అది నేనే... ఇది నేనే!

అచ్చంగా మనలానే ఉంటాయి. మనలానే మాట్లాడతాయి. మనలానే ఆలోచిస్తాయి. మనలానే సమాధానమూ ఇస్తాయి. అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నట్లుగానే అనిపిస్తాయి. ఈ వివరణ అంతా మన ప్రతిబింబాల గురించే.

Published : 19 May 2024 00:00 IST

అచ్చంగా మనలానే ఉంటాయి. మనలానే మాట్లాడతాయి. మనలానే ఆలోచిస్తాయి. మనలానే సమాధానమూ ఇస్తాయి. అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నట్లుగానే అనిపిస్తాయి. ఈ వివరణ అంతా మన ప్రతిబింబాల గురించే. సూటిగా చెప్పాలంటే డిజిటల్‌క్లోన్స్‌ అన్నమాట. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఏఐ పుణ్యమాని కొన్ని సంస్థలు ఇప్పుడు వ్యక్తిగత డిజిటల్‌ క్లోన్లను తయారుచేసేందుకు రెడీ అయిపోతున్నాయి.

దాదాపు పాతికేళ్ల కిందట... ఐశ్వర్యారాయ్‌ నటించిన ‘జీన్స్‌’లో ‘కన్నులతో చూసేదీ గురువా..’ పాటలో హీరోయిన్‌తోపాటు ఆమె ప్రతిబింబం - అదేనండీ, డిజిటల్‌ రూపం కూడా కలిసి డ్యాన్స్‌ చేయడం చూసినప్పుడు భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది కదూ. మనకీ అలా మారు రూపం ఉంటే బాగుంటుందని అప్పుడు ఎంతమంది అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడది అందుబాటులోకి వచ్చింది. అదే ‘డిజిటల్‌ క్లోన్స్‌’. హోలిస్టిక్‌ గురు, హెల్త్‌ గురుగా పేరున్న దీపక్‌ చోప్రా కొన్నిరోజుల క్రితం తనని పోలిన డిజిటల్‌ క్లోన్‌ను తయారుచేయించుకుని ఓ కార్యక్రమానికి హాజరుపరిచి వార్తల్లో నిలిచాడు. అతనిలానే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలనుకునే ఔత్సాహికులూ, అనుక్షణం బిజీగా ఉండే ప్రముఖులూ, తరచూ సమావేశాలకు హాజరయ్యేవారూ... ఒక్కమాటలో చెప్పాలంటే సమయంతోపాటు పరుగులు తీసేవారికి ఈ డిజిటల్‌ క్లోన్స్‌ మంచి పరిష్కారాన్ని చూపిస్తున్నాయిప్పుడు.

ఏంటీ డిజిటల్‌ క్లోన్‌...

ఇప్పటికే వర్చువల్‌, ఏఐ అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లోనూ ఏరోజుకారోజు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ రెండింటితో పోలిస్తే డిజిటల్‌ క్లోన్స్‌ ఎలా భిన్నం అంటే... వర్చువల్‌ అనేది లేనిది ఉన్నట్లుగా చూపించి మాయ చేస్తుంది. ఇక, ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో వ్యక్తిగత ఫొటోలను నచ్చినట్లుగా మార్చుకోవడం, కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడం, గేములు, వ్యాపారంలో భాగం చేసుకోవడం... ఇలా కృత్రిమ మేథస్సును తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారిప్పుడు. ఏఐ మోడళ్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో రాణించడమూ తెలిసిందే. వాటన్నింటికీ అప్‌డేటెడ్‌ వర్షెన్‌గా వచ్చిందే ఈ డిజిటల్‌ క్లోన్‌. అంటే... ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్‌ ప్రతిబింబం అన్నమాట. ఈ క్లోన్‌ మనలానే కనిపిస్తూ.. మనలానే ఆలోచిస్తూ, మనలానే సమాధానమిస్తుంది. ప్రముఖుల నుంచి బిజీ ఉద్యోగుల వరకూ వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తయారుచేస్తున్న ఈ డిజిటల్‌ క్లోన్స్‌తో ఎన్నోలాభాలు ఉన్నాయంటున్నాయి ఆయా తయారీ సంస్థలు. ఎలాగంటే.. ఒక ఫిట్‌నెస్‌ గురు ఒకే సమయంలో అయిదారుగురికి శిక్షణ ఇవ్వాల్సి రావచ్చు. బిజీ వ్యాపారవేత్తలు లేదా ప్రముఖులు తమకున్న సమయంలోనే  బోలెడు కార్యక్రమాలు లేదా సమావేశాలకు హాజరు కావడం తప్పనిసరి కావచ్చు. ఆ సమయాన్ని ఎంత పక్కాగా ప్లాన్‌ చేసుకున్నా ఏదయినా ఆటంకం ఎదురైనప్పుడు ఎలా అని కంగారుపడకుండా ఈ డిజిటల్‌ క్లోన్స్‌ను తెరమీదకు తీసుకురావొచ్చు అంటున్నారు.

ఎలా తయారుచేస్తారు...

ఒక వ్యక్తికి డిజిటల్‌క్లోన్‌ను తీసుకొచ్చేముందు ఆ సంస్థలు సదరు వ్యక్తికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మాటతీరు, ప్రముఖులైతే పాడ్‌కాస్ట్‌లు.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేసి, క్రోడీకరించి, ఆ సమాచారం అంతటినీ క్లోన్‌లో నిక్షిప్తం చేస్తాయి. దాంతో ఆ క్లోన్‌ రూపమే కాకుండా మాటతీరు, ప్రవన్తన, ఆలోచనావిధానం అన్నీ సదరు వ్యక్తిలానే ఉంటాయి. ఈ డిజిట్‌ క్లోన్‌ దుర్వినియోగం కాకుండా తయారీ సంస్థలు ముందుగానే ఫొటో ఐడెంటిఫికేషన్‌ వివరాలతోపాటు ఎన్నో జాగ్రత్తలూ తీసుకుంటాయి. ప్రస్తుతం డెల్ఫి ఏఐతోపాటు ఆల్ట్‌.ఏఐ, కోచ్‌వోక్స్‌ ఏఐ వంటి సంస్థలు ఈ డిజిటల్‌ క్లోన్స్‌ను తయారుచేస్తున్నాయి. పైన ఉదహరించిన దీపక్‌ చోప్రా డిజిటల్‌ క్లోన్‌ను డెల్ఫీ ఏఐ సంస్థే రూపొందించింది. ఈ క్లోన్‌ను కేవలం జూమ్‌కాల్స్‌కే కాకుండా ఇన్‌స్టా, షాపిఫై వంటి ఆప్‌లకూ అనుసంధానం చేసుకోవచ్చట. అదే జపాన్‌లోని ఆల్ట్‌ ఏఐ సంస్థ మరో అడుగు ముందుకేసి తమ ఉద్యోగుల్లో దాదాపు వందమందికి డిజిటల్‌క్లోన్‌లను రూపొందించింది. ఆ ఉద్యోగులు అందుబాటులో లేనప్పుడు ఈ క్లోన్‌లే పనిచేస్తాయట. కోచ్‌వోక్స్‌ అనే సంస్థ సైతం లైఫ్‌కోచింగ్‌, బిజినెస్‌ కోచింగ్‌ రంగాల్లో ఉన్నవారికోసం ఈ క్లోన్‌లను రూపొందిస్తోంది. ఇక, వీటిని వాడుకునే విధానాన్ని బట్టి.. ఒకేసారి లేదా నెలవారీ చొప్పున డబ్బును చెల్లించాల్సి వస్తుంది. మరి... సాంకేతికతలో వచ్చిన ఈ కొత్త రకం మార్పు ఎలా ఉందంటారూ..?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..