ఆ బడిలో... ఇంటి పనులూ నేర్పుతారు!

పుస్తకాల్లో ఉన్నది బుర్రకి ఎక్కించుకుని, పరీక్షల్లో పేజీలు నింపేయడమేనా చదువంటే... దానివల్ల ర్యాంకులు వస్తాయేమో కానీ, లైఫ్‌స్కిల్స్‌ పిల్లలకు పెద్దగా ఒంటబట్టవు. మార్కులు రాకపోతే జీవితం లేదనుకుని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అదీ ఒక కారణం.

Updated : 26 May 2024 05:07 IST

పుస్తకాల్లో ఉన్నది బుర్రకి ఎక్కించుకుని, పరీక్షల్లో పేజీలు నింపేయడమేనా చదువంటే... దానివల్ల ర్యాంకులు వస్తాయేమో కానీ, లైఫ్‌స్కిల్స్‌ పిల్లలకు పెద్దగా ఒంటబట్టవు. మార్కులు రాకపోతే జీవితం లేదనుకుని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అదీ ఒక కారణం. అందుకే చైనా పాఠశాలల్లో చిన్నారులకు చిన్నప్పటి నుంచీ రకరకాల వృత్తి విద్యాకోర్సులు నేర్పుతున్నారు. వ్యవసాయం నుంచీ వంట దాకా ప్రతిదాంట్లోనూ శిక్షణ ఇస్తున్నారు. కలిసిమెలిసి బతకడం, కష్టపడి జీవించడం, ఎవరి పనులు వాళ్లే చేసుకోవడం వంటివాటిని పిల్లలకు అలవరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

ప్రతిరోజూ ప్రతిరోజూ మనం తినే అన్నం.. పొలం నుంచి ప్లేటులోకి ఎలా వస్తుందో చెప్పమంటే పదేళ్ల దీపక్‌ ప్రశ్నార్థకంగా చూశాడు. బాల్కనీలో బట్టలు ఆరేస్తున్న తల్లి- ఐదో తరగతి చదివే తన కూతురు అంకితని లవంగాలు తెచ్చి పక్కింటి ఆంటీకి ఇవ్వమంటే ‘అవి ఎలా ఉంటాయీ’ అని అడిగింది ఆ చిన్నారి. నీళ్ల ట్యాపును రిపేరు చేస్తున్న ఓ తండ్రి తన కొడుక్కీ ఆ పనిని నేర్పిద్దామని పిలిస్తే... పట్టించుకోకుండా ఫోనులో మునిగిపోయాడు ఆ పిల్లాడు. నిజానికి ఇవన్నీ వయసుకు మించిన పనులేం కాదు, అంత అర్థం కానివి అంత కంటే కాదు. పిల్లలు దృష్టి పెట్టకపోవడంతో, ఇంట్లోనూ నిత్యజీవితంలోనూ మనకు ఉపయోగపడే వాటి గురించి వారికి ఏ మాత్రం అవగాహన ఉండక- జీవన నైపుణ్యాలకు ఆమడ దూరంలో బతికేస్తున్నారు పిల్లలు. వారిని ఆ దిశగా లాగుదామన్నా అనాసక్తి చూపుతున్నారు. ఉంటే హోమ్‌ వర్క్‌లు, లేదంటే మొబైల్‌, ట్యాబ్‌ల్లో మునిగితేలడమే అందుకు కారణం. పైగా ఒంటరిగా గడపడానికి అలవాటు పడి, పెరిగి పెద్దయ్యాక టీమ్‌ వర్క్‌లో ఇమడలేక నానా ఇబ్బందులూ పడుతున్నవారు ఎందరో. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి.. చదువొక్కటే ప్రపంచం కాదని చెబుతూ పిల్లలకు మొగ్గదశలోనే అన్ని పనులూ నేర్పించాలనుకుంది చైనా విద్యా మంత్రిత్వ శాఖ. ఇందుకోసం ‘లేబర్‌ కోర్సు’ పేరిట ఓ కరిక్యులమ్‌ను రూపొందించి స్కూళ్లలో కొత్త సిలబస్‌ను పిల్లలకు పరిచయం చేస్తోంది.

అసలైన హోమ్‌వర్క్‌...

కిండర్‌ గార్డెన్‌ నుంచీ- చదువుతోపాటు లైఫ్‌ స్కిల్స్‌కు కూడా సమప్రాధాన్యమివ్వాలన్నది ఈ కరిక్యులమ్‌ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా వంట, ఇంటి పనులు, సరకులూ కూరగాయలూ కొనడం, గృహోపకరణాలు బాగు చేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, వ్యవసాయం, పౌల్ట్రీ, డెయిరీ నిర్వహణ, పట్టుపురుగుల పెంపకం... ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యజీవితంలో అవసరపడే ఎన్నో పనులను తరగతి గదిలోనే నేర్పిస్తారు. హోమ్‌ వర్క్‌కు అసలైన అర్థం చెబుతూ- ఎవరింట్లో పనుల్ని వాళ్లు చేసేలా టాస్క్‌లు కూడా ఇస్తుంటారు. పిల్లలు బడిలో చేరగానే- వారు ఎవరి మీదా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునేలా తీర్చిదిద్దుతారు. ఎల్‌కేజీ, యూకేజీల్లో- ఇంట్లో వాడే కూరగాయల్నీ, సరకుల్నీ పరిచయం చేసి- అవెందుకు తినాలో వివరిస్తారు. తరవాత కూరగాయలు కడగడం, జాగ్రత్తగా కోయడం, వండటం, వంటింటి గట్టు తుడవడం వంటివన్నీ ఐదో తరగతి వరకూ ఒక్కోటిగా నేర్పిస్తారు. అమ్మ మీద ఆధారపడకుండా, పెద్దవారికి సాయపడేలా ప్రాజెక్టు వర్కులుంటాయి. ఇంట్లో తీసినవి ఎక్కడివక్కడ పెట్టడం, ఊడవడం, బట్టలు నానబెట్టడం, వాషింగ్‌ మెషీన్‌ ఆన్‌ చేయడం, సాక్సులూ, న్యాప్‌కిన్స్‌ ఉతికి ఆరేయడం, షూలు శుభ్రం చేసుకోవడం... ఇలా చాలానే ఉంటాయి.

పరీక్షలూ పెడతారు...

వంటింట్లో ఉపయోగించే కూరగాయలనూ చాలావరకూ పిల్లల చేతే సాగు చేయిస్తారు. వరి సాగు, చేపల పెంపకం, పౌల్ట్రీ, డెయిరీ నిర్వహణ వంటి పనుల్లోనూ వారిని భాగం చేస్తుంటారు. వీటికోసం అవసరమైతే ఫీల్డు ట్రిప్పులకు సైతం తీసుకెళ్తారు. టైలరింగ్‌, వైరు కుర్చీలూ మంచాల అల్లిక వంటి వాటిల్లోనూ తర్ఫీదు ఉంటుంది. విద్యార్థులు తాము నేర్చుకుంటూ మిగతా వారినీ కలుపుకుని వెళ్లేలానూ, తోటివారితో కలిసిమెలసి సఖ్యతగా ఉండేలానూ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకునేలానూ చూస్తుంటారు. వీటన్నింటితోపాటు ఆయా అంశాలకు సంబంధించి వారికి పరీక్షలు నిర్వహించి ఎవరెలా నేర్చుకుంటున్నారో తెలుసుకుంటూ ఉంటారు టీచర్లు. ఇదంతా చూస్తుంటే.. పిల్లలకు ఈ పనులే ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది కానీ, వారంలో రెండు రోజులు మాత్రమే ఈ కరిక్యులమ్‌ ఉంటుంది. మిగతా సమయాల్లో చదువుకీ, పరీక్షలకీ ప్రాధాన్యమిస్తారు. పిల్లలు చిన్నవయసులోనే లైఫ్‌ స్కిల్స్‌ అలవరుచుకోవడం వల్ల స్వతంత్రులుగా జీవించడంతోపాటు- కెరీర్‌ను ఎంచుకునే క్రమంలో తాము నేర్చుకున్న ఏదో ఒక విషయంలో స్పెషలైజేషన్‌ చేసి ఆ దిశగా కొత్త అడుగులు వేస్తారన్నది చైనా విద్యానిపుణుల ఆలోచనగా చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు