రెడీమేడ్‌ సలాడ్లు వచ్చేశాయ్‌!

సలాడ్లు సంపూర్ణ ఆహారమని చెప్పినా, వీటివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిసినా... తీరికలేక తినడానికి బద్ధకించేవాళ్లెందరో. అలాంటివారి కోసమే ఇప్పుడు మార్కెట్లో రకరకాల రెడీమేడ్‌ సలాడ్‌ కిట్స్‌ దొరుకుతున్నాయి.

Published : 18 May 2024 23:55 IST

సలాడ్లు సంపూర్ణ ఆహారమని చెప్పినా, వీటివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిసినా... తీరికలేక తినడానికి బద్ధకించేవాళ్లెందరో. అలాంటివారి కోసమే ఇప్పుడు మార్కెట్లో రకరకాల రెడీమేడ్‌ సలాడ్‌ కిట్స్‌ దొరుకుతున్నాయి. మన అవసరాలకు తగ్గట్టు పోషకాల్ని అందిస్తూ అందుబాటులో ఉన్నాయివి!

కప్పుడు సలాడ్‌ అంటే పండ్ల ముక్కలే ముందుగా గుర్తొచ్చినా ఇప్పుడు దాని పక్కన వెజ్‌ సలాడ్‌, గ్రీన్‌ సలాడ్‌, మిక్స్‌డ్‌ సలాడ్‌ అంటూ బోలెడన్ని వెరైటీలు చేరిపోయాయి. ఇదివరకు హోటళ్లలోనే ఎక్కువగా వినిపించే సలాడ్‌ అన్నమాట ఇప్పుడు- ప్రతి ఇంటా ఆహారంలో భాగమైపోయింది. సలాడ్లతో పోషకాలన్నీ యథాతథంగా అందుతాయని చెబుతూ... బరువు తగ్గడానికని ఒకరూ, ఆరోగ్యానికి మంచిదంటూ మరొకరూ- ఈమధ్య వీటిని ఇష్టంగా తినేస్తున్నారు.

తినడం సరే, కానీ ఏవో ఒక నాలుగు పచ్చి ముక్కలు కలిపితే సలాడ్‌ అయిపోదుగా. మామూలుగా కీరా, క్యారెట్లను ముక్కలుగా చేసుకుని తినడమే ఇబ్బంది. అలాంటిది రకరకాల కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లని నిదానంగా ముక్కల్లా చేసుకుని, వాటికి ఇతర పదార్థాల్ని కలుపుతూ సలాడ్‌ తయారుచేసుకోవడమంటే క్షణాల్లో అవదు. పైగా హోటళ్లలోలా కమ్మటి రుచి కోసం ఇంట్లోనే సలాడ్‌ డ్రెస్సింగ్‌ చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అదీ రోజూ సలాడ్‌ చేసుకోవాలంటే కాస్త సమయం పెట్టాల్సిందే. అందుకే- ప్రొటీన్లూ పీచు అందిస్తూ కొవ్వును తగ్గించే ఈ సలాడ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిసినా కొందరు వాటి జోలికి వెళ్లడమే మానేస్తారు. ఇప్పుడా ఆ ఇబ్బందిని పోగొట్టేలా వచ్చినవే ఈ రెడీమేడ్‌ సలాడ్లు. విడివిడిగా ఒక్కొక్కరి అవసరాలకు తగ్గట్టుగానూ అందుబాటులో ఉన్నాయివి. లెట్యూస్‌, పాలకూర, రాకెట్‌ లీవ్స్‌తో గ్రీన్‌ సలాడ్లు... క్యాబేజీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, దోసకాయ, ఉల్లిపాయ, టొమాటోలతో వెజిటెబుల్‌ సలాడ్లు... రకరకాల నట్స్‌, సీడ్స్‌, మొలకెత్తిన గింజల్లాంటివాటితో ప్రొటీన్‌ సలాడ్లు... ఇంకా అవకాడో, దానిమ్మ, పైనాపిల్‌, బత్తాయి, నారింజ, ద్రాక్ష పండ్లతో ఫ్రూట్‌ సలాడ్లు... మైక్రోగ్రీన్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు కలుపుతూ చేసే మిక్స్‌డ్‌ సలాడ్లన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. ఆర్గానిక్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌, ప్రొటీన్‌ గ్రీన్స్‌ పేర్లతో రోజూ మనం కోరుకున్న సలాడ్‌ బౌల్స్‌ను అందించే సంస్థలూ ఉన్నాయి. ఇవి కేవలం పచ్చిముక్కల్లానే కాకుండా సలాడ్‌ డ్రెస్సింగ్‌తో అప్పటికప్పుడు కలిపి తినేలా ఉంటాయి. వినెగర్‌, ఆలివ్‌ నూనె, నువ్వుల నూనె, నిమ్మరసం, సోయాసాస్‌, తేనె, ఆవపొడి, మిరియాల పొడి, ఉప్పులాంటి వాటితో చేసే ఈ డ్రెస్సింగ్‌లన్నీ సలాడ్లకు కమ్మదనం తెస్తాయి.

కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లూ తాజాగానే తినాలి కదా అన్న సందేహమేమీ అక్కర్లేదు. వారం రోజుల పాటు నిల్వ ఉండేలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే వీటిని ప్యాక్‌ చేస్తారు. కొన్ని సంస్థలేమో వీటిని ప్రీ-ఆర్డర్‌మీద మనకు అందిస్తుంటాయి. మరెందుకాలస్యం... సలాడ్‌ చేసుకోవడానికి సమయం లేనివారు ఈ రెడీమేడ్‌ కిట్స్‌ను ఒకసారి ట్రై చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..