శాస్త్రవేత్తలు చేయలేనిది... రైతుగా సాధించా!

తెలుగు అక్షరాలకున్న తలకట్టులాంటి ఠీవైన రైతు జీవితం ఆయనది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఓడిన చోట ఓ సేద్యకారుడిగా నిలిచి గెలిచినవాడాయన.

Updated : 20 Nov 2022 04:10 IST

శాస్త్రవేత్తలు చేయలేనిది... రైతుగా సాధించా!

తెలుగు అక్షరాలకున్న తలకట్టులాంటి ఠీవైన రైతు జీవితం ఆయనది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఓడిన చోట ఓ సేద్యకారుడిగా నిలిచి గెలిచినవాడాయన. ఆ క్రమంలో ‘హరిత విప్లవం’ పితామహులందరినీ ఆచంటలోని తన పంటపొలాల వైపు నడిపించినవాడు. అందుకే భారత 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా... ఆహార స్థిరత్వానికి దోహదపడ్డ రైతు శాస్త్రవేత్తగా విదేశీ మీడియా నుంచీ ప్రశంసలందుకున్నాడు. తన 88 ఏళ్ళ వయసులోనూ కాడి వదలని... పంటచేల్లో ప్రయోగాలు మానని... నెక్కంటి సుబ్బారావు జీవితప్రస్థానం ఆయన మాటల్లోనే...

అది గోదావరి ఒడ్డు. ఆ గంగమ్మ తల్లికి మనసులోని దిగులంతటినీ మౌనంగా వెళ్ళబోసుకుంటున్నాను. అంతకు పదిరోజుల ముందు మా నాన్న చనిపోయారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న నా తరగతి గదికి బంధువొకాయన వచ్చి... ఆ పిడుగులాంటి వార్త చెప్పాడు. అప్పటికి చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు నాన్న. తాను అట్టేకాలం ఉండనని తెలుసుకున్నారేమో... తనకున్న భూముల్ని ఏడుగురు సంతానానికీ పంచేశారు. ఆ ఏడుగురిలో నేను ఆరోవాణ్ణి... నా తర్వాత చెల్లి. అప్పటికే మా అన్నయ్యలు నలుగురికీ పెళ్ళిళ్ళైపోయి ఎవరి కుటుంబాలు వాళ్ళవయ్యాయి. నా వాటాగా పదిహేను ఎకరాలొచ్చాయి. అమ్మ ఇక చదువు చాలించి పొలంతోపాటూ కుటుంబం బాధ్యతా నన్నే చూసుకోమంది. బాధ్యతపట్ల నాకు భయంలేదుకానీ... చదువుమానేయాలన్న ఆలోచనే నన్ను ఇబ్బంది పెట్టింది. నేను ఇంటర్‌ అయ్యాక బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని కలలుకనేవాణ్ణి. ఆ కలలు కల్లలైపోతున్నాయనే ఆ రోజు గోదావరి ముందు నిల్చుని నా గోడు చెప్పుకుంటున్నాను. అప్పుడు మా అమ్మే దారి చూపింది. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో రింగుమంటున్నాయి... ‘జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టే జరగదు. ఉన్నంతలోనే దైర్యంగా ముందుకు సాగాలి. నాన్న వైద్యం కోసం పెట్టిన ఖర్చు తాలూకు అప్పు రెండు లక్షల రూపాయల దాకా ఉంది. నువ్వు వ్యవసాయం చేయకపోతే... అది తీరే మార్గమే లేదు. ఏమో ఏదో ఒక రోజు... ఈ భూములే నిన్ను గొప్పవాణ్ణి చేయొచ్చు. అంతా మంచికే జరుగుతుందనుకో’ అంది. ఆ మాటల్నే ఆశీస్సులుగా తీసుకుని... తొలిసారి కాడి చేతబట్టాను.

ఆకలి తీర్చిన ప్రయోగాలవి...

నాకు మా పెద్దన్నయ్య నాగేశ్వరరావే సాగులో తొలి పాఠాలు నేర్పారు. అప్పట్లో అక్కుళ్లూ, కృష్ణకాటుకలూ అనే రెండు వరి రకాలే దొరికేవి. అవి ఆరునెలల పంటలు... ఎకరానికి పదిహేను బస్తాలకన్నా ఎక్కువ వచ్చేవి కావు. అలా వచ్చిన ధాన్యమంతా అప్పులకి వడ్డీకింద కడుతూ ఏదో నెట్టుకొస్తుండేవాణ్ణి. 1965వ ఏడాది అది. మనకు స్వాతంత్య్రం వచ్చినా... ఆహార కరవు నుంచి విముక్తి రాలేదు. అమెరికా నుంచి ధాన్యాలు తెచ్చుకుని పేదలకి పంచాల్సిన స్థితి. బెంగాల్‌లోనైతే లక్షమందికిపైగా తిండిలేక డొక్కలెండి చనిపోయారట. ఓ స్థాయిలో మన ప్రధాని- ‘అందరూ మూడుపూటలా కాదు... ఒక్క పూట తినండి. మిగిలిన ధాన్యాన్ని పేదలకి పంచండి!’ అని చెప్పే పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఫిలిప్పైన్స్‌లోని ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(ఇర్రి) అధిక దిగుబడులిచ్చే ‘ఐఆర్‌ 8’ అన్న వరిరకాన్ని రూపొందించింది. దాన్ని దక్షిణాదిన కోయంబత్తూరులోనూ, ఆచంట గ్రామంలోనూ ఎకరం పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు శాస్త్రవేత్తలు. కానీ వాళ్ళు అధిక దిగుబడి కోసం... ఎక్కువ మోతాదు రసాయన ఎరువులు వాడటం గమనించాను. నీటి వసతి ఎక్కువున్న మా గోదావరి తీర ప్రాంతానికి ఆ పద్ధతి సరికాదు అనిపించింది. శాస్త్రజ్ఞులు వాడగా మిగిలిపోయి కాలవల్లో పడేసిన నారు దొరికితే తెచ్చి... మా పొలంలో ఒక చోట నాదైన పద్ధతిలో కేవలం పది సెంట్లలో వేశాను. పంట చేతికొచ్చేనాటికి... మా ఊళ్ళోనే కాదు కోయంబత్తూరులోనూ శాస్త్రవేత్తలు సాగుచేసిన భూమిలో 18 బస్తాలే వచ్చాయి. నలభై బస్తాలు వస్తాయనుకుంటే... ఇంత తక్కువ దిగుబడి ఏమిటా అని అటు కేంద్ర మంత్రులూ, ఇటు శాస్త్రవేత్తలూ తలలు పట్టుకున్నారు. అలా కుంగిపోయినవాళ్ళకి కొత్త వెలుగుల్ని చూపింది నా పదిసెంట్ల పొలం. శాస్త్రవేత్తల ఎకరం పొలంలో 18 బస్తాలు వచ్చాయన్నాను కదా... ఆ లెక్కన నా పదిసెంట్ల భూమిలో ఒకటిన్నర బస్తా రావాలి! కానీ నాకు నాలుగుబస్తాలు వచ్చాయి. అంటే, నా పద్ధతిలో ఎకరాకి నలభైబస్తాలు రావొచ్చన్నమాట! అది చూసిన శాస్త్రవేత్తల ఉత్సాహం అంతా ఇంతా కాదు.

విత్తనాలు విమానంలో తెప్పించారు!

నా పదిసెంట్ల వ్యవహారం కేంద్రప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. నాటి కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి సీఎస్‌ సుబ్రమణ్యం, రాష్ట్ర మంత్రి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు. అప్పుడు సీఎస్‌గారు ‘మీకు కావాల్సినన్ని విత్తనాలిస్తాం... మీ ఊళ్ళో ఎన్ని ఎకరాల్లో ‘ఐఆర్‌ 8’ సాగు చేయగలరు?’ అని అడిగారు. ‘వెయ్యి ఎకరాలు’ అని చెప్పాను. అప్పటికప్పుడు ఫిలిప్పైన్స్‌ నుంచి ఎకరాకి 30 కేజీల వంతున విత్తనాలని విమానం ద్వారా తెప్పించి ఇచ్చారు. కాకపోతే, మా ఊరి రైతుల్లో చాలామంది వాటిని వేయడానికి ముందుకు రాలేదు! పైగా ‘ఈ కుర్రాడు చెప్పేవన్నీ అబద్ధాలు... అసలు ‘ఐఆర్‌ 8’తో బాగా నష్టాలొస్తాయి’ అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. వాటన్నింటినీ గట్టిగా ఎదుర్కొన్నా. నాతో నడవగల యువరైతులు 150 మందిని కూడగట్టాను! కేంద్రప్రభుత్వం వెయ్యి ఎకరాల్లో వేయమని 30 కేజీల విత్తనాలిస్తే... నేను ఎకరాకి 15 కేజీల వంతున కుదించి రెండువేల ఎకరాల్లో సేద్యం చేయించాను! ఓ రకంగా నాకు అది చావోరేవో అన్న పరిస్థితి. మేం ఆశించిన ఫలితాలు రాకపోతే, ఊళ్ళోనే కాదు దేశం మొత్తంలోనూ ఎవ్వరూ ‘ఐఆర్‌ 8’ని నమ్మరు. ఆ భయంతోనే రాత్రింబవళ్ళూ పొలాలకి వెళ్ళి సలహాలూ సూచనలిస్తూ పర్యవేక్షించాను. నేను మా చెల్లెలి పొలాన్ని కూడా కలుపుకుని పాతిక ఎకరాల్లో నాట్లు వేశాను. ఆ కృషి అంతా ఫలించి... ప్రతి ఎకరానికీ రికార్డు స్థాయిలో 45 బస్తాలు చేతికొచ్చాయి! అంతే... మా ఊరు ఓ యాత్రాస్థలమైపోయింది. దేశం నలుమూలల నుంచి మూడువేలమంది శాస్త్రవేత్తలూ, అయిదారు వేలమంది రైతులూ మా దగ్గర తర్ఫీదు పొందడానికి వచ్చారు. ‘హరిత విప్లవ పితామహుల’ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌, కేంద్ర వ్యవసాయ మంత్రి సీఎస్‌ సుబ్రమణ్యం, ‘ఐఆర్‌ 8’ని వృద్ధిచేసిన ఫిలిప్పైన్స్‌ రైస్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ చాండ్లర్‌ తదితరులందరూ ఆచంటకొచ్చారు. సీఎస్‌ సుబ్రమణ్యం వేదికెక్కి ‘ఐఆర్‌ 8 ఫెయిలైందని మన ప్రధానీ, సుప్రీంకోర్టూ నన్ను చీవాట్లు పెట్టకుండా ఈ సుబ్బారావే కాపాడాడు’ అని ప్రకటిస్తుంటే... దాన్ని చూస్తున్న మా అమ్మ  కన్నీళ్లాగలేదు. నా విషయంలో తన మాట పొల్లుపోలేదని... బతికున్నంత కాలం చెబుతూనే ఉండేది!

వర్సిటీ సలహాదారునిగా...

‘ఐఆర్‌ 8’ పుణ్యమాని మాకున్న రెండు లక్షల రూపాయల అప్పుని తీర్చేశాను. అప్పుడే ఓ శాస్త్రవేత్త నాకు మొక్కజొన్నని పరిచయం చేశారు. దాన్ని మాలాంటి నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా మెట్ట పొలాల్లోనే వేయమన్నారు. దాంతో హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర వందెకరాలు కౌలుకి తీసుకుని ప్రయోగాలు మొదలుపెట్టాను. ఆ ప్రాంతంలోనే ఉన్న మా బంధువులమ్మాయి అట్లూరి నాగేశ్వరిని పెళ్ళి చేసుకున్నాను. మాకో పాప. మొక్కజొన్నలోనూ నేలను బట్టే కొత్త ప్రయోగాలు చేశాను. మొక్కల మధ్య ఎడం కుదించాను. అది చూసిన శాస్త్రవేత్త ఒకాయన ‘మీ ఇష్టానికి వేస్తే... మేం చదువుకుంది దేనికండీ!’ అంటూ మండిపడ్డాడు. కానీ ఆ ఏడాది దేశమంతా ఎకరాకి 14 క్వింటాళ్లు వచ్చే మొక్క జొన్న... నా దగ్గర 26 క్వింటాళ్లుగా నమోదైంది. దాంతో నన్ను తిట్టిన శాస్త్రవేత్తే మెచ్చుకుని... నా విధానాలపైన ఓ థీసిస్‌ తయారుచేసి అన్ని రాష్ట్రాలకీ వినియోగించారు! అందుకోసం ఉత్తమ రైతుగా జాతీయ అవార్డునీ అందుకున్నాను. 1985లో ‘ఐఆర్‌ 8’ను కనిపెట్టి పాతికేళ్లవుతున్న సందర్భంగా ఫిలిప్పైన్స్‌లోని ఇర్రీ సంస్థ వాళ్లు నన్ను సన్మానించారు. ఆ వేదికపైన ఎమ్మెస్‌ స్వామినాథన్‌ సహా శాస్త్రవేత్తలందరూ నన్ను ‘మిస్టర్‌ ఐఆర్‌ 8’ అనే సంబోధించడంతో... అదో బిరుదుగానే మారిపోయింది. నేను ఇక్కడికి రాగానే నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రతిష్ఠాత్మక ‘ధాన్‌ పండిత్‌’ అవార్డుని అందిస్తే, ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నన్ను అగ్రికల్చర్‌ వర్సిటీకి సలహాదారుగా నియమించారు. అన్నీ కలిసిరావాలేకానీ... నలుగురితోపాటూ తానూ బాగుపడటం కోసం రైతు ఏ సాహసమైనా చేస్తాడు. 1985లో నేను అదే చేశాను...

నక్సలైట్లు వచ్చారు!

ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అరవై ఎకరాల పొలం కొని పండ్ల తోటలు పెట్టాను. అక్కడి రైతుకూలీల పరిస్థితి దారుణంగా ఉండేది. వాళ్ళకి రోజుకి ఐదు రూపాయలే కూలీ ఇస్తే దాన్ని నేను రెండింతలు చేశాను. పనిలో ఒక గంట విశ్రాంతి తీసుకోవాలని చెప్పాను. చంటిపిల్లల తల్లులకు మరో గంట అదనంగా ఇచ్చాను. ఈ పద్ధతులన్నీ చుట్టుపక్కలున్న మాజీ జమీందార్లూ, ఇతర రైతులకీ నచ్చలేదు. కూలీ తగ్గించమని బెదిరించారు. అప్పుడే ఓ రోజు రాత్రి నా పొలం దగ్గరకి జీపొకటి వచ్చి ఆగింది. పదిమంది సాయుధులు దిగారు. ఒకమ్మాయి వాళ్ళకి నేతృత్వం వహించింది. నన్ను చూడగానే తన పేరు భారతి అని చెప్పుకుంది. ‘మీరు కూలీల్ని చాలా ఆదరంగా చూస్తున్నారని విన్నాం! మా నక్సల్స్‌ హైకమాండ్‌ ఇందుకోసం మిమ్మల్ని అభినందించి రమ్మంది’ అని చెప్పింది. వెళుతూ వెళుతూ ‘రైతు కూలీని పాతిక రూపాయలకి పెంచగలరా?’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆ హామీ ఇవ్వలేకున్నా... ఏడాది తర్వాత అంతే పెంచగలిగాను. ఆ ప్రాంతంలో పొగాకు కేంద్రం భూములపైన కబ్జాదారుల కళ్లుపెడితే... ముఖ్యమంత్రి ఎన్టీరామారావుతో మాట్లాడి అక్కడ హార్టికల్చర్‌ కళాశాల పెట్టడానికి సహకరించాను!

అదే నంబర్‌ వన్‌...

నాకు ఫిలిప్పైన్స్‌లో సన్మానం తర్వాత... నా చేతికి ‘ఐఆర్‌ 64’ అన్న కొత్త రకం వరి విత్తనాలని ఒక కేజీ అందించారు. నేను వాటిని అశ్వారావుపేటలో అభివృద్ధి చేశాను. 1986లో పశ్చిమగోదావరి జిల్లా వరదనీట మునిగిపోయింది. రైతులెవరి దగ్గరా వడ్లు కాదుకదా గడ్డి కూడా మిగల్లేదు. నేను అశ్వారావుపేటలో అభివృద్ధి చేసిన విత్తనాలని కారులో వేసుకుని కేజీ చొప్పున... ఐదువేల మంది రైతులకి ఉచితంగా పంచాను. అవి వరద ప్రాంతాల్లో కరవు నీడరాకుండా కాచుకున్నాయి. ఈ ధాన్యం వల్లే మా గోదావరి జిల్లా భూముల విలువ 50 వేల నుంచి ఐదు లక్షలకి చేరింది! నా విత్తనాలనే కేంద్ర ప్రభుత్వం సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా దేశం మొత్తానికీ పంచింది. ఇప్పటికీ మనదేశంలో లీడింగ్‌ వరి ధాన్యం ఇదే మరి!

దిల్లీలో నిలువెత్తు ఫ్లెక్సీ!

2017... ‘ఐఆర్‌ 8’ విజయం సాధించి 50 ఏళ్ళు. ఈ సందర్భంగా ‘రైస్‌ టుడే’ అన్న అంతర్జాతీయ పత్రిక కవరు పేజీ మీద నా ఫొటో ప్రచురించి... పెద్ద కథనం రాసింది. అదే ఏడాది ‘ఐఆర్‌ 8’ స్వర్ణోత్సవాల్ని దిల్లీలో నిర్వహిస్తే... ఆ వేదిక ముందు ఆ పేజీని అతిపెద్ద ఫ్లెక్సీగా ఏర్పాటుచేశారు. ఆ రోజు ‘ఇర్రీ’ సంస్థ అధినేత జయదేవ్‌ ఖుష్‌ని అందరూ సన్మానించబోతే... ఆయన ‘నన్ను కాదు... ఆయనే అన్ని సన్మానాలకీ అర్హుడు’ అంటూ నా వైపు చూపించాడు. అప్పుడే అంతర్జాతీయ విలేకర్లు నన్ను ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఏడాది స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని... మన దేశానికి ఆహార స్థిరత్వం ఇచ్చిన వరిరకం ‘ఐఆర్‌ 8’ విజయానికి దోహదపడ్డ ‘రైతు శాస్త్రవేత్త’ అంటూ అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తుంటే ఆనందంతో గుండె నిండిపోతోంది నాకు.


నాకింకా 88 ఏళ్ళే!

ఈ వయసులోనూ నా పదిహేను ఎకరాల పొలం పనులన్నీ నేనే చూస్తుంటాను. చూపూ వినికిడీ జ్ఞాపకశక్తీ సమస్యల్లేవు. ఎక్కడికెళ్ళినా స్కూటర్‌ మీదే తిరుగుతున్నాను. మాఅమ్మానాన్నలిద్దరికీ మధుమేహం సమస్య ఉండేది. నాకూ అది రాకూడదని...

31 ఏళ్ళప్పటి నుంచే ఒక్క పూట అన్నం తినడం అలవాటు చేసుకున్నాను. మిగతా రెండు పూట్లా పండ్లు తీసుకుంటాను. ఆరునూరైనా సరే రోజూ వ్యాయామం చేస్తాను.

- మొల్లేటి అరుణ్‌, న్యూస్‌టుడే, ఆచంట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు