అప్పుడే... ఆలోచనలు ఫిట్‌

చిన్నస్థాయి ఉద్యోగులు సైతం ఒత్తిడితో సతమతమవుతున్న రోజులివి. మరి కంపెనీల యజమానులూ, సీఈఓల పరిస్థితి ఏంటి? విధి నిర్వహణలో వీళ్లకి అడుగడుగునా సవాళ్లు.

Updated : 11 Jun 2023 16:31 IST

చిన్నస్థాయి ఉద్యోగులు సైతం ఒత్తిడితో సతమతమవుతున్న రోజులివి. మరి కంపెనీల యజమానులూ, సీఈఓల పరిస్థితి ఏంటి? విధి నిర్వహణలో వీళ్లకి అడుగడుగునా సవాళ్లు. ఓ సంస్థని విజయవంతంగా నడపాలంటే.. నాయకులు మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలి. అందుకోసం వీళ్లు ఏం చేస్తారంటే...


రోజుకో వ్యాయామం...

వారంలో ప్రతిరోజూ ఒకేలా కాకుండా భిన్నమైన వ్యాయామాలు చేస్తారు ఆనంద్‌ మహీంద్రా. ఒకరోజు కార్డియో-వాస్క్యులర్‌(స్విమ్మింగ్‌, ట్రెడ్‌మిల్‌), ఇంకోరోజు బరువులెత్తడం, మరోరోజు యోగా... ఇలా చేస్తుంటారు. వీటితోపాటు రోజూ ఉదయం 20 నిమిషాలు ధ్యానం చేస్తారు. ఆదివారం వ్యాయామం చేసే విషయంలో కొన్నిసార్లు బద్ధకం వేస్తుంటుందట. అలాంటప్పుడు క్రీడాకారుల శిక్షణ వీడియోలు చూసి స్ఫూర్తిపొందుతారు. అలాంటి వీడియోల్నీ ట్విటర్‌లో పంచుకుంటుంటారు. 68 ఏళ్ల ఆనంద్‌... మారథాన్‌ రన్నర్‌ కూడా. 

 ఆనంద్‌ మహీంద్రా, ఛైర్మన్‌, మహీంద్రా గ్రూప్‌


ఫిట్‌నెస్‌ కోసం... ఆట!

రుపదులు దాటినా ఎంతో ఫిట్‌గా కనిపించే సజ్జన్‌... రోజూ ఇంట్లోని జిమ్‌లో కార్డియో, బరువులెత్తడంలాంటి వ్యాయామాలు చేస్తారు. జాగింగ్‌, రన్నింగ్‌... ఇష్టమే. ఆఫీసుకు వెళ్లేప్పుడు లాబీ నుంచి మొదటి, రెండో అంతస్తు వరకూ మెట్లపైనుంచే వెళ్తారు. తరచూ ప్రయాణించే సజ్జన్‌ ఇప్పటికీ టెన్నిస్‌, స్క్వాష్‌ ఆడతారు. మారథాన్లలో పాల్గొంటారు. ‘ఫిట్‌గా ఉంటే పనిలోనూ చురుగ్గా ఉంటాం. అందుకే రోజూ ఆటలు ఆడతాను, వర్కవుట్స్‌ చేస్తా, సరైన ఆహారం తీసుకుంటా. ముఖ్యంగా రన్నింగ్‌... మనతో మనం గడపడానికి ఉపయోగపడే అత్యుత్తమ సమయం’ అని చెప్పే సజ్జన్‌... వివిధ లీగ్‌ల ఫ్రాంచైజీ(బెంగళూరు ఎఫ్‌సీ, దిల్లీ క్యాపిటల్స్‌, హరియాణా స్టీలర్స్‌) యజమానిగా క్రీడలనూ ప్రోత్సహిస్తారు. 

సజ్జన్‌ జిందాల్‌, ఛైర్మన్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌


ఆరోగ్యం తర్వాతే ఆర్థికం...

ర్థిక లక్ష్యాల్ని అందుకోవడంలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతుంటారనీ, కానీ ఈ ప్రపంచంలోని డబ్బంతా పెట్టినా మంచి ఆరోగ్యం దొరకదనీ అంటారు నితిన్‌. ‘రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రపోతా... దానివల్ల ఆరోజు ఆలోచనలకు, అలసటకు తొందరగా ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లవుతుంది. ఉదయం అయిదింటికి లేచి వ్యాయామం చేస్తా. బరువులెత్తడం, కార్డియో... అన్నీ చేస్తా. నిద్రకు గంట ముందు ఫోన్‌ పక్కన పెట్టేస్తా. డిన్నర్‌ తొందరగా ముగిస్తా. రిఫైన్డ్‌ షుగర్‌ కాకుండా ఖర్జూరం లాంటి వాటినుంచి చేసిన స్వీట్స్‌ తింటూ బరువు నియంత్రణలో ఉంచుకుంటా’ అని చెబుతారు నితిన్‌.

నితిన్‌ కామత్‌, వ్యవస్థాపకుడు, జిరోదా


మారథాన్‌ ఎన్నో నేర్పింది!

క్షల కోట్ల టాటా సామ్రాజ్యానికి ఛైర్మన్‌... చంద్ర. మధుమేహాన్ని ఎదుర్కోవడానికి 15 ఏళ్ల కిందట రన్నింగ్‌ అలవాటుచేసుకున్నారు. రోజూ నాలుగింటికే నిద్రలేచి 8 కి.మీ. పరుగుతీస్తారు. ఏటా నాలుగైదు మారథాన్లలో పాల్గొంటారు. ‘మారథాన్లద్వారా ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు, వ్యక్తిగతంగా, వృత్తి పరంగా మేలు జరుగుతుంది. సాధారణ సమయాల్లో ఆలోచించని, గమనించని విషయాలెన్నో రన్నింగ్‌ చేస్తున్నప్పుడు తటస్థిస్తాయి. పక్కనున్న వాళ్లు పరుగుతీస్తుంటే మనకూ పరుగు మధ్యలో ఆపబుద్ధి కాదు. అలాగే ఉద్యోగులందరి లక్ష్యం ఒక్కటైతే కలిసికట్టుగా పనిచేస్తారు. ఇలాంటి పాఠాలెన్నో నేర్చుకున్నా’ అని చెబుతారు చంద్ర.

ఎన్‌.చంద్రశేఖరన్‌, ఛైర్మన్‌, టాటా సన్స్‌


ఇటు స్విమ్మింగ్‌... అటు సైక్లింగ్‌

యుడమోనియా... గ్రీకులో ‘పరిపూర్ణ జీవితం’ అని అర్థం. శాశ్వతమైన సంతోషం, ఆనందం... దీనిలో ముఖ్యం. ఈ విధానాన్నే అనుసరిస్తారు దివ్య. ‘అందుకు శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నప్పుడు  బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌ చేసేదాన్ని. రన్నర్‌ని కూడా. ఇప్పుడైతే యోగా, కార్డియో, పిలేటస్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌... నా వ్యాయామంలో భాగం. రోజూ 30-60 నిమిషాలు, వారంలో అయిదు రోజులు వ్యాయామం తప్పనిసరి. మహిళలు ఇంట్లోని అందరి గురించీ ఆలోచిస్తారు కానీ తమ గురించి పట్టించుకోరు. అందరి తర్వాతయినా తమకోసం సమయం కేటాయించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి’ అంటారు.

 దివ్యా గోకుల్‌నాథ్‌, సహ వ్యవస్థాపకురాలు, బైజూస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..