సాగు... స్మార్ట్‌గా..!

‘‘అనురాధలో అడిగినంత పంట... స్వాతి వర్షం చేనుకు హర్షం...’’ ‘‘హస్తకు ఆది పంటా చిత్తకు చివరి పంటా...’’ ‘‘పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లిందే మేలు...’’ ఒకప్పుడు రైతుల సంభాషణల్లో ఇలాంటి సామెతలెన్నో దొర్లేవి. పూర్తిగా రుతువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన రోజులవి.

Updated : 24 Mar 2024 00:23 IST

‘‘అనురాధలో అడిగినంత పంట... స్వాతి వర్షం చేనుకు హర్షం...’’
‘‘హస్తకు ఆది పంటా చిత్తకు చివరి పంటా...’’
‘‘పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లిందే మేలు...’’
ఒకప్పుడు రైతుల సంభాషణల్లో ఇలాంటి సామెతలెన్నో దొర్లేవి. పూర్తిగా రుతువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన రోజులవి. ఇప్పుడు సాగు మారింది- రోబోలుండగా కూలీలు దండగ, ఏఐ ఉంటే ఏడాది పొడుగునా పంటే... లాంటి సామెతలూ రావచ్చిక. అన్ని రంగాల్లోనూ రాజ్యమేలుతున్న కృత్రిమమేధ వ్యవసాయాన్నీ స్మార్ట్‌గా మార్చేస్తోంది. అగ్రికల్చర్‌ ఆటోమేషన్‌ ఇప్పటి ట్రెండ్‌. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ప్రిసిషన్‌, నానో టెక్నాలజీ, ఆప్స్‌, డ్రోన్స్‌... వంటి పలురకాల సాంకేతికతలు దానికి తోడై రైతుకు అండగా నిలవడానికి అందుబాటులోకి వచ్చేశాయి.

ర్ణాటక రాష్ట్రంలో అదొక ద్రాక్ష తోట. నిజానికి ఆ పొలానికి నీటి వసతి లేదు. అయినా తోట ఏపుగా పెరిగి పచ్చగా నిగనిగలాడుతోంది. ఎలా అని దానికి మేనేజరుగా ఉన్న నితిన్‌ పాటిల్‌ని అడిగితే పొలంలో ఏర్పాటుచేసిన ఒక పరికరాన్ని చూపించాడు. ‘ఫసల్‌’ కంపెనీ తయారుచేసిన ఆ సెన్సర్‌లతో కూడిన పరికరం ఎప్పటికప్పుడు వాతావరణాన్నీ నేల పరిస్థితినీ విశ్లేషించి చూపుతుంటుంది. ఎప్పుడు నీళ్లు పెట్టాలో, ఎప్పుడు ఎరువు వేయాలో, ఎప్పుడు మందు చల్లాలో సూచిస్తూ ఆయన ఫోన్‌కి సందేశాలు పంపుతుంది. తాము ట్యాంకర్లతో నీటిని కొని తోటకు పెడుతున్నామనీ ఈ పరికరం అందించే సమాచారం సాయంతో సరైన సమయంలో చాలినంత నీటిని అందించడంవల్ల చుక్క నీరు వృథా కాకపోగా మామూలు కన్నా సగం నీరే సరిపోతోందనీ చెబుతాడు నితిన్‌.

నీరు సరే... మరి ఎరువులూ క్రిమిసంహారకాల సంగతి?

దానికీ వారి దగ్గర ఒక పరిష్కారం ఉంది. నిక్‌ రోబోటిక్స్‌ తయారుచేసిన ఏఐ పవర్డ్‌ రోబో ఓ చిన్న ట్రాక్టరు లాగా ఉంటుంది. దానికి రెండుపక్కలా పొడవాటి గొట్టాల్లా అమర్చిన స్ప్రేయర్‌కి కెమెరాలు ఉంటాయి. అవి నేలను రియల్‌టైమ్‌లో స్కాన్‌ చేస్తాయి. ఆ చిత్రాలను చూసి చీడ ఉన్న మొక్కల మీద మాత్రమే క్రిమిసంహారక మందుని చల్లుతుంది స్ప్రేయర్‌. దీనివల్ల సగానికన్నా తక్కువ మందే సరిపోతోందట.

ఇలా కృత్రిమమేధని సాగులో వాడడం వల్ల నీరూ ఎరువులూ మందుల ఖర్చు తగ్గడమే కాక, 25 శాతం దిగుబడి పెరుగుతోందని చెబుతున్నారు ద్రాక్ష, జామలాంటి ఎనిమిది రకాల ఉద్యానవన పంటల్ని సాగుచేస్తున్న రైతులు.

అసలు వ్యవసాయం అనేది అత్యంత పురాతన వృత్తి. ఎలాంటి సాంకేతికతా లేని రోజుల్లోనే ఎన్నో పంటలు పండించగలిగినప్పుడు ఇప్పుడీ టెక్నాలజీతో కొత్తగా చేసేది ఏమిటీ అన్న సందేహం సహజమే. ఎలా పండించినా అవే ధాన్యాలూ అవే కూరగాయలూ పండ్లూ. కానీ ఒకప్పటిలా వాటిని సువిశాలమైన తోటల్లో పండించేందుకు కావలసిన వనరులు ఇప్పుడు లేవు. చిన్న భూ కమతాలూ చాలీచాలని నీరూ సారహీనమైన నేలా పెరుగుతున్న చీడపీడలూ... ఇలాంటి ఎన్నో సమస్యలకు తోడు అధిక జనాభా, వాతావరణ మార్పులూ వ్యవసాయం భవిష్యత్తును పరీక్షకు పెడుతున్నాయి. కాబట్టి తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి మార్గాలను అన్వేషించడం నేటి అవసరం. అందుకే- కొత్త సాంకేతికతలను రైతులకు పరిచయం చేయాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మూడు రకాల సాంకేతికతలు వ్యవసాయాన్ని స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌... ఈ మూడు టెక్నాలజీల ఆధారంగా ఇప్పటికే ఎన్నో రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయంలో సాంకేతికత అంటే- అది గ్రీన్‌ హౌసుల్లోనో, వర్టికల్‌ ఫామింగ్‌లోనో మాత్రమే పనికొస్తుందన్నది అపోహే. సాధారణ సాగులోనూ దీన్ని నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చు. సంప్రదాయ వ్యవసాయ విధానాలకూ ఈ ఆధునిక విధానాలకూ మధ్య అంతరాన్ని పూడుస్తూ మొత్తంగా సాగులో విప్లవాత్మక మార్పులు తేవడానికి రంగం సిద్ధమవుతోంది.

సమాచారమే పునాది

ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ అనేది స్మార్ట్‌ వ్యవసాయానికి పునాది లాంటిది. ఈ విభాగం కింద సేద్యానికి సంబంధించి పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తారు. వివిధ రకాల నేలల లక్షణాలూ ఆయా నేలల్లో పండే పంటలూ వాటికి కావలసిన వనరులూ వాతావరణ పరిస్థితులూ పంటలకు వచ్చే చీడపీడలూ దిగుబడులూ... ఇలా అన్ని రకాల సమాచారాన్నీ సేకరించి సాఫ్ట్‌వేర్‌ రూపంలో భద్రపరుస్తారు. శాటిలైట్లూ వాతావరణ కేంద్రాలూ వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తోంటే, విశ్వవిద్యాలయాలూ పరిశోధనా కేంద్రాలూ పంటల గురించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఏ సాంకేతికత తయారీకైనా ఈ డేటానే కీలకం కాబట్టి ఈ విభాగంలో ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత కచ్చితమైన విధానాలనూ పరికరాలనూ రూపొందించుకోవడం సులువవుతుంది. ఇప్పుడు రైతులు వాడుతున్న ఆప్‌లు- కిసాన్‌ సువిధ, అగ్రిమార్కెట్‌, అప్నీ ఖేతీ, కృషిమిత్ర, కిసాన్‌ యోజన, ఆగ్రో స్టార్‌, ఇఫ్‌కో కిసాన్‌, ఫామ్‌లాగ్స్‌, బీజక్‌ లాంటి వాటన్నిటికీ ఆధారం ఇలా సేకరించిన సమాచారమే. దీన్ని మూలంగా చేసుకునే పలు అగ్రి-టెక్‌ ఉత్పత్తులూ తయారవుతున్నాయి.

ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌

వ్యవసాయంలో పంటల పర్యవేక్షణ పెద్ద పని. రైతు ఒళ్లంతా కళ్లు చేసుకుని ప్రతి మొక్కనీ పరిశీలనగా చూసుకుంటాడు. నీరు తక్కువైనా, ఎరువులు అవసరమైనా గమనించి వేసుకుంటాడు. తెగులు సోకిందేమోనని ఆకుల్ని అణువణువూ నిశితంగా పరిశీలిస్తాడు. అందుకు ఎంతో సమయమూ శ్రమా అవసరం. అంత కష్టపడినా ఎక్కడో చీడ పట్టిన మొక్క ఒక్కటి అతడి దృష్టి నుంచి తప్పించుకున్నా చాలు మొత్తం పంటకి తెగులు వ్యాపించి నాశనం చేసేస్తుంది. అందుకే రైతులు సాధారణంగా ఎరువులైనా క్రిమిసంహారక మందులైనా అవసరాన్ని బట్టి కాక ఏటా ఒక షెడ్యూలు ప్రకారం పొలం అంతా చల్లేస్తుంటారు. అలాగే నీరు కూడా కచ్చితంగా పంటకి అవసరమైనప్పుడు కాక కాస్త అటూఇటూగా నీరు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టేయడమూ కద్దు. దీనివల్ల వృథా ఖర్చుకి తోడు రసాయన ఎరువులూ క్రిమి సంహారకాలూ అనవసరంగా వాడడం వల్ల నేలనీ నీటినీ కలుషితం చేస్తున్నాయి. ఈ నష్టాలనన్నిటినీ నివారించడానికి కృత్రిమ మేధ తోడ్పడుతుంది. వ్యవసాయంలో సాంకేతికతను వాడి నష్టాలను తగ్గించే ఈ విధానాన్నే ‘ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌’ అంటున్నారు. 1980ల్లోనే డాక్టర్‌ పియరీ రాబర్ట్‌ అనే శాస్త్రవేత్త ఈ పద్ధతిని పరిచయం చేశాడు. వ్యవసాయంలో సాధ్యమైనంతగా సాంకేతికతను ఉపయోగించాలన్న ప్రయత్నం అప్పటినుంచీ కొనసాగుతూ వచ్చింది. కృత్రిమమేధతో అది వేగవంతమైందనవచ్చు.

ఏఐతో ఏం చేయవచ్చంటే...

ఒకప్పుడు వ్యవసాయంలో ప్రతి పనీ పూర్తిగా మనుషులే చేయాల్సి వచ్చేది. కొన్నిటికి పశువుల సాయం తీసుకునేవారు. ఇప్పుడు ఆఖరికి కూలీల అవసరం కూడా లేకుండా పనులన్నీ చేసేందుకు యంత్రాలు వచ్చాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి టెక్నాలజీలతో సాగు ఎంత స్మార్ట్‌గా మారిందంటే...

 • డ్రోన్లతో మందులు చల్లవచ్చు. వాటికే కెమెరాలు అమర్చి ఫొటోలూ వీడియోలూ తీస్తూ శాటిలైట్‌ సాయంతో మొత్తం ఫీల్డ్‌ సర్వే చేయొచ్చు. వాటిని ఫోనుకో, కంప్యూటరుకో అనుసంధానిస్తే అవి అందించే సమాచారాన్ని విశ్లేషించి తీసుకోవాల్సిన చర్యల్ని రైతుకి సూచిస్తాయి.
 • నీరు లేకో, అకాల వర్షాలతోనో, ఇతరత్రా కారణాల వల్లో... పంట పూర్తిగా నష్టపోవడం అనే ప్రశ్నే రాదు. ఏఐ తోడ్పాటుతో అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకోవచ్చు. వర్షాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు పడతాయో ముందుగానే తెలుస్తుంది కాబట్టి అందుకు తగిన పంటల్నే ఎంచుకోవచ్చు.
 • నేలని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అందులో ఏ పోషకాలు ఉన్నాయో ఏవి లోపించాయో చెబుతుంది ఏఐ టెక్నాలజీ. దాంతో లోపించిన పోషకాలను మాత్రమే భర్తీ చేసేలా ఎరువులను వాడవచ్చు. దీనివల్ల రైతుకి అనవసర ఖర్చు తగ్గడమే కాక, నేలలో కూడా అవసరం లేని రసాయనాలు పేరుకోకుండా ఉంటాయి.
 • పొలంలో మొక్కలన్నిటినీ ఎప్పటికప్పుడు నిశితంగా స్కాన్‌ చేసి తాజా సమాచారాన్ని అందిస్తాయి ఏఐ కెమెరాలు. దాంతో ఏ మూల ఏ ఒక్క మొక్కకి తెగులు సోకినా వెంటనే దాన్ని నిర్మూలించి మిగతా తోటని కాపాడుకోవడం తేలికవుతుంది. ఎరువుల్లాగే క్రిమిసంహారకాలనూ వృథా కాకుండా... అవసరమైన చోట మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది.
 • పంటని బట్టి దానికి అవసరమైన వాతావరణం ఏమిటీ, ప్రస్తుత వాతావరణం ఎలా ఉందీ గాలిలో తేమ చాలినంత ఉందా ఎక్కువగా ఉందా... లాంటి సమాచారాన్నంతా ఇస్తాయి ఏఐ సెన్సార్‌లతో పనిచేసే క్రాప్‌ మానిటరింగ్‌ పరికరాలు. ఎంత నీరు అవసరమూ ఏ సమయంలో పెట్టాలీ అన్నది కూడా చెబుతాయి. దానివల్ల తక్కువ నీటితో ఎక్కువ ఫలితం పొందవచ్చు.
 • కలుపు పెరిగినప్పుడో పంట కోతకి వచ్చినప్పుడో సరైన సమయంలో కూలీలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడడం అందరికీ తెలిసిన విషయమే. కృత్రిమమేధ సాయంతో పనిచేసే పరికరాలెన్నో ఉన్నాయిప్పుడు. ఏ పంట అయినా సరే దానికి తగ్గ యంత్రాలు తయారవుతున్నాయి. చెట్ల కొమ్మలకున్న ఆపిల్స్‌ని ఒక్కో కాయా ఎంచి కోసే రోబోలూ, సున్నితంగా ఉండే స్ట్రాబెర్రీల్ని అంతే సుకుమారంగా తుంచి భద్రపరిచే రోబోలూ ఉన్నాయి.
 • పంట పండాక దానికి గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోవడం అనేది జరగదు. ఫలానా పంటకి మార్కెట్‌ డిమాండ్‌ ఎంత ఉందో, ఎప్పటివరకూ ఉంటుందో కృత్రిమమేధ సాయంతో ముందుగానే తెలుసుకుని ఆ తర్వాతే సాగు చేయవచ్చు.
 • తేనెటీగలు తగ్గిపోవడం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు వాటి స్థానాన్నీ ఏఐ భర్తీ చేయబోతోంది. పరాగ సంపర్కం కోసం వినియోగించడానికి తేనెటీగల్లాంటి మినీ రోబోలను ఇప్పటికే కొన్ని చోట్ల వాడుతున్నారు.
 • పొలంలో వేర్వేరు చోట్ల కూలీలు పనిచేస్తున్నప్పుడు వారిని పర్యవేక్షించడానికి కూడా ఏఐ తోడ్పడుతుంది.
 • నాణ్యమైన విత్తనాల తయారీకి అవకాశం ఉంటుంది. కృత్రిమమేధ సాయంతో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పండించవచ్చు కాబట్టి సహజంగానే దిగుబడి క్వాలిటీ బాగుంటుంది.
 • వేసిన పంటల నిర్వహణే కాదు, నేల సారాన్ని బట్టీ, వాతావరణ పరిస్థితుల్ని బట్టీ ఏ పంట వేస్తే బాగా పండుతుందన్న విషయాన్ని కూడా కృత్రిమ మేధ సాయంతో తెలుసుకోవచ్చు.
 • గ్రీన్‌హౌసుల్లో, వర్టికల్‌ విధానాల్లో అయితే పూర్తిగా ‘కంట్రోల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అగ్రికల్చర్‌’ చేస్తున్నారు. ఏఐ సాయంతో వెలుతురూ ఉష్ణోగ్రతా గాలిలో తేమా అన్నిటినీ నిర్ణీత స్థాయుల్లో ఉంచడం ద్వారా అత్యధిక దిగుబడి పొందడం సాధ్యమవుతోంది.

ఇన్ని రకాలుగా ఈ సాంకేతికత సహకరిస్తుంది కాబట్టి రైతు ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలుగుతాడు. చుట్టుపక్కలవారి ప్రభావానికి లోనై ఏ పంట వేయాలీ, ఎంత ఎరువు వేయాలీ లాంటి సందేహాలతో సతమతమవ్వాల్సిన పనిలేదు.

పశుపోషణలోనూ...

వ్యవసాయదారులు పంటల సాగుతోపాటు పశువుల పెంపకాన్నీ చేపట్టడం సహజం. అటువంటప్పుడు సాంకేతికతను వాటికి మాత్రం ఎందుకు ఉపయోగించకూడదూ అనుకున్నారు పరిశోధకులు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు... ఏవైనా సరే. వాటి ఆరోగ్యం, తిండీ నీరూ, పరిశుభ్రతా... అన్నిటి విషయంలోనూ తగు జాగ్రత్తలను తీసుకోవడానికి అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉంది. కృత్రిమమేధకు సంబంధించి కంప్యూటర్‌ విజన్‌ ఏఐ అనే విభాగం అందుకు తోడ్పడుతుంది. పెద్ద పెద్ద ఫారాలు ఉన్నవాళ్లు విజన్‌ ఎక్విప్‌డ్‌ డ్రోన్స్‌ (కెమెరాలు అనుసంధానించి ఉంటాయి) సాయంతో మొత్తం పశువుల్ని ఏరియల్‌ వ్యూ ద్వారా చూడవచ్చు. ఒక్క పశువు ఉండాల్సిన చోట లేకున్నా తక్షణం హెచ్చరిక వస్తుంది. వాటి కదలికల్నీ, ప్రవర్తననీ రియల్‌ టైమ్‌లో గమనించవచ్చు. అవి గాయపడినా, అనారోగ్య లక్షణాలు కన్పిస్తున్నా సమస్య పెద్దది కాకముందే తగిన చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు, పాడి పశువులైతే పాల ఉత్పత్తీ, కోళ్లయితే గుడ్ల ఉత్పత్తినీ ఈ పరికరాలు పర్యవేక్షించి తేడాలను విశ్లేషిస్తాయి. ఏ ఆహారం తీసుకుంటే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందో ఏ ఆహారం తీసుకుంటే నాణ్యత బాగుందో కూడా చెబుతాయి. నాణ్యతను బట్టి ఉత్పత్తుల గ్రేడింగ్‌ చేసే వెసులుబాటూ ఉంటుంది. పలు డెయిరీ ఫారాల్లో, కోళ్ల ఫారాల్లో ఏఐతో పనిచేసే పరికరాలు వాడుకలో ఉన్నాయి. పాలు పితకడానికీ కోడిగుడ్లను సేకరించి భద్రపరచడానికీ ఆటోమేటెడ్‌ రోబోట్ల వాడకం చాలాకాలంగా ఉంది.

అగ్రి-టెక్‌దే భవిష్యత్తు

ప్రపంచమంతా డిజిటలైజేషన్‌ దారి పట్టినప్పుడు ప్రధాన రంగమైన వ్యవసాయం మాత్రం దానికి దూరంగా ఎందుకు ఉంటుంది. అందుకే ఇప్పుడదీ సాంకేతికతను అందిపుచ్చుకుని సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. అగ్రి- టెక్‌కి సంబంధించి దేశంలో దాదాపు 1500 అంకుర పరిశ్రమలున్నాయట. నాట్లు వేసేవీ, కలుపు తీసేవీ, కోతలు కోసేవీ మాత్రమే కాదు- మందులు చల్లేవీ, తోటల్లో పండ్లను కోసేవీ... ఎన్నో రకాల యంత్రాలను ఇవి తయారుచేస్తున్నాయి. కృత్రిమ మేధతో పనిచేసే రోబోలూ, డ్రోన్లూ స్ప్రేయర్లూ మనిషి ప్రమేయం లేకుండా పనులు పూర్తి చేస్తూ కూలీల కొరతను తీరుస్తున్నాయి. తక్కువ నీటినీ స్థలాన్నీ ఉపయోగించుకునే హైడ్రోపోనిక్స్‌, వర్టికల్‌ ఫామింగ్‌ విధానం సైతం దేశంలో ఆదరణ పొందుతోంది. ఈ రంగంలో ప్రస్తుతం ఏటా 20శాతం చొప్పున పెరుగుదల నమోదవుతోంది. ఎరువుల బస్తాల స్థానంలో చిన్న చిన్న సీసాల నానో ఎరువులు వినియోగంలోకి వచ్చేశాయి. అగ్రివి, ఆహార్‌ ఈఆర్‌పీ, హార్వెస్ట్‌ ప్రాఫిట్‌, ఫామ్‌బ్రైట్‌, క్రాప్‌ట్రాకర్‌, పాన్‌ఆగ్రో... లాంటి రకరకాల ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌లూ, క్రాప్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రతి రైతుకీ అతని పొలం పరిస్థితిని బట్టి పర్సనలైజ్డ్‌ డాష్‌ బోర్డును తయారుచేసిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది రైతులతో కలిసి పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ సాగులో ఏఐ వాడకం వల్ల హెక్టారుకు 30 శాతం దిగుబడి పెరిగిందని చెబుతోంది.

ఏటా 23 శాతం!

అమెరికా, యూరప్‌ లాంటి చోట్లే కాదు, డేటా ఆధారంగా సాగే వ్యవసాయం మన దేశంలోనూ పెరుగుతోంది. వ్యవసాయ మార్కెట్‌లో ఏఐ వాటా 2023 నుంచి 2028 మధ్య ఏటా 23.1 శాతం చొప్పున పెరుగుతుందని నిపుణుల అంచనా. అయితే సాగులో పెట్టుబడి పెద్ద సమస్య. ఇప్పటికే రకరకాల పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే కూడా పెట్టుబడి పెద్దమొత్తంలోనే అవసరమవుతుంది. ఆ దిశగా వారిని చైతన్య పరచాల్సిన అవసరమూ ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కూడా చేసుకుంది. నేషనల్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ సొసైటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ విభాగం, వాధ్వానీ ఫౌండేషన్‌ల మధ్య జరిగిన ఈ ఒప్పందం కృత్రిమమేధను రైతులకు చేరువ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో స్మార్ట్‌ అగ్రికల్చర్‌కి కావలసిన ఆర్థిక సాయమూ అందించవచ్చు. వ్యవసాయానికి పనికొచ్చే పరికరాల తయారీ స్టార్టప్‌లు మరిన్ని వచ్చే అవకాశమూ ఉంది. మరొక ముఖ్యమైన విషయం... ఈ సాంకేతికత యువతరాన్ని వ్యవసాయం పట్ల ఆకర్షితుల్ని చేస్తోంది. ఎందరో విద్యావంతులైన యువకులు ఉద్యోగాలు వదిలి పొలంబాట పడుతున్నారు. కొత్త పరికరాలను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ముందుకొస్తున్నారు.  

సాంకేతికతను ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా శ్రమా సమయం కలిసి వస్తాయి. వనరుల్ని పూర్తి స్థాయిలో నూటికి నూరుశాతం సద్వినియోగపరచుకోవచ్చు. వ్యర్థాలు ఉండవు. నేల సారం దెబ్బతినదు. నేలా నీరూ కలుషితమవడం తగ్గుతుంది. పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవచ్చు. అన్నిటినీ మించి నిర్వహణ ఖర్చు తగ్గుతుందీ, దిగుబడి పెరుగుతుందన్న హామీ ఉండనే ఉంది. 2050 నాటికి ఆహారోత్పత్తి యాభై శాతం పెంచితే కానీ పెరిగే జనాభాకి సరిపోదంటోంది ఐక్యరాజ్యసమితి. ఆ లక్ష్యాన్ని చేర్చే ఏకైక మార్గం- ఏటికేడాదీ కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ ఆధారిత స్మార్ట్‌ సేద్యమేనంటోంది అగ్రి-టెక్‌ ప్రపంచం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు