ఈ సినిమా... నేను మా అమ్మకు రాసిన ఉత్తరం!

ఆత్మీయులు దూరమయ్యాకే తెలిసొస్తుంది... వాళ్లులేని ఆ లోటేమిటో, ఆ వెలితి లోతేమిటో. ‘నేనిలా చేసుంటే తను వెళ్ళుండేది కాదేమో’, ‘తనతో ఇంకాస్త ఎక్కువ సమయం గడపాల్సిందేమో’... వంటి తలపోతలెన్నో చుట్టుముడుతుంటాయి.

Updated : 25 Sep 2022 11:13 IST

ఈ సినిమా... నేను మా అమ్మకు రాసిన ఉత్తరం!

ఆత్మీయులు దూరమయ్యాకే తెలిసొస్తుంది... వాళ్లులేని ఆ లోటేమిటో, ఆ వెలితి లోతేమిటో. ‘నేనిలా చేసుంటే తను వెళ్ళుండేది కాదేమో’, ‘తనతో ఇంకాస్త ఎక్కువ సమయం గడపాల్సిందేమో’... వంటి తలపోతలెన్నో చుట్టుముడుతుంటాయి. అలాంటివేళ కవులైతే గొప్ప స్మృతి కావ్యాలు రాస్తారు. సినిమావాళ్ళయితే చక్కటి ఉద్వేగాలున్న చిత్రాల్ని తీస్తారు... ‘ఒకే ఒక జీవితం’తో దర్శకుడు శ్రీకార్తిక్‌ అదే చేశాడు. ఈ సినిమా చనిపోయిన తన తల్లి కోసం రాసిన ఓ లేఖే అంటాడతను. ఆ ‘చిత్ర’లేఖ వెనకున్న కథని ఇలా చెబుతున్నాడు...

ఆ నాన్నకి సంగీతమంటే ఇష్టమేకానీ... కళతోనే జీవితంలో నెగ్గలేమని అనుకుంటాడు. తల్లికేమో తనకొడుకు సంగీతంలో మాత్రమే రాణించగలడని గట్టి నమ్మకం. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది! - ‘ఒకే ఒక జీవితం’లోని హీరో తల్లిదండ్రుల పాత్రలు ఇలాగే ఉంటాయి. ఆ సినిమా కథ కోసం నేను అలా పాత్రల్ని మార్చాను కానీ... వాస్తవానికి మా ఇంట్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. మా నాన్న రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటయినా ఆయన మనసంతా కళలవైపే మొగ్గుతుండేది. చిన్నప్పుడు డాన్సర్‌ కావాలనుకుని అది నెరవేరక ఏవేవో ఉద్యోగాలు చేసి చివరికి స్థిరాస్తి రంగం వైపు వచ్చాడు. కళాకారుడు కావాలన్న ఆ కలని నా ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచీ నేను డాన్స్‌ను ఇష్టపడుతుంటే బాగా ప్రోత్సహించాడు. అందుకోసం ఎన్నోసార్లు బడికి డుమ్మా కొట్టినా ఏమనేవాడు కాదు. కానీ అమ్మ ఇందుకు భిన్నం. ‘ముందు చదువు సంగతి చూడు, ఆ తర్వాతే ఏదైనా!’ అని చాలా గట్టిగా చెప్పేది. అందుక్కారణం లేకపోలేదు. నాన్న స్థిరాస్తి రంగంలో ఉన్నాడన్న మాటేకానీ అందుక్కావాల్సిన లౌక్యం బొత్తిగా లేనివ్యక్తి. భూమి లావాదేవీల్లో ఏ వివాదాలొచ్చినా... ఆ నష్టమంతా ఈయనే భరిస్తుండేవాడు. ఇందువల్ల పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అమ్మ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో ఉద్యోగి. తన జీతమే మా కుటుంబానికున్న స్థిరమైన ఆదాయం. దాంతో, నేనూ అక్కా ఉద్యోగానికి భరోసా ఇచ్చే విద్యే చదవాలని పట్టుబడుతుండేది. అక్క ఐటీ ఉద్యోగం సాధించి ఆ కలని నెరవేర్చింది కానీ... నా విషయంలో అమ్మ ఆందోళన చెందినంతా అయింది...

డాన్స్‌ బాబూ డాన్స్‌!

మేము చెన్నైకి చెందిన తెలుగువాళ్లం. అమ్మవాళ్ల పూర్వీకులు ఎప్పుడో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి స్థిరపడ్డారట. నాన్నవాళ్ళదేమో తమిళనాడులోని కుంభకోణం. వాళ్ళూ తెలుగువాళ్ళేకానీ నాన్నకి మన భాష రాదు... తమిళమే మాట్లాడుతుండేవారు. దాంతో పిల్లలం మేం చిన్నప్పట్నుంచే అమ్మతో తెలుగులోనూ... నాన్నతో తమిళంలోనూ మాట్లాడటం నేర్చుకున్నాం. అలా రెండు భాషలేకాకుండా... రెండు సినిమా ప్రపంచాలు నాకు దగ్గరయ్యాయి. తెలుగులో చిరంజీవి, తమిళంలో ప్రభుదేవా డాన్స్‌లంటే నాకు పిచ్చి ఇష్టం. చిన్నప్పటి నుంచీ ఇంట్లో టేబుల్‌ ఎక్కి గెంతుతున్నవాణ్ణి కాస్తా... ఎనిమిదేళ్లకి స్టేజీలెక్కడం ప్రారంభించాను. మేమున్న ప్రాంతంలో పండగలూ పబ్బాల్లో నా చేత డాన్స్‌ చేయిస్తుండేవారు. వాటిల్లో పడి స్కూలుకి వెళ్ళనప్పుడల్లా అమ్మ కోప్పడుతుండేది. తనకి డాన్స్‌ అంటే బొత్తిగా ఇష్టంలేదని కూడా చెప్పలేం. వాళ్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ వార్షిక సాంస్కృతిక పోటీల్లో నా చేత డాన్స్‌ చేయిస్తుండేది. నన్ను చూసి మా అక్క కూడా నాట్యం నేర్చుకుంటానంటే భరతనాట్యం నేర్పించింది. ఓసారి మేమిద్దరం శివపార్వతులుగా చేసిన నాట్యానికి... దక్షిణాది మొత్తానికీ ఫస్ట్‌ప్రైజ్‌ వస్తే అమ్మ ఎంతగా సంతోషించిందో! కానీ- నేను ముందే చెప్పినట్టు, అమ్మకి చదువు తర్వాతే ఇంకేదైనా! తన భయంతోనేనేమో... టెన్త్, ఇంటర్‌ మంచి మార్కులతోనే పాసై ఇంజినీరింగ్‌లో చేరాను. ఆర్థికంగా అమ్మ పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నందువల్ల... ఓ డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. నెలకి రూ.10 వేలు వస్తున్నా... అమ్మకి మాత్రం నేను చదువుపైన పూర్తిగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఉండేది. ఆ అసంతృప్తిని దాటుకుని... నా డాన్స్‌ కెరీర్‌కి అమ్మ పూర్తిస్థాయిలో అండదండలు అందించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది...

ఇలాంటి అమ్మ ఉంటే...

‘కలైజ్ఞర్‌’ టీవీ అనే తమిళ ఛానల్‌లో అప్పట్లో ఓ డాన్స్‌ రియాల్టీ షోకి మంచి క్రేజ్‌ ఉండేది. డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు శిష్యులుగా ఉన్నవాళ్లూ, నా కాలేజీ ఫ్రెండ్స్‌ అందరం కలిసి ఓ టీమ్‌గా వెళ్ళి అందులో పాల్గొన్నాం. ఊహించనిరీతిలో రకరకాల దశల్ని సునాయాసంగా దాటుకుంటూ వెళ్ళాం. రోజూ ప్రాక్టీస్‌ చేయడం కోసం మా టీమ్‌లోని 30 మందీ మా ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాం. అప్పటిదాకా నా డాన్స్‌పైన పెద్దగా శ్రద్ధ చూపని అమ్మ నాకు అన్ని రకాలా సాయం చేయడం ప్రారంభించింది. ఏడాదిపాటు ముప్పైమందికి భోజనాలూ, షోకి కావాల్సిన రకరకాల బట్టలూ... వీటన్నింటికీ రెండు లక్షల రూపాయలదాకా అయ్యాయి! ఎందుకీ దండుగ ఖర్చు అని అమ్మ ఎప్పుడూ అనలా.టీమ్‌లోని ప్రతి ఒక్కర్నీ నాతో సమానంగానే చూసుకుంది. టీమ్మేట్స్‌ అందరూ ‘ఇలాంటి అమ్మ మాకుంటేనా... అద్భుతాలు చేసేవాళ్లం!’ అంటుండేవాళ్లు. ఏదేమైతేనేం- అమ్మ సాయంతోనే ఆ పోటీలో విజేతలుగా నిలిచాం. నా వంతుగా వచ్చిన మూడు లక్షల రూపాయల ప్రైజ్‌మనీని అమ్మ చేతికిస్తే... ఆ డబ్బుని అక్క పెళ్ళి కోసం వాడింది. బంధువులందరికీ ‘మావాడి సంపాదనతోనే ఇంత చక్కగా చేస్తున్నామండీ!’ అని గర్వంగా చెబుతుంటే... నేను ప్రయోజకుణ్ణి కావాలని తనెంతగా తపిస్తోందో అర్థమైంది. కాకపోతే తన కల నెరవేరడానికి ఇంకొంత కాలం పట్టింది...

నటనవైపు...

నేను టీవీ ఛానల్‌లో ఛాంపియన్‌షిప్‌ నెగ్గాక అక్కడ జడ్జిగా వచ్చిన ప్రముఖ మాస్టర్‌లందరూ ‘డాన్స్‌కన్నా నీ ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బావున్నాయి. నటనలో ట్రై చెయ్‌!’ అన్నారు. అప్పట్నుంచి ఉదయం వేళ కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాను. అలా శంకర్‌-విక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఐ’ సినిమాలో ఓ చిన్న పాత్ర దొరికింది. ఆ తర్వాత అజిత్‌కుమార్‌ ‘ఆట ఆరంభం’ సినిమాలో సైడ్‌ యాక్టర్‌గా కనిపించాను. ఆ రెండింటి తర్వాత- సినిమాల్లో నటుడిగా నాకు అంతకన్నా గొప్ప అవకాశాలు రావని అర్థమైపోయింది. అందువల్లే నాకోసం నేనే కథలు రాసుకోవాలనుకున్నాను. పోనుపోనూ నాట్యం, నటనలకన్నా నా గమ్యం రాయడమేనని అర్థమైపోయింది. నేను రాసిన ఆ కథల్నే షార్ట్‌ఫిల్మ్‌లుగా తీయడం మొదలుపెట్టాను. ‘హ్యాపీ టు బి సింగిల్‌’ అన్న షార్ట్‌ఫిల్మ్‌కి నార్వే వెళ్ళి ‘బెస్ట్‌ డైరెక్టర్‌’గా అవార్డు తీసుకున్నా. ఇంత సాధించినా అమ్మని మెప్పించలేకపోయాను... ‘కూటికీగుడ్డకీ రాని ఈ అవార్డులను ఏం చేసుకుంటావ్‌ నాన్నా! కనీసం నీ ఖర్చులకన్నా వచ్చేలా ఏదైనా చెయ్‌!’ అంటుండేది. కేవలం తనని మెప్పించాలనే ‘మ్యాడ్‌బాయ్స్‌ క్రియేటివ్‌’ పేరుతో కంపెనీ పెట్టి... వివిధ వస్తువులకి యాడ్‌ఫిల్మ్‌లు చేయడం ప్రారంభించాను. చిన్నగా మొదలుపెట్టి హైదరాబాద్‌ ఐపీఎల్‌ జట్టుకి ప్రకటనలు చేసే స్థాయికి కంపెనీని తీసుకొచ్చాను. అమ్మ నా విషయంలో ఎంతో సంతోషిస్తున్న రోజులవి. అప్పుడే తొలిసారి సినిమా కోసమంటూ ఓ కథ రాశాను. అది తనకి చూపిస్తే ‘ఇందులో పెద్దగా ఎమోషన్స్‌ లేవురా!’ అంది. ఆ తర్వాత రాసిన రెండో కథని ఎమోషన్స్‌తో నింపే రాశాను... నిజం చెప్పాలంటే అలా రాయాల్సి వచ్చింది... ఎందుకంటే అది మా అమ్మ మరణానికి సంబంధించిన కథ కాబట్టి!

దేవుడు లేడనుకున్నా...

2012 చివర్లో... మా అమ్మకి మహారాష్ట్రలోని మాండ్యకి బదిలీ అయింది. మూణ్ణెళ్ళ తర్వాత ఎడమవైపు ఛాతీ దగ్గర నొప్పి ప్రారంభమైందట. ప్రాథమిక పరీక్షలోనే అది రొమ్ము క్యాన్సర్‌ అని నిర్థారించారట వైద్యులు. అది కూడా మూడో స్టేజీలో ఉందన్నారట. అమ్మానాన్నలిద్దరూ ఇవేవీ మాకు తెలియనివ్వలేదు. మరో నెలకి అమ్మ మళ్ళీ చెన్నైకి బదిలీ చేయించుకుంది. సొంతగూటికి వచ్చినందుకు సంతోషించాల్సిందిపోయి... అమ్మ ముభావంగా ఉంటుండేది. తనలా ఉండటం, తరచూ ఆసుపత్రికి వెళ్ళి రావడం నాకెందుకో అనుమానం రేకెత్తించింది. నేను అడగబోయేలోపే... ఓ రోజు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని విషయం చెప్పింది. తను ఎంత మెత్తగా చెప్పినా... తనపట్ల విధి చూపిన కాఠిన్యాన్ని భరించలేకపోయాను. ‘నీకింత అన్యాయం చేస్తున్నాడంటే అసలు దేవుడే లేడు’ అంటూ పూజగదిలో ఉన్న పటాలన్నీ ఆవేశంతో బయట పడేశాను. ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ఆశతో నాకు తెలిసిన ఆసుపత్రుల చుట్టూ తిప్పాను. అందరూ ‘బాగా ఆలస్యమైపోయిందమ్మా!’ అనేవారే. అలా- ఎప్పుడూ కళగా ఉండే అమ్మ... కళ్ళెదుటే అస్థిపంజరమైపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. అమ్మేమో చాలా నిబ్బరంగా మృత్యువుని ఆహ్వానించేందుకు సిద్ధమైంది. కన్నీళ్లు పెట్టుకునేది కానీ వాటి వెనక మృత్యుభయంకన్నా... తను పోతే మేమేమవుతామోనన్న దిగులే ఎక్కువగా కనిపించేది. ఆ దిగులు చూసేకొద్దీ నాలో ఓ అపరాధభావన మొదలైంది. దాని గురించి చెప్పాలి...

‘అమ్మా... తననే పెళ్ళి చేసుకుంటా’

సింధుజ... ఇంజినీరింగ్‌లో నా క్లాస్‌మేట్‌. అప్పట్లోనే ప్రేమలో పడ్డాం. నేను నటన కోసమనీ, షార్ట్‌ఫిల్మ్‌ల కోసమనీ తిరుగుతూ ఉంటే తనే ఉద్యోగం చేస్తూ సాయపడుతుండేది. తనూ నేనూ అమ్మా కలిసి అప్పుడప్పుడూ షాపింగ్‌లకి వెళుతుండేవాళ్లం. సింధు మా ఫ్యామిలీకి ఇంత దగ్గరైనా సరే... ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానన్న విషయం అమ్మ దగ్గర దాచాను. అన్నీ తనతో పంచుకునే నేను ఈ మాట మాత్రం దాటవేస్తున్నానని అమ్మకి అర్థమైంది. నేనే చెబుతానని అనుకుందేమో నన్నెప్పుడూ అడగలేదు. క్యాన్సర్‌ వచ్చి అమ్మ మృత్యువు ఒడికి చేరుతున్నప్పుడైనా ఈ విషయం చెప్పలేకపోయాను. ఆ అపరాధభావన నాలో రోజురోజుకూ పెరుగుతూ పోయింది. ఓ దశలో ఉదయం సింధుజని ఆసుపత్రిలో ఉన్న అమ్మ దగ్గరకి తీసుకెళ్లాను. అప్పటికి కొన్నిగంటల ముందే తను మాట కోల్పోయింది. తను వింటోందో లేదో, విన్నా అర్థమవుతోందో లేదో తెలియని పరిస్థితుల్లో సింధుజ చేతిని తనచేతిలో పెట్టి... ‘అమ్మా, నేను తనని పెళ్ళి చేసుకుంటానమ్మా!’ అని చెప్పాను. ఆ తర్వాత వారానికి... అమ్మ కన్నుమూసింది!

ఒక్క ఛాన్స్‌ ఇస్తే...

అమ్మ పోయాక రెండేళ్లపాటు నేను మనిషిని కాలేకపోయాను. జీవితం నాకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళగలిగితే అమ్మకొచ్చిన క్యాన్సర్‌ని ముందే పసిగట్టేస్తాను కదా... సింధుజ సంగతి ముందే చెప్పేద్దును కదా... అనుకుంటూ ఏవేవో ఆలోచిస్తుండేవాణ్ణి. అందులో నుంచే ‘నాకో టైమ్‌ మెషిన్‌ ఉంటేనా?’ అన్న ఆశ మొదలైంది. అలా 2017 ప్రారంభంలో ‘ఒకే ఒక జీవితం’ కథ రాశాను! అమ్మ బర్త్‌డే అప్పుడు నేను విషెస్‌ చెబుతూ రికార్డు చేసిన క్యాసెట్‌ ఇవ్వడాన్ని నా సినిమాలోకి తీసుకొచ్చాను. టీ ఇచ్చిన ప్రతిసారీ చక్కెర కలపకుండా నాలుక్కరుచుకోవడం, కుక్కలపైన తనకున్న ప్రేమ, తను చేసే సాంబార్‌ వంటివన్నీ యథాతథంగా తీసుకొచ్చేశాను. ఈ సినిమాలో హీరో శర్వానంద్‌ పాత్రకీ, అతని తల్లి అమలకీ మధ్య- అతని ప్రేమకి సంబంధించిన డైలాగ్‌ ఒకటి ఉంటుంది. ఓ రకంగా మా అమ్మతో సింధుజ గురించి నేను జరిపి ఉండాల్సిన సంభాషణ కాబట్టి... అది రాస్తున్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా నేను అమ్మకి రాసిన స్మృతి లేఖలాంటిది. ఈ దృశ్యాలన్నీ తన కోసం నేను ఎంతో బాధతో రాసుకున్న వాక్యాల్లాంటివి. అందుకే, ఈ చిత్రం చివర్లో- ప్రేక్షకులందరూ ఉద్వేగంతో నిండిపోతారని నేను భావించిన క్షణాల్లో... నా పేరుని ఎండ్‌ టైటిల్‌గా పెట్టాను. దానికింద ‘సన్‌ ఆఫ్‌ పుష్పవతీ శేఖర్‌’ అని గర్వంగా రాసుకున్నాను!

ఫొటోలు: మధు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..