నమ్మండీ... ఇవి చాక్లెట్లండీ!

కూతురి బర్త్‌డే పార్టీకని స్నేహితురాలు లీలనీ, ఆమె పిల్లల్నీ ఆహ్వానించింది రూప. కేక్‌ కటింగ్‌ అయ్యాక ఆ ముక్కలతోపాటు కారం అంత మందాన చల్లిన చిన్న లెగ్‌పీసులూ, పచ్చి స్వీట్‌కార్న్‌, కుండ బిర్యానీ...

Published : 21 Apr 2024 00:31 IST

కూతురి బర్త్‌డే పార్టీకని స్నేహితురాలు లీలనీ, ఆమె పిల్లల్నీ ఆహ్వానించింది రూప. కేక్‌ కటింగ్‌ అయ్యాక ఆ ముక్కలతోపాటు కారం అంత మందాన చల్లిన చిన్న లెగ్‌పీసులూ, పచ్చి స్వీట్‌కార్న్‌, కుండ బిర్యానీ... ఇలా రకరకాల పదార్థాలను ఉంచిన ప్లేట్లను ఇంటికొచ్చిన పిల్లలందరికీ ఇచ్చింది రూప. కారం తినని పిల్లలు ఆ లెగ్‌ పీసులు ఎలా తింటారోనని లీల అనుకుంటుండగానే నోట్లో పెట్టుకుని చప్పరించేస్తున్నారు. ఉడికిందో లేదో సంబంధం లేకుండా స్వీట్‌ కార్న్‌ను ఆస్వాదిస్తున్నారు. కుండ బిర్యానీని ప్లేటుతో సహా తినేస్తున్నారు. ఆశ్చర్యంగా చారెడేసి కళ్లతో ఆ దృశ్యాన్ని చూసిన లీల కూడా వాటిని నోట్లో పెట్టుకుంటే తెలిసింది అవి చాక్లెట్లు అని. రూపం మార్చుకుని నోరు తీపి చేయడానికి  వచ్చిన ఆ సరికొత్త రుచులపైన మనమూ ఓ లుక్కేద్దామా!

చాక్లెట్‌ పేరెత్తితేనే పిన్నల నుంచి పెద్దల వరకూ నోరూరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా చిన్నారులకు ఇదొక తీపి తాయిలం....అందుకే పిల్లలున్న ఇళ్లకు వెళ్లేటప్పుడు వారి కోసం అవే కొనేస్తుంటారు చాలామంది. పుట్టినరోజులకైనా, క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చినా, స్నేహితులకు బహుమతిగా ఇవ్వాలన్నా అవే గుర్తొస్తాయి. చిన్నారులకు సంబంధించిన ప్రతి వేడుకలోనూ పెద్ద పీట వేసే ఈ చాక్లెట్లు ఇప్పుడు కొత్త అవతారమెత్తాయి. సరికొత్త లుక్‌లో చూపర్లను ఆకట్టుకుంటూ పిల్లలకోసం సందడి చేయడానికి మార్కెట్‌లోకి వచ్చాయి.
సాధారణంగా చాక్లెట్లను పాలూ, చక్కెర, పాలపొడి, కోకోపొడి తదితరాలతో తయారు చేస్తారు. వాటికి ఎడిబుల్‌ రంగులు కూడా జోడించి పలు వర్ణాల్లోనూ తయారు చేస్తుంటారు చాక్లెట్‌ ఆర్టిస్టులు. ఆ పదార్థాలతోనే చాక్లెట్లు తయారు చేస్తూ కాస్త సృజననీ జోడించి పిల్లల్నీ, పెద్దల్నీ ఆశ్చర్యపరిచేలా భిన్నమైన రూపాల్లో డిజైన్‌ చేస్తున్నారు.  

భిన్న ఆకృతుల్లో...

పాలిమర్‌ క్లే, క్లే, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌(పీఓపీ) మెటీరియల్‌తో చాలామంది మీనియేచర్‌ ఆహారపదార్థాలను తయారు చేస్తుంటారు. అవి క్రమంగా షోకేసుల్లోనూ, పిల్లల ఆట వస్తువుల్లోనూ చేరిపోయి సందడి చేస్తున్నాయి. వాటికే అయస్కాంతాన్ని జత చేసి ఫ్రిజ్‌లకు అతికించుకుని అలంకరణలోనూ భాగం చేశారు. ప్రతి చోటా ఎంతో ఆదరణ పొంది ముద్దుగా కనిపించే ఈ మీనియేచర్‌ ఫుడ్‌ ఆకృతిలోనే చాక్లెట్లను కూడా రూపొందించడం మొదలుపెట్టారు చాక్లెట్‌ మేకర్లు. అరచేతిలో ఒదిగిపోయే పిజాలూ, బర్గర్లూ, స్వీట్లూ, టిఫిన్‌ ప్లేట్లూ, థాలీలూ, బ్రెడ్‌ ఆమ్లెట్‌లూ... తదితర ఆకృతుల్లో తయారు చేస్తున్నారు. ఎడిబుల్‌ రంగులను పాలపొడీ, చక్కెర పొడిలో కలిపి చేయడం వల్ల ఆ పదార్థాలూ చాలా సహజ సిద్ధంగానూ అనిపిస్తాయి. తింటేనే అవేంటో తెలిసేంత సహజంగా వీటిని చేస్తున్నారు. పిల్లల పుట్టినరోజునాడు క్లాస్‌లో ఈ తరహా చాక్లెట్లు ఇచ్చి చూడండీ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అలానే స్నేహితులకు ఇష్టమైన ఆహార పదార్థాల ఆకృతిలో కస్టమైజ్‌ చేసి వారికి బహుమతిగా ఇచ్చినా బాగుంటాయి ఈ మీనియేచర్‌ ఫుడ్‌ చాక్లెట్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..