మెచ్చిన పర్‌ఫ్యూమ్‌... నచ్చిన ధరలో!

వేల రూపాయల గూచీ లాంటి బ్రాండెడ్‌ పర్‌ఫ్యూమ్స్‌ రెండువేల రూపాయలలోపే ఉంటే... కోరిన పరిమళం సీసాలు తయారుచేసుకోవచ్చంటే... అబ్బ, ఆ మాటలే అత్తరు పూసినంత హాయిగా లేవూ.

Published : 17 Mar 2024 00:23 IST

వేల రూపాయల గూచీ లాంటి బ్రాండెడ్‌ పర్‌ఫ్యూమ్స్‌ రెండువేల రూపాయలలోపే ఉంటే... కోరిన పరిమళం సీసాలు తయారుచేసుకోవచ్చంటే... అబ్బ, ఆ మాటలే అత్తరు పూసినంత హాయిగా లేవూ. హైదరాబాద్‌లోని అల్‌ హర్మైన్‌ పర్‌ఫ్యూమ్స్‌లో ఆ మాటల్ని నిజం చేసుకోవచ్చు... రకరకాల బ్రాండ్ల పర్‌ఫ్యూమ్స్‌తో పాటూ కస్టమైజ్డ్‌ అత్తర్లనీ చేసిస్తారిక్కడ!

మ్మని పరిమళాలు ఎన్నో మనసును ఇట్టే దోచేస్తాయి. రోజంతా తాజాదనాన్ని అందిస్తూ ఆహ్లాదపరుస్తాయి. అందుకే మరి, ప్రత్యేకంగా పెళ్లీ పేరంటాల్లోనే కాదు, చాలామంది అత్తరు వాసనల్ని- రోజూ తమ ఆహార్యంలో భాగం చేసుకుంటారు. తమ బడ్జెట్‌లో వచ్చే మంచి పర్‌ఫ్యూమ్‌ను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు మనం కొనలేని వేల రూపాయల బ్రాండెడ్‌ కంపెనీల పర్‌ఫ్యూమ్స్‌నూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్‌లోని అల్‌ హర్మైన్‌ పర్‌ఫ్యూమ్స్‌ వాళ్లు మనకు నచ్చిన పరిమళాన్ని చాలా తక్కువ ధరలోనే తయారు చేసిస్తున్నారు.

‘ఇది నీకు మాత్రమే’ అన్నది ప్రతిదాంట్లోనూ ఉండాలనుకునే ఈతరం ఇష్టాన్ని గమనించిన డిజైనర్లూ, తయారీదారులూ దుస్తుల నుంచి నగల వరకూ అన్నింట్లోనూ కస్టమైజేషన్‌ను తీసుకొచ్చినట్టే- ఈ అల్‌ హర్మైన్‌ అత్తరుల్లోనూ ఇస్తోందన్నమాట.

ఏంటీ దీని ప్రత్యేకత...

‘గంధపు వాసనలు చల్లే సీకే పర్‌ఫ్యూమ్‌ భలేగా ఉంటుంది కానీ వేల రూపాయలు పెట్టి కొనలేను’ అనుకుంటున్నారా... అయితే ఈ అత్తరు దుకాణానికి వెళితే ఆ కోరిక తీరుతుంది. అదే కాదు, ఇక్కడ ప్రపంచంలో పేరున్న వేల రూపాయల గూచీ, అర్మానీ, ప్రాడా, వెర్సేస్‌, క్రిస్టియన్‌ డియోర్‌, బుల్గారీ... లాంటి రకరకాల బ్రాండ్‌లకు చెందిన పరిమళాల్ని కూడా చాలా తక్కువ ధరలకే తయారుచేసిస్తారు. సుగంధ నూనెలూ... పూల, పండ్ల సువాసనలతో పాటూ రకరకాల ఫ్రాగ్రెన్సులన్నీ ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. వాటితో మనకు కావాల్సిన పరిమళాన్ని చేసిపెడతారు. ఉదాహరణకు దాదాపు 30 వేల రూపాయలుండే 100 మిల్లీ లీటర్ల లూయీ వుటాన్‌ పర్‌ఫ్యూమ్‌ ఇక్కడైతే మూడువేల రూపాయలకే దొరుకుతుంది. ఇంచుమించు 95 శాతం వరకూ కోరిన బ్రాండ్‌ వాసనతోనే ఉంటుందట ఈ రెప్లికా పర్‌ఫ్యూమ్‌ కూడా. కావాలంటే ముందుగా మినీ బాటిల్‌ను ట్రై చేసి చూశాక నచ్చితేనే పెద్ద బాటిల్‌ కొనుక్కోవచ్చట. అంతేకాదు, మేక్‌ యువర్‌ ఓన్‌ పర్‌ఫ్యూమ్‌ పేరుతో మనకు నచ్చిన సువాసనలతో సరికొత్త అత్తర్లనూ ఇక్కడ తయారుచేసిస్తారు. మల్లెల మధురిమల దగ్గర్నుంచి మట్టి వాసనల వరకూ కమ్మటి గుబాళింపుల అత్తరులెన్నో ఉంటాయిక్కడ.  

దాదాపు 50 సంవత్సరాల నుంచీ నడుస్తున్న ఈ సంస్థ పర్‌ఫ్యూమ్స్‌కి పెట్టింది పేరు. నగరంలో పలుచోట్ల దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ కూడా అందుబాటులో ఉంది.

ఇక్కడ రకరకాల పరిమళాలే కాదు, కళ్లను కట్టిపడేసే ఆకారాల్లో ఖాళీ పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లూ ఉంటాయి. మనకు నచ్చిన బ్రాండ్‌ పర్‌ఫ్యూమ్‌ను తయారుచేయించుకోవడమే కాదు, ఎంచక్కా అందమైన బహుమతి అందించేలానూ అత్తరు సీసాల్ని తీర్చిదిద్దుకోవచ్చు కూడా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..