ఆ ‘సూపర్‌’ రైళ్ళ వెనక... నా టెక్నాలజీ!

ఓ మారుమూల గ్రామం. గుడ్డి వెలుతుర్లో చదువు. వారాంతాల్లో పొలం పనులు. - ఇలాంటి బాల్యం గడిపినవాళ్ళెవరైనా ‘ముందు మనకో సర్కారు ఉద్యోగమొస్తే చాలు’ అనుకుంటారు. మిరియాల మురళీధర్‌ అలాంటి ఉద్యోగాలు కాదనుకున్నాడు.

Updated : 17 Mar 2024 08:15 IST

ఓ మారుమూల గ్రామం. గుడ్డి వెలుతుర్లో చదువు. వారాంతాల్లో పొలం పనులు. - ఇలాంటి బాల్యం గడిపినవాళ్ళెవరైనా ‘ముందు మనకో సర్కారు ఉద్యోగమొస్తే చాలు’ అనుకుంటారు. మిరియాల మురళీధర్‌ అలాంటి ఉద్యోగాలు కాదనుకున్నాడు. సాహసించి పరిశోధనవైపు అడుగేశాడు. ఆ తెగువే ఆయన్ని జపాన్‌లో ప్రసిద్ధ సైంటిస్టు- ప్రొఫెసర్‌గా నిలిపింది. సూపర్‌ఫాస్ట్‌ ట్రెయిన్‌లకి కావాల్సిన కీలక సాంకేతికతని అందించేలా చేసింది. ఆ స్ఫూర్తి కథేమిటో చూద్దామా...  

చైనాలో ఈ మధ్య గంటకి 600 కిలోమీటర్లు ప్రయాణించే సూపర్‌ఫాస్ట్‌ రైలుని పరిచయం చేశారు. ఆ రైలు మన దగ్గరుంటే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి అరగంటలో చేరుకోవచ్చన్నమాట! ఓ రైలుకి అంత స్పీడు ఎలా సాధ్యమవుతోంది? అది పట్టాల ‘మీద పరిగెడుతూ’ కాకుండా పట్టాల ‘పైన తేలుతూ’ ప్రయాణిస్తే సాధ్యమవుతుంది. కంటికి కనిపించని రెండు అయస్కాంత క్షేత్రాలు రైలుని గాల్లో తేలేలా చేస్తే- ఏ రాపిడీ లేకుండా అది గరిష్ఠ వేగంతో దూసుకెళుతుందన్నమాట. అందుకే వీటిని ‘మ్యాగ్నటిక్‌ లెవిటేషన్‌’(మ్యాగ్‌-లెవ్‌) ట్రెయిన్స్‌ అంటారు. ఇక్కడ-ఓ రైలుని మోయగలిగేంత అయస్కాంత క్షేత్రాన్ని (మ్యాగ్నటిక్‌ ఫీల్డ్‌ని) సృష్టించడమే కీలకం. కాకపోతే- ఆ క్షేత్రాన్ని మామూలు అయస్కాంతంతో కాకుండా ‘సూపర్‌కండక్టర్స్‌’తో సృష్టిస్తారు. ఆ అపూర్వ లోహాల గుట్టు విప్పినవాళ్ళలో నేనూ ఒకణ్ణి!
మహబూబ్‌ నగర్‌ భూత్‌పూర్‌ మండలంలో చిన్న పల్లెటూరు మాది. పేరు కరివేన. నాన్న టీచర్‌. ఇంట్లో మేం ఏడుగురు పిల్లలం. ఏడుగురి చదువు సాగాలి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. పదో తరగతి సెకండ్‌ క్లాసులోనే పాసయ్యాను. అప్పట్లో చదువుపైన పెద్ద ఆసక్తికానీ... గొప్ప లక్ష్యాలు కానీ లేవు. కానీ- మా నాన్న ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరే- ఊళ్ళోని పిల్లలకి పైసా తీసుకోకుండా చదువు చెబుతుండేవారు. నాన్న విద్యకిస్తున్న ఆ ప్రాముఖ్యతే నన్ను మార్చిందని చెప్పాలి. ఇంటర్‌ నుంచి చదువే ధ్యాసగా అయ్యింది. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ తర్వాత బీఈడీ కూడా చేశాను. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం రెండుసార్లు వచ్చినా పీహెచ్‌డీ వైపే మొగ్గాను. నా ఖర్చుల కోసం హోమ్‌ట్యూషన్‌లు చెబుతూ పరిశోధనలో నిమగ్నమయ్యాను. అప్పుడే ‘హైటెంపరేచర్‌ సూపర్‌కండక్టర్స్‌’ గురించి విన్నాను. అప్పట్లోనే వాటిపైన నేను పరిశోధించి రాసిన 18 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో వచ్చాయి. దాంతో డాక్టరేట్‌తోపాటూ 1995లో ‘యంగ్‌ సైంటిస్టు’ అవార్డూ అందుకున్నాను. ఆ ఫెలోషిప్‌తోనే పోస్ట్‌-డాక్టరల్‌ చేశాను. ఆ పరిశోధనే నన్ను జపాన్‌కి తీసుకెళ్ళింది.

అంతగా ఏం చేశానంటే...

అయస్కాంత క్షేత్రాల గురించి మొదట్లో చెప్పాను కదా! అయస్కాంతానికి రాగి తీగచుట్టడం ద్వారానే ఒకప్పుడు వాటిని సృష్టిస్తుండేవారు. జనరేటర్లలో ఈ సూత్రమే పనిచేస్తుంది. కానీ- రాగి తీగల ద్వారా కరెంటు ప్రవహించడం వల్ల- విద్యుత్తు శక్తిని 5 శాతం దాకా కోల్పోతాం. అలాకాకుండా- ఏ మాత్రం నష్టం కలగకుండా విద్యుత్తుని మోసుకెళ్ళే ప్రత్యేక లోహాలే ఈ సూపర్‌కండక్టర్‌లు. కానీ మొదట్లో ఈ లోహాల ద్వారా విద్యుత్తు ప్రవహించాలంటే -269 డిగ్రీల చల్లదనం కావాల్సి వచ్చేది. అలా కాకుండా, మామూలు వాతావరణం(గది ఉష్ణోగ్రత)లోనూ అవి పనిచేసేలా ఉండాలని శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. 1987లో ఓ ముందడుగు వేశారు. గది ఉష్ణోగ్రతలో కాకున్నా -182 డిగ్రీల చల్లదనంలో పనిచేసే లోహ మిశ్రమాన్ని కనిపెట్టారు. కానీ, ఆ చల్లదనంలో అయస్కాంతశక్తి క్షేత్రం స్వల్పంగా- కేవలం 2 టెస్లాల మేరకే ఉండేది. దాన్నే నేను 15 టెస్లాలకి పెంచే కొత్త లోహమిశ్రమాన్ని ఆవిష్కరించాను. అది సృష్టించే అయస్కాంతక్షేత్రానికి ఓ రైలుని కూడా మోసే శక్తి ఉండేది. ఆ ఆవిష్కరణతోనే జపాన్‌ వెళ్ళాను. అక్కడి ఇంటర్నేషనల్‌ సూపర్‌కండక్టివిటీ టెక్నాలజీ సెంటర్‌ (ఐస్‌టెక్‌లో)లోకి అడుగుపెట్టాను. జపాన్‌ రైల్వేలోనూ పనిచేశాను. గంటకి 600 కి.మీ. మించిన వేగంతో ప్రయాణించే మ్యాగ్‌-లెవ్‌ ట్రెయిన్‌లో నా టెక్నాలజీయే కీలకమైంది. ఇవీ, వీటితోపాటు మరికొన్ని ఆవిష్కరణలకి సంబంధించి 13 అంతర్జాతీయ పేటెంట్లు అందుకోవడంతోపాటూ 510 పరిశోధనా పత్రాలనీ అందించాను. 2013లో నన్ను షిబోరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 2016 నుంచి రెండేళ్ళు డిప్యుటీ ప్రెసిడెంట్‌గా చేసి ప్రస్తుతం అక్కడే బోర్డ్‌ ఆఫ్‌ కౌన్సిలర్‌గా ఉంటున్నాను. జపాన్‌లో ఏ భారతీయుడికీ దక్కని గౌరవం అది!

మన విద్యార్థుల్నీ పిలుస్తున్నా!

నేను షిబోరా వర్సిటీలో చేరాక దాన్ని ప్రపంచ సాంకేతిక వర్సిటీల సమాఖ్య(వరల్డ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ నెట్‌వర్క్‌)లో కీలక భాగస్వామిగా మలిచాను. ఆ సమాఖ్యకి ఛైర్మన్‌గానూ వ్యవహరించాను. అలా నా సేవలు భారత ప్రభుత్వం దృష్టికొచ్చి నాకు 2021లో ‘ప్రవాసి భారతీయ సమ్మాన్‌’ అవార్డుని అందించారు. సత్యనాదెళ్ళ తర్వాత ఆ అవార్డుని అందుకున్న తెలుగువాడిగా గుర్తింపు పొందాను. అంతేకాదు, మనదగ్గర ఉస్మానియా, ఐఐటీల విద్యార్థుల్ని జపాన్‌కి ఆహ్వానించి పరిశోధనల్లో భాగస్వాముల్ని చేస్తున్నాను. అలా ఎంతోకొంత నా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నాను!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..