మధుబనీ... ఓ అందమైన ఫ్యాషన్‌

‘కళలూ ఫ్యాషన్లూ చూడ్డానికి వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ ఆ రెండిటిదీ విడదీయలేని బంధం...’ అని చెబుతారు నయా ఫ్యాషనిస్టులు. అందుకే ఒకప్పటి కళలన్నీ నేటి ఫ్యాషన్లలో అందంగా ఒదిగిపోతున్నాయి.

Published : 19 Nov 2022 23:27 IST

మధుబనీ... ఓ అందమైన ఫ్యాషన్‌

‘కళలూ ఫ్యాషన్లూ చూడ్డానికి వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ ఆ రెండిటిదీ విడదీయలేని బంధం...’ అని చెబుతారు నయా ఫ్యాషనిస్టులు. అందుకే ఒకప్పటి కళలన్నీ నేటి ఫ్యాషన్లలో అందంగా ఒదిగిపోతున్నాయి. మిథిలా నగరంలో పుట్టి పెరిగిన ‘మధుబనీ’ చిత్రకళ కూడా ఆ కోవకే చెందుతుంది. సరిహద్దుల్ని దాటుకుని అంతర్జాతీయ ఫ్యాషన్‌ ర్యాంప్‌లమీదా ఇంటీరియర్‌ డిజైన్లలోనూ ట్రెండీ ఫ్యాషన్‌గా ఎందరినో ఆకర్షిస్తోంది.

ఫ్యాషన్లు వస్తుంటాయి... పోతుంటాయి. కానీ కళలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అందుకేనేమో ఈమధ్య డిజైనర్లు రోజురోజుకీ మారిపోయే ఫ్యాషన్ల చక్రంలోకి ఒకప్పటి కళలను కోరి మరీ తెస్తున్నారు. కలంకారీ, పిఛ్‌వాయీ, మధుబనీ... ఇవన్నీ అలా వస్తున్నవే. అందులో భాగంగానే ఇప్పుడు నెట్టింట్లోనూ దుకాణాల్లోనూ మధుబనీ హ్యాండ్‌ పెయింటింగ్‌ దుస్తులూ యాక్సెసరీలూ హల్‌చల్‌ చేస్తున్నాయి.ఒకప్పుడు మధుబనీ చిత్రం ఇంటి అలంకరణకే పరిమితం. బిహార్‌, నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న మిథిలా ప్రాంతానికి చెందిన మహిళలు సహజ రంగుల్లో సన్నని కొమ్మలూ బ్రష్‌లూ అగ్గిపుల్లలూ లేదా వేలి కొనల్నీ ముంచి రకరకాల బొమ్మలతో కూడిన చిత్రాల్ని గోడలమీద చిత్రించేవారు. పండగలూ పెళ్లి వేడుకల సమయంలో- ఇంటి గోడలమీదా అలికిన నేలమీదా వాటిని తప్పక వేసుకునేవారట. 1960లలో ఓ విదేశీ కళాకారుడు ఆ గోడ చిత్రాలను చూసి ముగ్ధుడై వాటిని కాగితం మీద గీయించుకుని తీసుకెళ్లడంతో ఈ కళ ప్రపంచానికి పరిచయమైంది. అప్పటినుంచీ స్థానిక మహిళలు వంశపారంపర్యంగా అబ్బిన తమ కళని కాన్వాస్‌మీదా మందపాటి వస్త్రంమీదా కూడా గీయడం ప్రారంభించారట. అది కాస్తా రాజకీయ నాయకుల్నీ చిత్రకారుల్నీ ఆకర్షించడంతో మిథిలా పెయింటింగ్‌గానూ మధుబనీ కళగానూ ప్రాచుర్యం చెందింది. క్రమంగా దేశ, విదేశీ ఫ్యాషన్‌ డిజైనర్లనీ ఈ కళ ఆకట్టుకోవడంతో దుస్తులమీదకీ వచ్చింది. గోధుమ రంగుమీద ఈ చిత్రాలు కొట్టొచ్చినట్లు కనిపించడంతో మధుబనీ చిత్రానికి టస్సర్‌ సిల్కు అద్భుతమైన కాన్వాస్‌గా మారిపోయింది.

ఎలా వేస్తారు?

బియ్యప్పిండిలో సహజ రంగుల్ని కలిపి గీసే ఈ చిత్రాల్లో ప్రకృతిలో కనిపించే పక్షులూ జంతువులూ చెట్లతోపాటు పురాణాల్లోని దేవీదేవతల బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. భారతీయులు పవిత్రమైనదిగా భావించే తులసిమొక్కతోపాటు గౌతముడు జ్ఞానాన్ని పొందిన రావి వృక్షాన్నీ విధిగా గీస్తుంటారు. వీటితోపాటు రేఖా గణిత చిత్రాల్నీ రాజులకాలంనాటి కొలువుల్నీ వివాహవేడుకల్నీ రమణీయంగా చిత్రిస్తుంటారు. మధుబనీ చిత్రం తాంత్రిక సంస్కృతిని ప్రతిబింబిస్తుందనీ అంటారు. ఎందుకంటే మిథిలా ప్రాంతం పూర్వం నుంచీ తాంత్రిక విద్యలకు పేరొందింది.నిజానికి ఈ కళ రామాయణ కాలంనాటిది అంటుంటారు. అప్పట్లో జనక మహారాజు సీతారాముల కల్యాణంకోసం ఊరంతా అలంకరించమని చెప్పడంతో- ఇంటి గోడలమీద రంగులతో బొమ్మలు వేయడం ద్వారా ఈ కళ మొదలైందట. ఆ సంప్రదాయం మిథిలా ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తోంది. ఈ చిత్రం వేసేముందు కూడా మహిళలు ప్రార్థన చేస్తారట. ముఖ్యంగా కొత్త జంట నివసించే పడకగదిలో మధుబనీ చిత్రం ఉంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. అందుకే మధుబనీ చిత్రాన్ని ప్రేమకీ సంతాన సాఫల్యతకీ చిహ్నంగానూ భావిస్తారు. ఈ నమ్మకం ఆనోటా ఈనోటా అంతటా పాకి ఆధునిక ఇళ్లలోనూ మధుబనీ చిత్రాన్ని వేయించుకునేంతగా ప్రాచుర్యం పొందింది. ప్రార్థనా మందిరంలోనూ ఈ చిత్రాల్ని ఉంచుతున్నారు.

అయితే, మధుబనీ... కళ మాత్రమే కాదు, ఓ ఉద్యమం కూడా అని చెప్పాలి. 2012లో బిహార్‌లోని గ్రామాల్లో రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను నరికేయడంతో అక్కడ ‘గ్రామ్‌ వికాస్‌ పరిషత్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోన్న షష్టినాథ్‌ ఝా వాటిని కాపాడేందుకు మధుబనీ చిత్రాల్నే ఆయుధంగా చేసుకున్నాడట. రామాయణ, మహాభారత దృశ్యాలతో ఉండే ఈ కళలో చెట్లూ చిత్రంలో భాగంగా ఉండేవి. అవి లేకపోతే మనిషికి మనుగడ లేదన్న విషయం అందరికీ అర్థమయ్యేలా మధుబనీ చిత్రాల్లో మిగిలిన బొమ్మలకన్నా చెట్లే ఎక్కువగా చిత్రించేలా చేశాడట ఝా. అందుకే చెట్టులేని మధుబనీ చిత్రం ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మధుబనీ చిత్రాలకు సంబంధించి మిథిలా ప్రాంతానికి చెందిన ఎంతోమంది మహిళా కళాకారులు ఎన్నో అవార్డుల్నీ అందుకున్నారు.

దీనికితోడు భారతీయ రైల్వే బిహార్‌లోని సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కి వేయించిన మధుబనీ ఆర్ట్‌ని చూసి ఐక్యరాజ్య సమితి సైతం ‘ఎంతో అందంగా ఉంద’ని ట్విటర్‌ ద్వారా ప్రశంసించింది. అదొక్కటే కాదు, పట్నా-రాజధాని, జనసాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపెట్టెలు కూడా మధుబనీ చిత్రాలతో కళకళలాడుతుంటాయి. మధుబనీ నగరంలోని రైల్వేస్టేషన్‌తోపాటు అక్కడి ప్రభుత్వ భవనాలన్నింటినీ ఈ చిత్రాలతోనే తీర్చిదిద్దుతున్నారు. బిహార్‌లోని మిగిలిన స్టేషన్లని కూడా ఈ పెయింటింగులతోనే ఆకర్షణీయంగా మార్చనున్నారట. ఈ పెయింటింగులతో అనేక స్టాంపుల్నీ విడుదల చేసింది కేంద్రప్రభుత్వం.

ఫ్యాషన్‌ చిత్రం!

జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, అమెరికా... వంటి దేశాల్లోనూ క్రేజీగా మారిన ఈ చిత్ర కళను చూశాక మన ఫ్యాషన్‌ డిజైనర్లు మాత్రం మనసు పారేసుకోకుండా ఎలా ఉండగలరు... తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ చీరలూ డ్రెస్సులూ లెహంగాలూ శాలువాలూ స్టోల్సూ దుపట్టాలమీద స్థానిక కళాకారులతో మధుబనీ చిత్రాల్ని వేయిస్తున్నారు. పైగా బరువైన ఎంబ్రాయిడరీలతో విసుగెత్తిన అమ్మాయిలకు ఈ మధుబనీ బొమ్మలతో చిత్రించిన బ్లౌజులూ చీరలూ తేలికగా ఉండి ఎంతగానో నచ్చేస్తున్నాయట. పైగా ఇవన్నీ సహజమైన టస్సర్‌ సిల్కుమీదే రావడంతో సౌకర్యంగానూ కళ్లకీ హాయిగానూ ఉంటున్నాయి. హ్యాండ్‌ పెయింట్‌ చేసిన మధుబనీ టస్సర్‌ సిల్క్‌ చీరలు సాధారణంగా ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకూ ఉన్నాయి. కానీ సిల్కు నాణ్యత వల్లో డిజైనర్‌ కారణంగానో తెలియదుకానీ కొన్ని చీరల ఖరీదు లక్షల్లోనూ ఉండటం విశేషం. కొవిడ్‌ సమయంలో మధుబనీ మాస్క్‌లు సైతం క్రేజీగా అమ్ముడుపోయాయి. కుషన్లూ బ్యాగులూ పెన్‌కేస్‌లూ డెయిరీలూ... ఇలా నిత్య జీవితంలో వాడుకునే ఎన్నో వస్తువులు సైతం మధుబనీ అందాల్ని అద్దుకుంటున్నాయి. ఈ చిత్రాల క్రేజ్‌ ఎంతగా వచ్చిందంటే సాదాసీదా దుస్తులమీదా మధుబనీ బొమ్మల్ని డిజిటల్‌ ప్రింటింగ్‌తో ముద్రించేస్తున్నారు మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..