షెఫ్‌లు... ఇంటికొస్తారు, వండి పెడతారు!

‘ఇంట్లో చిన్న పార్టీ... వంటలు కాస్త వెరైటీగా ఉండాలి’. ‘అమ్మాయి పుట్టినరోజు వస్తోంది. బిర్యానీ, మంచూరియా కాకుండా పిల్లలు ఇష్టపడే పాస్తా, బర్గర్‌, పిజ్జాల్లాంటివి చేయించాలని ఉంది’.

Published : 19 May 2024 00:35 IST

‘ఇంట్లో చిన్న పార్టీ... వంటలు కాస్త వెరైటీగా ఉండాలి’. ‘అమ్మాయి పుట్టినరోజు వస్తోంది. బిర్యానీ, మంచూరియా కాకుండా పిల్లలు ఇష్టపడే పాస్తా, బర్గర్‌, పిజ్జాల్లాంటివి చేయించాలని ఉంది’. ‘ఈసారి కిట్టీపార్టీ వంతు నాది. పదిమందికోసం వంటచేసే మనిషిని ఒక్కరోజులో ఎక్కడ వెతికి పట్టుకోవాలో’... అంటూ ఆలోచించేవారికోసం ఇప్పుడు శిక్షణ పొందిన షెఫ్‌లు అందుబాటులో ఉన్నారు. ఒకరిద్దరి నుంచి ఎంతమందికోసమైనా సరే కావాలనుకున్నప్పుడు ఇంటికొచ్చే ఈ పర్సనల్‌ షెఫ్‌లు కోరుకున్న వంటకాల్ని మన ఎదురుగానే వండి... హోటల్‌ స్టైల్‌లో అందంగా అమర్చి ఆశ్చర్యపరుస్తారు.

సుధ కొడుకు రాహుల్‌ పుట్టినరోజు. పది నుంచి పన్నెండు మంది ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలుస్తాననీ... పార్టీలో చీజ్‌ పాస్తా, చికెన్‌ లాలీపాప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, మోమోస్‌ వంటివి కావాలనీ పట్టుబట్టాడు. వాటిని బయటి నుంచి తెప్పించొచ్చు కానీ ఎలాంటి నూనెలు వాడతారోననేది సుధ భయం. పోనీ తనే చేయాలనుకున్నా సరిగ్గా కుదరకపోతే... పార్టీమూడ్‌ పోతుంది కాబట్టి ఏం చేయాలబ్బా అనుకుంటున్నప్పుడు ఆమె కొలీగ్‌ ఓ నంబరు ఇచ్చింది. కట్‌ చేస్తే... ఓ వ్యక్తి సుధ ఇంటికొచ్చి రాహుల్‌ అడిగిన వంటకాలన్నీ చేసిపెట్టాడు. వంటవాళ్లు రావడంలో గొప్పేముందని అనుకోవచ్చు కానీ సుధ ఇంటికొచ్చింది శిక్షణ పొందిన షెఫ్‌. నిజానికి ఇప్పటికీ కేటరింగ్‌ సర్వీసెస్‌ ఉన్నాయి. కుక్స్‌ కూడా దొరుకుతున్నారు. ఆర్డరిచ్చిన పదార్థాలను ఇరవైనాలుగ్గంటలూ తెచ్చిచ్చే ఫుడ్‌సర్వీస్‌ ఆప్‌లూ లేకపోలేదు. వీటితో పోలిస్తే షెఫ్‌ ఇంటికి రావడంలో గొప్పేముందని అనిపించొచ్చు కానీ వీళ్ల స్టైలే వేరు. మన వంటింటినే లైవ్‌ కిచెన్‌గా మార్చేసి... ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్థాయిలో వండిపెట్టడమే వీళ్ల ప్రత్యేకత.

కోరుకున్న వంటకాన్ని చేసేలా...

పెళ్లిరోజు, పిల్లల పుట్టినరోజు, ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌, కిట్టీపార్టీ, చిన్న పూజ, ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కావడం... ఇలా ఈ రోజుల్లో అంతా కలిసి సరదాగా గడిపేందుకు బోలెడు అవకాశాలు. వాటన్నింటికోసం ప్రతిసారీ హోటల్‌కు వెళ్లాలంటే మాటలా అనుకునేవారు ఈ షెఫ్‌లను పిలిపించుకోవచ్చు. వీళ్లు ఒక వ్యక్తి నుంచి ఎంతమందికైనా వండిపెడతారు. అదేవిధంగా గంటకోసం వచ్చి ఒకటి రెండు వంటకాలు చేసిపెట్టడం నుంచి కొన్ని గంటల సమయం వరకూ ఉండి అడిగినవన్నీ వండేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌ ... దేనికైనా వీళ్లను పిలిపించుకోవచ్చు. వంటంతా పూర్తయ్యాక వంటింటి గట్టునూ శుభ్రం చేస్తారు. ఇక, వీళ్లు చేసే వంటకాల్లో దక్షిణాది/ఉత్తరాది రుచులతోపాటు హైదరాబాదీ, మొఘలాయి, చైనీస్‌, కాంటినెంటల్‌, కొరియన్‌, మెక్సికన్‌... వంటివన్నీ ఉంటాయి. అలాగే సలాడ్లూ, స్టార్టర్లూ, బార్బెక్యూ, డెజర్ట్‌లూ, చాట్‌లూ, దోశలూ.. ఇలా దేన్నయినా చేస్తూనే చాట్‌, దోశ, స్నాక్స్‌... లాంటివాటికి లైవ్‌ కౌంటర్‌లనూ పెడతారు.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, దిల్లీ... ఇలా దాదాపు అన్నిప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సేవల్ని కూక్స్‌, షెఫ్‌ దర్బారీ, షెఫ్‌ హైర్‌, హోరాసర్వీస్‌... వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఇదంతా బానే ఉంది కానీ... వంటలకు సంబంధించిన పదార్థాలు, వండేందుకు అవసరమైన సామగ్రి ఎలా అనుకునేవారికి వాటినీ అందించే సంస్థలున్నాయి. ఒకవేళ పార్టీకి హాజరయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే... వెయిటర్లనూ పిలిపించుకోవచ్చు. కూక్స్‌ సంస్థ అలాంటిదే మరి.  మనం వండించుకునే వంటకాలు, పార్టీకి వచ్చే వ్యక్తుల సంఖ్య, కోరుకునే ఇతర సేవల్ని బట్టి.. డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి... ఈసారి ఏదయినా పార్టీ పెట్టుకున్నప్పుడు మెనూ మీరు తయారు చేసుకుని వండే పని వీళ్లకు అప్పగించి చూడండి. హాయిగా అతిథులతో కబుర్లు చెబుతూ పార్టీని ఎంజాయ్‌చేస్తూనే వెరైటీ వంటకాలను ఆస్వాదించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..