కావలెను... బాంబే బ్లడ్‌ గ్రూప్‌!

‘నా దగ్గరేముంది ఇవ్వడానికి?’ అని మాత్రం అనకండి. మీలోనే ఓ అమృతభాండం ఉంది. మీరు దానం చేసే ప్రతి రక్త బిందువూ ప్రాణాపాయంలో ఉన్నవారికి ఆత్మబంధువు.

Updated : 09 Jun 2024 00:48 IST

‘నా దగ్గరేముంది ఇవ్వడానికి?’ అని మాత్రం అనకండి. మీలోనే ఓ అమృతభాండం ఉంది. మీరు దానం చేసే ప్రతి రక్త బిందువూ ప్రాణాపాయంలో ఉన్నవారికి ఆత్మబంధువు. కాబట్టే, ఉన్నది పిడికెడంత మందే అయినా.. బాంబే బ్లడ్‌ గ్రూపు వ్యక్తులు ప్రతి అభ్యర్థనకూ స్పందిస్తున్నారు. సప్త్త సముద్రాలు దాటెళ్లి మరీ సాటి మనిషిని రక్షిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.
రక్తం కావాలి.
ప్రసూతి గండం.  
రక్తం ఎక్కించాలి.
శస్త్ర చికిత్స.
రక్తం సేకరించాలి.

అంగడి సరుకైతే తల తాకట్టు పెట్టయినా కొనుక్కోవచ్చు. తయారు చేయగలిగే అవకాశమే ఉంటే ల్యాబ్‌లోనే సృష్టించుకోవచ్చు. ఏ హిమాలయాల్లోనో దొరుకుతుందని తెలిస్తే.. ఆశావాదంతో అన్వేషిస్తూ వెళ్లొచ్చు. అలా కుదరదే. ఎవరో ఒకరు రావాలి. చిరునవ్వుతో సూది గుచ్చుకుని స్వచ్ఛందంగా తీసివ్వాలి. 

టీవీలో స్క్రోలింగ్‌.

వాట్సాప్‌లో షేరింగ్‌.

ఆత్మీయులకు ఫోన్లు.

పరిచయస్థులకు మెసేజ్‌లు.

ఎంత ప్రయత్నించినా స్పందన లేకపోవచ్చు. మధ్యమధ్యలో మొక్కుబడి కాల్స్‌. పరామర్శించడానికి కొందరు. పలకరించే సాకుతో కొందరు. కొన్ని ఉచిత సలహాలు. కొన్ని సానుభూతి వాక్యాలు.

అవున్లే. ఎవరు మాత్రం ఏం చేస్తారు?

ఓ.. కాదు. ఏ.. కాదు. బీ.. కాదు. ఏబీ గ్రూపు కూడా కాదు.

పదివేల మందికి ఒకరిలో కనిపించే అరుదైన రకం.. బాంబే బ్లడ్‌ గ్రూపు! ఆ ఒక్కరికి కూడా తమది ఫలానా గ్రూపు అని తెలియకపోవచ్చు. ఏ ల్యాబ్‌లోనో పరీక్షించుకున్నప్పుడు.. మిడిమిడి జ్ఞానంతో ఇంకేదో గ్రూపుగా నిర్ధారించి ఉండొచ్చు. తమది బాంబే గ్రూపు అని కచ్చితంగా తెలిసినా, పెద్ద మనసు చేసుకుని రక్తదానానికి సిద్ధపడినా.. అవసరమైన వారి వరకూ ఆ సమాచారం వెళ్లకపోవచ్చు. ఉన్నదేమో పిడికెడు మంది. విసిరేసినట్టుగా అక్కడొకరూ, ఇక్కడొకరూ. అందులోనూ అనేక పరిమితులు. బీబీ గ్రూపువారు విశ్వదాతలు. ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. కానీ ఒక్క బాంబే బ్లడ్‌ గ్రూపు మినహా, ఎవరి నుంచీ తీసుకోకూడదు.

పొరపాటున ఎక్కించినా ప్రమాదమే, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా. మిగిలినవాటితో పోలిస్తే.. బాంబే గ్రూపు రక్తానికి షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువ. నెలల తరబడి నిల్వ ఉంచడం అసాధ్యం. 

దశాబ్దాల సమస్య..

డెబ్భై రెండేళ్ల నాటి సంఘటన ఇది. తన సుదీర్ఘమైన కెరీర్‌లో.. తొలిసారిగా ఓ వింత సమస్యను ఎదుర్కొన్నారు ముంబయికి చెందిన డాక్టర్‌ భెండే. మరీ బలహీనంగా ఉన్న ఓ రోగికి రక్తం అవసరమైంది. పరీక్షలు చేయిస్తే.. ఓ-పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. ఆ గ్రూపు రక్తమే ఎక్కించారు. కానీ, ప్రయత్నం వికటించింది. చావు అంచుల వరకూ వెళ్లాడు రోగి. ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదు. స్పష్టత కోసం మరిన్ని పరీక్షలు చేయించారు భెండే. బ్లడ్‌ గ్రూపు నిర్ధారణలోనే ఏదో పొరపాటు జరిగిందని అర్థమైపోయింది. మరొక్కసారి ల్యాబ్‌కు రక్త నమూనాలు పంపారు. తాజా ఫలితాలు ఏ రక్త వర్గంతోనూ సరిపోల లేదు. ఆ తర్వాత కూడా, వరుసగా అలాంటి కేసులే వచ్చాయి. అన్నీ ముంబయి పరిసర ప్రాంతాల నుంచే. దీంతో, ఆ అరుదైన రక్తానికి ‘బాంబే బ్లడ్‌ గ్రూపు’ అని పేరు పెట్టారాయన. సాంకేతికంగా అయితే.. హెచ్‌హెచ్‌ బ్లడ్‌గ్రూప్‌. రక్తంలోని ఎర్ర రక్తకణాల్లో ఉన్న చక్కెర అణువులే మన బ్లడ్‌ గ్రూపును నిర్ణయిస్తాయి. బాంబే బ్లడ్‌ గ్రూపు వారిలో మాత్రం అసలు చక్కెర అణువులే తయారు కావు. దీంతో, ఆ వ్యక్తులు ఏ బ్లడ్‌ గ్రూపు పరిధిలోకీ రారు. ఇలాంటి వారి సంఖ్య చాలా పరిమితం. మొదట్లో ముంబయి పరిసరాల్లో మాత్రమే కనిపించినా.. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా గుర్తించారు. ఇరాన్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లోనూ ఉన్నట్టు తేలింది. అలా అని, ఇదేం వైకల్యం కాదు. అనారోగ్యం కిందికి కూడా రాదు. బీబీ గ్రూప్‌ వాళ్లు కూడా అందరిలా సాధారణ జీవితం గడపొచ్చు. పదిహేనేళ్ల క్రితం వరకూ.. మొత్తం 179 మందిలో బాంబే గ్రూపు రక్తాన్ని గుర్తించారు. అదే సమయంలో బెంగళూరులో ఓ కేసు బయటికొచ్చింది. అన్నప్ప అనే వ్యక్తి.. అనారోగ్యం పాలైన కూతుర్ని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ బిడ్డకు రక్తం అవసరమైంది. దీంతో తానే ముందుకొచ్చాడు. రక్త పరీక్షలో అన్నప్పది బీబీ గ్రూపు అని తేలింది. అలా, స్కోరు నూట ఎనభైకి చేరింది. ప్రస్తుతం, నాలుగొందల నుంచి ఐదొందల మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. 

కొవిడ్‌ సమయంలో

కొవిడ్‌ సంక్షోభం బాంబే బ్లడ్‌ గ్రూపు వ్యక్తులను మరింత కలవరపరిచింది. ఒక వైపు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేని పరిస్థితి. మరోవైపు రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కొరత. ఇవి చాలనట్టు, బ్లడ్‌ బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయాయి. కరోనా భయంతో రక్తదాతలు గడపదాటలేని పరిస్థితి. బాంబే గ్రూపు రక్తం దొరకడమే అసాధ్యమైపోయింది. అదంతా తల్చుకున్నప్పుడు, విశ్రాంత శాస్త్రవేత్త మహేష్కర్‌ ఉద్వేగానికి గురవుతారు. ‘నా బ్లడ్‌గ్రూప్‌ గురించి ముప్పై ఏళ్ల క్రితమే తెలిసింది. ఎందుకైనా మంచిదని కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేయించాను. అందరివీ సాధారణ బ్లడ్‌ గ్రూపులే అని తేలింది. కొవిడ్‌ సమయంలో నేను ఆసుపత్రి పాలయ్యాను. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఎంత ప్రయత్నించినా చుక్క రక్తమూ దొరకలేదు. మొత్తానికి, డాక్టర్ల కృషితో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. అరుదైన రక్తం నాలో ప్రవహిస్తున్నందుకు గర్వంగా ఉంది, అదే సమయంలో కొంత భయంగానూ ఉంది’ అంటారాయన.

సంఘాలుగా ఏర్పడి..

ఏదైనా పరిమితిని అధిగమించాలంటే, అదే సమస్యను ఎదుర్కొంటున్న ఓ పదిమందిని కూడగట్టాలి. సంఘంగా ఏర్పడాలి. కలిసి మాట్లాడుకోవాలి. బాధలు పంచుకోవాలి. పరిష్కారం వెతుక్కోవాలి. బీబీ గ్రూపు వ్యక్తులూ ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. తొలి అడుగుగా ‘బాంబే బ్లడ్‌ గ్రూపు కమ్యూనిటీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమకంటూ ఓ ఆన్‌లైన్‌ వేదికనూ సిద్ధం చేసుకున్నారు. ఎవరికి రక్తం అవసరమైనా ఇక్కడే అభ్యర్థన పెడతారు. అందులో, దేశంలోని అన్ని ప్రాంతాల వారూ ఉంటారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రంగారావుకు రక్తం కావాలంటూ తాజాగా ఓ పోస్టు కనిపించింది. గుంటూరుకు చెందిన అనసూయ అభ్యర్థన కూడా ఆ జాబితాలో ఉంది. ఇలాంటి ప్రకటనలకు సభ్యుల్లోంచే ఎవరో ఒకరు స్పందిస్తారు. రక్తదానానికి ముందుకొస్తారు. అవసరమైతే ఇతర నగరాలకూ, దేశాలకూ వెళ్తారు. ఏదైనా బ్లడ్‌ బ్యాంకులో అందుబాటులో ఉంటే, ఆ సంగతీ చెబుతారు. రక్తదాతలకు ఓ వాట్సాప్‌ గ్రూపు కూడా ఉంది. ఆ వేదిక ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. ఆమధ్య ఓ పసిబిడ్డ లేత గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తీసుకెళ్లారు. పరీక్షల్లో భాగంగా ల్యాబొరేటరీకి రక్త నమూనాలు పంపారు. చిన్నారిది బాంబే బ్లడ్‌ గ్రూపు అని తేలింది. అప్పటికప్పుడు, ఆ అరుదైన రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సర్జరీ వాయిదా వేస్తేనేమో బిడ్డ ప్రాణానికే ప్రమాదం. ఆ విపత్కర పరిస్థితుల్లో బాంబే బ్లడ్‌ గ్రూపు కమ్యూనిటీ స్పందించింది. ఇద్దరు కార్యకర్తల్ని పంపింది. ఓ దాత ముంబయి నుంచి, ఓ దాత పుణె నుంచి హుటాహుటిన తరలి వెళ్లారు. ‘ఇలాంటి అరుదైన బ్లడ్‌ గ్రూప్‌తో పుట్టడం దేవుడిచ్చిన అవకాశం’ అని చెబుతున్నప్పుడు ఆ ఇద్దరి కళ్లలోనూ ఆనందబాష్పాలు. మరో సభ్యుడు మహేశ్‌ కృష్ణ ఇప్పటికే వంద రక్తదానాలు చేశాడు. ‘సెంచరీ తర్వాత క్రికెటర్‌ పొందే ఆనందం లాంటిదే ఇదీ. వంద రక్తదానాలు అంటే.. వంద ప్రాణాలు.. వంద జీవితాలు’ అని మురిసి పోతాడు అతను. రజత్‌ కుమార్‌, ఆశీష్‌ అయితే ఓ నవజాత శిశువుకు బాంబే గ్రూపు రక్తం ఇవ్వడానికి వియత్నాం దేశానికి వెళ్లారు. భారత్‌ వెలుపల కూడా ఈ బ్లడ్‌ గ్రూపు ఆనవాళ్లు ఉన్నట్టు ప్రపంచానికి తెలిసిందీ అప్పుడే.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

బాంబే బ్లడ్‌ గ్రూపు తెలుగువారి జీవితాలనూ ప్రభావితం చేస్తోంది. నిజానికి, తొంభైశాతం వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో అంతంతమాత్రం సాంకేతికతే ఉంటుంది. సిబ్బందికీ¨ అవగాహన తక్కువే. దీంతో, కాస్త దగ్గరి పోలికలు ఉండటంతో ‘ఓ’ గ్రూప్‌ కింద జమకట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడోకానీ వాస్తవం వెల్లడి కాదు. ఆ సమయానికి, వైద్యుల ప్రయత్నం వికటించి రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఉండొచ్చు. పరిస్థితి అంతవరకూ రాలేదు కానీ.. హైదరాబాద్‌కు చెందిన వెంకట రమణ, రాజు సుబ్బయ్యల విషయంలో దాదాపుగా ఇలానే జరిగింది. రెండోసారి పరీక్ష చేయించుకున్నాకే, తమది బాంబే బ్లడ్‌ గ్రూపు అనే విషయం తెలిసింది. ‘ఇప్పటికే నేను ముప్పై అయిదు మందికి రక్తదానం చేశాను. సృష్టికర్త నాకిచ్చిన అరుదైన అవకాశమిది’ అంటారు సుబ్బయ్య. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) తెలుగు రాష్ట్రాల్లోని బాంబే బ్లడ్‌ గ్రూపు వ్యక్తుల వివరాలు సేకరించే ప్రయత్నం ప్రారంభించింది. డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు, బ్లడ్‌ బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ.. ఇప్పటికే పదహారుమందిని గుర్తించింది. జాతీయ స్థాయిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఆ బాధ్యత తీసుకుంది. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కూడా తన బ్లడ్‌ బ్యాంకులలో అరుదైన బ్లడ్‌ గ్రూపుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తోంది. మహారాష్ట్రలోని రత్నగిరితో పాటు.. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో బాంబే గ్రూపు ఉనికి ఉంది. ఒడిశాలోని గిరిజన తెగల్లో ఈ రక్త వర్గానికి చెందినవారు చాలామందే ఉన్నారు. మేనరికాలు, వంశపారంపర్యత, జన్యు ఉత్పరివర్తనాలు ఇందుకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయాలూ

ఉన్నది కొద్దిమంది. ఆ ఐదొందల జనాభాలోనూ కొందరికి వృద్ధాప్యం, కొందరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతుల నుంచే రక్తదానాన్ని ప్రోత్సహిస్తారు. ఆ ప్రకారంగా చురుకైన దాతలు వందలోపే. ఈ పరిస్థితుల్లో ఒకటే మార్గం. ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం. బెంగళూరులోని సంకల్ప్‌ ఫౌండేషన్‌.. దాతల రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది. మరొకరి నుంచి సేకరించాల్సిన అవసరం లేకుండా.. రోగి శరీరమే రక్తాన్ని వృద్ధి చేసుకునే మార్గాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు నిపుణులు.

సుదీర్ఘ ప్రయాణాలు

‘కుటుంబం, ఉద్యోగం.. ఈ రెండే కాదు, రక్తదానాన్నీ నా బాధ్యతగానే భావిస్తాను. వందకోట్ల మందిలో కొన్ని వందలమందికి మాత్రమే లభించిన అపురూప అవకాశమిది. కానీ, చాలా సందర్భాల్లో సకాలంలో రోగిని చేరుకోలేకపోతాం. సమయానికి రైళ్లు అందవు. బస్సులు దొరకవు. ఇలాంటప్పుడే, రక్తదాతలకు రైళ్లలో ప్రత్యేక కోటా అవసరమేమో అనిపిస్తుంది. కానీ, మన పాలకులకు ఎవరు చెప్పాలి?’ అంటున్నప్పుడు ముంబయికి చెందిన కులకర్ణి స్వరంలో ఆవేదన. ఆ మధ్య అతను ఓ వృద్ధురాలికి రక్తం అవసరమై.. ఝార్ఖండ్‌ వరకూ వెళ్లొచ్చాడు. రాత్రంతా నిలబడే రైలు ప్రయాణం చేశాడు. కొంతదూరం లారీలో వెళ్లాడు. అక్కడక్కడా కాలినడకా తప్పలేదు. తిరిగి వెళ్తున్న సమయానికి ఆ కష్టమే గుర్తులేదు. ఓ ప్రాణం నిలబెట్టాననే సంతృప్తి ముందు ఆ బడలిక చిన్నదైపోయింది.

ప్రాణదాత అనిపించుకోడానికి..
డాక్టరే కానవసరం లేదు.
రక్తదాత కూడా కావచ్చు!    


నిజంగా బంగారమే!

గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూపు.. బాంబే బ్లడ్‌గ్రూపు కంటే అరుదైన రకం. ప్రపంచవ్యాప్తంగా యాభైమంది మాత్రమే ఈ పరిధిలోకి వస్తారు. అందులో నలభైమంది ఆరోగ్య కారణాల వల్ల రక్తదానానికి అనర్హులు. మిగిలిన పదిమందే గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూపు ప్రజలకు దిక్కు. ఏ గ్రూపువారికి అవసరమైనా.. కళ్లు మూసుకుని గోల్డెన్‌ గ్రూపు రక్తం ఎక్కించవచ్చు. రియాక్షన్‌కు ఆస్కారం తక్కువ. బాంబే గ్రూపులోనే పారా-బాంబే అనే సబ్‌ గ్రూపు కూడా  ఉంది. ఇప్పటి వరకూ ఓ ముప్పైమంది రక్తంలో ఆ లక్షణాలు గుర్తించారు.  


ఉద్యమానికి రక్త తిలకం

వినయ్‌ షెట్టి.. రక్తదాన ఉద్యమకారుడు. ఆ మహాదానాన్ని ప్రోత్సహిస్తారు.. తలసీమియా రోగులకు అండగా నిలుస్తారు. వేలమంది దాతల్ని నమన్వయం చేసుకుంటూ.. ఎవరికి ఏ అవసరం వచ్చినా తక్షణం స్పందిస్తారు. ముంబయి కేంద్రంగా థింక్‌ ఫౌండేషన్‌ ఛత్రం కింద ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. బాంబే బ్లడ్‌ గ్రూపు పట్ల ప్రజలకు ఎంతోకొంత అవగాహన ఉందంటే.. అదంతా వినయ్‌ చొరవే. ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ... ఇలా వీలైనన్ని డాక్యుమెంట్లలో బ్లడ్‌గ్రూప్‌ను భాగం చేయాలంటారు వినయ్‌ షెట్టి. తాజాగా హైదరాబాద్‌లోనూ బాంబే బ్లడ్‌గ్రూపు నమోదుకు శ్రీకారం చుట్టారాయన. వినయ్‌ విద్యార్థి దశలోనే రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.. ‘రక్తం విలువైన ఔషధం లాంటిది. మిమ్మల్ని బతికిస్తుంది. మీరు మరొకర్ని బతికించే అవకాశమూ ఇస్తుంది’ అంటారాయన.


మహాదానం.. మనమూ చేద్దాం!

క్తదానం సాక్షాత్తూ ప్రాణదానమే. ఇదొక అత్యుత్తమ సేవ. మహోన్నత మానవతా యజ్ఞం. కానీ అర్థంలేని భయాలూ, అశాస్త్రీయమైన ప్రచారాలూ రక్తదాన ఉద్యమాన్ని నీరుగారుస్తున్నాయి. ఆ అనుమానాలు పటాపంచలు చేయాల్సిన సందర్భం ఇది.


మహిళలు రక్తదానం చేయకూడదు

పచ్చి అబద్ధం. మంచిపనికి ఆడామగా వివక్ష ఉండదు. గర్భిణులు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వివిధ రుగ్మతల కారణంగా హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నవారు మినహా ఎవరైనా చేయొచ్చు.


ఏడాదికి ఒకసారే చేయాలి

రక్తదానం వల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. శరీరం ఆ లోటును పూడ్చుకోడానికి నాలుగు నుంచి ఆరువారాల సమయం పడుతుంది. ప్లాస్మా అయితే ఇరవైనాలుగు గంటల్లోపు పూర్వ స్థితికి చేరుకుంటుంది. ఆ ప్రకారంగా, ఓ మూడునెలలు ఆగి, మళ్లీ రక్తదానం చేయొచ్చు.


శాకాహారులకు హానికరం

శాకాహారులమా, మాంసాహారులమా అనేది అప్రస్తుతం. మనం సంపూర్ణ ఆరోగ్యవంతులమైతే చాలు. మాంసాహారంలో ఐరన్‌ ఉంటుంది కాబట్టి, ఐరన్‌ హిమోగ్లోబిన్‌ వృద్ధికి కారణం అవుతుంది కాబట్టి.. ఇలాంటి ప్రచారం జరిగి ఉండొచ్చు. ఆ మాటకొస్తే శాకాహారులు కూడా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, ఎండుద్రాక్ష మొదలైనవి తీసుకోవడం ద్వారా ఐరన్‌ శక్తిని సొంతం చేసుకోవచ్చు.


వయసు ఓ అవరోధం

కానే కాదు. రక్తదానానికి కనీస వయసు పద్దెనిమిది. గరిష్ఠ పరిమితి లేనే లేదు. అరవై ఏళ్ల వయసులోనూ రక్తదానానికి సిద్ధపడుతున్నవారు ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేకపోతే చాలు. కొన్నిరకాల ఔషధాలు తీసుకునేవారు కూడా దూరంగా ఉండటం మేలు. తీవ్ర రుగ్మతల నుంచి పూర్తిగా కోలుకున్నవారు.. నిపుణుల సలహాతో రక్తదానం చేయొచ్చు.  


అనారోగ్యం పాలవుతాం

రక్తదానంతో బలహీనపడిపోతాం, నీరసం ఆవహిస్తుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ఫలితంగా వివిధ రోగాలు చుట్టుముడతాయి.. ఇవన్నీ నిరాధారమైన ప్రచారాలే. నిజానికి, రక్తదానం శరీర వ్యవస్థకు కొత్తబలాన్ని ఇస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒకటిరెండు రోజుల క్రితం రోగ నిరోధక వ్యాక్సిన్‌ తీసుకున్నవారు, నలభై ఎనిమిది గంటల్లో మద్యం పుచ్చుకున్నవారు, ఆ పూట ధూమపానం చేసినవారు.. రక్తదానానికి
అనర్హులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..