ఏడుస్తూ అమ్మకి ఫోన్‌ చేశా!

తెలుగు సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్‌లో దూసుకుపోతోంది కృతి సనన్‌. రామాయణ నేపథ్యంలో వస్తోన్న పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌’లో జానకిగా కనిపించనున్న ఈ చక్కనమ్మ తన గురించి బోలెడు ఆసక్తికర విషయాలు మోసుకొచ్చింది.

Updated : 22 Feb 2024 16:30 IST

తెలుగు సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్‌లో దూసుకుపోతోంది కృతి సనన్‌. రామాయణ నేపథ్యంలో వస్తోన్న పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌’లో జానకిగా కనిపించనున్న ఈ చక్కనమ్మ తన గురించి బోలెడు ఆసక్తికర విషయాలు మోసుకొచ్చింది.

సినీ రంగంలోకి బ్యాగ్రౌండ్‌ లేకుండా రావడం, అవకాశాలు సంపాదించడం చాలాకష్టం. నేనూ ఆసక్తి కొద్దీ ఈ రంగంలోకి వచ్చినా, అడ్డంకులను అధిగమించలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా. ఆ సమయంలో అమ్మ చెప్పిన మాటలే నన్ను ఆపి ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి.

అమ్మే నాకు స్ఫూర్తి...

నాన్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. అమ్మ దిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసరు. తన కుటుంబంలో మొదటి ఉద్యోగస్తురాలు అమ్మే. అమ్మమ్మ తరపున బంధువులంతా అమ్మని చాలా గౌరవంగా చూస్తారు. వాళ్ల పిల్లలకు ఆదర్శంగా చెబుతుంటారు. ‘నువ్వు ఏం చదువుకున్నా ఫర్వాలేదు. కానీ ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి మాత్రం తప్పక చేయాలి. ఆర్థిక స్వాతంత్య్రమన్నది ప్రతి స్త్రీకీ ఉండితీరాల’ని చిన్నప్పటి నుంచీ నాకూ చెల్లికీ చెప్పేది.

పెళ్లికాదన్నారు...

చిన్నతనంలో నాకంటూ ఓ లక్ష్యం ఉండేది కాదు. బీటెక్‌ చదివేటప్పుడే మోడలింగ్‌ గురించి తెలిసింది. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. క్రమంగా ప్రకటనల్లోనూ నటించే అవకాశం వచ్చింది. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడుతెలియని అనుభూతి కలిగింది. సినిమాల్లోనూ ఇలానే కదా నటించేది అనిపించింది. కాలేజీలో స్నేహితులు ‘హీరోయిన్లను ఎవరూ పెళ్లి చేసుకోరు. జీవితాంతం ఒంటరిగా ఉండిపోవల్సిందే’ అన్నారు. అమ్మే ధైర్యం చెప్పి పంపింది.

అప్పుడు భయపడ్డా...

బీటెక్‌ పూర్తవగానే దిల్లీ నుంచి ముంబయి వెళ్లిపోయా. సిటీలోగానీ, బాలీవుడ్‌లోగానీ పరిచయస్తులెవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. క్రమంగా పరిచయాలు పెంచుకుంటూ ఆడిషన్ల గురించి తెలుసుకుని వెళుతుండేదాన్ని. దాదాపు రెండేళ్లపాటు ఒంటరిగా చేసిన ప్రయత్నాలెన్నో ఫెయిలయ్యాయి. అవకాశాలు వస్తున్నట్టే వచ్చి చేజారేవి. మరోవైపు పాకెట్‌ మనీకోసం మోడలింగ్‌ కూడా చేసేదాన్ని.

వెళ్లిపోదామనుకున్నా...

ఒక ర్యాంప్‌షోలో కొరియోగ్రాఫర్‌ అమర్యాదగా ప్రవర్తించి అందరి ముందూ అవమానించాడు. ఆ బాధతో మోడలింగూ-సినిమాలూ వద్దనీ, ఇంటికొచ్చేస్తాననీ ఏడుస్తూ అమ్మకి ఫోన్‌ చేశా. తను నవ్వుతూ...‘ప్రతిచోటా సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం. ఇలాంటివి తరవాత కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ధైర్యంగా, స్ట్రాంగ్‌గా ఉండటం అలవాటు చేసుకో’మని చెప్పింది.

తొలిసారి తెలుగులో...

ఎన్నో ఆడిషన్ల అనంతరం తొలిసారి మహేశ్‌బాబు పక్కన ‘1: నేనొక్కడినే’లో అవకాశం వచ్చింది. తెలుగు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకు అన్ని డైలాగులు ఎందుకని సుకుమార్‌ సర్‌ని అడిగేదాన్ని. ఆ మాటలకు ఆయన నవ్వుతూ ప్రతి డైలాగునూ చదివి... అర్థం వివరించేవారు. సమయం వృథా అనుకోకుండా హావభావాలు చక్కగా రావడానికి సుకుమార్‌ సర్‌ చేసిన ప్రయత్నాలు నాకు బాగా నచ్చేవి. ఆ సినిమా చేస్తున్నప్పుడే బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. కాస్త తీరిక దొరకడంతో ‘దోచెయ్‌’లో నటించా.

అందుకు కష్టపడ్డా...

ఫిట్‌నెస్‌ కోసమని నోరు కట్టేసుకోను. నచ్చినవి తినేసి బాగా వ్యాయామం చేస్తా. ఎక్కువ మంచినీళ్లు తాగుతా. చిన్నతనంలో నేర్చుకున్న కథక్‌ను ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేస్తుంటా. నేను సన్నగా ఉండటానికి అదే కారణం. హిందీ సినిమా ‘మిమీ’కోసం పదిహేను కిలోలు పెరగడానికి చాలా కష్టపడ్డా. కానీ ఎత్తుగా ఉండటం వల్ల లావు తెలియలేదు.


మూడు కోరికలున్నాయి...

నాకు మూడు కోరికలు ఉన్నాయి. త్వరలో వాటిని తీర్చుకోవాలి. అమ్మకు పెద్ద ఇల్లు కట్టించి- చుట్టూ గార్డెన్‌ ఏర్పాటుచేసి ఇవ్వాలి. ఆ పచ్చని వాతావరణంలో ప్రతిరోజూ ఉదయం టీ తాగుతూ సేదతీరాలి. రెండోది నాకు ఇష్టమైన గ్రీస్‌ వెళ్లి స్కై డైవింగ్‌ చేయాలి. మూడోది నేషనల్‌ అవార్డు అందుకోవాలి.


ఎత్తుగా ఉండాలి...

కాబోయేవాడు కచ్చితంగా నా కంటే ఎత్తు ఉండాలి. ఇతరులకి మర్యాద ఇవ్వాలి. తనతో మాట్లాడితే ఇంకా ఇంకా మాట్లాడాలనిపించాలి. మాటల్లోనే కాదు మౌనంలో కూడా అతడితో సంతోషంగా ఉండగలగాలి. నా వృత్తిని గౌరవించాలి.


అదే ప్లస్‌...

నేను పొడవుగా ఉండటం వల్ల తొలినాళ్లలో సరిగా అవకాశాలు రాలేదు. తరవాత అదే ప్లస్‌ అయింది. ‘ఆదిపురుష్‌’లో అవకాశం రావడానికి అదీ ఓ కారణం. మొదట్లో ప్రభాస్‌ ‘నాకు హిందీ రాదు... నువ్వే సర్దుకోవాలి’ అన్నారు. సమయం దొరికితే హిందీ నేర్పేదాన్ని. ఇప్పుడు గలగలా మాట్లాడేస్తున్నారు. అలానే తెలుగులో డైలాగులు పలికే సమయంలో ప్రభాస్‌ నాకు సాయపడేవారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..