సిల్లీపాయింట్‌

పాశ్చాత్య దేశాల్లోని కొన్ని కంపెనీలు మెల్లగా ‘నో మీటింగ్‌’ విధానాన్ని తెస్తున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోలు సంస్థ ‘షాపిఫై’ వాటిని పూర్తిగా రద్దుచేసింది. ఆన్‌లైన్‌ మీటింగ్‌లకి అవకాశం కల్పించే ‘జూమ్‌’ కూడా ఇదే బాట పడుతోంది!

Updated : 14 Apr 2024 04:59 IST

పాశ్చాత్య దేశాల్లోని కొన్ని కంపెనీలు మెల్లగా ‘నో మీటింగ్‌’ విధానాన్ని తెస్తున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోలు సంస్థ ‘షాపిఫై’ వాటిని పూర్తిగా రద్దుచేసింది. ఆన్‌లైన్‌ మీటింగ్‌లకి అవకాశం కల్పించే ‘జూమ్‌’ కూడా ఇదే బాట పడుతోంది!

  • బ్రిటన్‌లో ఎంపీలు తమ నియోజకవర్గ ప్రజలతో భేటీ అయ్యే సమావేశాలని ‘సర్జరీ’ అనీ ‘క్లినిక్‌’ అనీ అంటారు! ఒకప్పుడు ఆసుపత్రి వైద్యులు బయటి రోగుల కోసం కేటాయించే ‘ఓపీ’ సమయాన్ని ఇలా పిలిచేవారట. ఆ మాటే అక్కడి రాజకీయాల్లోకి పాకిందన్నమాట!
  • కుక్కలకి మనకన్నా ఎక్కువ ఘ్రాణశక్తి ఉండొచ్చుకానీ- వాటికి కారం, ఉప్పు వంటి రుచులకి పెద్దగా తేడా తెలీదు. కుక్కల రుచి బుడిపెలు (టేస్ట్‌బడ్స్‌) మనకన్నా 80 శాతం తక్కువ ఉండటమే ఇందుక్కారణం.
  • కోడికూత 140 డెసిబెల్స్‌ దాకా ఉంటుంది. ఆ చప్పుడుతో కోడికి చెవుడు రాకుండా ఉండటానికని- అది కూసే ప్రతిసారీ దాని చెవుల్లోని గూబ(ఇయర్‌ డ్రమ్‌) సగందాకా
    మూసుకుపోతుంది!
  • ఎంత గజ ఈతగాళ్ళయినా నీటిలో మునిగితే- కొన్ని నిమిషాలకన్నా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టలేరు. అదే తేలు అయితే ఆరు రోజులపాటు నీళ్ళలో ఉండిపోగలదట.
  • మనం వాడే ప్రతి స్పూను తేనె వెనక- ఓ డజను తేనెటీగల జీవితకాల శ్రమ ఉంటుంది!
  • ఉగాది రోజు- మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మారిషస్‌లోనూ సెలవు దినంగా ప్రకటిస్తారు.  

ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌లో తలపడే మహిళలకి వయో పరిమితి లేదు. పదహారేళ్ళు దాటిన ఎవరైనా ఆడొచ్చు! అదే మగవాళ్ళయితే 23 ఏళ్ళలోపు వాళ్ళు మాత్రమే ఆడాలి.

  • ‘పఫ్‌’ని- 1631లో ఫ్రన్స్‌వా పియర్‌ లావర్నె కనిపెట్టాడు. కనిపెట్టాక ఆయన చాలాచోట్ల వంటవాడిగా చేశాడు. చేసిన ప్రతిచోటా-తన పఫ్‌ రెసిపి సీక్రెట్‌ ఎవరికీ తెలియకూడదని ఓ గదిలో తాళం వేసుకుని మరీ వంట చేసేవాడట. ఆయనే దీనిపైన పుస్తకం రాసేదాకా అది రహస్యంగానే ఉండిపోయింది!

1715 ఆగస్టు 2 నుంచి... తిరుపతిలో లడ్డూ ప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు! అప్పటిదాకా- పులిహోర, వడలు మాత్రమేఇస్తుండేవారు.


చైనీయుల రోజువారీ ఆహారంలో తప్పకుండా వేరుశనగ ఉండి తీరుతుంది! ప్రపంచంలో వాటిని అత్యధికంగా పండించేది కూడా ఆ దేశమే.


జపాన్‌లో 30 ఏళ్ళకిందటి దాకా ఇంటికో స్నానాల గది ఉండేది కాదు. బాగా డబ్బున్నవాళ్ళు తప్ప మిగతావాళ్ళందరూ ‘సెంటో’ అనే సామూహిక స్నానపుగదుల్నే వాడేవారు.


తెలుగు ప్రాంతాల్లో వల్లంకిపిట్ట అని పిలచే ‘గ్రేటర్‌ పెయింటెడ్‌ స్నైప్‌’ జాతిలో ఆడపక్షి గుడ్లు పెడితే మగపక్షి వాటిని పొదిగి, పోషిస్తుంది.


పాము కోరలు విషం చిమ్మడానికి తప్ప నమలడానికి పనికిరావు. నిజానికి, ఏ పామైనా ఆహారాన్ని నమలదు... మింగుతుంది.

  • వాట్సాప్‌ లోగోలో వాడే లేతాకుపచ్చ రంగుని మన సొంత వెబ్‌సైట్‌కో, బ్లాగ్‌కో ఉపయోగించుకోవాలంటే... ఆ సంస్థ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి!
  • క్రీ.పూ.మూడో శతాబ్దం నాటి ఈజిప్టు మమ్మీల్లోనూ... మహిళల హ్యాండ్‌బ్యాగ్స్‌ ఉన్నాయి.
  • పులులు, చిరుతలు, జాగ్వార్‌ల వంటివాటికి మనం వాడే సెంట్లంటే ఇష్టమట.
  • అమెరికాలో కాల్విన్‌ క్లయిన్‌(సీకే) వంటి బ్రాండెడ్‌ పెర్ఫ్యూమ్‌లని ఉపయోగించి- మనుషులపైన దాడి చేసే జాగ్వార్‌లని పట్టుకున్న సందర్భాలున్నాయి. మనదగ్గరా- కర్ణాటక, తమిళనాడు అడవుల్లో పులులూ, చిరుతలనూ ఇలాగే ఆకర్షించి బంధించిన ఉదాహరణలున్నాయి!

కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతంలో ఉండే కొడగు ప్రజలు- తుపాకుల్ని దైవంగా భావించి పూజలు చేస్తారు!


పక్షుల్లో ఈము, జంతువుల్లో కంగారూ... వెనక్కి నడవలేవు!  


మనీప్లాంట్‌ని... ఆ పేరుతో కేవలం ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోనే పిలుస్తారు. మిగతాచోట్ల ‘గోల్డన్‌ పాథోస్‌’ అనే అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..