ఫీజు కట్టలేరా... వీళ్ళున్నారు!

ముగ్గురు మిత్రులు వాళ్ళు. ఓ సెలవురోజు సరదాగా కలిశారు. టీలూ పిచ్చాపాటి ముచ్చట్లూ అయ్యాక నిరుపేద విద్యార్థుల కోసం ఏదైనా చేద్దామన్నాడు వాళ్ళలో ఒకడు. ‘దానికి డబ్బుండాలి!  మనల్ని నమ్మి ఎవరిస్తారు?’ అన్నాడు ఇంకొకడు.

Published : 20 Apr 2024 23:56 IST

ముగ్గురు మిత్రులు వాళ్ళు. ఓ సెలవురోజు సరదాగా కలిశారు. టీలూ పిచ్చాపాటి ముచ్చట్లూ అయ్యాక నిరుపేద విద్యార్థుల కోసం ఏదైనా చేద్దామన్నాడు వాళ్ళలో ఒకడు. ‘దానికి డబ్బుండాలి!  మనల్ని నమ్మి ఎవరిస్తారు?’ అన్నాడు ఇంకొకడు. ‘ఎవరో ఎందుకు... మనదగ్గర ఉన్నదే ఇద్దాం’ అంటూ మొదటి మిత్రుడు తన జేబులోని డబ్బులు అక్కడ పెట్టాడు. మిగతా ఇద్దరూ పర్స్‌ తీశారు... రూ.600 పోగయ్యాయి. ఆ ఆరొందలూ నేడు యాభై లక్షలయ్యాయి. ముగ్గురు కాస్తా ఐదొందలమందయ్యారు. ‘ఫెక్ట్‌’ ట్రస్టుగా మారి పేదవిద్యార్థుల్ని ప్రొఫెషనల్స్‌గా మారుస్తున్నారు!

తురగిరి... మదురై దగ్గర ఓ ఆధ్యాత్మిక కేంద్రం. ఆ కొండెక్కడానికి మెట్లొక్కటే మార్గం. సహజంగా వృద్ధులు ఎక్కలేరు కాబట్టి వాళ్ళ కోసం డోలీలుంటాయి. వారాంతాల్లో అక్కడ డోలీ మోయడానికి వచ్చేవాడు 18 ఏళ్ళ ముత్తుకాళీ అనే కుర్రాడు. ‘బుద్ధిగా చదువుకోకుండా నీకెందుకీ కష్టం’ అని ఎవరైనా అడిగితే ‘నేను హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తున్నా. కాలేజీ ఖర్చుల కోసమే ఇలా వస్తున్నా’ అని చెప్పేవాడు. అతనికి తల్లి లేదు... తండ్రి కూలీనాలీ చేసేవాడు. అతని గురించి ఎవరో ‘ఫెక్ట్‌’(ఫ్రెండ్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌) సభ్యులకి చెబితే వాళ్ళు అతణ్ణి అక్కున చేర్చుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేదాకా ఫీజులు కట్టారు. కానీ- ముత్తుకాళీ డిగ్రీతోనే ఆగిపోవాలనుకోలేదు. హైదరాబాద్‌లో పేరున్న ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పీజీ చేస్తానన్నాడు. ‘ఫెక్ట్‌’ అందుకూ సాయపడింది. ఏడాదికి రెండున్నర లక్షలయ్యే ఫీజూ ఇతర ఖర్చుల్ని భరించింది. ఆ కోర్సు తర్వాత ఇంగ్లండ్‌ వెళ్ళిన ముత్తుకాళీ ఇప్పుడు అక్కడో పెద్ద స్టార్‌ హోటల్‌లో షెఫ్‌గా చేస్తున్నాడు!  

*  *  *

రాజ్‌కుమార్‌ తండ్రి ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు. పనిచేసేచోట ప్రమాదానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. తల్లీ, పెద్దక్కయ్యలకి మతిస్థిమితం లేదు. దాంతో పెద్దమ్మదగ్గర ఉంటూ ఇంటర్‌ చదివాడు. 99 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టులో 200/200 కటాఫ్‌ మార్కులు తెచ్చుకున్నాడు. ఆ విషయం తెలిసి- స్థానిక నేతలు అతణ్ణి సన్మానించి ప్రభుత్వం తరపున చదివిస్తామన్నారు. కానీ- సన్మానం రోజు చేతిలో పెట్టిన పాతికవేలు తప్ప ఎవరూ ఏ సాయమూ చేయలేదు. మరోవైపు- మెడికల్‌ కాలేజీ ప్రవేశానికి సమయం దగ్గరపడుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్లో ‘ఫెక్ట్‌’ గురించి విని వాళ్ళకి ఫోన్‌ చేశాడు రాజ్‌కుమార్‌. అప్పటికప్పుడు ఫీజుకట్టి అతణ్ణి కాలేజీలో చేర్చారు అందులోని సభ్యులు. ఎంబీబీఎస్‌ ముగించేదాకా కాలేజీ, హాస్టల్‌ ఫీజులూ, పుస్తకాలకయ్యే ఖర్చులన్నింటికీ సాయపడ్డారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ ఎండీ (పీడియాట్రిక్స్‌) చేస్తున్నాడు.

ఈ ఇద్దరూ కేవలం మచ్చుతునకలే. గత 18 ఏళ్ళలో ‘ఫెక్ట్‌’ సంస్థ ఇలాంటివాళ్ళు 1200 మందికి సాయపడింది. పదో తరగతితో మొదలుపెట్టి మెడిసిన్‌, నర్సింగ్‌, ఇంజినీరింగ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌... ఇలా విద్య ఏదైనా సరే అన్ని రకాలా ఆదుకుంటోంది. ఇందుకోసమే ఏటా రూ.50 లక్షలు తమ సభ్యుల నుంచి సేకరిస్తోంది. ప్రతిభ ఉన్నా ఉన్నత చదువుకి పేదరికం అడ్డుపడుతున్న వాళ్ళని వెలికితీసి ఉన్నత విద్యావంతులుగా మలుస్తోంది!

ఇలా మొదలైంది...

ఫెక్ట్‌ సంస్థని 2006లో దినేష్‌ బాబు, ప్రవీణ్‌, సెంథిల్‌ అనే మిత్రులు ప్రారంభించారు. ముగ్గురూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళు. బీటెక్‌లో సహాధ్యాయులు. ఐటీ ఉద్యోగాల్లో కుదురుకున్నాక- ఓ సెలవురోజున కలిశారు. పేద విద్యార్థులకి చిన్నగానైనా ఏదైనా చేయాలనుకున్నారు. అప్పటికప్పుడు జేబులోంచి ఆరొందలు తీసి పక్కన పెట్టారు. ఆ తర్వాతి నెల మరో ఆరొందలు... ఇలా ఏడాదిపాటు పోగేసి- మానసిక వికలాంగ చిన్నారులకి ఆశ్రయమిస్తున్న ఓ స్కూలుకి అందించారు. ‘మేం సాయపడ్డ విషయం- మా సహోద్యోగులతో పంచుకుంటే వాళ్ళూ మాతో కలిసి నడుస్తామన్నారు. అలా రెండో ఏడాదే ముగ్గురం కాస్తా పదిమందిమయ్యాం. మరుసటి సంవత్సరం మా సంఖ్య 50కి చేరింది’ అని వివరిస్తాడు దినేష్‌. 2009లో ఈ సంస్థ ట్రస్టుగా రిజిస్టరైంది. 2015 నాటికి సభ్యుల సంఖ్య 500 మందికి చేరింది. వీరిలో నెలకి వెయ్యి నుంచి పదివేలదాకా ఇచ్చేవాళ్ళున్నారు.

కౌన్సెలింగ్‌ కూడా...

ఎంత ప్రతిభావంతులైనా- కొన్ని కోర్సులు కొరకరాని కొయ్యలా ఉంటాయి. వీళ్ళ దగ్గర సాయంతీసుకుంటూ వాటిల్లో చేరి- ఫెయిలైపోతున్నా- ‘ఫెక్ట్‌’ వాళ్ళకి తమ సాయాన్ని ఆపదు. పైగా- వాళ్ళ లోపం ఎక్కడుందో తెలుసుకునేలా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పించి దారిలో పెడుతుంది. ధరణి అనే అమ్మాయికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనది దిగువ మధ్యతరగతి కుటుంబం. సీఏ చదవడం తన లక్ష్యమని చెబితే ఫెక్ట్‌ సభ్యులు ఏడాదికి రెండులక్షల ఫీజుతో కోచింగ్‌లో చేర్పించారు. కానీ అక్కడ- ‘ఇంటర్‌’లో రెండుసార్లు ఫెయిలై కుంగిపోయింది. ‘ఫెక్ట్‌’ ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇప్పించాక- సీఏ విజయవంతంగా ముగించిన ధరణి ప్రస్తుతం డెలాయిట్‌ సంస్థలో ఆడిటర్‌గా చేస్తోంది.

మొదట తమిళనాడులోని విద్యార్థుల కోసమే మొదలుపెట్టిన ఫెక్ట్‌ తమ సేవల్ని కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్రాలకూ విస్తరించింది. ఆయా రాష్ట్రాల్లోని తమ వలంటీర్ల సాయంతో- నిత్యం విద్యార్థుల బాగోగుల్ని చూసుకుంటోంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..