మంచుబొమ్మలు... చేసేద్దామా!

వానచినుకుల్లా కురిసే మంచును దూరం నుంచి చూస్తున్నా...దట్టంగా పరుచుకున్న మంచులో కూర్చుని తోచినట్లుగా బొమ్మలు చేస్తూ సరదాగా గడుపుతున్నా ఆ మజానే వేరు కదూ.

Published : 14 Apr 2024 01:10 IST

వానచినుకుల్లా కురిసే మంచును దూరం నుంచి చూస్తున్నా...దట్టంగా పరుచుకున్న మంచులో కూర్చుని తోచినట్లుగా బొమ్మలు చేస్తూ సరదాగా గడుపుతున్నా ఆ మజానే వేరు కదూ. కానీ దానికోసం తరచూ ఏ హిమాలయాలకో లేదంటే విదేశాలకో వెళ్లలేంగా అనేవారికి ఇప్పుడు చక్కని పరిష్కారం వచ్చేసింది. అదే ‘మ్యాజిక్‌ స్నో’. దీంతో నట్టింట్లోనే మంచుపర్వతాలను సృష్టించొచ్చు తెలుసా...

నీళ్లు, ఐసుముక్కలు, ఇసుక, మంచు... ఇవన్నీ ఎదురుగా ఉన్నాయంటే పిల్లలు ప్రపంచాన్ని మర్చిపోయి మరీ ఆడుకుంటారనేది తెలిసిందే. నీళ్లు, ఇసుక, ఐసు ముక్కలంటే కావాలనుకున్నప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఆడుకోవచ్చు. మరి మంచు సంగతి ఎలా అనుకునేవారి కోసమే వచ్చేసింది ‘మ్యాజిక్‌ స్నో’. దీంతో ఇంటినే మంచు ప్రాంతంగా మార్చుకోవడంతోపాటూ తమకు నచ్చిన బొమ్మలు చేసేందుకు రెడీ అయిపోతారు పిల్లలు. మంచు దొరకడం ఏంటీ... అనిపించొచ్చు కానీ ఈ మ్యాజిక్‌ స్నోతో అది సాధ్యమే. ఎందుకంటే ఇది ఫేక్‌/ఆర్టిఫీషియల్‌/ ఇన్‌స్టంట్‌ స్నో మరి. పిల్లల ఆట వస్తువులు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా రకాలు దొరుకు తున్నాయి. సాధారణ బొమ్మల నుంచి స్మార్ట్‌టాయ్స్‌ వరకూ ఎన్నో ఉన్నాయి.  ఎన్ని ఉన్నా... పిల్లల్ని సరదాగా బీచ్‌ దగ్గరకో, ఏదయినా మంచు ప్రాంతానికో తీసుకెళ్లామనుకోండి.. ఇసుకతో కోటలు కట్టేస్తూ, సొరంగాల్ని సృష్టిస్తూ తెగ సంబరపడిపోతారు.

అదే మంచుతో అయితే బంతులు, స్నోమ్యాన్‌...వంటి బొమ్మల్ని తయారు చేసుకుంటూ.. తోటివారిపైన వాటిని విసురుతూ మురిసిపోతారు. ఆ ఆనందాన్ని వాళ్లకు నట్టింట్లో కల్పించేందుకు ఇసుక ఎలాగైతే దొరికేస్తోందో అదేవిధంగా ఈ కృత్రిమ స్నోనీ తీసుకొచ్చారు తయారీదారులు.

ఎలా వాడుకోవచ్చంటే...

ఈ మ్యాజిక్‌ లేదా ఫేక్‌ స్నో- ప్యాకెట్లలో, డబ్బాల్లో పొడిరూపంలో దొరుకుతుంది. ఈ పొడిని ఎకోఫ్రెండ్లీ పాలిమర్‌తో తయారు చేస్తారు. ఇలా వచ్చే పొడిని ఒకటి రెండు చెంచాలు తీసుకుని కాసిని నీళ్లు పోస్తే చాలు. నిమిషాల్లోనే మంచులా తయారవడంతోపాటూ చల్లగా మారే గుణమూ ఈ పొడికి ఉంటుందట.

ఒకవేళ ఇంకా చల్లగా కావాలనుకుంటే.. దీన్ని మరో అరగంటసేపు ఫ్రిజ్‌లోనూ పెట్టి తీసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న మంచుతో స్నోమ్యాన్‌, కుక్కపిల్ల, పాండా, పర్వతాలు, కృత్రిమ ఐస్‌గోలా.. ఇలా ఒకటేమిటి, కోరుకున్న బొమ్మలన్నీ తయారు చేసుకోవచ్చు. ఆ తరువాత ఆసక్తిని బట్టి నచ్చిన రంగుల్నీ అలంకరించొచ్చు. అంతేనా... పుట్టినరోజులప్పుడు ఫ్రోజెన్‌ థీమ్‌ పార్టీలనూ ప్లాన్‌ చేయొచ్చు. ఈ పొడితోపాటూ బొమ్మల్ని తయారు చేసుకునేందుకు వీలుగా కొన్ని మౌల్డ్స్‌, అదనంగా రంగులూ ఉన్న కిట్‌ కూడా దొరుకుతోంది. అన్నింటికీ మించి... చర్మానికి ఎలాంటి హానీ కలగని విధంగా ఈ పొడిని రూపొందించారట. అదండీ సంగతి... పిల్లలకు వేసవి సెలవుల్లో... ఈ పొడిని కొనిచ్చారనుకోండీ... పదేపదే ఫ్రిజ్‌లోంచి ఐసుముక్కల్ని తీసి ఇల్లంతా తడి చేయకుండా ఈ కృత్రిమ మంచుతోనే కాలక్షేపం చేస్తారంటే నమ్మండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..