నా హీరోయిన్లు!

రౌడీస్‌ అంటూ తన అభిమానుల్ని ఆప్యాయంగా పిలిచే విజయ్‌ దేవరకొండ.... త్వరలో ‘ఫ్యామిలీ స్టార్‌’తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ తనతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి చెబుతున్నాడిలా...

Published : 30 Mar 2024 23:21 IST

రౌడీస్‌ అంటూ తన అభిమానుల్ని ఆప్యాయంగా పిలిచే విజయ్‌ దేవరకొండ.... త్వరలో ‘ఫ్యామిలీ స్టార్‌’తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ తనతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి చెబుతున్నాడిలా...


తను నా ఆరాధ్య

నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ‘ఏ మాయ చేశావె’ సినిమా విడుదలైంది. అందులో సమంతను చూసినప్పటి నుంచి తనని ఆరాధించడం మొదలుపెట్టా. ఆమె నటించిన సినిమాలను చూసేకొద్దీ తనపైన క్రష్‌ మొదలైంది. కొన్నాళ్లకు ‘మహానటి’లో మేమిద్దరం కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన గొప్ప వ్యక్తిత్వమూ తెలియడంతో ఆమెపైన అభిమానం మరింత పెరిగింది. ఏ సినిమా చేస్తున్నా అదే తన మొదటి సినిమాగా, దానిపైనే తన కెరీర్‌ ఆధారపడి ఉంటుందన్నట్లుగా భావించి మరీ నటిస్తుంది. ‘ఖుషి’ సమయంలోనూ ఆరోగ్యం సహకరించకపోయినా సరే సమంత అతి కష్టంమీద షూటింగ్‌ను పూర్తిచేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. తను ఓ ఫైటర్‌.


లిల్లీ పట్టించుకోలేదు

నేనూ రశ్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటించినా... ‘గీత గోవిందం’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజానికి ఆ సినిమా చేసేందుకు కొందరు హీరోయిన్లు ముందుకు రాలేదట. అలాంటి సమయంలో అప్పుడప్పుడే తెలుగులో నటిస్తున్న రశ్మిక కేవలం కథ విని ఓకే చెప్పింది. షూటింగ్‌ సమయంలోనూ తన పాత్రకు న్యాయం చేసేందుకు వందశాతం కష్టపడింది. ఇక, ‘డియర్‌ కామ్రేడ్‌’ చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చినా లిల్లీ పాత్రకోసం ప్రాణం పెట్టి మరీ నటించింది. క్రమంగా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ప్రముఖ హీరోలతో కలిసి నటించే స్థాయికి చేరుకోవడం చూశాక రశ్మిక శ్రమ వృథా పోలేదు అనిపించింది. తను చేయాలనుకున్న పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతైనా కష్టపడుతుంది.  


సువర్ణగా  మెప్పించింది

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నేను నలుగురు హీరోయిన్లతో నటించినా.. ఐశ్వర్య రాజేశ్‌తో చేసిన సన్నివేశాలు నాకు నచ్చుతాయి. ఎందుకంటే... ఆ సినిమాలో ప్రత్యేకమైన యాసలో మాట్లాడటం కోసం ఎంతో కసరత్తు చేసి ఆ పదాలన్నింటినీ అర్థంచేసుకుని మరీ డైలాగుల్ని చెప్పింది. సువర్ణ పాత్రకు తను వందశాతం న్యాయం చేసింది.


ప్రీతి పాత్ర మంచి జ్ఞాపకం

న్ను ఓ హీరోగా నిలబెట్టిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నా జీవితంలో ఓ మైలురాయి. అందులో నా లవర్‌గా నటించిన షాలినీ పాండేకూ, నాకూ అంతకుముందు పరిచయం లేదు. పైగా మా భాషలూ వేరు. షూటింగ్‌ మొదలు పెట్టకముందు మాకు వర్క్‌షాప్‌ నిర్వహించినా కొన్ని సీన్లను ఎలా చేయాలా అని ఆలోచించేవాడిని. కానీ షాలినీ మాత్రం.. చాలా సులువుగా దర్శకుడు చెప్పింది విని, సన్నివేశాన్ని అర్థం చేసుకుని మరీ నటించేది. దాంతో సినిమా విడుదలయ్యాక చాలామంది మేమిద్దరం నిజంగానే ప్రేమికులమని భ్రమపడ్డారు. ప్రేమించుకుంటున్నారు కదూ అంటూ అడిగినవాళ్లూ ఉన్నారు. షాలినీకి అస్సలు తెలుగు రాకపోయినా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవడం చూసి ఆశ్చర్యపోయా.


చిత్రతో నటించడం తేలిక

నేను రెండుసార్లు తెరను పంచుకున్న మరో హీరోయిన్‌ రీతు వర్మ. మేమిద్దరం మొదటిసారి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో ఆ తరువాత ‘పెళ్లిచూపులు’లో నటించాం. రీతు వర్మతో లాభం ఏంటంటే తను తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. దాంతో షూటింగ్‌ సమయంలో ఒకరితో ఒకరం ముందు మాట్లాడుకుని డైలాగుల్ని ప్రాక్టీస్‌ చేసుకునేవాళ్లం. మా సీన్లు చేసి పక్కకు వెళ్లి కూర్చోకుండా ఆ తరువాత ఏం చేయాలీ.. ఎలా నటించాలీ.. ఇలా ప్రతిదీ చర్చించుకునేవాళ్లం. అలా తనతో షూటింగ్‌ చాలా సౌకర్యంగా అనిపించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..