IIT Madras: అన్నింటా మేటి... మద్రాస్‌ ఐఐటీ!

కొన్ని కాలేజీలు ఉంటాయి... చదివితే ఇక్కడే చదవాలి- అనిపించే ప్రత్యేకతలు వాటి సొంతం. మనదేశంలో సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెద్ద చదువులు చదవాలనుకునే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఐఐటీలను. వాటిల్లో చేరాలని స్కూల్లో ఉన్నప్పటినుంచే కష్టపడతారు.

Updated : 26 Jun 2023 08:04 IST

కొన్ని కాలేజీలు ఉంటాయి... చదివితే ఇక్కడే చదవాలి- అనిపించే ప్రత్యేకతలు వాటి సొంతం. మనదేశంలో సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెద్ద చదువులు చదవాలనుకునే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఐఐటీలను. వాటిల్లో చేరాలని స్కూల్లో ఉన్నప్పటినుంచే కష్టపడతారు. రెండుదశలుగా సాగే ప్రవేశపరీక్ష జేఈఈని ఏటా పన్నెండు లక్షలమందికి పైగా రాస్తే, అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 16 వేలమంది మాత్రమే ఐఐటీల్లో సీటు సంపాదించుకోగలుగుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లోనూ ఇంతకాలం విద్యార్థుల మొదటి ప్రాధాన్యంగా నిలుస్తూ వచ్చిన ఐఐటీ బోంబే, దిల్లీలకు ఇప్పుడు ఐఐటీ మద్రాస్‌ గట్టి పోటీనిస్తోంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్‌లోనూ,జనరల్‌ కేటగిరిలోనూ వరసగా మొదటిస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది. ఏమిటీ దీని ప్రత్యేకత అంటే...

స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకసారి చెన్నైలో బంధువుల ఇంటికి వెళ్లాను. అప్పుడు మా కజిన్‌ నన్ను ఐఐటీ వైపు తీసుకెళ్లాడు. బయటినుంచి చూస్తే అడవిలాగా కన్పిస్తూ లోపల పెద్ద పెద్ద బిల్డింగులతో ఎంత నచ్చిందో నాకు. చదివితే ఇలాంటి కాలేజీలోనే చదవాలనుకున్నా. ఎనిమిదో తరగతి నుంచి సీరియస్‌గా చదివాను. జేఈఈలో మంచి ర్యాంకు తెచ్చుకుని ఇక్కడ చేరినప్పుడు ప్రపంచాన్ని జయించినంత సంతోషమేసింది...’ అంటూ మెరిసే కళ్లతో చెబుతాడు ఒక విద్యార్థి.

‘సొంతంగా స్టార్టప్‌ పెట్టాలన్నది నా కల. ఇక్కడ ప్రొఫెసర్లు మంచి మెంటార్లు అని విన్నా. అందుకే ఇక్కడ చేరడానికి ఇష్టపడ్డా...’నంటాడు మరో విద్యార్థి.

‘ఐఐటీ అంటే చాలా సీరియస్‌ వాతావరణం ఉంటుందేమో, చదువు తప్ప మరేం ఉండవేమో అనుకునేవాణ్ణి. కానీ ఇక్కడ దానికి భిన్నమైన పరిస్థితి కనిపించింది. కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఏడాది పొడుగునా ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. నాకైతే స్టూడెంట్‌ లైఫ్‌లో గోల్డెన్‌ పీరియడ్‌ అంటే మద్రాస్‌ ఐఐటీలో గడిపే సమయమే అనిపిస్తోంది...’ అంటాడు తెలంగాణ నుంచి చేరిన విద్యార్థి.

‘పరిశోధనకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యమిస్తారనీ చక్కటి సౌకర్యాలున్నాయనీ తెలిసి ఏరి కోరి ఈ ఐఐటీని ఎంచుకున్నాను’ అంటాడు ఉత్తరాది నుంచి వచ్చిన ఇంకో విద్యార్థి.

విద్యార్థులకు ఇన్నిరకాలుగా నచ్చింది కాబట్టే కేంద్ర మానవ వనరుల శాఖ ఏటా చేపడుతున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌లోనూ మెరిసిపోతోంది ఐఐటీ మద్రాస్‌. ఐఐటీ కాబట్టి ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు తెచ్చుకోవడం సహజమే. కాకపోతే 2016 నుంచీ 2023 వరకూ వరసగా ఈ సంస్థకే మొదటి స్థానం లభించడమే విశేషం. అంతేకాకుండా, అత్యంత ప్రాధాన్యమున్న ఓవరాల్‌ కేటగిరీలో సైతం ఐఐటీ మద్రాస్‌ వరుసగా ఐదోసారి ప్రథమ స్థానంలో నిలవడం అంతకన్నా విశేషం. ఇలా రెండు విభాగాల్లోనూ అన్నేసేళ్లు ప్రథమస్థానం పొందిన ఏకైక సంస్థ- ఐఐటీ మద్రాస్‌.

ఎలా ఇస్తారు ఈ ర్యాంకుల్ని?

విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచి వాటిని మరింత మెరుగుపరచడం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకుల్ని ఇస్తుంది. ఆయా సంస్థల్లో అందుబాటులో ఉన్న బోధనా వనరులూ, ఎంతమంది విద్యార్థులు ఏయే కోర్సులు చదువుతున్నారూ, ఆర్థిక వనరుల వినియోగమూ, చేపడుతున్న ప్రాజెక్టులూ, విద్యార్థుల్లో వైవిధ్యమూ, కెరీర్లో రాణింపూ, పారిశ్రామిక వ్యాపార రంగాల్లోని నిపుణులు వెల్లడించే అభిప్రాయాలూ తదితర అంశాలెన్నిటినో పరిగణించి ఈ ర్యాంకులు ఇస్తారు.

దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే సాంకేతిక నిపుణుల్ని తయారుచేయాలన్న లక్ష్యంతో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ సంస్థల్ని నెలకొల్పింది ప్రభుత్వం. వీటికి ‘జాతీయ ప్రాధాన్యం కల సంస్థలు’గా ప్రత్యేక గుర్తింపునీ ఇచ్చింది. ప్రాంతీయ విభేదాలూ రాజకీయాలూ లాంటివి లేకుండా క్రమశిక్షణతో లక్ష్యం కోసం పనిచేసే ఐఐటీలకు కోర్సులూ శిక్షణా పరిశోధనలకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేసే స్వేచ్ఛ ఉంది. దాంతో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల నుంచీ పీహెచ్‌డీ వరకూ బయట అందుబాటులో లేని వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్‌, డ్యుయల్‌ డిగ్రీ కోర్సులు ఈ సంస్థల్లో ఉంటాయి. కేవలం ఇంజినీరింగే కాక పలు ఇతర కోర్సులూ ఐఐటీల్లో ఉంటాయి.

మద్రాస్‌ ఐఐటీ విశేషాలేంటి?

నాటి పశ్చిమ జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారంతో 1959లో మద్రాస్‌ ఐఐటీని నెలకొల్పారు. చెన్నైలోని రాజ్‌భవన్‌కి సమీపంలో 632 ఎకరాల్లో విస్తరించిన దట్టమైన అడవి మధ్యలో నిర్మించిన భవనాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ క్యాంపస్‌. లేళ్లూ దుప్పులూ రకరకాల పక్షులూ ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యమిచ్చే ఈ ప్రాంగణంలో పది వేలమంది విద్యార్థులు చదువుతున్నారు.

దాదాపు 600 మంది ఫ్యాకల్టీ సభ్యులూ మరో 1250 మంది పాలనా సిబ్బందీ ఉన్నారు. వందకు పైగా ల్యాబొరేటరీలున్నాయి. విద్యార్థులందరికీ హాస్టల్‌ వసతి ఉంటుంది. ఆస్పత్రీ, బ్యాంకులూ, షాపింగ్‌ సెంటర్లూ, జిమ్‌, స్విమింగ్‌ పూల్‌ లాంటివన్నీ క్యాంపస్‌లోనే ఉన్నాయి. అలాగని విద్యార్థులు లోపలికీ బయటికీ తిరగడంపైన ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రతి స్టూడెంట్‌కీ తన అభిరుచికి తగ్గ యాక్టివిటీ క్లబ్‌ ఉంటుంది. ఏడాది పొడుగునా ఏదో ఒక కార్యక్రమంతో క్యాంపస్‌ సందడిగా ఉంటుంది. ఏడువేల మంది కూర్చోవడానికి వీలుగా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఉంది. ప్రతి శనివారం రాత్రీ అక్కడో సినిమా ప్రదర్శిస్తారు. ఇతర వేడుకలూ, సంగీత కచేరీలూ నిర్వహిస్తారు.

ఏటా టెక్నికల్‌, కల్చరల్‌ ఫెస్ట్‌లు జరుగుతాయి. ఐఐటీలన్నిటి మధ్య ఇంటర్‌ ఐఐటీ స్పోర్ట్స్‌ మీట్‌ కూడా ఉంటుంది. ఇవన్నీ దాదాపు అన్ని ఐఐటీలలోనూ ఉండేవే కానీ మద్రాస్‌కే ప్రత్యేకమైనవి మరికొన్ని ఉన్నాయి.

ఏమిటవి?

ఇక్కడి వాతావరణమూ, దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి రవాణా మార్గాలు అందుబాటులో ఉండడమూ లాంటి కారణాల వల్ల విభిన్న నేపథ్యాలకు చెందిన విద్యార్థులు దిల్లీ, బోంబే తర్వాత మద్రాస్‌ ఐఐటీలోనే ఎక్కువగా కన్పిస్తారు. దక్షిణాది భాషలన్నిటితో పాటు హిందీ ఇంగ్లిషూ కలగలిపి ఈ క్యాంపస్‌లో విన్పించే భాషమీద జర్మన్‌ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఏకంగా మాస్టర్స్‌ థీసిస్‌ చేశాడట.

* స్టార్టప్‌లకు మెంటార్‌లుగానే కాదు, తరచూ వ్యాపారవేత్తలుగానూ మారతారు ఇక్కడి ప్రొఫెసర్లు. తమ విద్యార్థులు పెట్టే స్టార్టప్‌లకు సహ వ్యవస్థాపకులుగా ఉంటారు. పీహెచ్‌డీ విద్యార్థులతో  కలిసి పరిశోధనలో పాలుపంచుకుంటారు. ఐడియాలను స్టార్టప్‌లుగా మార్చడం వెనక కీలక పాత్ర పోషిస్తారు.

* 250 విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని, ఆయా సంస్థల భాగస్వామ్యంతో కోర్సులూ ప్రాజెక్టులూ చేపడుతున్నారు. దాంతో విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ ఎక్కువే.

* ఏటా వందకు పైగా పేటెంట్లకు దరఖాస్తు చేస్తూ అత్యధిక పేటెంట్లు సాధించిన విద్యాసంస్థగా పేరు తెచ్చుకుంది మద్రాస్‌ ఐఐటీ.

* క్యాంపస్‌లో రీసెర్చ్‌ పార్క్‌ పెట్టిన మొట్టమొదటి ఐఐటీ ఇదే. పలు సవాళ్లను ఎదుర్కొనే పరిశోధకులకు మార్గదర్శకత్వంతో సహా సకల వసతుల్నీ కల్పిస్తారిక్కడ. పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో సమన్వయం చేసుకుంటూ సాగుతున్న ఐఐటీ ప్రగతికి ఈ పార్క్‌ ఎంతగానో తోడ్పడుతోంది.

* ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా రీసెర్చ్‌ పార్క్‌లో ఇంక్యుబేషన్‌ దశలో ఉన్న స్టార్టప్‌లతో కలిసి పనిచేయొచ్చు. సైన్సూ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు చదివీ చదివీ బోర్‌ కొడితే కాస్త మార్పు కోసం సంగీతం, ఫొటోగ్రఫీ, డాన్స్‌, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ లాంటి వాటిల్లో చేరి రిలాక్స్‌ అవచ్చు.

* ఏటా ఇక్కడ నిర్వహించే టెరీ ఫాక్స్‌ రన్‌కి చాలా పేరుంది. పాతిక వేలమంది దాకా పాల్గొనే ఈ రన్‌తో విరాళాలు సేకరించి క్యాన్సర్‌ పరిశోధనకు వినియోగిస్తున్నారు.

స్టార్టప్‌ రంగంలో దీని పాత్ర ఏమిటి?

అజీర్తి నుంచి అంతరిక్ష యాత్రల వరకూ ఇక్కడ పరిశోధించని అంశం లేదు.

పరిశోధక విద్యార్థులూ వారి ప్రొఫెసర్లూ కలిసి ఏటా కొన్ని వందల పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. పూర్తిగా త్రీడీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌ని విజయవంతంగా ప్రయోగించిన ‘అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ మద్రాస్‌ ఐఐటీ ప్రాంగణంలో పుట్టిందే. ఇప్పుడిది దేశంలోని స్పేస్‌ టెక్నాలజీ సంస్థల్లో తొలి వరుసలో నిలుస్తోంది. మరో సంస్థ ‘గెలాక్సై’ ప్రపంచంలోనే తొలిసారి మల్టీ సెన్సార్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ని తయారుచేసి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది.

డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ‘డేటా ప్యాటర్న్స్‌ ఇండియా లిమిటెడ్‌’ కూడా ఐఐటీ మద్రాస్‌ కన్సార్టియంలో చేరింది. గాలినుంచి నీటిని తయారుచేసే ‘వాయుజల్‌ టెక్నాలజీస్‌’, క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ స్టార్టప్‌ ‘క్యూన్యూ ల్యాబ్స్‌’, ఫ్లైయింగ్‌ ట్యాక్సీల రూపకల్పనకు కృషిచేస్తున్న ‘ఈప్లేన్‌ కంపెనీ’, పరిశ్రమల వ్యర్థ జలాల నుంచి విద్యుత్తు తయారీకి కృషిచేస్తున్న ‘జేఎస్‌పీ ఎన్విరో’, కృత్రిమ మేధ స్టార్టప్‌ ‘హైపర్‌వెర్జ్‌’, మెరైన్‌ రోబోటిక్‌ సొల్యూషన్స్‌కి కృషిచేస్తున్న ‘ప్లానిస్‌ టెక్నాలజీస్‌’... ఇలాంటివి ఎన్నో మద్రాస్‌ ఐఐటీ అండతో నిలబడినవే. అందుబాటులోకి వచ్చిన సెప్టిక్‌ ట్యాంకుల్ని శుభ్రం చేసే రోబో, పూర్తిగా సౌరశక్తితో పనిచేసే డీశాలినేషన్‌ ప్లాంట్‌, పెట్రోలియం వ్యర్థాలను ఉపయోగపడేలా మార్చడం... లాంటివన్నీ ఇక్కడి పరిశోధకుల చలవే. ఇవన్నీ చేయడానికి కావలసిన ఆర్థిక వనరుల్నీ సంస్థే సమీకరించుకోవడం విశేషం.

అదెలా?

కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మీద ఆధారపడకుండా నిధుల సమీకరణకు మద్రాస్‌ ఐఐటీ రకరకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ అండ్‌ స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఆర్‌) విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టుల ద్వారా, బయటి పరిశ్రమలకు సలహాలివ్వడం ద్వారా ఏటా కొన్ని వందల కోట్లు సంపాదిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంపాదన వెయ్యికోట్ల పైమాటే.

అంతేకాకుండా పూర్వవిద్యార్థులకు సంబంధించి ఇక్కడ పలు సంఘాలున్నాయి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన సంస్థ అభివృద్ధికి ఇవన్నీ రకరకాలుగా తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు- విద్యార్థుల సృజనకు పదునుపెట్టే వాతావరణాన్ని కల్పించడానికి, ఏడాది పొడుగునా పనిచేసే అతి పెద్ద ల్యాబ్‌ ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌’ని 1981 బ్యాచ్‌ విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో ప్రారంభించారు. ఇలా క్యాంపస్‌లోని పలు భవనాలు పూర్వ విద్యార్థుల విరాళాలతో నిర్మించినవే. ఇక్కడ చదువుకుని బిలియనీర్‌ అయిన ప్రేమ్‌వత్స తన తండ్రి పేరున క్యాంపస్‌లో అద్భుతమైన అథ్లెటిక్స్‌ స్టేడియం నిర్మించారు. ఇలా చాలామంది చాలా రకాలుగా సంస్థను మరింత బలోపేతం చేయడానికి కృషిచేస్తూనే ఉన్నారు. ఇదేకాక ‘జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌’ పేరుతో ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న ఫండ్‌ రైజింగ్‌ వేదిక కూడా సంస్థని ఆర్థికంగా ఆదుకుంటోంది. రీసెర్చ్‌ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతూ అందుకు ఎంత డబ్బు కావాలో సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంటోంది. దాతలు తమకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టుకి విరాళాలు అందిస్తూ ఉంటారు. ఇలా పలుమార్గాల్లో తాను స్వావలంబన సాధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతోంది ఐఐటీ మద్రాస్‌.

సైన్సూ టెక్నాలజీలను ప్రగతికి మెట్లు... అంటారు. ఆ రంగాల్లో కృషి ప్రజల కలలకు అద్దం పట్టాలీ, అవసరాలను తీర్చాలీ... అన్నది ఆశయమైతే దాన్ని ఆచరణలోకి తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థల్లో ముందు నిలుస్తోంది ఐఐటీ మద్రాస్‌! లక్ష్యానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేసే ప్రొఫెసర్లూ, విద్యార్థుల సృజనశీలతా, అండగా నిలుస్తున్న పరిశ్రమ నిపుణులూ... అంతా కలిసి ఈ ఐఐటీని మిగతావాటికి భిన్నంగా ఉంచుతున్నాయన్నది నిపుణుల మాట.


అక్కడే చదివారు!

ఐటీల్లో ఒక్కో దానికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎక్కువ మంది సీఈఓలను తయారుచేసిన సంస్థగా ఖరగ్‌పూర్‌ ఐఐటీకి పేరు. అదే మద్రాస్‌ ఐఐటీ విషయానికి వస్తే సాంకేతిక రంగంలో ఉన్నతస్థానాలకు వెళ్లినవాళ్లు ఎక్కువ కన్పిస్తారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు క్రిస్‌ గోపాలకృష్ణన్‌, గూగుల్‌న్యూస్‌ సృష్టికర్త కృష్ణ భరత్‌, బిలియనీర్‌ ప్రేమ్‌వత్స, జోహో వ్యవస్థాపకులైన అన్నాచెల్లెళ్లు శ్రీధర్‌- రాధా వేంబు, టాటాస్టీల్‌ ఎండీ ముత్తురామన్‌, ఐబీఎం సీటీఓ అండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జై మేనన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్‌ టెక్నాలజీ ఆవిష్కర్త రామనాథన్‌ వి.గుహ, మైక్రోసాఫ్ట్‌ సీటీఓ రఘు రామకృష్ణన్‌ తదితరులు ఉన్నారు. ఇక్కడ చదువుకుని శాస్త్రవేత్తలుగా రాణించిన వారెందరో శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డులు అందుకున్నారు. పలువురు విదేశీ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ పరిశోధనలూ చేస్తున్నారు.


కోటి జీతంతో ఉద్యోగాలు

దివినవాళ్లందరికీ మంచి ఉద్యోగాలు వస్తేనే ఏ కాలేజీకైనా గర్వకారణంగా ఉంటుంది. ఈ ఏడాది 445 మందికి మంచి ఉద్యోగావకాశాలు లభించాయి. అందులో పాతిక మందికి వార్షిక జీతం కోటి రూపాయల పైనేనట. మరో 15 మందికి అంతర్జాతీయ సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి. మొత్తం 331 కంపెనీలు ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి రిజిస్టర్‌ చేసుకున్నాయి. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌కన్నా ముందే 407 మందికి ప్రిప్లేస్‌మెంట్‌ ఆఫర్లు (ఇంటర్న్‌షిప్‌ చేసిన చోటే ఉద్యోగావకాశాలు) రావడం మరో విశేషం. ఇలా జరగడం ఇప్పటివరకూ ఇదే గరిష్ఠం.

2022లో 480 కంపెనీలనుంచి అవకాశాలు రాగా ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగాల్లో 24.3 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. బీటెక్‌ విద్యార్థులకు అత్యధికంగా రూ.2.14 కోట్ల ప్యాకేజీ లభించింది. 2021 కన్నా 2022కి ఉద్యోగావకాశాలు 43 శాతం పెరిగాయట. మొత్తంగా జీతానికి సంబంధించి యావరేజ్‌ ప్యాకేజీలు చూసినా ఆకర్షణీయంగానే ఉన్నాయి. బీటెక్‌ ఓవరాల్‌ 33 లక్షలు, బీటెక్‌ సీఎస్‌ఈ 42 లక్షలు, బీటెక్‌ ఈసీఈ 25 లక్షలు...చొప్పున వచ్చాయి. ఎంపిక చేసుకున్న సంస్థల్లో మైక్రోసాఫ్ట్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, మెకిన్సే కంపెనీ తదితరాలు ముఖ్యమైనవి.


స్టార్టప్‌లూ... యూనికార్న్‌లూ...

మధ్య ఏ స్టార్టప్‌ వ్యవస్థాపకులను కదిలించినా ఐఐటీలో చదివానని చెబుతున్నారు. నిజంగానే ఈ విషయంలో ఐఐటీలు ముందువరసలోనే ఉన్నాయి. కొత్తవాటిని మినహాయిస్తే పాత ఐఐటీల్లో ఒక్కో దాంట్లో చదువుకున్న వారినుంచి వందల్లో స్టార్టప్‌లు వచ్చాయి. అలాగే ఐఐటీ మద్రాస్‌లో పట్టా పుచ్చుకున్నవారు ఇప్పటివరకూ 827 కంపెనీలు పెట్టగా అందులో 11 యూనికార్న్‌లు అయ్యాయి. దాదాపు 1900మంది పెట్టుబడిదారులనుంచి లక్షా పాతికవేల కోట్ల రూపాయల నిధులను ఈ కంపెనీలు సేకరించాయి. ఐఐటి మద్రాస్‌ ఆలుమ్ని స్థాపించిన టాప్‌ టెన్‌ కంపెనీల్లో స్విగ్గీ, అర్బన్‌ లాడర్‌, మైండ్‌ ట్రీ, అథర్‌ ఎనర్జీ, ఈజ్‌మైట్రిప్‌, జెట్‌వర్క్‌, రుబ్రిక్‌, అప్‌వర్క్‌, వేకూల్‌, ఆఫ్‌బిజినెస్‌... ఉన్నాయి.


రీసెర్చ్‌ పార్క్‌- 50వేల కోట్లు!

రిశోధన చేయడమే కాదు, దాని ఫలితాలు పేపరు మీద మిగిలిపోకుండా ఉత్పత్తులుగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆశయంతో మద్రాస్‌ ఐఐటీలో రీసెర్చ్‌ పార్క్‌ని ప్రారంభించారు. పదకొండున్నర ఎకరాల్లో విస్తరించిన విశాలమైన భవనాల్లో ఉన్న ఈ లాభాపేక్ష లేని సంస్థలో 16 విభాగాల్లో మూడున్నరవేల మంది రీసెర్చ్‌ స్కాలర్స్‌ పరిశోధనలు చేస్తుండగా 600 మంది ఫ్యాకల్టీ సభ్యులున్నారు. రోజంతా ఇన్నొవేషన్‌, ఇంక్యుబేషన్‌, ఇకోసిస్టమ్‌ లాంటి మాటలు మార్మోగే ఈ సంస్థలో పని ఎలా జరుగుతుందో తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ...

అంకిత్‌ పొద్దార్‌ది వ్యాపారకుటుంబం. వ్యాపారం చేయడం ఇష్టంలేక ఇంజినీరింగ్‌ చదివాడు. అలాగని జీవితమంతా కోడింగ్‌ రాస్తూ గడపదలచుకోలేదు. దాంతో మద్రాస్‌ వచ్చి రీసెర్చ్‌ పార్క్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ ఝన్‌ఝన్‌వాలాను కలిశాడు. ఆయన అంకిత్‌కి ఒక సమస్య చెప్పారు. ఆ భవనంలోనే నాలుగు లక్షల చదరపు అడుగుల విభాగంలో ఎయిర్‌కండిషనింగ్‌కి సంబంధించిన ఆటోమేషన్‌ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనీ ఎలా మెరుగుపర్చవచ్చో చూడమనీ చెప్పారు. అది సాధ్యం అయితే భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అంకిత్‌ సరేనని పరిశోధన మొదలెట్టాడు. అతడి ప్రయోగాలకు కావలసిన వనరులన్నీ సంస్థే సమకూర్చింది. అంకిత్‌ రెండున్నరేళ్లపాటు కష్టపడ్డాడు. రకరకాల విధానాలను ప్రయత్నించి ఎట్టకేలకు ఏసీ వ్యవస్థ తక్కువ కరెంటుతో ఎక్కువ సమర్థంగా పనిచేసే సాంకేతికతను తయారుచేశాడు. పెద్దపెద్ద భవనాల్లో ఉష్ణోగ్రతల్నీ, వెంటిలేషన్నీ ఐఓటీ సాయంతో నియంత్రించేందుకు తాను కనిపెట్టిన విధానాన్ని వ్యాపారపరంగా అభివృద్ధిచేసి ‘జెడ్‌బీ’ పేరుతో స్టార్టప్‌ పెట్టాడు అంకిత్‌.

ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఇక్కడ పురుడు పోసుకుని పరిశ్రమలుగా వ్యాపారాలుగా రూపుదాల్చాయి. పరిశోధకులకీ శాస్త్రవేత్తలకీ సాంకేతికజ్ఞానం తప్ప వ్యాపారజ్ఞానం తక్కువ. అందుకే ఇక్కడ దానిపై దృష్టిపెడతారు. విద్యార్థులే కాదు, సంస్థలు కూడా తమ సమస్యలను చెప్పి పరిష్కారాలు పొందవచ్చు. బిగ్‌ డేటా, నానో టెక్నాలజీస్‌, ఏఆర్‌/వీఆర్‌, కృత్రిమమేధ, మెషీన్‌ లెర్నింగ్‌, బయోటెక్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌చైన్‌... తదితర సాంకేతికతలకు ప్రయోగశాలగా మారిన ఈ రీసెర్చ్‌ పార్క్‌ని ‘ఇండియాస్‌ డీప్‌ టెక్‌ హావెన్‌’ అంటారు. 50 వేలకోట్ల విలువ చేసే రెండు వందలకు పైగా కంపెనీలు ఈ రీసెర్చ్‌పార్క్‌ నుంచి బయటకు వచ్చాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..