ఫూల్‌ మఖానా... పోషకాల ఖజానా!

తిరుగులేని టైంపాస్‌ స్నాక్స్‌గా ఇదివరకు పాప్‌కార్న్‌ మాత్రమే ముందుగా గుర్తొచ్చేదా... కానీ ఇప్పుడు దాని పక్కనే వచ్చి చేరింది ఫూల్‌ మఖానా కూడా. తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూఇటూగా పాప్‌కార్న్‌లా కనిపించే ఈ మఖానా- వట్టి కాలక్షేపానికే కాదు, సూపర్‌ఫుడ్‌గానూ ముందు వరసలోకి వెళ్లింది.

Updated : 26 May 2024 12:49 IST

తిరుగులేని టైంపాస్‌ స్నాక్స్‌గా ఇదివరకు పాప్‌కార్న్‌ మాత్రమే ముందుగా గుర్తొచ్చేదా... కానీ ఇప్పుడు దాని పక్కనే వచ్చి చేరింది ఫూల్‌ మఖానా కూడా. తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూఇటూగా పాప్‌కార్న్‌లా కనిపించే ఈ మఖానా- వట్టి కాలక్షేపానికే కాదు, సూపర్‌ఫుడ్‌గానూ ముందు వరసలోకి వెళ్లింది. మనదేశంలో బిహార్‌లో పుట్టి ప్రపంచదేశాల ఆహారంలోనూ చేరిపోతూ రకరకాల రుచుల్లో కలిసిపోయింది. ఎండుఫలాల పోషకాలతో ఏమాత్రం తీసిపోని నట్‌గా పేరుతెచ్చుకున్న ఈ ఫూల్‌ మఖానా- అసలింతకీ ఎలా తయారవుతుందో... తామరపూల విత్తనాల నుంచి ఫూల్‌ మఖానాలా మారే వరకూ విశేషాలేంటో... చూద్దాం.

సాయంత్రం సరదాగా తాతయ్యతో కబుర్లు చెబుతూ మఖానా తింటున్న ప్రణయ్‌కి ఒక సందేహం వచ్చింది. వెంటనే ‘మరమరాలూ, పాప్‌కార్న్‌... వడ్లూ, మొక్కజొన్నగింజల నుంచి వస్తాయని తెలుసు కానీ ఈ ఫూల్‌ మఖానా ఎలా తయారవుతుందబ్బా’ అని పక్కనే ఉన్న తాతయ్యని అడిగాడు. ‘ఫూల్‌ మఖానా ఎలా వస్తుందన్నదే కాదు, తింటే జరిగే మేలేంటీ, ఇంకా దాని ఆసక్తికరమైన విషయాలేంటో కూడా వివరంగా చెబుతా విను’ అంటూ తాతయ్య మఖానా ముచ్చట్లు మొదలుపెట్టారిలా...

తామరపూల విత్తనాలే..!

చెరువులూ, బురద నీటి గుంటల్లో అందంగా విరిసే తామర పూల నుంచే వస్తాయీ మఖానా. అయితే అన్ని రకాల తామర పూల విత్తనాల నుంచీ కాదు. రకరకాల లోటస్‌సీడ్స్‌ను కొన్నిచోట్ల వంటకాల్లో ఉపయోగించినా ఫూల్‌ మఖానా తయారయ్యేది మాత్రం యూర్‌యల్‌ ఫారెక్స్‌, ప్రిక్లీ అనే వాటర్‌ లిల్లీ నుంచే. ఎక్కువగా ఆసియాలో కనిపించే ఈ రకం వాటర్‌ లిల్లీ పువ్వులు- ఊదా రంగులో చిన్నగా ఉంటే, ఆకులేమో- పెద్ద పెద్దగా మూడు అడుగులంత పరిమాణంలో ఉంటాయి. అందుకే మరి, ఈ మఖానా తామరపూల చెరువంతా పచ్చని ఆకులతోనే నిండిపోయి ఉంటుంది. ఇక విత్తనాల విషయానికి వస్తే... అందంగా పూసిన తామరపూల తొడిమ దగ్గర ఈ మఖానా విత్తనాలు ఉంటాయి. పూల రెక్కలు మొత్తం రాలిపోయాక ఆ గింజలన్నీ ఎండిపోయి నీటి అడుగుకి చేరతాయి. నీటిపైన ఆకులు మాత్రమే పరుచుకుని కనిపిస్తాయి. ఆ ఆకుల్ని పక్కకు జరుపుతూ అడుగునున్న తామర విత్తనాల్ని- వలలూ, బుట్టలతో సేకరిస్తుంటారు. తర్వాత వాటిని కడిగి తేమంతా పోయేలా ఎండబెడతారు. మట్టీ, ఇతర చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా చేసిన నల్లని ఆ గింజల్ని ఇనుప మూకుళ్లలో సన్నని సెగ మీద ఓ పద్ధతి ప్రకారం వేయిస్తారు. ఆ తర్వాత గింజల్ని పగలగొడితే పాప్‌కార్న్‌లా పేలుతూ బయటకు వస్తాయీ ఫూల్‌మఖానా. ఈ ప్రక్రియ అంతటినీ కొన్నిచోట్ల ఇలా సంప్రదాయ పద్ధతుల్లో చేస్తే... మరికొన్నిచోట్ల యంత్రాల సాయంతోనూ చేస్తున్నారు.

మన దగ్గరే పుట్టింది!

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పేరు పొందిన ఈ ఫూల్‌ మఖానా సాగు మొదలైంది మనదగ్గరే. బిహార్‌లోని మధుబనీ మఖానా పుట్టిల్లు. దాదాపు రెండు వందల ఏళ్ల నుంచే ఇక్కడ దీన్ని తయారుచేస్తున్నారు. అప్పట్లో చిన్న రైతులు తామర గింజల నుంచి
మఖానాను ఉత్పత్తి చేసేవారు. మంచి ఆదాయం ఇచ్చి పేదరికాన్ని పోగొడుతుందని లోటస్‌ సీడ్స్‌ను ‘బ్లాక్‌ డైమండ్స్‌’ అని పిలిచేవారట. ఆహారపదార్థాలతోపాటు ఔషధాల్లోనూ వాడే ఈ మఖానా గొప్పతనం అందరికీ తెలియడంతో లోటస్‌ సీడ్స్‌కు గిరాకీ పెరిగింది. నెమ్మదిగా పక్క
జిల్లాలూ సాగు చేయడం మొదలుపెట్టాయి. ప్రభుత్వమూ ఈ పంట సాగును ప్రోత్సహించడంతో బిహార్‌లోని మిథిలాంచల్‌ ప్రాంతం ఫూల్‌ మఖానాకి పెట్టింది పేరయ్యింది. అక్కడ కొన్ని ఊళ్లు మొత్తంగా మఖానా మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి కూడా. అంతేనా... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ఫూల్‌ మఖానాలో 90 శాతం వాటా భారత దేశానిదైతే అందులో 85 శాతం బిహార్‌ రాష్ట్రానిదే. అందుకే మిథిలా మఖానా పేరుతో జీఐ ట్యాగ్‌నూ అందుకుందీ ప్రాంతం. ఫాక్స్‌ నట్స్‌, లోటస్‌ సీడ్స్‌, పఫ్డ్‌ వాటర్‌లిల్లీ సీడ్స్‌ అంటూ బోలెడన్ని పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన ఆహారంగా మారిన మఖానాని అత్యధికంగా దిగుబడి చేసుకునే దేశాల్లో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందు వరసలో ఉన్నాయి.

రుచులూ అద్దుకుంది!

ఫూల్‌ మఖానా పిల్లల చిరుతిళ్లలో భాగమై పోయాక వాళ్లకు నచ్చినట్టు మారడానికి బోలెడన్ని రుచుల్నీ అద్దుకుని వచ్చింది. ఉప్పూ కారాలూ, తీపి రుచులతో పాటూ పుదీనా, టొమాటో, ఉల్లిపాయక్రీముల ఫ్లేవర్లలో దొరుకుతోంది. ఇంకా మిరియాలూ, పెరీపెరీ, చీజ్‌, చాక్లెట్‌ రుచులతోనూ నోరూరిస్తోంది.

ఉత్పత్తులు...

పచ్చి గింజల్లా, స్నాక్స్‌లా కాకుండా మఖానా గింజలతో ఎన్నో వెరైటీ వంటకాల్నీ తయారు చేసుకుంటున్నారు. ఇంకా మాంచి ప్రొటీన్‌ ఫుడ్‌గా చెప్పే మఖానాని పిల్లల కోసం పొడుల రూపంలోనూ తీసుకొచ్చారు. అంతేకాదు, వీటితో చేసిన లడ్డూలూ, బర్ఫీ స్వీటూ, చిప్స్‌, మురుకుల్లాంటివీ మార్కెట్లో చాలానే వచ్చాయి.

ఎన్ని లాభాలో... 

  • మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. పైగా దీంట్లోని ప్రొటీన్లూ, పీచూ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందుకే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • ఈ నట్స్‌లో ఉండే అధిక పీచు- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలావరకు తగ్గుతాయి.
  • మఖానాతో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ఇందులోని ఫ్లవనాయిడ్లూ, యాంటీఆక్సిడెంట్లూ చర్మంపైన ముడతల్నీ, తెల్లవెంట్రుకల్నీ నివారిస్తాయి. చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి.
  • దీంట్లో అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌నీ, ట్రైగ్లిజరైడ్స్‌నీ అదుపులో ఉంచుతుంది.
  • అధిక పొటాషియం, తక్కువ సోడియంతో ఉండే ఈ మఖానా రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి ఆహారం.
  • గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటంతో- రక్తంలో చక్కెరస్థాయిల్ని నియంత్రిస్తుందిది. కాబట్టి మధుమేహులూ దీన్ని తినొచ్చని రకరకాల పరిశోధనలూ చెబుతున్నాయి.
  • మఖానా తింటే ఎముకలూ, దంతాలూ దృఢంగా తయారవుతాయి. అందుకు కారణం దీంట్లో ఉండే అధిక కాల్షియమే. కీళ్ల నొప్పులున్నవారు రోజూ తీసుకుంటే ఎంతో మంచిది.
  • దీంట్లో ఎక్కువగా లభించే బి- విటమిన్‌ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  
  • మానసిక ఆరోగ్యానికీ మఖానా ఎంతో మేలు చేస్తుంది. యాంగ్జైటీ, కుంగుబాటు, నిద్రలేమి లాంటి వాటిని ఇది దూరం చేస్తుందట.

అంతేకాదు, దీనిలోని రకరకాల పోషకాలు-  ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యతలను తగ్గించడంలో, మగవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో, శరీరంలోని వ్యర్థాల్ని బయటకు పంపడంలో, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సాయపడతాయి.
మరెందుకాలస్యం... రోజూ కమ్మని కాఫీకో, టీకో జతగా ఏవో ఒక స్నాక్స్‌కు బదులు ఈ ఫాక్స్‌ నట్స్‌ను ఎంచుకోండి, అటు రుచినీ ఇటు పోషకాల్నీ అందిస్తాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..