గేమింగ్‌ ‘పురాణం’!

ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే అయోధ్యాపురిలో విహరిస్తే ఎలా ఉంటుంది? రామమందిరం నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తే ఏం చేస్తారు? నిజజీవితంలో ఇవన్నీ కుదిరే పని కాదు కానీ మొబైల్‌లో కొన్ని ఆటల్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే కచ్చితంగా సాధ్యమవుతాయి.

Published : 09 Jun 2024 01:07 IST

ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండానే అయోధ్యాపురిలో విహరిస్తే ఎలా ఉంటుంది? రామమందిరం నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తే ఏం చేస్తారు? నిజజీవితంలో ఇవన్నీ కుదిరే పని కాదు కానీ మొబైల్‌లో కొన్ని ఆటల్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే కచ్చితంగా సాధ్యమవుతాయి. వాటిలోకి వెళ్తే- కురుక్షేత్ర యుద్ధంలో మనమూ కత్తి తిప్పొచ్చు. రామభక్త హనుమాన్‌గా మారిపోయి రాక్షసుల అంతూ చూడొచ్చు. పురాణాలూ, ఇతిహాసాలూ, భారతీయ సంస్కృతి, చరిత్రలపై అవగాహన కల్పిస్తూ, చిన్నాపెద్దా గేమర్లను కట్టి పడేస్తున్న ఆ ఆటలేంటో చూద్దామా..!

తుపాకులతో కాల్చేసే విధ్వంసకరమైన గేములే ఎక్కువగా ఉంటున్నాయి మొబైల్స్‌లో. కొట్టుకోవడం, చంపుకోవడమే లక్ష్యంగా ఉండే ఆ ఆటలు చిన్నారుల మనసుల్లో ప్రతికూల ఆలోచనల్ని నింపేస్తున్నాయి. పబ్జీ, బ్లూవేల్‌ లాంటివైౖతే మరణాలకూ కారణమవుతున్నాయి. అందుకే కొన్ని గేమింగ్‌ సంస్థలు వినోదంతోపాటు విజ్ఞానాన్నీ పంచాలనే ఉద్దేశంతో పౌరాణిక, చారిత్రక నేపథ్యంలో గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

గేమర్ల చేతిలో గాండీవం...

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠను దేశమంతా పండుగలా జరుపుకుంది. ఆ సంబరాలను రెట్టింపు చేసేలా కొన్ని గేమ్స్‌ వస్తున్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అయోధ్య రామాలయాన్ని నిర్మించొచ్చు, రకరకాల శిల్పాలతో గుడిని తీర్చిదిద్దొచ్చు, పూజలు చేయొచ్చు.  అయోధ్యధామ్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించి, వందేభారత్‌ ట్రైన్‌ను పరుగులు పెట్టించొచ్చు. రామాయణ, మహాభారతాల ఆధారంగా తయారు చేసిన ఆటల్లో రాముడి నుంచి అంగదుడి వరకు ఎందరో కనిపిస్తారు. మహాభారత వీరులందరూ తారసడతారు. ఆసక్తిని బట్టి ఒక వీరుణ్ని ఎంచుకుని ఆ పాత్రలో మనమే పరకాయ ప్రవేశం చేసి రాక్షసుల మీద యుద్ధం ప్రకటించొచ్చు. అర్జునుడి గాండీవం, విష్ణుమూర్తి సుదర్శన చక్రం, గద, పాశుపతాస్త్రం వంటి వాటితో అసురుల భరతం పట్టొచ్చు. మరో ఆటలో హనుమాన్‌గా మారిపోయి లంకా నగరంపై దండెత్తొచ్చు. లిటిల్‌ కృష్ణ అవతారమెత్తి... మాయలెన్నో చేయొచ్చు.

నేర్పుగానూ ఆడొచ్చు...

ఫోన్‌లో కేవలం ఆధ్యాత్మికతను పంచే ఆటలు మాత్రమే కాకుండా ధైర్యసాహసాలను నింపేవీ, కష్టసమయంలో ఎలా తెలివైన నిర్ణయం తీసుకోవాలో నేర్పించేవీ, మెదడుకు పదును పెట్టేవీ, చరిత్ర మూలాల్నీ, పలు సంస్కృతుల్నీ, సంప్రదాయాల్నీ తెలిపేవీ... ఇలా రకరకాల గేమ్స్‌ కూడా వస్తున్నాయి. ఉదాహరణకు- ‘రాజీ: యాన్‌ ఏన్షియంట్‌ ఎపిక్‌’ అనే గేమ్‌లో... రాజీ అనే అమ్మాయి తమ్ముణ్ని ఓ రాక్షసుడు అపహరిస్తాడు. తమ్ముణ్ని వెతుక్కుంటూ బయల్దేరిన ఆ అమ్మాయి అడ్డంకుల్ని అధిగమిస్తూ ఎంతోమందితో పోరాడాల్సి వస్తుంది.

ఆ సమయంలో రాజీకి విష్ణుమూర్తి, దుర్గామాత అండగా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను అందిస్తుంటారు. అలానే రాజీ ఎంతో కష్టమైన పజిళ్లను కూడా దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. పిల్లలకు ధైర్యసాహసాలను నేర్పించే ఇలాంటి ఆటలు ప్లేస్టోర్‌లో ఎన్నో ఉన్నాయి. చరిత్ర విషయానికొస్తే... హిందూ మహాసముద్ర తీరాన చోళ సామ్రాజ్య జెండాను ఎగరేసిన రాజరాజ చోళుడే పొన్నియన్‌ సెల్వన్‌. ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు. ఆగ్నేయాసియా వరకూ తన సైన్యాన్ని నడిపించిన ఆ చక్రవర్తి కథతో రూపొందిందే ‘అన్‌సంగ్‌ ఎంపైర్స్‌: ది చోళాస్‌’ గేమ్‌. ఆడేవారు చోళ సైన్యంతో కలిసి శత్రువుల్ని అంతమొందించొచ్చు. రకరకాల నేపథ్యాలూ, థీమ్‌లతో వచ్చే ఈ ఆటల్ని భారతీయులతోపాటు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌, అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో, రష్యా, చైనా వంటిదేశాల్లోనూ ఎక్కువగా ఆడేస్తున్నారు. రొటీన్‌ ఆటలకు గుడ్‌బై చెప్పి... ఇలాంటి వీడియో గేమ్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తే పిల్లలకు వినోదం, విజ్ఞానం సొంతమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..