కోరిన గొంతుతో... కృత్రిమ డబ్బింగ్‌!

వర్చువల్‌ ప్రపంచంలో ‘ఏఐ’తో కానిదేదీ లేదు ఇప్పుడు. చేయితిరిగిన ఇంద్రజాలికుడిలా క్షణక్షణం కొత్త వింతల్ని మన ముందుపెట్టి అబ్బురపరుస్తోందిది.

Updated : 05 May 2024 10:19 IST

వర్చువల్‌ ప్రపంచంలో ‘ఏఐ’తో కానిదేదీ లేదు ఇప్పుడు. చేయితిరిగిన ఇంద్రజాలికుడిలా క్షణక్షణం కొత్త వింతల్ని మన ముందుపెట్టి అబ్బురపరుస్తోందిది. ఆ ఆశ్చర్యాల్లో తాజాగా వచ్చి చేరింది... డబ్బింగ్‌! డబ్బింగ్‌ అనగానే సినిమా టీవీ ప్రకటనలే అనుకోవద్దు... నేటి సామాన్యుల సాధనంగా మారిన యూట్యూబూ పాడ్‌కాస్ట్‌ల్లోనూ దీని అవసరం చాలా ఉంది. మారుతున్న ఈ కొత్త తరం అవసరాలకి తగ్గట్టే డబ్బింగ్‌ స్వరం మారుస్తోంది ‘ఏఐ’. పాత గళ నైపుణ్యాలకే కొత్త సాంకేతికతని అద్దుతోంది!

మీకు ఏ యాభైయో అరవైయో వయసు. తెలుగులో మీరూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలనుకున్నారు. మీకొచ్చిన వంటలో, తిరిగిన ప్రాంతాలో, నేర్చిన నైపుణ్యాలో... ప్రపంచంతో పంచుకోవాలనుకున్నారు. వీడియోలు తీశారు. కానీ- వాటికి ‘వాయిస్‌ ఓవర్‌’ చెప్పాలంటే స్వరం వణుకుతోంది. అందుకోసం ‘స్క్రిప్టు’ రాసుకోవడం పెద్ద పనిగా ఉంది. మీలాంటివాళ్ళకి సాయం చేయడానికి ఓ ఆప్‌ వచ్చిందిప్పుడు. మూడేముక్కల్లో మీరు విషయం చెబితే చాలు- మీరు మీ డైలాగ్‌ ఎలా మొదలుపెట్టి ఎలా ముగించాలో చెబుతూ ఇది స్క్రిప్టు సిద్ధం చేసి ఇస్తుంది. ‘స్క్రిప్టు ఓకే కానీ నాకు వాయిస్‌ ఓవర్‌ చెప్పేందుకు కావాల్సిన మాడ్యులేషన్స్‌ రావు... ఎలా?’ అంటారా- దానికీ ఓ పరిష్కారం ఉంది. కేవలం ఆరుసెకన్లు మీరు మీ గళాన్ని ఈ ఆప్‌లో నమోదుచేస్తే... దాన్ని తీసుకుని మీ డైలాగ్‌ మొత్తాన్నీ మీరే చెప్పినట్టు- రకరకాల మాడ్యులేషన్‌లో వాటిని అందిస్తుంది. డైలాగ్‌ రెడీ అయ్యింది సరే- మీ యూట్యూబ్‌ వీడియోలో దాని నిడివిని బట్టి వాటిని ఎక్కడ ఎలా పెట్టాలో అన్న సందేహం ఉందా... నో ప్రాబ్లమ్‌. ఆ ఎడిటింగ్‌ బాధ్యతలూ ఇదే తీసుకుంటుంది! విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ‘యూనిడబ్‌’ అన్న స్టార్టప్‌ చేస్తున్న అద్భుతం ఇది. ఏలేశ్వరపు భరణి, కావ్య అనే అన్నాచెల్లెళ్ళు దీన్ని సృష్టించారు. వీళ్ళ ఆప్‌లో మరో గమ్మత్తు కూడా ఉంది... యూట్యూబర్‌గా తెలుగు భాషలో బాగా సక్సెస్‌ అయ్యారనుకుందాం. దీన్నే మిగతా భాషల్లోకీ తీసుకెళితే - మరిన్ని వ్యూస్‌ వచ్చే అవకాశముందని మీరు భావిస్తున్నారు. కానీ అందరికీ అన్ని భాషలూ రావు కదా... దానికీ పరిష్కారం ఉంది వీళ్ళ వెబ్‌సైట్‌లో. కేవలం కొన్ని నిమిషాల్లో మీ వీడియోని 30 భాషల్లో, అదీ మీరే మాట్లాడినట్టు మార్చి ఇస్తుందీ ఆప్‌!

కొత్త టచ్‌!

యూట్యూబర్స్‌కి సాయం చేసే ఆప్‌లు మనకు కొత్తకాదు. విదేశాల్లో స్పీచిఫై, మనదేశంలోని డబ్‌వెర్స్‌.ఏఐ, డబ్‌డబ్‌.ఏఐ సంస్థలు గత నాలుగైదేళ్ళుగా ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి. కానీ- అవన్నీ వేర్వేరు భాషల్లోకి మీ డైలాగుల్ని అనువదించేటప్పుడు ఇంకెవరివో రికార్డెడ్‌ వాయిస్‌లని ఉపయోగిస్తాయి. అలాకాకుండా- మనమే వివిధ భాషల్ని మాట్లాడినట్టు- సరైన లిప్‌ సింక్‌తో చేయడమే ‘యూని డబ్‌’ ప్రత్యేకత. కానీ, ఇక్కడో సమస్య ఉంది.  ఈ ‘లిప్‌సింక్‌’ కొంతవరకు దక్షిణాది భాషలన్నింటా అడ్జస్ట్‌ అవుతుందేమోకానీ... హిందీ, ఇంగ్లిషు, స్పానిష్‌, ఫ్రెంచి వంటి భాషలకి వెళ్ళినప్పుడు తేడాగా అనిపిస్తుంది. ఆ భాషలు మాట్లాడేటప్పుడు పెదవులు మాత్రమే కాదు- దవడల కదలికల్లోనూ మార్పులు రావడం ఇందుకు కారణం. ఆ తేడా కూడా రానివ్వకుండా మనం మాట్లాడే భాషకి తగ్గట్టు ముఖకవళికల్నీ మార్చి ఇస్తుంది బెంగళూరుకి చెందిన ‘న్యూరల్‌ గ్యారేజ్‌’ అనే సంస్థ. ఇందుకోసం వీళ్ళు రూపొందించిన ‘విజువల్‌డబ్‌.ఏఐ’ అన్న సాంకేతికత ఈ తరహావాటిల్లో ప్రపంచంలోనే మొదటిదని చెబుతున్నారు. అందుకే దీన్ని యూట్యూబర్స్‌ మాత్రమేకాకుండా ప్రకటనా రంగంలోనూ చక్కగా వినియోగించు కుంటున్నారు. ఎలాగంటే...

మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలుగు...

గత ఏడాది అమెజాన్‌ ఫ్రెష్‌ సంస్థ మనోజ్‌బాజ్‌పాయ్‌తో హిందీలో ఓ ప్రకటన రూపొందించింది. తీసింది హిందీలో మాత్రమే అయినా- మనోజ్‌ బాజ్‌పాయ్‌  తెలుగు, తమిళం, మలయాళం తదితర ఎనిమిదిభాషల్లో డైలాగ్‌ చెప్పినట్టు మార్చి ఇచ్చిందీ సంస్థ. ‘డ్రీమ్స్‌ 11’ కోసం క్రికెటర్‌ రోహిత్‌ శర్మ చేతా ఇలాగే తెలుగు డైలాగులు చెప్పించింది. గత ఏడాది వచ్చిన ‘వ్యాక్సిన్‌ వార్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ కూడా వీళ్ళు చేసిందే. అందులో నానా పటేకర్‌ తనదైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడినట్టు చేసిన ఘనత వీళ్ళది. వీళ్ళలాగే- సినిమాల విషయంలో తమ ‘యూని డబ్‌’తో పెద్ద విప్లవమే సృష్టించడానికి నడుంబిగించాడు భరణి.

ఏ భాష నుంచైనా సరే తెలుగులోకి డబ్బింగ్‌ చేయించాలంటే- ఏ డబ్బింగు ఆర్టిస్టు సాయమూ లేకుండా తెలుగులోకి నిమిషాల్లో అనువదించి ఇస్తామంటున్నాడు! పాటలు మినహా తెలుగు డైలాగులకి సంబంధించిన స్క్రిప్టు తమకిస్తే- అచ్చం మూలంలోని నటులే చెప్పినట్టు తెలుగు డైలాగులు చెప్పిస్తామంటున్నాడు.

ఇప్పటికే రెండు మలయాళం సినిమాలని తెలుగులో ఇలా తీసుకొచ్చే పనిలో ఉన్నాడు! దీంతో లక్షలు ఖర్చయ్యే డబ్బింగ్‌ పని కేవలం పదివేలల్లో పూర్తవుతుందని చెబుతున్నాడు. ఏదేమైతేనేం- ‘ఏఐ’తో మనం చూసే సినిమాల్లోనే కాదు... తీసే వీడియోల్లోనూ కొత్త విప్లవాలు రావడం మాత్రం తథ్యం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..