ఈ కోటీశ్వరుడు...ఒకప్పుడు రిక్షావాలా!

రవి దిల్లీలో ఐటీ నిపుణుడు. ఇటీవల తన స్వగ్రామం వెళ్ళాలని పట్నా విమానాశ్రయంలో దిగాడు. రాత్రి రెండుగంటలప్పుడు ‘రోడ్‌బేజ్‌’ క్యాబ్‌ని బుక్‌చేసుకున్నాడు.

Updated : 21 Apr 2024 14:24 IST

రవి దిల్లీలో ఐటీ నిపుణుడు. ఇటీవల తన స్వగ్రామం వెళ్ళాలని పట్నా విమానాశ్రయంలో దిగాడు. రాత్రి రెండుగంటలప్పుడు ‘రోడ్‌బేజ్‌’ క్యాబ్‌ని బుక్‌చేసుకున్నాడు. వస్తానన్న డ్రైవర్‌ పత్తాలేకుండా పోయాడు. రవికి చిర్రెత్తుకొచ్చి ఆ సంస్థ సీఈఓకి మెయిల్‌ చేశాడు. ఐదు నిమిషాల తర్వాత వేరే క్యాబ్‌ వచ్చింది. డ్రైవర్‌ సీట్లో- స్వయంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు దిల్‌ఖుష్‌కుమార్‌ ఉన్నాడు! ‘బిహార్‌ స్టార్టప్‌ కింగ్‌’ ఇలా డ్రైవర్‌గా రావడమేంటన్న రవి ఆశ్చర్యం తర్వాతి రోజు వార్తయ్యింది. దిల్‌ఖుష్‌ ప్రస్థానం మళ్ళీ చర్చకొచ్చింది...

ర్షమొస్తే వరదకీ... రాకుంటే కరవుకీ పేరుమోసిన గ్రామం అది. బనగావ్‌ అని పేరు... బిహార్‌లోని సహస్ర జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లా కేంద్రంలో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా ఉండేవాడు దిల్‌ఖుష్‌కుమార్‌ తండ్రి పవన్‌ ఖాన్‌. దిల్‌ఖుష్‌ని పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ఓ రోడ్డు ప్రమాదంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. పవన్‌ ఖాన్‌ గాయాలతో ఇంటికే పరిమితమైతే... దిల్‌ఖుష్‌ ఇంటర్‌ మానేసి కుటుంబ భారాన్ని తలకెత్తుకోవాల్సి వచ్చింది. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా మారాడు. 18 ఏళ్ళకే అతనికి పెళ్ళిచేశారు. ఇంట్లో ఒకరికి నలుగురు కావడంతో- ఓ స్కూల్‌లో గుమాస్తా పనికి ప్రయత్నించాడు. వాళ్ళు- ఇతనికి ‘ఆపిల్‌’ లోగోని చూపించి అది ఏ ఫోన్‌దని అడిగారట. ఐఫోన్‌ని యాడ్‌లో కూడా చూసి ఎరగని దిల్‌ఖుష్‌ తెలియదనడంతో- ‘పల్లెటూరి మొద్దువి... నీకెందుకీ ఉద్యోగాలు’ అని ఈసడించి పంపించారట. ఈలోపు దిల్‌ఖుష్‌కి బాబు పుట్టాడు... ఈతిబాధలు పెరిగాయి. క్యాబ్‌ డ్రైవర్‌గా దిల్లీకన్నా వెళితే... కాస్త ఎక్కువ ఆదాయం వస్తుందనుకున్నాడు.

రిక్షావాలాగా...

దిల్లీ చేరుకున్న దిల్‌ఖుష్‌ని చూసి ‘నీకిక్కడి ట్రాఫిక్‌ రూల్స్‌ తెలియవు... రూట్లూ అర్థం కావు’ అంటూ ఏ క్యాబ్‌ సంస్థా అవకాశం ఇవ్వలేదట. తానిక్కడ పనిచేయకుంటే ఊళ్ళో అందరూ పస్తులుండాల్సిన పరిస్థితి. చేసేదేమీ లేక రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. రెండు నెలలు ఎలాగోలా నెట్టుకొచ్చాడుకానీ దిల్లీ వాతావరణం పడక అనారోగ్యం పాలయ్యాడు. మళ్ళీ సొంతూరికి చేరుకున్నాడు. ‘అందరూ నన్ను చేతకానివాడిగా చూడటమే కాదు... మొహమ్మీదే ఆ మాట అనసాగారు. అది భరించలేక ఓ సంపన్నుడి దగ్గర కారు డ్రైవర్‌గా చేరాను. ఆ ఆదాయమూ సరిపోయేది కాదు. దాంతో- రోజూ సాయంత్రం అక్కడి మార్కెట్లో కూరగాయ లమ్మాను. చిన్నదే కావొచ్చు కానీ ఆ ‘స్వయం ఉపాధి’ నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఇకపైన నేనేం చేసినా అది సొంత వ్యాపారంగా ఉండాలనుకున్నాను. డ్రైవర్‌ పని మానేశాను...’ అని గుర్తుచేసుకుంటాడు దిల్‌ఖుష్‌. సరిగ్గా అప్పుడే పట్నా నగరంలో ఓలా, ఉబర్‌ సంస్థలు అడుగుపెట్టాయి. అలాంటి క్యాబ్‌ సేవలు పల్లె ప్రాంతాలకూ అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది దిల్‌ఖుష్‌కి! అప్పటికప్పుడు ఓ సెకండ్‌హ్యాండ్‌ ‘టాటా నానో’ కొని వాళ్ళ జిల్లాలోనే సేవలు ప్రారంభించాడు. ఆ సంస్థకి ‘ఆర్యగో’ అని పేరుపెట్టి వాళ్ళింటి పశువులకొట్టాన్నే ఆఫీస్‌గా మార్చుకున్నాడు!

నవ్వనివారు లేరు!

దిల్‌ఖుష్‌ ఆలోచన విని ‘పల్లెజనాలకి కారు సేవలా...’ అంటూ అందరూ నవ్వినవారే. కానీ ఫోన్‌ చేయగానే ఇంటి ముందు వాలిపోయే క్యాబ్‌ సౌకర్యాన్ని మెల్లగా అర్థంచేసుకున్నారు. చూస్తుండగానే అతనికి డిమాండు పెరిగింది. ఆరులక్షలు అప్పుచేసి అదనంగా రెండు శాంత్రోకార్లు కొని సేవల్ని విస్తరించాడు. అప్పుడే బిహార్‌లోని పట్నా, దర్భంగా వంటి నగరాల నుంచి పల్లెటూళ్ళకి రాకపోకలు సాగించేవాళ్ళు పెరగడాన్ని దిల్‌ఖుష్‌ గమనించాడు. 150 కిలోమీటర్ల దూరం ఉండే- ఒకవైపు ప్రయాణానికే క్యాబ్‌ డ్రైవర్‌లు వాళ్ళ నుంచి  రూ.4,500 వసూలు చేయడం చూశాడు. మామూలుగా క్యాబ్‌డ్రైవర్‌లు ప్రయాణికుల్ని ఓ చోట దింపాక, తిరుగుప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుంది కాబట్టి- ఆ రెండింటికీ కలిపే వసూలు చేస్తుంటారు. ‘అలాకాకుండా ప్రయాణికుల నుంచి ఒకవైపు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తే... ఎలా ఉంటుందీ!’ అనిపించింది దిల్‌ఖుష్‌కి. తిరుగుప్రయాణంలో ఖాళీగా వస్తున్న క్యాబ్‌డ్రైవర్‌లనీ, వాళ్ళు వస్తున్న దారిలోనే వెళ్ళాల్సిన ప్రయాణికుల్నీ కలిపితే ఇది సాధ్యమవుతుందని ఆలోచించాడు. అంతేకాదు, ఇద్దరుముగ్గురు ప్రయాణించేలా ‘కార్‌పూలింగ్‌’ పద్ధతిని అనుసరిస్తే పల్లెప్రజల ఖర్చుని మరింత తగ్గించవచ్చనీ భావించాడు. ఈ సేవలన్నింటితో ‘రోడ్‌బేజ్‌’ సంస్థని ప్రారంభించాడు. రూ.1500 వందలకే రెండొందల కిలోమీటర్లు హాయిగా క్యాబ్‌లో వెళ్ళే అవకాశం కల్పించాడు. దాంతో ఏడాదికే- ఓలా, ఉబర్‌ సంస్థల్ని తోసిరాజని బిహార్‌లో అతిపెద్ద క్యాబ్‌ సంస్థగా ‘రోడ్‌బేెజ్‌’ అవతరించింది. పలు దేశీ ఇన్వెస్టర్‌ల పెట్టుబడులతో- సంస్థ విలువ రూ.10 కోట్లకి చేరింది. ఒకప్పుడు అందరూ చేతకానివాడన్న దిల్‌ఖుష్‌ కుమార్‌ని ‘బిహార్‌ స్టార్టప్‌ కింగ్‌’గా మార్చింది!

డ్రైవర్‌లు చల్లన...

ప్రస్తుతం రోడ్‌బేజ్‌ సంస్థ ద్వారా మూడువేల మంది డ్రైవర్‌లు పనిచేస్తున్నారు. వాళ్ళ ఖాతాలో నెలకి కనీసం రూ.60,000 చేరేలా చూస్తున్నాడు దిల్‌ఖుష్‌. అంతేకాదు, ఒక ఎన్జీఓతో చేతులు కలిపి వాళ్ళ పిల్లల చదువుకి కావాల్సిన వసతులన్నీ అందిస్తున్నాడు! పదేళ్ళ కిందట స్కూల్‌ ప్యూన్‌ పనికీ ప్రయత్నించి నెగ్గలేని దిల్‌ఖుష్‌ నేడు ఏకంగా ఐఐటీలూ, ఐఐఎంల విద్యార్థుల్ని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాడు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..