కొప్పు క్లిప్పు ఇది!

అమ్మాయిలందరూ డ్రెస్సుకు తగ్గట్టు జుత్తు అలంకరణ చేసుకోవడం అనేది మామూలే. ఆ ముచ్చటలో భాగంగానే కొన్నిసార్లు కొప్పులూ వేసుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రమే సులువుగా ఎంతో అందంగా ముడి వేసుకునే నైపుణ్యం ఉంటుంది.

Published : 19 Nov 2022 23:41 IST

కొప్పు క్లిప్పు ఇది!

అమ్మాయిలందరూ డ్రెస్సుకు తగ్గట్టు జుత్తు అలంకరణ చేసుకోవడం అనేది మామూలే. ఆ ముచ్చటలో భాగంగానే కొన్నిసార్లు కొప్పులూ వేసుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రమే సులువుగా ఎంతో అందంగా ముడి వేసుకునే నైపుణ్యం ఉంటుంది. చాలామంది ఇతరులతో వేయించుకుంటుంటారు. ఇప్పుడు అలాంటివారికోసమే మంచి పరిష్కారం చూపిస్తూ ‘హెయిర్‌ బన్‌ టూల్స్‌’ దొరుకుతున్నాయి. పొడవైన క్లిప్పుల్లా ఉండి మధ్యలో రంధ్రంతో ఉంటాయివి. ఇక్కడ ఫొటోలో చూపినట్టు క్లిప్పులోని ఖాళీలోంచి జుత్తును బయటకు తీసి, మళ్లీ పైవరకూ మడిచి ఆఖర్లో రెండు చివర్లను కలిపితే... క్షణాల్లో ఎలాంటి శ్రమా లేకుండానే చూడచక్కని కొప్పు తయారైపోతుంది. ఈ బన్‌ మేకర్‌లోనే రకరకాల వెరైటీలూ అందుబాటులో ఉన్నాయి.


ఛార్జర్‌ బ్రేస్‌లెట్‌ బాగుందా!

ఫోన్‌ అనేది ఇప్పుడో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందుకే చాలామంది ఫోన్‌తోపాటూ ఛార్జర్‌ కేబుల్నీ జతగా తీసుకెళుతుంటారు. అది గుర్తించే వినియోగదారులకు వెసులుబాటును కల్పించడానికి తయారీదారులు బోలెడన్ని ఛార్జర్‌ కేబుళ్లనీ మార్కెట్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి... ఈ ‘బ్రేస్‌లెట్‌ యూఎస్‌బీ కేబుల్‌’. రకరకాల మోడళ్లలో ఉండే ఈ కేబుల్‌ బ్రేస్‌లెట్‌ని సరదాగా చేతికీ పెట్టుకోవచ్చు, లేదంటే ఫోన్‌కే అలా యాక్సెసరీలా పెట్టేయొచ్చు. అవసరమైనప్పుడు ఎంచక్కా తీసి ఛార్జర్‌లానూ వాడుకోవచ్చు. అన్ని రకాల ఫోన్లకు సంబంధించిన పిన్నులతో అందుబాటులో ఉన్నాయివి.    


నాణెంలో వీడియో!

ప్రియమైన వారికి సరికొత్తగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వీడియో గ్రీటింగ్‌ కార్డుల గురించి వినుంటారు, చూసి ఉంటారు. వాటికి కాస్త భిన్నంగా ఇప్పుడు మరింతగా ఆశ్చర్యపరచడానికి ‘వీడియో గ్రీటింగ్‌ కాయిన్‌’ వచ్చింది. ‘అవుగ్రావ్‌’ అనే జ్యువెలరీ సంస్థ ఈ సరికొత్త నాణేల్ని తీసుకొచ్చింది. వెండీ, బంగారు నాణేల్లోనే వీడియో కనిపించేలా తయారుచేస్తోంది. నాణెం మీదున్న క్యూఆర్‌ కోడ్‌ని ఫోన్‌తో స్కాన్‌ చేస్తే చాలు... అందులో దాగున్న వీడియో తెరమీద కనిపిస్తుంది. పండుగ శుభాకాంక్షలో, మరేదైనా పాటనో మనకు నచ్చిన దాన్ని అలా చేయించుకోవచ్చు. బహుమతి అందుకునేవారి ఇష్టాయిష్టాల్ని బట్టి ఆర్డర్‌ ఇచ్చి ఈ వీడియో కాయిన్లను తయారు చేయించుకోవచ్చు. కాగితపు గ్రీటింగ్‌ కార్డులకు బదులు  ఎప్పటికీ ఉండిపోయే ఈ లోహపు వీడియోల్ని పదికాలాలపాటు పదిలంగా దాచుకోవచ్చు, ఏమంటారు?


గోడ అంతా గీసుకోవచ్చు!

చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రంగుల పెన్ను వారి చేతికి దొరికిందంటే చాలు, గోడల మీదా, నేలపైనా ఎక్కడపడితే అక్కడ గీసేస్తుంటారు. అలా రాసుకోవడానికి పిల్లల కోసమే ప్రత్యేకంగా ‘బ్లాక్‌, వైట్‌ బోర్డులు’ పెట్టించినా సరే, మిగతా గోడలపైనా రాయడం ఆపరు. అందుకే ‘స్మార్ట్‌ మ్యాగ్నెటిక్‌ వైట్‌బోర్డ్‌ వాల్‌పేపర్స్‌’ మార్కెట్లోకి వచ్చాయి. సన్నని కాగితంలా ఉండే వీటిని గోడలపైన మనకు కావాల్సినట్టు అతికించేసుకోవచ్చు. గోడకు పూర్తిగా అతుక్కుపోయి చూస్తే గోడలానే కనిపిస్తుంది. పిల్లలు మామూలుగా దానిపైన రాసినా, బొమ్మలు గీసినా మళ్లీ సులువుగా చెరిపేసుకోవచ్చు, వద్దనుకుంటే- స్టిక్కర్‌ తీసేసినంత ఈజీగానే తొలగించుకోవచ్చు. మొత్తానికి ఈ వాల్‌పేపర్‌ వైట్‌ బోర్డు భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..