కూరకు.. కాస్త మసాలా దట్టిద్దామా!

విందు భోజనాల్లో మసాలా కూరలు ఉంటేనే మజా అని చెప్పేస్తుంటారు ఆహారప్రియులు. ముఖ్యంగా రోటీ, పులావ్‌ లాంటివాటికి అయితే... అవి తప్పనిసరిగా ఉండాల్సిందేనని పట్టుబట్టేవారికి ఈ కూరలు మంచి కాంబినేషన్‌ అవుతాయి.

Published : 24 Mar 2024 00:26 IST

విందు భోజనాల్లో మసాలా కూరలు ఉంటేనే మజా అని చెప్పేస్తుంటారు ఆహారప్రియులు. ముఖ్యంగా రోటీ, పులావ్‌ లాంటివాటికి అయితే... అవి తప్పనిసరిగా ఉండాల్సిందేనని పట్టుబట్టేవారికి ఈ కూరలు మంచి కాంబినేషన్‌ అవుతాయి.


కాజూ మసాలా

కావలసినవి: జీడిపప్పు: రెండు కప్పులు, ఉల్లిపాయలు: అయిదు, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: చెంచా, యాలకులు: నాలుగు, బిర్యానీ ఆకు: ఒకటి, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, కారం: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను, గరంమసాలా: చెంచా, వెన్న: టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు: కప్పు, క్రీమ్‌: రెండు టేబుల్‌స్పూన్లు ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ఓ గిన్నెలో మూడు ఉల్లిపాయలముక్కలు, ముప్పావుకప్పు జీడిపప్పు తీసుకుని పెద్ద కప్పు నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి... అయిదు నిమిషాలు ఉడికించి దింపేసి నీటిని పూర్తిగా వంపేయాలి. ఈ రెండింటినీ మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి మిగిలిన జీడిపప్పును వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి జీలకర్ర, యాలకులు, బిర్యానీఆకు, వెల్లుల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు తప్ప మిగిలిన పదార్థాలు, చేసుకున్న మసాలా వేసి కలిపి మూత పెట్టాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు అరకప్పు నీళ్లు, జీడిపప్పు వేసి కలిపి కూర దగ్గరకు అయ్యాక దింపేస్తే సరి.


ఎగ్‌ కర్రీ

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఆరు, నూనె: పావుకప్పు, పసుపు: పావుచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: రెండు, ఉల్లిపాయలు: రెండు, ఉప్పు: తగినంత, అల్లంతరుగు: రెండు చెంచాలు, వెల్లుల్లి తరుగు: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: రెండు, టొమాటో పేస్టు: అరకప్పు, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: అరచెంచా, సెనగపిండి: రెండు చెంచాలు, గరంమసాలా: ముప్పావుచెంచా, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం:  స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేయాలి. అది వేడెక్కాక పావుచెంచా కారం, పావుచెంచా ఉప్పు, పసుపు, ఉడికించిన గుడ్లు వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి.. ఎండుమిర్చి, ఉల్లిపాయముక్కల్ని వేయించాలి. అవి ఎర్రగా అవుతున్నప్పుడు గుడ్లు తప్ప మిగిలిన పదార్థాలు వేసి మరోసారి వేయించి కప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్లు వేసి కలిపి... అయిదు నిమిషాలయ్యాక స్టవ్‌ని కట్టేయాలి.


పనీర్‌తో...  

కావలసినవి: పనీర్‌: రెండువందల గ్రాములు (కాస్త పెద్ద ముక్కల్లా కోయాలి), నూనె: పావుకప్పు, జీలకర్ర: అరచెంచా, యాలకులు: రెండు, దాల్చినచెక్క: చిన్నముక్క, పచ్చిమిర్చి: రెండు, క్యాప్సికం: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, కారం: టేబుల్‌స్పూను, దనియాలపొడి: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, టొమాటోలు: రెండు, ఉప్పు: తగినంత, క్రీమ్‌: రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా, కసూరీమేథీ: చెంచా.  

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క వేయించుకుని పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయముక్కలు వేయాలి. ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగుతున్నప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, టొమాటో గుజ్జు, సన్నగా తరిగిన క్యాప్సికం, తగినంత ఉప్పు వేసి కలపాలి. టొమాటో గుజ్జు ఉడికాక క్రీమ్‌, కసూరీమేథీ, గరంమసాలా, పనీర్‌ముక్కలు వేసి కప్పు నీళ్లు పోసి, కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


చికెన్‌తో...

కావలసినవి: చికెన్‌: కేజీ, ఉల్లిపాయలు: మూడు, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, అల్లం పేస్టు: రెండు టేబుల్‌స్పూను, వెల్లుల్లి పేస్టు: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: రెండు చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, ఎండుమిర్చి: ఒకటి, బిర్యానీఆకులు: రెండు, దాల్చినచెక్క: చిన్నముక్క, యాలకులు: ఆరు, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర తరుగు: అరకప్పు.  

తయారీవిధానం: చికెన్‌ ముక్కలపైన టేబుల్‌స్పూను చొప్పున అల్లం, వెల్లుల్లి పేస్టు, అరచెంచా కారం, పసుపు, సగం చొప్పున జీలకర్రపొడి - దనియాలపొడి, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు వేయించుకుని మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో గుజ్జు వేసి కలపాలి. ఈ మసాలా ఉడికాక చికెన్‌, కసూరీమేథీ, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్‌, కసూరీమేథీ, కొత్తిమీర వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి.. చికెన్‌ ఉడికాక స్టవ్‌ని కట్టేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..