మల్లెపూలే టీచర్లకి జీతమిస్తున్నాయి!

వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలీ, ఏం చేయాలీ అని ఓ లిస్టు రాసుకుంటారు. బడులు తెరిచాక క్లాసులకు రావడానికి ఎంతో బాధ పడిపోతుంటారు. కర్ణాటకలోని ఓజల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు మాత్రం అలా ఆలోచించరు.

Updated : 31 Mar 2024 15:13 IST

వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలీ, ఏం చేయాలీ అని ఓ లిస్టు రాసుకుంటారు. బడులు తెరిచాక క్లాసులకు రావడానికి ఎంతో బాధ పడిపోతుంటారు. కర్ణాటకలోని ఓజల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు మాత్రం అలా ఆలోచించరు. వేసవి వస్తుందంటే సంబర పడిపోతారు తప్ప స్కూలుకు దూరంగా వెళ్లాలనుకోరు... ఎందుకూ అంటే- మల్లెపూల కోసం... అవి పంచే విద్యాపరిమళాల కోసం. అసలు బడి పిల్లలకీ... బొండు మల్లెలకీ సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే మల్లె తోటే ఆధారంగా నిలబడిన ఆ స్కూలుకు వెళ్లాల్సిందే!

మంగళూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓజల ప్రైమరీ స్కూలు పరిసరాలకు వెళితే మల్లె వాసనలు గుబాళిస్తాయి. స్కూల్లో మల్లె మొక్కలున్నాయా లేదా మల్లె తోటలో బడి ఉందా అనిపిస్తుంటుంది. ఇంట్లో పూల కోసం పెంచుకునే మల్లె మొక్కలను స్కూల్లో పెద్ద ఎత్తున నాటడానికి కారణం టీచర్ల కొరత. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ చదువు చెప్పే ఆ స్కూలుకు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల నుంచి పిల్లలు వస్తుంటారు.

పదమూడేళ్ల క్రితం ఉన్నట్టుండి విద్యార్థుల సంఖ్య పదికి పడిపోయింది. దానికి కారణం... అంతవరకూ ఐదుగురు టీచర్లు పనిచేసిన చోట ఒక్కరే మిగలడం. ఆ ఒక్క టీచరు కూడా రాకపోతే ఉన్న విద్యార్థులు కూడా చదువు మానేయాల్సొస్తుందనీ, బడి శాశ్వతంగా మూత పడిపోతుందనీ గ్రామస్థులు భయపడ్డారు. అందుకే ‘స్కూలు అభివృద్ధి కమిటీ’(ఎస్‌డీసీ)ని ఏర్పాటు చేసుకొని బడిని బాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  

పిల్లలే కోస్తారు...

స్కూల్లో ఇద్దరు టీచర్లని నియమించమని అధికారుల్ని కమిటీ కోరితే పట్టించుకోలేదు. ఆ సమస్యకు పరిష్కారంగా కమిటీనే జీతమిస్తూ ఇద్దరు కాంట్రాక్ట్‌ టీచర్లని ఏర్పాటు చేసింది. స్కూలు మానేసిన వారిని కూడా తిరిగి చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వచ్చారు కమిటీ సభ్యులు. భవిష్యత్తులో ఎక్కువ మంది టీచర్లు అవసరపడతారని అర్థమైంది వారికి. అలాంటప్పుడు సొంత నిధుల నుంచి అంతమందికి జీతాలివ్వడం ఆర్థిక భారమవుతుంది కాబట్టి శాశ్వత పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. మంగళూరు వాతావరణం, నేలా మల్లె సాగుకు ఎంతో అనుకూలం కావడంతో స్కూల్లోని ఖాళీ స్థలంలో ఓ యాభై మల్లె మొక్కలు నాటారు. క్రమంగా ఊళ్లో కూడా ఎక్కడ స్థలముంటే అక్కడ మల్లె మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. గ్రామస్థులు ఎరువులు వేసి, చీడలకు రసాయనాలు పిచికారీ చేస్తే- పిల్లలు మొక్కలకు నీళ్లు పెట్టి, మొగ్గలు కోసి పెద్దవారికి సాయపడతారు. వేసవి సెలవులకి కూడా ఎక్కడికీ వెళ్లకుండా స్కూలు ఆవరణలోని మల్లె మొక్కల్ని సంరక్షిస్తుంటారు. పిల్లల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామస్థులు కూడా పండుగలకీ, ప్రత్యేక సందర్భాలకీ, పెళ్లికీ స్కూలు నుంచే పూలూ, పూలజడలూ తీసుకుంటుంటారు. ఆ పువ్వులు అమ్మగా వచ్చిన డబ్బును ఏ రోజుకారోజు బడి పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది కమిటీ.  

వసతులు కల్పించి...

ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ పూసిన మల్లెలతో సీజన్‌ పూర్తయ్యేసరికి దాదాపు లక్ష రూపాయల ఆదాయం అందుతుంటుంది. మల్లె సాగుతో లాభాలొచ్చాక మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ టీచర్లని నియమించారు ఎస్‌డీసీ సభ్యులు. మిగిలిన డబ్బుతో స్కూలును బాగు చేయించి, బెంచీలూ కుర్చీలూ సమకూర్చారు. టీవీ కొని, వైఫై పెట్టించి స్మార్ట్‌ క్లాసులకు శ్రీకారం చుట్టారు. బోరు వేయించి మరుగుదొడ్లు కట్టించి కనీస అవసరాలు తీర్చారు. ఒకవైపు వసతులు కల్పిస్తూ, మరోవైపు టీచర్ల సంఖ్యను పెంచారు. అధికారులతో మాట్లాడి ఎల్‌కేజీ, యూకేజీతోపాటు ఆరేడు తరగతులకూ చదువు చెప్పించేలా అనుమతి తీసుకున్నారు. ఏటా మల్లెలతో వచ్చే ఆదాయంతో కాంట్రాక్ట్‌ టీచర్లకు జీతాలు ఇస్తూ పిల్లల చదువుకోసం కృషి చేస్తున్న గ్రామస్థుల ఆరాటాన్ని అర్థం చేసుకున్న అధికారులు క్రమంగా ముగ్గురు టీచర్లని నియమించారు. ప్రస్తుతం ఓజల స్కూల్లో 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ జిల్లా మొత్తం మీద ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యా, హాజరు పరంగా ఈ స్కూలే ముందుండటం విశేషం. ఇటీవల రెండు బస్సుల్ని కూడా కొనుగోలు చేసి దూర ప్రాంతాల పిల్లల కోసం నడుపుతోంది ఎస్‌డీసీ. చదువుతోపాటు కరాటే, డాన్స్‌, సంగీతం, యోగాలో కూడా శిక్షణ ఇచ్చి స్కూల్లో పిల్లల్ని మెరుగ్గా తీర్చిదిద్దుతున్నారంటే అదంతా మల్లెల చలువే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..