సిల్కీ... సూపర్‌ చికెన్‌!

నాటుకోడి అయితేనే నాకిష్టం అనే వాళ్లు కొందరు. పందెం కోడి రుచే వేరు అంటారు మరికొందరు. కడక్‌నాథ్‌ కోడి మాంసంలో పోషకాలు బాగుంటాయి అంటారు ఇంకొందరు.

Published : 21 Apr 2024 00:37 IST

నాటుకోడి అయితేనే నాకిష్టం అనే వాళ్లు కొందరు. పందెం కోడి రుచే వేరు అంటారు మరికొందరు. కడక్‌నాథ్‌ కోడి మాంసంలో పోషకాలు బాగుంటాయి అంటారు ఇంకొందరు. చికెన్‌ వెరైటీలను కోరుకోవడంతోపాటు... కోళ్లలో రకాల్ని చూసుకుని కూడా తినేవాళ్లుంటారు. అలాంటి వాళ్లు ఈసారి కెలొరీలు తక్కువగానూ పోషకాలు ఎక్కువగానూ ఉండి రుచిలో అదుర్స్‌ అనిపించే సిల్కీ చికెన్‌ను ప్రయత్నించి చూడండి.

కోడికో ధర, పుంజుకో రేటు ఉండటం తెలిసిందే. వాటిని వండినప్పుడు రుచిలోనూ తేడా ఉంటుందని చెప్పేస్తారు చికెన్‌ ప్రియులు. అదేవిధంగా నాటుకోడి, బ్రాయిలర్‌, కడక్‌నాథ్‌.. ఇలా కోళ్ల వెరైటీలూ చాలానే ఉంటాయి. ఆ జాబితాలో కొత్తగా సిల్కీచికెన్‌ కూడా చేరిందిప్పుడు. సుతిమెత్తని రెక్కలతోనూ పలు రంగుల్లోనూ ఉండే ఈ బొచ్చు కోళ్లు భలే ముద్దుగా ఉంటాయి. చూడగానే ఆకర్షించే గుణమున్న ఈ సిల్కీ కోళ్లను ఇళ్లలో స్థలమున్నవారూ, ఫామ్‌హౌస్‌లున్నవారూ పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివాళ్లకోసమే ఈ సిల్కీచికెన్‌ను పెంచి అమ్మేస్తున్నారు కొందరు. సుమారు మూడువేల అయిదు వందల నుంచి అయిదువేల రూపాయల వరకూ పలుకుతున్న జత కోళ్లు కావడానికి ఫ్యాన్సీ రకమే అయినా... వీటికంటూ కొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి.

ఎక్కడిదీ కోడి...

సిల్కీ/ఫ్లఫ్ఫీ/బాంటమ్‌ చికెన్‌గా పిలిచే ఈ కోడి చైనాలో పుట్టిందని చెబుతారు. దీని రెక్కలు ముట్టుకోవడానికి మెత్తగా ఉండి...  నలుపు, నీలం, లావెండర్‌, గోధుమ, ఊదా వంటి రంగుల్లో వస్తాయి. నిజానికి ఈ కోళ్లు ఇలా రంగుల్లో వస్తున్నా వీటి మాంసం, ఎముకలు మాత్రం నలుపురంగులో ఉంటాయి. సాధారణంగా కొన్ని రకాల కోళ్లు ఇతర పక్షుల గుడ్లను పొదగడానికి ఇష్టపడవు. కానీ ఈ సిల్కీచికెన్‌ మాత్రం అన్నిరకాల పక్షుల గుడ్లునూ పొదిగేస్తాయట. మరీ వేడి లేదా చల్లని వాతావరణం  కాకుండా గది ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఈ కోళ్లకు ఉంటుంది. దాదాపు తొమ్మిదేళ్లు జీవించడం, వీటిని పెంచడమూ సులువు కావడం, ఎగరకపోవడం, ఒళ్లంతా ఒకటి లేదా రెండు రంగుల్లో మాత్రమే కనిపించడం... తదితర అంశాలను పరిగణించే చాలామంది ఈ కోళ్లను తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు.  

ఆరోగ్యానికీ మేలు చేసేలా...

ఈ కోడిని పెంచుకునేవారు కొందరైతే.. దీని మాంసాన్ని తినాలనుకునేవారు మరికొందరు. నిజానికి ఈ కోడి మాంసంలో పోషకాలు ఎక్కువ. అందుకే ఒకప్పుడు చైనీయులు... కొన్ని రకాల అనారోగ్యాలను నయం చేసేందుకు ఈ చికెన్‌ సూప్‌ను తాగేవారట. చైనాలో బాలింతలు ఈ చికెన్‌తో చేసిన పదార్థాలు తినడం వల్ల త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తయారవుతారనీ నమ్మేవారట. అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితం... ఈ కోడి ఎముకల పొడిని మందుల తయారీలో ఉపయోగించేవారట. ఇక, వంద గ్రాముల సిల్కీ చికెన్‌లో దాదాపు ఇరవై గ్రాముల మాంసకృత్తులు, మూడు గ్రాముల కొవ్వు, 121 కెలొరీలు ఉంటాయి. ఈ కోడి మాంసం నల్లగా ఉండటం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయనీ, రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటూ కండరవృద్ధికీ తోడ్పడుతుందనీ అంటారు. అందుకే చైనీయులతోపాటు జపనీయులూ, కొరియన్లూ, మలేషియన్లూ వంటకాల్లో ఈ చికెన్‌ను ఎక్కువగా వాడతారు. అన్నింటికీ మించి.. ఈ కోళ్లలో కార్నోసైన్‌ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. సహజ పెప్టైడ్‌గా పిలిచే ఈ కార్నోసైన్‌ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందట. ఈ
అంశాలన్నీ పరిగణించే వీటి ధర కూడా కాస్త ఎక్కువ అంటున్నారు ఈ కోళ్ల అమ్మకందార్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..