ఎక్కడ సేదతీరుతామంటే!

వేసవిలో క్రికెట్‌ ప్రేమికులంతా ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూస్తూ సేదతీరుతున్నారు. మరి ఆ మ్యాచులు ఆడుతూ తమ జట్లను ముందుకు నడిపించే కెప్టెన్లు...  విశ్రాంతి కోసం ఎక్కడికి వెళతారో తెలుసా!! ఆ ప్రదేశాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి!

Updated : 21 Apr 2024 00:29 IST

వేసవిలో క్రికెట్‌ ప్రేమికులంతా ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూస్తూ సేదతీరుతున్నారు. మరి ఆ మ్యాచులు ఆడుతూ తమ జట్లను ముందుకు నడిపించే కెప్టెన్లు...  విశ్రాంతి కోసం ఎక్కడికి వెళతారో తెలుసా!! ఆ ప్రదేశాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి!


గ్రీస్‌లో విహరిస్తా

- కేఎల్‌ రాహుల్‌

ని ఒత్తిడి నుంచి బయటపడి హాయిగా గడపడానికి భారత్‌లోనూ చాలా ప్రదేశాలున్నాయి. కానీ ప్రైవసీ లేక విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్యారిస్‌ వీధుల్లో షాపింగ్‌ చేయడం, స్పెయిన్‌లో స్థానిక వంటకాలను రుచిచూడటం నాకు అలవాటు. గ్రీస్‌ కూడా చూడ్డానికి బాగుంటుంది. అక్కడ చాలా పురాతన కట్టడాలున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టినవి కూడా ఎంతో ఆధునికంగా అనిపిస్తాయి. అవి అతియాకీ బాగా నచ్చుతాయి. అందుకే ఇద్దరం తరచూ గ్రీస్‌ వెళ్లొస్తుంటాం. పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని అనుకున్నాం కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరక సింపుల్‌గా ఓ ఫామ్‌హౌస్‌లో చేసుకున్నాం.


లండన్‌ వెళ్తా

- హార్దిక్‌ పాండ్య

క్రికెట్‌ మ్యాచ్‌లు లేనప్పుడు స్నేహితులతో కలిసి ఎక్కువగా లండన్‌ వెళుతుంటా. ఎన్నిసార్లు వెళ్లి వచ్చినా మళ్లీ మళ్లీ అక్కడకు వెళ్లాలనిపిస్తుంటుంది. సముద్రపు జీవుల్ని దగ్గరగా చూపించి ఎన్నో వింతల్ని పరిచయం చేసే ‘సీ లైఫ్‌ అక్వేరియం’ బాగా నచ్చుతుంది. మొదటి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడిన ఆస్ట్రేలియా కూడా నాకు ప్రత్యేకం. మనసు బాగోనప్పుడు అక్కడికే చెక్కేస్తుంటా. మ్యాచ్‌ తాలూకు తీపి జ్ఞాపకాలు మనసును తేలిక పరుస్తుంటాయి. అందుకే కుటుంబంతో కలిసి ఎక్కువగా వెళ్లొస్తుంటా. వెళ్లిన ప్రతిసారీ ఖరీదైన వాచీలు కొనడం అలవాటు.


అమ్మమ్మ ఊరెళతా

- శుభమన్‌ గిల్‌

టలీలోని రోమ్‌, వెనిస్‌ నాకు చాలా ఇష్టం. వెనిస్‌ నగరంలో పడవ ప్రయాణం ఎంత బాగుంటుందో. ఆ అనుభూతికోసమే ఖాళీ దొరికినప్పుడు అక్కడికి వెళుతుంటా. ప్రకృతిలో గడపడానికి ఇష్టపడే నాకు మన దేశంలో కశ్మీర్‌ నచ్చుతుంది. వీటన్నింటితోపాటు పంజాబ్‌లో పాక్‌ సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మమ్మగారి ఊరు చక్‌ ఖేరేవాలా అంటే చెప్పలేనంత ఇష్టం. ఒత్తిడిగా ఉన్నప్పుడు- నేను పుట్టిన ఆ ఊరికి వెళ్లి సేదతీరుతుంటా. అక్కడి పచ్చని పొలాల్లోనే మూడేళ్ల వయసులో క్రికెట్‌ ఆడటం నేర్చుకున్నా. ఎక్కడికెళ్లినా ఆ పచ్చదనాన్నీ, కల్మషం లేని బంధువుల్నీ అస్సలు మర్చిపోలేను.


ఆలయాలు చుట్టొస్తా

- రిషబ్‌ పంత్‌

త్తరాఖండ్‌లోని రూర్కీలో పుట్టి పెరిగిన నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మ్యాచ్‌లు లేనప్పుడు మా పరిసర ప్రాంతాల్లోనే సేదతీరుతుంటా. సమయం దొరికితే కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వెళ్లొస్తుంటా. ఆధ్యాత్మిక ప్రయాణం పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తుందని నమ్ముతా. ఇప్పటివరకూ ఎన్ని సార్లు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చానో లెక్కే లేదు. ఏడాదిలో రెండు సార్లు అమ్మ, చెల్లితో కలిసి దుబాయ్‌ చుట్టొస్తా. అక్కడ స్కై డైవింగ్‌, స్కూబా డైవింగ్‌ చేయడానికి ఇష్టపడతా. పలు పర్యటక ప్రదేశాలతోపాటు పామ్‌జుమేరి, బుర్జ్‌ఖలీఫా కూడా చూసొస్తుంటాం.


ఇస్తాంబుల్‌ ఇష్టం

-శ్రేయస్‌ అయ్యర్‌

ప్రపంచమంతా చుట్టేయాలన్న లక్ష్యం పెట్టుకున్న నేను తీరిక దొరికితే స్నేహితులతో కలిసి ఎక్కడికో ఒకచోటుకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటా. ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం టర్కీలోని ఇస్తాంబుల్‌ వెళుతుంటా. అక్కడి ఆహారం, కట్టడాలూ బాగా నచ్చుతాయి. బీచ్‌ వాతావరణంలో గడపాలనిపిస్తే గోవా వెళతా. కరీబియన్‌ దీవుల్లో ఒకటైన ఆంటీగా కూడా నా ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌. ఆ వాతావరణం ఎంతో బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..