వన్యప్రాణుల ప్రేమాలయం... వనతార!

మనకు బాగోకపోతే చూడ్డానికి ఎన్నో ఆసుపత్రులున్నాయి. పెంపుడు జంతువులకూ పశువులకూ వెటర్నరీ హాస్పిటళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి వన్య ప్రాణులైన ఏనుగులూ చిరుతపులులూ వంటివాటికి ఏమైనా అయితే ఎవరు పట్టించుకుంటారు... ప్రమాదాల్లో గాయపడితే వాటి బాధను ఎవరు తీర్చుతారు... అని ఆలోచించాడు అనంత్‌ అంబానీ.

Updated : 17 Mar 2024 21:57 IST

మనకు బాగోకపోతే చూడ్డానికి ఎన్నో ఆసుపత్రులున్నాయి. పెంపుడు జంతువులకూ పశువులకూ వెటర్నరీ హాస్పిటళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి వన్య ప్రాణులైన ఏనుగులూ చిరుతపులులూ వంటివాటికి ఏమైనా అయితే ఎవరు పట్టించుకుంటారు... ప్రమాదాల్లో గాయపడితే వాటి బాధను ఎవరు తీర్చుతారు... అని ఆలోచించాడు అనంత్‌ అంబానీ. ఆ ప్రశ్నలకు సమాధానం, మూగజీవాల పట్ల అతని ప్రేమకు తార్కాణమే ‘వనతార’! వన్యప్రాణుల బాధను తీర్చి సాంత్వన చేకూర్చే ఆ కృత్రిమ అడవిలోని ప్రతి సౌకర్యమూ ఓ అద్భుతమే!

క్కడ అడుగు పెట్టగానే మైదానంలో పరుగులు తీసే దుప్పులూ, నీళ్లలోనూ ఒడ్డునా విశ్రాంతి తీసుకునే మొసళ్ల్లూ కనిపిస్తాయి. రకరకాల పక్షిజాతులూ, హిప్పోలూ, కొండ జాతి మేకలూ, జిరాఫీలూ, అడవి దున్నల వంటి రకరకాల జంతువులు స్నేహంగా తిరుగుతుంటాయి. నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతుంటే ఏనుగులు మట్టితో సయ్యాట ఆడుతుంటాయి. తెల్ల పులులూ, నల్ల పులులూ ఓరగా చూస్తుంటాయి... ఇలా ఆ అడవిలో అడుగడుగునా స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగాలూ, సాధు జంతువులూ ఎన్నో తారసపడతాయి. అక్కడే ఓ వైపు జబ్బుతో బాధపడే జంతువుల్నీ, మరోవైపు కంటికి కునుకు లేకుండా వాటికి సేవలు అందించే సిబ్బందినీ చూడొచ్చు. సహజమైన అడవిలోనో, జూలోనో ఇలాంటి వాతావరణం మనకెక్కడా కనిపించదు. ఇది- మూగ జీవాలను అక్కున చేర్చుకుని వాటి మౌన రోదన తీర్చడానికి అంబానీలు సృష్టించిన అరణ్యం ‘వనతార’.

 

కలల ప్రాజెక్టు....

తాత ధీరూభాయ్‌ అంబానీ, తల్లి నీతా అంబానీ వన్యప్రాణుల విషయంలో శ్రద్ధ తీసుకోవడం, వాటిని కాపాడటం, దానధర్మాలు చేయడం చూస్తూ పెరిగాడు అనంత్‌ అంబానీ. వారి ప్రభావం వల్ల చిన్నతనం నుంచీ జంతువులకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. తమ స్వస్థలమైన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయెన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో దాదాపు 3000 ఎకరాల స్థలం ఖాళీగా ఉందని అతనికి తెలిసింది. ఆ స్థలాన్ని వన్య ప్రాణుల సంరక్షణకోసం ఉపయోగించాలన్న కోరికతో వివిధ రకాల పండ్ల మొక్కల్నీ ఔషధ మొక్కల్నీ నాటించి కృత్రిమ అడవికి బీజం వేశాడు. అప్పుడు అనంత్‌కు పద్దెనిమిదేళ్లు. టీనేజీ పిల్లలంటేనే సరదాలూ సంతోషాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సంపన్నుల వారసులంటే ఇంకెంతో విలాసంగా గడుపుతుంటారు. అలాంటిది ఆ వయసులోనే ప్రాణి సేవ గురించి ఆలోచించిన అనంత్‌ నిర్ణయానికి సంబరపడిన అంబానీల కుటుంబం రిలయెన్స్‌ ఫౌండేషన్‌ తరపున అడవిని నిర్మించడానికి ముందుకొచ్చింది. పదేళ్లలో పెరిగి పెద్దవైన చెట్ల మధ్యలో రెండు ఆసుపత్రుల్నీ, పెద్ద వంటగదినీ, ఇతరత్రా భవనాలను నిర్మించారు. అడవి నక్షత్రం (స్టార్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌) అని అర్థం వచ్చేలా ఆ కేంద్రానికి ‘వనతార’ అనే పేరు పెట్టుకున్నాడు అనంత్‌. ప్రాణాపాయంలో చిక్కుకున్న అడవి జంతువులనూ ఇతర జీవజాతులనూ రక్షించి- వాటికి పునరావాసం కల్పించేలా వనతారలో అన్ని రకాల సదుపాయాలూ కల్పించాడు. ఈ బృహత్కార్యం కోసం దాదాపు పదివేల మంది సిబ్బందినీ నియమించాడు. అనారోగ్యం వల్లనో ప్రమాదాల్లోనో వేటగాళ్ల కారణంగానో గాయపడిన జంతువులకు ఆత్యాధునిక వైద్యంతోపాటు అవసరమైతే శస్త్రచికిత్సలూ చేసి సంరక్షిస్తున్నారు సిబ్బంది. జూలో బంధించినట్టుగా కాకుండా అడవిలో మాదిరిగా స్వేచ్ఛగా తిరిగేలా- క్రూరజంతువులకూ, సాధు జంతువులకూ విడివిడిగా స్థలం కేటాయించిన వనతారలోని సేవలన్నింటినీ రిలయెన్స్‌ ఫౌండేషన్‌ పర్యవేక్షిస్తుంటుంది.

లీలావతితో మొదలు  

‘లీలావతి’... ఓ పెద్ద సర్కస్‌ కంపెనీకి చెందిన ఏనుగు. కొవిడ్‌కు ముందు రోజుల్లో అగ్నిప్రమాదంలో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది. కొవిడ్‌తో పరిస్థితులు కాస్త చక్కబడ్డాక దాన్ని ‘వనతార’కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాడు అనంత్‌ అంబానీ. లీలావతితో సేవలు మొదలుపెట్టిన వనతారలో- అప్పట్నుంచీ దానికి రకరకాల చికిత్సలు అందించడంతోపాటు హైపర్‌బారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ చేస్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా లీలావతిని ఓ అద్దాల గదిలో ఉంచి ఔషధాల సమ్మిళితమైన ఆక్సిజన్‌ను లోపలికి పంపుతున్నారు. ఆ ప్రత్యేకమైన గాలులతోనూ లేజర్‌థెరపీతోనూ ఇప్పుడిప్పుడే లీలావతి కోలుకుంటోంది. ప్రస్తుతం వనతారలో రకరకాల కారణాల వల్ల అనారోగ్యం పాలైన ఇలాంటి దాదాపు 200 ఏనుగులు సాంత్వన పొందుతున్నాయి. వాటికోసం 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రిని నిర్మించారు. పంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిన ఈ కేంద్రంలో పోర్టబుల్‌ ఎక్స్‌రే, లేజర్‌ మిషన్ల వంటివాటితోపాటు పరీక్షలకోసం ల్యాబులూ, ఫార్మసీ, ఆపరేషన్‌ థియేటర్‌, ఏసీ ఐసీయూ తదితర సౌకర్యాలు ఉన్నాయి. చికిత్స కోసం వచ్చినవాటినీ, కోలుకుంటున్న వాటినీ కంటికి రెప్పలా చూసుకోవడానికి- వెటర్నరీ డాక్టర్లూ, బయాలజిస్టులూ, పాథాలజిస్టులూ, న్యూట్రిషనిస్టులూ, ఇతర సిబ్బందీ కలిసి దాదాపు 500 మంది ఉన్నారు. ఆ ఏనుగుల్లో ఒక్కోదానికి రోజుకు 200 కిలోల ఆహారం కావాలి. అందుకోసం అక్కడున్న ప్రత్యేక వంటగదిలో రోజూ దాదాపు యాభై వేల కిలోల ఆహారాన్ని సిద్ధం చేస్తారు. పోషకాహార నిపుణుల సమక్షంలో జావలూ, కిచిడీలూ, డ్రైఫ్రూట్స్‌ లడ్డూలూ, బెల్లం స్వీట్లూ వంటివెన్నో తయారు చేస్తారు. వాటికోసం కావల్సిన ముడిసరకును స్థానిక సేంద్రియ రైతుల నుంచీ సేకరిస్తున్నారు.

ఆధునిక వైద్యం...

ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి బయటికొచ్చాక వనతారలోనే 650 ఎకరాల్లో ‘గ్రీన్‌ జూలాజికల్‌ రెస్క్యూ అండ్‌ రీహాబిలిటేషన్‌ కింగ్‌డమ్‌’(జీజెడ్‌ఆర్‌ఆర్‌కే) పేరుతో మరో విభాగం కనిపిస్తుంది. అందులో 43 జాతులకు చెందిన రెండువేలకు పైగా వివిధ జీవులు ఆశ్రయం పొందుతున్నాయి. వాటికోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ, డయాలసిస్‌ పరికరాలూ- ఆధునిక సౌకర్యాలతో ఆపరేషన్‌ థియేటర్‌ వంటివెన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లోనూ దాడుల్లోనూ గాయపడిన సుమారు 200 చిరుతపులులను రక్షించి ఇక్కడకు తీసుకొచ్చారు జీజెడ్‌ఆర్‌ఆర్‌కే సిబ్బంది. వాటితోపాటు దుప్పులూ, మొసళ్లూ, పాములూ, తాబేళ్లూ, రకరకాల జాతులకు చెందిన పక్షులకు ఈ కేంద్రంలో శస్త్రచికిత్సలు నిర్వహించి, కొత్త జీవితాన్నిచ్చి సంరక్షిస్తున్నారు. మనదేశంతోపాటు ఆఫ్రికాలో గాయపడిన వన్యప్రాణులకు కూడా వైద్యమందించడానికి ప్రభుత్వ పరమైన అనుమతులన్నీ తీసుకుని సేవలందిస్తున్నారు. మెక్సికో, వెనెజువేలాల్లోని అంతర్జాతీయ వన్యప్రాణి రెస్క్యూ కేంద్రాలతో కలిసి పనిచేస్తున్న వనతార- వైద్యుల పరిశోధనలకు ప్రయోగశాలను కూడా అభివృద్ధి చేసింది. అందుకోసం ఈ కేంద్రంలో దాదాపు
2500 మంది సిబ్బందిని నియమించింది.

ప్రాణి సేవకు పెద్ద పీట వేసిన వనతార కేంద్రం- సాధారణ జూ లాగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ బోనుల్లో బంధించి ఉంచిన జంతువులుగానీ, వాటిని చూడ్డానికి వచ్చే సందర్శకులు గానీ కనిపించరు. అచ్చంగా అడవుల్లోని జీవావరణ పరిస్థితులనే కృత్రిమంగా సృష్టించి జంతువులు స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాట్లు చేసిన ప్రాణి ప్రపంచమిది. వన్యప్రాణుల గురించి తెలుసుకోవాలనుకునే వారికీ¨, ఎడ్యుకేషనల్‌ టూర్‌కు వచ్చేవారికీ మాత్రమే ప్రవేశం కల్పిస్తున్న వనతార- దేశంలోని 150కి పైగా జూలను అభివృద్ధి చేసేందుకు సెంట్రల్‌ జూ అథారిటీతోనూ ఇతర ప్రభుత్వ విభాగాలతోనూ కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. దేశం నలుమూలల్లోని జంతుజాలమంతటినీ ఆదరించి అక్కున చేర్చుకుని ఉచితంగా వైద్యమందించే బాధ్యతను భుజానికెత్తుకున్న ‘వనతార’- మూగజీవాల పాలిటి మమత కోవెల అనేందుకు సందేహమెందుకు..?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..