ఆయనతో ప్రయాణం అద్భుతం!

అందాల తార దిశా పటానీ తెలుగులో ‘లోఫర్‌’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి... ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించింది. జాకీ చాన్‌ సినిమాలోనూ మెరిసిన ఈ అమ్మడు తాజాగా ‘కల్కి 2898ఏడీ’లో సందడి చేయబోతోంది.

Updated : 24 Mar 2024 14:52 IST

అందాల తార దిశా పటానీ తెలుగులో ‘లోఫర్‌’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి... ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించింది. జాకీ చాన్‌ సినిమాలోనూ మెరిసిన ఈ అమ్మడు తాజాగా ‘కల్కి 2898ఏడీ’లో సందడి చేయబోతోంది. పైలట్‌ అవ్వాలనుకుని హీరోయిన్‌ అయిన దిశ తన గురించి ఏం చెప్పిందంటే...!


కుటుంబం...

మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ. నాన్న పోలీస్‌, అమ్మ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, అక్క ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌... ఇలా ఇంట్లో వాళ్లంతా మంచి హోదాలో ఉంటే నేనొక్కదాన్నే సినిమాల్లోకి వచ్చా. చిన్నతనంలో నేను పైలట్‌ కావాలనుకున్నా. పోలీస్‌, ఆర్మీ నేపథ్యంలో సినిమాలు విడుదలైతే- నాన్న థియేటర్‌కి తీసుకెళ్లి మరీ చూపించేవారు. క్రమంగా సినిమాల పట్ల ఆసక్తి కలిగింది. అమ్మ కాలేజీ రోజుల్లో హీరోయిన్‌ అవ్వాలనుకుందట కానీ, ఇంట్లో ఒప్పుకోలేదట. ఆ విషయం తెలిసి అమ్మ కోరిక తీర్చుదామనుకున్నా.


వాళ్లే చేశారు...

ఖ్‌నవూలోని అమిటీ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతున్నప్పుడు స్థానికంగా అందాల పోటీ నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటన వచ్చింది. స్నేహితులు నాకు తెలియకుండా నా ఫొటోల్ని పంపి దరఖాస్తు చేశారు. అనుకోకుండా ఆ పోటీలకు నేను ఎంపిక కావడంతో లెటర్‌ పంపారు. ఏ మాత్రం ప్రిపేర్‌ కాకుండానే పోటీలకు వెళ్లా. అయినా ఆ పోటీల్లో రన్నరప్‌గా నిలిచా.


తెలుగుతో మొదలు...

అందాల పోటీల్లో గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ధైర్యంతోనే అమ్మానాన్నలకు చెప్పి చదువు మానేసి సినిమా అవకాశాలకోసం ముంబయి వచ్చేశా. మోడలింగ్‌ చేస్తూనే ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. తొలిసారి ‘లోఫర్‌’లో వరుణ్‌తేజ్‌ పక్కన అవకాశం వచ్చింది. తరవాత ‘ధోనీ- అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భాగీ2’, ‘భాగీ3’, ‘భారత్‌’... తదితర చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం ‘యోధ’ విడుదలైంది. త్వరలో ‘కల్కి 2898ఏడీ’ రాబోతోంది.


అదే కారణం...

నేను ఫిట్‌నెస్‌ కోసం కిక్‌బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌, జుంబా డాన్స్‌ వంటివి చేస్తుంటా. ‘కుంగ్‌ ఫూ యోగా’ ఆడిషన్‌లో యాక్షన్‌ సీన్‌ ఇస్తే చేసి చూపించా. నా జిమ్నాస్టిక్స్‌ వీడియోలు కూడా చూసి నన్ను ఎంపిక చేశారన్నమాట. ఆడపిల్లలైనా సరే అన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కకీ, నాకూ ఆ విద్యలన్నీ చిన్నతనంలోనే నేర్పించారు నాన్న. కారు చెడిపోతే ఎవరి మీదా ఆధారపడకూడదని రిపేరింగులోనూ శిక్షణ ఇప్పించారు.


వారానికోసారి...

వారమంతా డైట్‌ చేసి ఆదివారం నచ్చినవన్నీ తినేస్తా. పాన్‌ కేక్‌, ఐస్‌క్రీమ్‌ అంటే ప్రాణం. అసలు వాటికోసమే వారానికోరోజు చీట్‌ మీల్‌్ పెట్టుకున్నా. రంజాన్‌ సమయంలో హైదరాబాదీ హలీమ్‌ను ఇష్టంగా తింటా. కుదిరితే ప్రతిరోజూ తెప్పించుకుంటా.


కథలు చెప్పారు...

విదేశీ నటుడైనా జాకీ చాన్‌ యాక్షన్‌ సినిమాలకు మన దగ్గరా ఎందరో వీరాభిమానులున్నారు. అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా! 2017లో వచ్చిన ‘కుంగ్‌ ఫూ యోగా’ అనే చైనీస్‌ సినిమాలో జాకీచాన్‌ పక్కన అవకాశమొచ్చింది. ఆయన సెట్‌కు వచ్చేటప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరికీ చా·క్లెట్లూ, కేకులూ, ఐస్‌క్రీమ్‌లూ తెచ్చేవారు. విరామ సమయంలో తన అనుభవాలను పంచుకోవడంతోపాటు కథలను డ్రామా యాక్షన్‌తో కలిపి చెప్పేవారు. అంత గొప్ప నటుడితో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది.


స్ఫూర్తి...

మా ప్రాంతంలో ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారు. ఇంట్లో నాన్న ఎంత బాగా చూసుకున్నా బయట ఇబ్బందిగానే ఉండేది. అక్క ఖుష్బు ఆర్మీ ఆఫీసర్‌ అవ్వడానికి పలు అంశాల్లో శిక్షణ తీసుకునేది. ఆ సమయంలో బంధువులూ తెలిసినవారూ రకరకాల మాటలనేవారు. అవేమీ పట్టించుకోకుండా లక్ష్యం మీదే దృష్టి పెట్టింది అక్క. ఆర్మీ లెఫ్టినెంట్‌గా ఉద్యోగానికీ ఎంపికైంది. నచ్చిన పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం ముందుకు వెళ్లాలి తప్ప ఎక్కడా ఆగకూడదని అక్కని చూసి నేర్చుకున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..