బతుకు పాఠాలు చెబుతారిక్కడ!

క్లాస్‌రూములు, పిరియడ్లు, సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షలు... ఇవేమీ లేని స్కూల్‌ అది. అక్కడ పుస్తకాలు ఉండవు కానీ, పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతారు.

Updated : 24 Mar 2024 05:04 IST

క్లాస్‌రూములు, పిరియడ్లు, సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షలు... ఇవేమీ లేని స్కూల్‌ అది. అక్కడ పుస్తకాలు ఉండవు కానీ, పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతారు.  హోంవర్కులు ఉండవు కానీ, తమ కాళ్ల మీద తాము నిలబడి బతకడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ నేర్పిస్తారు. ప్రకృతి అనే బ్లాక్‌బోర్డు మీద బతుకు పాఠాలను బోధిస్తున్న ఆ ప్రత్యేక పాఠశాల పేరు ‘యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌’.

పిల్లలకు అక్షరాభ్యాసం చేయించగానే తల్లిదండ్రుల మనసులో మెదిలే మొదటి ప్రశ్న.. తమ బిడ్డలను ఏ స్కూల్లో చేర్పించాలనే. ఎన్నో స్కూళ్లు చూసి చివరికి  ఒకటి ఎంపిక చేసుకుని చేర్పిస్తుంటారు. కానీ, తమ కూతురి కోసం ఏకంగా కొత్తరకం బడినే ప్రారంభించారు మహారాష్ట్రకు చెందిన సచిన్‌ దేశాయ్‌- మీనల్‌ దంపతులు. బరువైన బ్యాగులు మోసుకెళ్తూ, పుస్తకాలను బట్టీపట్టే చదువు తమ బిడ్డకు వద్దనీ- జీవిత పాఠాలూ, ఎదిగేందుకు నైపుణ్యాలూ నేర్పించే బడి కావాలనీ అనుకున్నారు. అలాంటి స్కూలు ఎక్కడా దొరక్కపోవడంతో సచిన్‌-మీనల్‌లు తమ ఆలోచనలకు అనుగుణంగా  ‘యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌’ను ఏర్పాటు చేశారు. గోడలు లేని ఆ బడి కొన్నేళ్లుగా ఎంతోమందికి చదువు చెబుతూ, ఉపాధి మార్గాన్నీ చూపుతోంది.

 సొంతూరిలోనే ఉపాధి

సచిన్‌ దేశాయ్‌, మీనల్‌ దంపతులది మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా ధామాపుర్‌. బతుకుతెెరువుకోసం భోపాల్‌ వెళ్లి అక్కడ ఓ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి పిల్లలకు కంప్యూటర్‌ పాఠాలు చెప్పేవారు.
ఆ సమయంలో విద్యార్థులకు నాణ్యమైన చదువు అందట్లేదని అర్థమైంది. అందుకే వారి కూతురు మృణాళిని కోసం ఎన్నో స్కూళ్లు తిరిగారు కానీ ఏదీ నచ్చలేదు. దాంతో పదహారేళ్ల క్రితం సొంతూరు ధామాపుర్‌ వచ్చి ‘శమంతక్‌’ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ- ‘యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌’ (యూఓఎల్‌) పేరుతో ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. సేంద్రియ వ్యవసాయం నుంచి ఆయుర్వేదం వరకు, చేతి వృత్తుల మొదలు పోషకాలతో కూడిన వంటల తయారీ దాకా విభిన్న అంశాల్లో ప్రాక్టికల్‌గా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. టీచర్లు ఉండని ఆ విద్యాసంస్థలో ఎవరికి ఏది ఇష్టమైతే అది నేర్చుకోవచ్చు. ఆ క్రమంలో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. యూఓఎల్‌లో చేరిన వారికి రకరకాల అంశాల్లో శిక్షణ ఇస్తూనే ఓ గంటపాటు వారికి చదువు కూడా చెబుతారు మీనల్‌ దంపతులు. ఆ పిల్లలకు లైఫ్‌ స్కిల్స్‌ నేర్పించడంతోపాటు ‘సంత్‌ రావుల్‌ మహరాజా మహావిద్యాలయ’ నుంచి ఓపెన్‌ డిగ్రీ కూడా పూర్తి చేయిస్తారు. అక్కడి నుంచి ఓ విద్యార్హతతోపాటు జీవితంలో ఎదగగల నైపుణ్యాలతోనే బయటకు పంపుతారు. యూఓఎల్‌లో పేదల్నీ, చదువు మానేసిన వారినీ, తప్పిపోయిన చిన్నారుల్నీ, అనాథల్నీ, జువెనైల్‌ హోమ్‌ నుంచి బయటకు వచ్చినవారినీ చేర్చుకుంటారు. అలానే మానసిక సమస్యల కారణంగా స్కూళ్లలో చేర్చుకోని వారిని కూడా ఆదరిస్తారిక్కడ. రెండు నుంచి మూడేళ్లపాటు వారికి ఇష్టమైన అంశంలో శిక్షణ ఇస్తూనే...  ఏ దిక్కూలేని వారికి ఆశ్రయం కూడా కల్పించి కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అలా అక్కడ శిక్షణ పొంది విభిన్న వృత్తుల్లో దాదాపు రెండు వేల మందిదాకా స్థిరపడ్డారు. ఆ పిల్లలతోపాటు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది ‘యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌’. చిన్నతనం నుంచీ అక్కడే చదువుకుంటున్న సచిన్‌ కూతురు మృణాళిని ప్రస్తుతం దూరవిద్య ద్వారా జర్నలిజంలో పీజీ చేస్తోంది.

మహాత్మాగాంధీ స్ఫూర్తితో అడుగులు వేస్తోన్న సచిన్‌.. శమంతక్‌ ట్రస్ట్‌లో భాగంగా ‘స్వయమ్‌’ అనే స్టార్టప్‌ను స్థాపించాడు. రకరకాల ఆహార పదార్థాలూ, పచ్చళ్లూ, పానీయాలూ, సేంద్రియ ఎరువుల వంటి దాదాపు వంద రకాల ఉత్పత్తుల్ని విద్యార్థులతో కలిసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. అలానే ఆసక్తి కలిగిన న్యాయవాదులతోనూ, లా విద్యార్థులతోనూ కలిసి ‘లా ఫర్‌ సోషల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అనే కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నాడు. దీనికింద పర్యావరణం, మానవహక్కులు, విద్యావ్యవస్థలకు సంబంధించిన సమస్యలపై హైకోర్టులోనూ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లోనూ కేసులు వేసి ప్రజలకోసం స్వచ్ఛందంగా పోరాడుతున్నాడు. తమ విద్యార్థులకు నైతిక బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ యాంత్రిక జీవితాలను కొత్త దారుల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న ‘యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌’లో ఇంటర్న్‌షిప్పు చేస్తూ అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడానికి విదేశీ యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు