చింతపండు ఐస్‌క్రీం తిన్నారా!

తియ్యని చాక్లెట్‌- కాస్త పుల్లగానూ వస్తే... చల్లని ఐస్‌క్రీంలో తీపీపులుపూ కలగలిసిపోతే... కమ్మటి జెల్లీ- పుల్లటి రుచిలోనూ ఉంటే... అబ్బ తినకముందే నోట్లో నీళ్లూరిపోవూ... ఇదిగో, అందుకే వచ్చాయి రకరకాల చింతపండు చాక్లెట్లూ ఐస్‌క్రీమ్స్‌లాంటివెన్నో!

Published : 03 Mar 2024 00:52 IST

తియ్యని చాక్లెట్‌- కాస్త పుల్లగానూ వస్తే... చల్లని ఐస్‌క్రీంలో తీపీపులుపూ కలగలిసిపోతే... కమ్మటి జెల్లీ- పుల్లటి రుచిలోనూ ఉంటే... అబ్బ తినకముందే నోట్లో నీళ్లూరిపోవూ... ఇదిగో, అందుకే వచ్చాయి రకరకాల చింతపండు చాక్లెట్లూ ఐస్‌క్రీమ్స్‌లాంటివెన్నో!

చింటూ తాతయ్య దగ్గరికి పరుగున వచ్చి ఒక చాక్లెట్‌ చేతిలో పెట్టాడు. ‘నాకెందుకు చాక్లెట్‌’... అంటూనే దానిమీదున్న పేరు చూసిన తాతయ్య- ‘అరెరె చింతపండు చాక్లెట్టా’ అంటూ చటుక్కున నోట్లో పెట్టుకున్నాడు. ‘భలేగా ఉందే. నా చిన్నప్పుడు చింతపండులో కొంచెం ఉప్పూ, కొంచెం కారమూ కలిపి, పుల్లకు గుచ్చి చప్పరించేవాళ్లం. ఇప్పుడదే రుచితో చాక్లెట్లూ వచ్చాయే’ అంటూ ఒకింత ఆశ్చర్యపోయాడు. కానీ అసలు విషయం ఏమిటంటే... ఒక్క చాక్లెట్లేంటీ, రకరకాల స్నాక్సుల్లోనూ చింతపండు కలిసిపోయి సరికొత్త రుచుల్ని అందిస్తోంది.

నిజానికి ఇతర పండ్ల మాదిరే చింతపండుతో కూడా మనకు చాలా లాభాలే ఉన్నాయి. పీచు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-బి, విటమిన్‌-సిలతో ఉండే చింతపండు- జీర్ణక్రియను మెరుగుపరచడం లోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఎంతో మేలు చేస్తుందట. అందుకే మన ఆహారంలో భాగంగా ఉంటుందిది. ఇటు ఉపయోగంతో పాటు అటు కమ్మనీ పుల్లనీ రుచులతో ఉండే చింతపండును ఇంకాస్త సరికొత్త రుచుల్లో చూపితే ఎలా ఉంటుంది అనుకున్నారో లేదంటే పాతతరం అనుభవించిన చిన్న చిన్న సంతోషాల్ని కొత్తతరానికీ పరిచయం చేయాలను కున్నారో... కారణం ఏదైనాగానీ ఎన్నో వెరైటీల్లోనూ చింతపండు రుచిని తీసుకొచ్చారు. ఇదివరకూ చక్కెర, చింతపండుగుజ్జుతో ఉండే ఇమ్లీ పాప్‌లాంటిదే దొరికితే- ఇప్పుడు తీపీపులుపూ రుచులతో చాక్లెట్లూ, జెల్లీలూ, క్యాండీలూ, కుకీలూ, ఐస్‌క్రీమ్సూ వస్తున్నాయి.

ఎన్ని రకాలో...

తియ్యగా ఉండే థాయిలాండ్‌ చింతకాయల్నీ కాస్త పుల్లగా ఉండే మామూలు చింతకాయల్నీ ఉపయోగిస్తూనే వీటన్నింటినీ తయారుచేస్తున్నారట. కొబ్బరిపాలూ, చింతపండును కలిపి ‘టామరిండ్‌ కోకోనట్‌ మిల్క్‌ చాక్లెట్‌’... బెల్లం, ఖర్జూరాలూ, చింత పండు గుజ్జుతో... టామరిండ్‌ ఫ్రూట్‌ కట్లీ, జెల్లీలూ, ఫ్రూట్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఇంకా అరటికాయ, చింతపండుగుజ్జు, కారం, ఉప్పు కలిపి టామరిండ్‌ బైట్స్‌, అరటికాయ టామరిండ్‌ చిప్స్‌ లాంటివాటినీ మార్కెట్లోకి తెచ్చారు. ఇవే కాదు... చల్లచల్లని ఐస్‌క్రీం- పుల్లని రుచినీ ఇచ్చేలా ఇమ్లీ లిక్జ్‌, ఐస్‌క్యాండీస్‌, ఇమ్లీ ఐస్‌క్రీమ్సూ వచ్చాయి. వీటితో పాటు టామరిండ్‌ తేనె, సాసుల్లాంటివీ ఉన్నాయండోయ్‌. ఎప్పుడూ ఒకేరకమైన రుచులతో బోర్‌ కొట్టేస్తుంటే... కట్టామీఠా రుచుల్లో దొరుకుతున్న ఈ చింతపండు పదార్థాల్నీ ఓసారి తిని చూడండి. పిల్లలకేమో కొత్తరుచుల్ని అందిస్తే... పెద్దవాళ్లకేమో చిన్ననాటి తీపి అనుభూతుల్ని గుర్తుకు తెస్తాయి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..