సిల్లీపాయింట్‌

మన దగ్గరైతే చరిత్రలో కలిసిపోయింది కానీ... టెలిగ్రామ్‌ని అమెరికా, జపాన్‌, రష్యా, ఇటలీ సహా సుమారు 45 దేశాల్లో వాడుతూనే ఉన్నారు.

Published : 12 May 2024 00:47 IST

న దగ్గరైతే చరిత్రలో కలిసిపోయింది కానీ... టెలిగ్రామ్‌ని అమెరికా, జపాన్‌, రష్యా, ఇటలీ సహా సుమారు 45 దేశాల్లో వాడుతూనే ఉన్నారు.

  • ప్రపంచంలో అద్దె ఇంటివాళ్ళు ఎక్కువగా ఉండే దేశం... స్విట్జర్లాండ్‌. మొత్తం జనాభాలో 67 శాతం మంది అద్దె ఇళ్ళలోనే నివసిస్తారట.
  • బస్సూ, రైలూ, ట్రామ్‌బండ్లూ... ఇలా యూరప్‌లోని లక్సెంబర్గ్‌ దేశంలో అన్ని ప్రజారవాణా వ్యవస్థల్నీ ఉచితంగా నడుపుతారు. ఇందుక్కారణం అక్కడ అందరూ పేదవాళ్లై ఉండటం కాదు... ధనవంతులు కావడం. ఆ దేశంలో కార్లు ఎక్కువగా ఉండటంవల్ల ట్రాఫిక్‌తోపాటూ కాలుష్యం ఎక్కువకావడంతో ప్రజల్ని ప్రజారవాణా బాటపట్టించాలని ఇలా అన్నీ ఫ్రీగా నడుపుతున్నారట!
  • ప్రపంచంలో ‘జీతంతో కూడిన సెలవులు’ అత్యధికంగా ఇచ్చే దేశం ఇరాన్‌! ఏడాదిలో 27 సెలవుల్ని ఇలా తీసుకోవచ్చట అక్కడి ఉద్యోగులు.
  • ఈజిప్టులో ఇప్పటికీ మంచి నీటి కుండలూ, మట్టితో చేసిన మగ్గుల వాడకం ఎక్కువ!
  • ‘కృంగ్‌థెప్‌ మహానఖౌన్‌ అమోన్‌రత్తనఖోసిన్‌ మహింతరాయుథ్థయా...’ ఇలా సుదీర్ఘంగా 168 పదాలతో సాగుతుంది ఆ నగరంపేరు. ప్రపంచంలో అతిపెద్ద పేరున్న రాజధాని కూడా ఇదే! అంతపెద్ద పేరుని పలకలేకే సింపుల్‌గా దాన్ని ‘బ్యాంకాక్‌’ అని పిలుస్తున్నారు థాయ్‌లాండ్‌ ప్రజలు!
  • ‘స్కూల్‌కి’, ‘ఆఫీసు అవసరాలకి’, ‘బొమ్మలు గీయడానికి’... ఇలా పెన్సిళ్ళపైన రకరకాల ముద్రలు వేసుంటాయి జపాన్‌లో. ఆ రకంగా నిర్దేశించిన పెన్సిళ్ళని ఆయా అవసరాలకి తప్ప మరేదానికీ వాడరట అక్కడ!
  • జంతుప్రపంచంలో మనుషులకీ, డాల్ఫిన్‌లకీ మాత్రమే కుడి లేదా ఎడమ చేతి వాటం ఉంటుంది. మిగతావన్నీ ఏ చేతినైనా వాడతాయి.

నం ఎన్ని పండ్లతో జ్యూస్‌ చేయగలిగితేనేం... ప్రపంచంలో అత్యధికులు ఇష్టపడేది ఆరెంజ్‌ రసాన్నేనట!


బ్రెజిల్‌ దేశ రాజధాని బ్రెసిలియా నగరం విమానం ఆకారంలో ఉంటుంది.


నదేశంలో ఫౌంటైన్‌ పెన్‌ల వాడకం తగ్గినా... విదేశాల్లో మామూలు వాటితోపాటూ  ఖరీదైన కలాల్నీ వాడుతున్నారు. వాటన్నింటికీ కావాల్సిన పాళీలను మాత్రం భారత్‌లోనే చేస్తున్నారు మరి!


అద్దం ముందు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఎక్కువ సమయాన్ని గడుపుతారంటోంది లండన్‌లో నిర్వహించిన సర్వే ఒకటి. మగవారు రోజుకి 23 సార్లు అద్దం చూస్తే...
మహిళలు 16 సార్లే చూస్తారట!


వేసవి ఎండలు మరీ తీవ్రమైనప్పుడు మనదేశంలో కొన్నిచోట్ల ఎండ వేడికి... రైలుపట్టాలు పాముల్లా మెలికలు తిరిగిపోతుంటాయి. దీన్ని ‘రైల్‌ బర్న్‌’ అంటున్నారు!


మహిళల్లో అరుదుగా మగవాళ్ళలా మీసాలూ గెడ్డాలూ మొలిచినట్టే... కొన్ని ఆడ సింహాలకూ జూలు పెరుగుతుంది.


అమ్మాయి పేరు లక్ష్మి. ఓ బ్రిటిష్‌- ఇండియా ఆఫీసర్‌ని ప్రేమిస్తుంది. అది ఆమె తండ్రి నీలకంఠానికి నచ్చదు. అతను ఆ ఆఫీసర్‌ని అంతుచూడాలనుకుంటాడు... క్లుప్తంగా ఇలా సాగుతుంది ఆ ఫ్రెంచ్‌ సంగీతరూపకం. 1883లో దిలెబె అన్న నాటకరచయిత రాశాడు దాన్ని. లక్ష్మి అన్న పేరునే ఫ్రెంచిలో ‘లాక్మే’ అని మార్చుకున్నాడు. ఆ పేరు బాగా నచ్చడంతోనే హిందూస్థాన్‌ లీవర్‌సంస్థ తమ సౌందర్యసాధనాలకి దాన్ని వాడటం మొదలుపెట్టింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..