సెలెబ్రిటీల ఇంట్లో మనమూ ఉందామా!

చాలామంది రాజకుటుంబీకులు తమకు చెందిన విలాస భవనాలను హోటళ్లుగా మార్చేసి... పర్యటకులకీ, డెస్టినేషన్‌ పెళ్లిళ్లకీ ఆహ్వానం పలకడం మనకు తెలిసిందే.

Updated : 19 May 2024 13:44 IST

చాలామంది రాజకుటుంబీకులు తమకు చెందిన విలాస భవనాలను హోటళ్లుగా మార్చేసి... పర్యటకులకీ, డెస్టినేషన్‌ పెళ్లిళ్లకీ ఆహ్వానం పలకడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొందరు సెలెబ్రిటీలూ అదే బాటలో నడుస్తూ తమ ఖరీదైన భవనాలను హోమ్‌ స్టేలుగా ఆధునికీకరించి... అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. తమ ఇళ్లలో బస చేసే అవకాశం కల్పిస్తున్న ఆ ప్రముఖులు ఎవరంటే....

తిథులు ఉండటానికి వీలుగా ఇళ్లను సౌకర్యంగా మార్చేసి అద్దెకిచ్చే సంస్కృతి మన దగ్గర ఎప్పుడో మొదలైంది. సెలెబ్రిటీలు మొదలుకొని సామాన్యుల దాకా కొత్త ప్రదేశాలకు వెళితే హోమ్‌స్టేలకు ప్రాధాన్యమిస్తున్నారు ఈరోజుల్లో. ఇందువల్ల పర్యటనకు వెళ్లిన ప్రదేశంలో ఇబ్బంది పడకుండా సొంతింట్లోనే ఉన్న అనుభూతి పొందుతూ నచ్చినవన్నీ చేయించుకుని తింటూ సకల సౌకర్యాలూ అనుభవించొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హోమ్‌ స్టేలూ ఫార్మ్‌ స్టేలూ అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి. చాలామంది తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లను జ్ఞాపకంగా ఉంచుకోవాలని భావించి హోమ్‌స్టేలుగా మార్చేసి ఆదాయం పొందుతున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవికి చెన్నైలో ఓ విలాసవంతమైన భవనం ఉంది. బీచ్‌ను ఆనుకుని ఉన్న ఆ భవనంలో జాన్వీ కపూర్‌కి చిన్ననాటి జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. శ్రీదేవి మరణానంతరం జాన్వీకి సొంతమైన ఆ మాన్షన్‌ను- హోమ్‌స్టేగా మార్చేసి ఓ ప్రముఖ రెంటల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ ఇంట్లో ఉండేవారిని అప్పుడప్పుడూ కలవడంతోపాటు  తనకు ఇష్టమైన వంటకాలతో విందు కూడా ఇస్తుందట. అదే విధంగా షారూఖ్‌ ఖాన్‌ మూడేళ్ల క్రితమే దిల్లీలో ఉన్న తన ఇంటిని హోమ్‌స్టేగా మార్చేశాడు. కుటుంబంతో ముడిపడిన ఎన్నో జ్ఞాపకాలకు నెలవైన ఆ ఇంటికి రీమోడలింగ్‌తో రాయల్‌ లుక్‌ని తీసుకొచ్చి- పర్యటకులకూ, పెళ్లిళ్లకూ అద్దెకిస్తున్నాడు.

ప్రకృతి మధ్యలో... 

క్యాన్సర్‌ కారణంగా క్రికెట్‌కి దూరమైన యువరాజ్‌ సింగ్‌ కూడా వీళ్ల బాటలోనే నడుస్తున్నాడు. గోవాలోని తన ఆసక్తులకు తగినట్టుగా ఓ ఇంటిని నిర్మించుకుని చాలా కాలం హాలిడే హోమ్‌గా ఉంచాడు. ప్రకృతికి చేరువగా బీచ్‌కి అభిముఖంగా ఉండే ఆ ఇంట్లో ఉన్నప్పుడు తనకెంతో పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది అనే యువరాజ్‌ సింగ్‌- రెండేళ్ల క్రితం పర్యటకులకూ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ముంబయి పరిసరాల్లో ద్వీపాన్ని తలపించే మాధ్‌ ప్రాంతంలో ఓ విశాలమైన భవనమొకటి ఉంది బాలీవుడ్‌ నటి మందిరా బేడీకి. కొండల మధ్యలో... పచ్చని రంగేసినట్టుండే ప్రదేశంలో బోగన్‌విల్లా పేరుతో ఉన్న ఆ ఇంటిని మందిర స్వయంగా డిజైన్‌ చేసి నిర్మించుకుంది. సెలవురోజుల్లో భర్తతో ఎప్పుడూ అక్కడే గడిపిన మందిర... అతని మరణానంతరం ఆ ఇంటిని అద్దెకివ్వడం మొదలుపెట్టింది.

అమ్మడం ఇష్టంలేకే...

ఈ మధ్య వచ్చిన ‘యానిమల్‌’ సినిమాలో ప్యాలెస్‌ని తలపించే రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు- బాలీవుడ్‌ నటుడు, కరీనా కపూర్‌ భర్త అయిన సైఫ్‌ అలీఖాన్‌ కుటుంబానికి చెందిన రాజభవనం. దానిపేరు పటౌడీ ప్యాలెస్‌. 150 గదులున్న ఆ ప్యాలెస్‌ గుడ్‌గావ్‌లోని పదెకరాల్లో విస్తరించి ఉంటుంది. కొంత కాలం ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించి హోటల్‌గా మార్చేసింది పటౌడీ కుటుంబం.

రెండేళ్ల క్రితం సైఫ్‌ అలీఖాన్‌ పూర్తి బాధ్యతలు తీసుకుని ఆ రాజభవనంలో కొన్ని మార్పులూ చేర్పులు చేయించి- ప్రయివేటు పార్టీలకూ, వేడుకలకూ అందుబాటులో ఉంచుతూనే సినిమా షూటింగులకూ అద్దెకిస్తున్నాడు. ‘తాండవ్‌’, ‘మేరీ బ్రదర్‌కీ దుల్హన్‌’, ‘వీర్‌జారా’, ‘మంగళ్‌ పాండే’, ‘రంగ్‌ దే బసంతీ’ చిత్రాలు అక్కడ చిత్రీకరించినవే. ఈ ప్రముఖులు పర్యటకులకు ఆతిథ్యమిస్తుంటే విరాట్‌ కోహ్లీ దిల్లీలో తన పూర్వీకులకు సంబంధించిన ఓ ఫ్లాట్‌ను అమ్మడం ఇష్టం లేక కో వర్కింగ్‌ స్పేస్‌గా మార్చేశాడు. ముఖ్యంగా సమావేశాలకూ వేడుకలకూ, తాత్కాలికంగా పనిచేసుకునేందుకు వీలుగా మార్చి కార్పొరేట్‌ లుక్‌ని తీసుకొచ్చి అద్దెకిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..