Kambhampati Subbarao: అవమానంతో... కళ్లలో నీళ్లు తిరిగాయి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) గురించి ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనమైతే గూగుల్‌లో వెతుకుతాం. మరి అమెరికన్‌ ప్రభుత్వ ప్రముఖులూ, విలేకర్లూ ఏం చేస్తారంటే... కంభంపాటి సుబ్బారావుని పిలవమంటారు!

Updated : 25 Dec 2022 10:54 IST

Kambhampati Subbarao: అవమానంతో... కళ్లలో నీళ్లు తిరిగాయి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) గురించి ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనమైతే గూగుల్‌లో వెతుకుతాం. మరి అమెరికన్‌ ప్రభుత్వ ప్రముఖులూ, విలేకర్లూ ఏం చేస్తారంటే... కంభంపాటి సుబ్బారావుని పిలవమంటారు! ఆమాటకొస్తే అమెరికానే కానక్కర్లేదు ‘ఏఐ’కి సంబంధించి ఏ మేధావికి ఎలాంటి సందేహం వచ్చినా ఆయనవైపే చూస్తున్నారు. కృత్రిమ మేధపైన ఆయనకున్న పట్టు అలాంటిది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ చిన్నపట్టణంలో పుట్టి ఈ స్థాయికెదిగిన ఆయన... తన ప్రస్థానాన్ని మనతో ఇలా పంచుకున్నారు.

హైదరాబాద్‌ జూబ్లీ హాల్‌... ముఖ్యమంత్రి రాక కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాం ఆరోజు. ఆయనకి ఎలా నమస్కరించాలి.. ఏదైనా అడిగితే ఎలా జవాబు చెప్పాలి... ఇలా ప్రతిదానిపైనా అప్పటికే మాకు తర్ఫీదు ఇచ్చారు. ఆ రోజు మాకు సన్మానం చేస్తున్నారు. నాతోపాటూ మరో తొమ్మిదిమంది ఉన్నారు. మేమంతా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో తొలి పది ర్యాంకుల్ని సాధించినవాళ్ళం. నాది ఏడో ర్యాంకు. సీఎం రాక ఆలస్యం కావడంతో అక్కడున్న పిల్లలం మాటల్లో పడ్డాం. అప్పుడో విద్యార్థి ఇంగ్లిషులో అడిగాడు ‘వాట్‌ ఈజ్‌ ది ఏరియా ఆఫ్‌ పారలలోగ్రామ్‌?’ అని. ‘సమాంతర చతుర్భుజం’ అని తెలుగులో అడిగుంటే టకీమని జవాబు చెప్పేవాణ్ణేకానీ... ఇంగ్లిషులో నాకేమీ అర్థంకాలేదు. దాంతో ‘పారలలోగ్రామ్‌ అంటే తెలియలేదు... వీడు స్టేట్‌ర్యాంకర్‌!’ అని ఆ అబ్బాయి అనేసరికి పిల్లలందరూ నవ్వేశారు. నా కళ్ళలోకి నీళ్ళు తన్నుకొచ్చేశాయి. అవమానంగా అనిపించింది. ఆలోగా.. సీఎం వచ్చారు! సన్మానం అయి, సీఎంతో ఫొటోలు తీసుకున్నాక కూడా నా మనసు మనసులో లేదు. అంతటి అవమానానికి కారణం... నాకు ఇంగ్లిషు రాకపోవడమేకదా అనిపించింది. ఇంటర్‌లోనైనా ఇంగ్లిషు మీడియం తీసుకోవాలనుకున్నాను. హైదరాబాద్‌ కోఠీకి వెళ్ళి ఇంటర్‌ ఇంగ్లిషు మీడియంకి సంబంధించిన పుస్తకాలన్నీ కొని... మా పెద్దాపురం బస్సెక్కాను.  

ఒకటో తరగతిలో... మూడేళ్ళు!

పెద్దాపురంలో సోమరాజు టాకీస్‌ అని ఉండేది. దాని పక్కనే ఉండటం వల్ల మా స్కూల్‌ని అందరూ ‘సినిమా హాల్‌ బడి’ అంటుండేవాళ్ళు. అక్కడి జోస్యుల సూర్యనారాయణ మాస్టారే నా తొలి గురువు. ఉపాధ్యాయులపట్లా, అధ్యాపక వృత్తిపట్లా నాకున్న అనురక్తికి బీజం పడింది ఆయన దగ్గరే. ఆయనంటే నాకు ఎంత అభిమానం అంటే... ఒకటో తరగతి పాసయ్యాక కూడా ఆ క్లాసులోనే ఉండిపోయాను. ఎవరు చెప్పినా వినకుండా... రెండేళ్లు మరే క్లాసుకీ వెళ్ళలేదు. నాన్న గౌరీపతి శాస్త్రి హైస్కూలు మాస్టారు కావడం వల్ల... ఇక్కడి టీచర్లు నా ఇష్టప్రకారమే ఒకటో తరగతిలోనే ఉండనిచ్చారు. నాన్న వాళ్ళది మసకపల్లి. నిరుపేద కుటుంబం. నాన్న పదో తరగతిలో చదువుతున్నప్పుడే... పెద్దాపురానికి చెందిన కంభంపాటి సుబ్బారావు ఆయన్ని దత్తత తీసుకుని చదివించారట. నాన్నకి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యేనాటికే ఆ పెద్దాయన చనిపోయారు. ఆయనపైన కృతజ్ఞతతోనే నాన్న నాకు ఆ పేరు పెట్టారు. నాకో చెల్లీ, తమ్ముడూ. ఒకటో తరగతిలో మూడేళ్లు ఉన్నాక నాన్న నన్ను తాను పనిచేస్తున్న ఎస్వీ స్కూల్లో నేరుగా నాలుగో తరగతిలో వేశారు. చదువులో చురుగ్గానే ఉండేవాణ్ని కానీ... పాఠాలకన్నా వ్యాసరచన, వక్తృత్వాల్లో బాగా రాణించేవాణ్ణి. 1972లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మా జిల్లా నుంచి ఎంపికై... మాట్లాడే అవకాశం దక్కించుకున్నాను. పదో తరగతి పరీక్షల్ని పెద్దగా కష్టపడకుండా ఆడుతూపాడుతూనే రాశా. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రస్థాయి ర్యాంకొచ్చింది. ఆ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చా. ఆ రోజు కసితో ఇంగ్లిషు మీడియం పుస్తకాలైతే తీసుకున్నాను కానీ... మా ఊళ్లో తెలుగు మీడియం మాత్రమే ఉంది!

‘ఇంగ్లిష్‌’తో కుస్తీ... దోస్తీ!

ఇంటర్‌లో తెలుగు మీడియం చదివినా... ఇంగ్లిషులో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తూ ఆ ఏడాదే విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలా నా కోరిక తీరే అవకాశం దక్కింది. కానీ... మరి నాకు ఇంగ్లిషులో నోట్స్‌ ఎవరు రాసిస్తారు? అదేదో నేనే తయారు చేసుకోవాలనుకున్నా. ఉదయం నుంచి మధ్యాహ్నందాకా మా ఎమ్మార్‌ కాలేజీలో తెలుగులో పాఠాలు విని... ఇంటికొచ్చాక నా దగ్గరున్న ఇంగ్లిషుమీడియం పుస్తకాల సాయంతో నోట్స్‌ తయారుచేసుకునేవాణ్ణి. వాటిని మాస్టార్లకు చూపించి...తప్పులు సరిచేయించుకునేవాణ్ణి.

ఇలా రెండేళ్ళు... శని, ఆదివారాలనీ సెలవులనీ పట్టించుకోకుండా చదివా. దాంతో ఇంటర్‌లో తొలిసారి ఇంగ్లిషు మీడియంలో పరీక్ష రాసినా...గ్రూపు సబ్జెక్టుల్లో 95 శాతానికిపైగా మార్కులు తెచ్చుకోగలిగా. అప్పుడే నాకు ఐఐటీల గురించి తెలిసింది.  అప్పటికి అయిదే ఐఐటీలు ఉండేవి.  సవాలుగా తీసుకుని ప్రిపేర్‌ కావడం మొదలుపెట్టాను. కాకపోతే, ఒక్క మ్యాథ్స్‌ తప్ప ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఐఐటీ ఎంట్రన్స్‌ సిలబస్‌కీ స్టేట్‌బోర్డుకీ సంబంధమే ఉండేది కాదు. అప్పట్లో కోచింగ్‌లు లేవు... నాకు దొరికిన అతితక్కువ మెటీరియల్‌తోనే ప్రిపేరై పరీక్ష రాశాను. కాకినాడ జేఎన్‌టీయూ... మా పరీక్షా కేంద్రం. దాదాపు 300 మంది హాజరయ్యారు కానీ... క్వశ్చన్‌ పేపర్‌ చేతిలోకి తీసుకున్న అర్ధగంటకి అందరూ వెళ్ళిపోయారు... నేనూ మరొక విద్యార్థి మాత్రమే మిగిలాం. అన్నింటికీ జవాబు తెలుసని కాదుకానీ... అలా వెళ్ళిపోవడం అవమానంగా భావించి ఆ ప్రశ్నలతో కుస్తీ పడుతూ మూడు గంటలూ ఉండిపోయా.

టాప్‌ ర్యాంకర్‌ని!

ఐఐటీలో సీటు వస్తుందన్న నమ్మకం  లేకపోవడంతో... కాకినాడలోని డిగ్రీ కాలేజీలో చేరేందుకు ప్రయత్నించా. అక్కడి కాలేజీల్లో అప్లికేషన్‌ వేస్తూ పనిలోపనిగా... నా ఐఐటీ రిజల్ట్‌ ఏమైందో చూద్దామని జేఎన్‌టీయూకి వెళ్ళా. అప్పటికి ఏడేళ్ళుగా ఆ కేంద్రం నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నా... ఒక్కరూ సెలెక్ట్‌ కాలేదట. అందుకేనేమో- నేను వెళ్ళి అడగ్గానే అందరూ నన్ను వింతగా చూశారు. ఓ వ్యక్తిని చూపించి అతణ్ణి అడగమన్నారు. ఆయన ఎంత వెతికినా ఫలితాల చిట్టా కనిపించలా. ఎందుకైనా మంచిదని పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లోనూ చూశాడు. అడుగు నుంచి... ఓ పెద్ద కాగితం తీశాడు. దాన్ని నా ముందు పెట్టి ‘ఇందులో ఉందేమో చూసుకో’ అన్నాడు. చూశాను- నా నంబర్‌ ఉంది, అదీ 310 ర్యాంక్‌తో! మరో నెలకి, ఐఐటీ- మద్రాసులో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరా. అదో సరికొత్త ప్రపంచంగా అనిపించింది. ఎవరినోట విన్నా ఇంగ్లిషే వినిపించేది. వాళ్ళతో మాట్లాడలేక  తలకిందులైపోయేవాణ్ణి. అయితేనేం, తొలి రెండు సంవత్సరాల్లోనూ టాపర్‌గా నిలిచాను. టాప్‌ ర్యాంకు సాధించేవాళ్ళకి మూడో ఏడాది తమకిష్టమైన బ్రాంచికి మారే అవకాశం ఉండేది. దాంతో- అప్పట్లో విద్యార్థుల మధ్య మంచి క్రేజ్‌ ఉన్న ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తీసుకున్నా. అక్కడే తొలిసారి ‘కృత్రిమ మేధ’ గురించి తెలుసుకున్నా.

‘ఏఐ’తో కరచాలనం!

ఐఐటీలో మిగతా అధ్యాపకులందరూ పాఠాలకే పరిమితమవుతూ ఉంటే... యజ్ఞ నారాయణ అనే ప్రొఫెసర్‌ మాత్రం పరిశోధనలు చేస్తుండేవారు. నన్నే ఎందుకు ఎంపికచేశారో తెలియదుకానీ... ఓ రోజు ఆయన ల్యాబ్‌కి రమ్మన్నారు. ఆయనతోపాటూ పగలూరాత్రీ పరిశోధనలు చేయించారు. తొలిసారి ‘స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిశోధన’తో పరిచయం చేయించింది ఆయనే. అప్పట్లో అదే ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’! రెండేళ్లపాటు ఆయనతో కలిసి చేసిన పరిశోధనే నాకు అమెరికాలో ఎమ్మెస్‌ చేసే అవకాశం దక్కేలా చేసింది. అక్కడికెళ్ళాలని నిర్ణయించుకున్నాక... అప్పటిదాకా చదువొక్కటే ప్రపంచంగా ఉన్న నాకు మా ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు అర్థంకాసాగాయి. నాన్న   జీతం ఇల్లు గడవడానికి, మా చదువులకే సరిపోయేది. నాకు స్కాలర్షిప్పులు వస్తున్నా... ఆయన జేబు నుంచీ ఎక్కువ మొత్తం పెట్టాల్సి వచ్చేది. ఎమ్మెస్‌కి కూడా పూర్తిస్థాయి స్కాలర్షిప్‌ వచ్చినా విమానం ఖర్చులకి డబ్బు
కావాల్సి వచ్చింది. రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకొచ్చినా... నాన్న వద్దన్నారు. ఎలాగోలా రూ.10వేలు తీసుకొచ్చారు! నేను అమెరికా వెళ్ళాకగానీ నాకు తెలియలేదు, నాన్న తనకున్న ఏకైక ఆస్తి... ఎకరం పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చారని!

కోటీశ్వరులం కాలేం కానీ...

ఎమ్మెస్‌కి కార్నెగీ మెలన్‌ వర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌లోనే చేరాను. కానీ రెండు నెలలకే నా మనసు కంప్యూటర్‌ సైన్స్‌పైకి మళ్ళింది... భవిష్యత్తు అందులోనే ఉందనిపించింది. దాంతో మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఆ రంగంపైన పరిశోధనలు మొదలుపెట్టా. ఎమ్మెస్‌లోనే తొలిసారి రోబో రూపురేఖల్ని దిద్దడం నేర్చుకున్నాను. పీహెచ్‌డీలో వాటిచేత పనులు చేయించడంపైన పరిశోధించా! ఆ సమయంలోనే మేరీల్యాండ్‌లో నాతోపాటు పీహెచ్‌డీ చేస్తోన్న చైతాలీ చక్రవర్తితో పరిచయం ఏర్పడి... ప్రేమగా మారింది. ఇరువైపులా పెద్దల సమ్మతంతో అమెరికాలోనే పెళ్ళిచేసుకున్నాం. ఆ ఆనందంలోనూ డబ్బుల్లేక అమ్మానాన్నలు రాలేకపోవడం నన్ను బాధపెట్టింది. అప్పట్లోనే ఎన్నో బహుళజాతి కంపెనీలు లక్షల్లో జీతం ఇస్తామని ముందుకొచ్చాయి కానీ... నేను అధ్యాపకవృత్తికే పరిమితం కావాలనుకున్నాను. రోబోలపైన పరిశోధనలతో పోస్ట్‌ డాక్టరేట్‌ విద్యార్థిగానూ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ గుర్తింపుని సాధించాను. కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన యంత్ర భాషని మనం నేర్చుకోవడం కన్నా... మనతో మన భాషలో పనిచేయించగలగడం ఎలా అన్న దిశగానే నా పరిశోధనలు ఉంటాయి. మనుషుల్లాగే రెండు విభిన్నమైన విషయాలని పోల్చి వాటి మధ్య సామ్యాల్ని పట్టుకోగల సామర్థ్యాన్ని దానికి కల్పించడానికి చూస్తున్నాను. అలా చేయగలిగితేనే ఏ చిన్న ప్రమాదానికీ దారితీయని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలని తీసుకురాగలం, ఓ మానవ సెక్రెటరీకి ఏమాత్రం తీసిపోని రోబోలని సృష్టించగలం. ఈ దిశగా కొద్దోగొప్పో విద్యార్థులు సాధించిన విజయాలూ, అతిపెద్ద కంపెనీల్లో వాళ్ళు వహించిన స్థానాలే... అమెరికాలోనూ,   ప్రపంచవ్యాప్తంగా నన్ను ఏఐకి అధికార ప్రతినిధి(స్పోక్‌ పర్సన్‌)గా మార్చాయి.

శ్వేత సౌధమైనా...

అమెరికా కేంద్రంగా పనిచేసే ‘అసోసియేషన్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’(ట్రిపుల్‌ ఏఐ) సంస్థకి 2016 నుంచి రెండేళ్ళపాటు నేను అధ్యక్షుడిగా చేశాను. నాటి నుంచీ అమెరికన్‌ మీడియా ‘ఏఐ’పైన నా చేత విరివిగా వ్యాసాలు రాయిస్తోంది, ప్యానల్‌ డిస్కషన్‌లకి పిలుస్తోంది. ప్రపంచ నలుమూలల్లోని విశ్వవిద్యాలయాలూ చర్చావేదికలూ ఆహ్వానిస్తున్నాయి. ఈ రంగానికి నిధులు ఎలా ఏరకంగా కేటాయించాలన్నదానిపైనా, పరిశోధనల్లోని కొత్త పోకడలపైనా శ్వేత సౌధం కూడా సంప్రదిస్తుంటుంది. సుష్మాస్వరాజ్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు... భారత ప్రభుత్వమూ కొన్ని కీలకాంశాలపైన నాతో చర్చించింది. ఆ మధ్య ఐఐటీ మద్రాస్‌ నన్ను ప్రముఖ పూర్వ విద్యార్థిగా సన్మానించింది. అమ్మానాన్నా ఆ కార్యక్రమానికి హాజరవ్వడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.


నన్ను నడిపించేది నా భార్యే!

శాస్త్రవేత్తగా నేనేమిటన్నది పక్కనపెడితే... వ్యక్తిగా నాకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అంటే  అస్సలు తెలియదు. ప్రతిపనీ వాయిదావేస్తుంటాను. వందలాదిమందికి లెక్చర్లిచ్చినా... ఏ ఒక్కరితోనైనా వ్యక్తిగతంగా మాట్లాడాలంటే జంకుతాను. ఇవన్నీ నాలోపాలు. అవి బయటకురాకుండా నాకు వెన్నుదన్నుగా నిలిచి నన్ను విజయాలవైపు నడిపిస్తోంది నా భార్య చైతాలీయే. తనూ ప్రొఫెసరే కానీ నాకున్న లోపాలేవీ లేని అత్యంత సమర్థురాలు! మాకో ఒకబ్బాయి... పేరు సౌమ్య. తను కూడా కంప్యూటర్‌ రంగంలోనే ఉన్నాడు.

- జె.రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..