వీటిని మనమూ పెంచేద్దామా!

వంటింట్లో ఉండే పదార్థాలతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు మహిళలు. మరి వారికి కొత్త రకమైన  కూరగాయలు దొరికాయంటే ఊరుకుంటారా... ఎన్నో రకాల వెరైటీలు చేసి ఇంటిల్లిపాదికీ రుచి చూపిస్తారు.

Updated : 09 Jun 2024 06:58 IST

వంటింట్లో ఉండే పదార్థాలతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు మహిళలు. మరి వారికి కొత్త రకమైన  కూరగాయలు దొరికాయంటే ఊరుకుంటారా... ఎన్నో రకాల వెరైటీలు చేసి ఇంటిల్లిపాదికీ రుచి చూపిస్తారు. అలాంటి వారికోసమే ఈ కొత్త పదార్థాల పరిచయం.


 ఇవీ బీన్సే!

బీన్స్‌ జాతికి చెందిన వెరైటీలు అనగానే మనకు గోరుచిక్కుడు, ఫ్రెంచ్‌బీన్స్‌, చిక్కుడుకాయలే గుర్తొస్తాయి కదూ... ఇప్పుడు ఆ బీన్స్‌ కుటుంబం నుంచి మరో కూరగాయ కూడా వచ్చేసింది. అదే ‘క్లోవ్‌బీన్స్‌’. గబుక్కున చూడగానే పచ్చిలవంగ మొగ్గలా లేదంటే మల్లె మొగ్గలా కనిపించే ఈ క్లోవ్‌బీన్స్‌ను కూరల్లో, సలాడ్ల తయారీలో, పులావ్‌లలో వాడతారు. వీటితో బజ్జీలు కూడా చేసుకుంటారు కొందరు. ఆకుపచ్చ, ఊదా రంగుల్లో వచ్చే ఈ బీన్స్‌ తీగ అచ్చం చిక్కుడు తీగలానే ఉంటుంది. ఈ కాయలు కోయకపోతే వాటి చివరి నుంచి పువ్వులు వస్తాయి.

తియ్యగా ఉండే ఆ పువ్వుల్ని కూడా సలాడ్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ లవంగబీన్స్‌లోనూ పువ్వుల్లోనూ విటమిన్‌ సి తోపాటు పీచు, పొటాషియం, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, థయామిన్‌, సల్ఫర్‌, ఐరన్‌ వంటి పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే ఈ బీన్స్‌ను బరువు తగ్గేందుకూ సూచిస్తున్నారు వైద్యులు.


నిమ్మ ఎంత తీపో!

నిమ్మకాయను వంటకాల్లో వాడతాం, జ్యూస్‌ల రూపంలో తీసుకుంటాం తప్ప నేరుగా తినడానికి సాహసించం. ఎందుకంటే అది ఎంత పుల్లగా ఉంటుందో తెలుసు కాబట్టి. అలాంటి నిమ్మకాయ ఇప్పుడు తియ్యగా నోరూరించేస్తోంది. హైబ్రిడ్‌ రేగుపండ్లు, ద్రాక్ష తరహాలో కనిపించే ఈ స్వీట్‌లైమ్‌ పండుతోపాటు తొక్క కూడా మధురంగా ఉంటుంది. సాధారణ నిమ్మకాయలతో పోలిస్తే విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా అందించే ఈ స్వీట్‌లైమ్‌ ఆకుపచ్చ, పసుపు, కాషాయ రంగుల్లో వస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటూ శ్వాస సంబంధ సమస్యల్ని నివారిస్తుంది.

ఈ పండ్లను నేరుగా తినొచ్చు... జ్యూస్‌లూ, సలాడ్ల తయారీలోనూ వాడుకోవచ్చు. పచ్చడి రూపంలోనూ పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మన దగ్గరా దొరుకుతున్న ఈ నిమ్మకాయల్ని పెరట్లో పెంచుకోవడం కూడా సులువే. వీటి గింజల్ని నాటితే బొన్సాయ్‌ మొక్క తరహాలోనే పెరిగి... రెండేళ్లకే గుత్తులుగా కాయలు కాస్తాయి... ఏడాదంతా పండ్లూ చేతికొస్తాయి.


కుండీల్లో చింతపండు!

పులుసులకీ, కొన్నిరకాల కూరలకీ, పచ్చళ్లకీ పుల్లని రుచిని తెచ్చేందుకు చింతపండును వాడుతుంటాం కదా.. అదే చింతపండు వంటకానికి సువాసనను కూడా అదనంగా తెస్తే ఎలా ఉంటుందంటారూ... అదే మరి ‘మలబార్‌ టామరిండ్‌’ ప్రత్యేకత. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చేపల వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ చింతపండు ఇప్పుడు మనదగ్గరా దొరికేస్తోంది. మినీ గుమ్మడికాయలా ఉండే ఈ మలబార్‌ చింతకాయ మొదట ఆకుపచ్చ రంగులో కనిపించినా... పండిన తరువాత పసుపురంగులోకి మారుతుంది. అప్పుడు దాన్ని కోసి లోపలి గింజల్ని తీసేసి ఎండబెట్టడంతో నల్ల చింతపండు తరహాలోకి మారుతుంది. దాన్నే వంటల్లో వాడతారు. ఈ చింతపండును అచ్చంగా అలాగే వాడుకోవచ్చు లేదంటే పొడి, సిరప్‌రూపంలోనూ దొరుకుతుంది. అంతేకాదు, ఇది బాగా పుల్లగా ఉండి ప్రత్యేకమైన సువాసనతో కూడుకుని ఉండటం వల్ల వంటకాలు- ముఖ్యంగా  చేపల వంటకాలు- అద్భుతంగా ఉంటాయట. దీన్ని నిత్యం కూరలూ, పచ్చళ్ల తయారీలో ఉపయోగించడం వల్ల జీర్ణసమస్యలు అదుపులో ఉండటంతోపాటు ఇన్సులిన్‌ ఉత్పత్తీ వృద్ధి అవుతుంది. ఔషధాల తయారీలోనూ విరివిగా ఉపయోగించే ఈ చింతను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..