ప్రచారం నిషిద్ధం... ఓటుకు సిద్ధం!

ఒక్క ఓటు వేసే రోజు తప్ప, ఎన్నికల హడావుడి అస్సలు కనిపించదు... ప్రచారమే కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించిన చిన్న పోస్టర్‌ని కూడా అక్కడ చూడలేం.

Updated : 05 May 2024 17:19 IST

ఒక్క ఓటు వేసే రోజు తప్ప, ఎన్నికల హడావుడి అస్సలు కనిపించదు... ప్రచారమే కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించిన చిన్న పోస్టర్‌ని కూడా అక్కడ చూడలేం...ఎందుకంటే, ఆ గ్రామంలో రాజకీయ ప్రచారం పూర్తిగా నిషిద్ధం మరి... కానీ ఓటు వేయకపోతే మాత్రం జరిమానా విధిస్తారు... ఒకవైపు ప్రచారం వద్దంటూ మరోవైపు వందశాతం ఓట్లు వేస్తున్న ఈ ఊరి ప్రత్యేకతలు ఇంకా చాలానే ఉన్నాయి!

 ఊరి కట్టుబాట్లు అంటే చాలావరకూ పండుగలు, వేడుకలు జరుపుకోవడానికీ ఊరంతా కలిసికట్టుగా తమ సంప్రదాయాలు పాటించడానికీ మాత్రమే పెట్టుకుంటారు. కానీ గుజరాత్‌లోని రాజ్‌సమాధియాలా ఊళ్లో మాత్రం కట్టుబాట్లన్నీ ఆ ఊరు బాగుకే. పెట్టుకున్న జరిమానాలన్నీ అందరూ సంతోషంగా ఉండటం కోసమే. పాత పద్ధతులు పాటిస్తూనే నేటి కాలానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ పల్లె- ఆ విశేషాల వల్లే మరెన్నో ఊళ్లకు ఆదర్శవంతమయ్యింది.
గ్రామంలో అడుగుపెట్టగానే పంచాయతీ కార్యాలయం దగ్గర పెద్ద బోర్డు కనిపిస్తుంది. అందులో అందరూ ఎలా నడుచుకోవాలో కొన్ని నియమాలూ,
వాటిని ఉల్లంఘిస్తే విధించే రుసుముల జాబితా ఉంటాయి. ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచీ ఆ నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకుంటున్నారట. మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ కట్టుబాట్ల విషయానికి వస్తే...

ఎన్ని నిబంధనలో...

సాధారణంగా ఎన్నికలప్పుడు పల్లెటూళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కో రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుంటుంది. ఒక్కోసారి వేరువేరు పార్టీలకు సంబంధించిన కుటుంబాలు ఓట్ల విషయాల్లో గొడవలూ పడుతుంటాయి. కొన్నిసార్లు ర్యాలీలూ, రాజకీయ నాయకులిచ్చే తాయిలాలూ ఊరంతటినీ ఇబ్బందికరమైన వాతావరణంలో పడేస్తాయి. అసలీ గొడవలేవీ మా ఊరికి వద్దంటూ 1983లో రాజ్‌సమాధియాలా- ఎన్నికల ప్రచారాన్ని నిషిద్ధం చేసింది. అప్పటి నుంచీ అభ్యర్థులెవరూ ఏ ఎన్నికల ప్రచారానికీ ఇక్కడికి రావడం లేదట. అలాగని ఓట్లకు దూరంగా ఉంటే కుదరదు. ఓటు వేయనివారు జరిమానా కట్టాలి కూడా. దాదాపు 2500 జనాభా ఉన్న ఈ ఊరు- ఒక్క ఎన్నికల విషయంలోనే కాదు, ఊరు బాగు కోసం నియమాలెన్నింటినో పెట్టుకుంది. వాటిని చూసుకోవడానికి గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకుంది.


ఆ నిబంధనల ప్రకారం- ఎవరైనా మద్యపానం చేస్తే రూ.500 జరిమానా, గుట్కాల్లాంటివి తింటే 50 రూపాయల ఫైన్‌, ఇంకా ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారాన్ని వేసినా, చెట్లు నరికినా... డబ్బు కట్టాలి. అంతేకాదు, అబద్ధపు సాక్ష్యం చెప్పినా, పదిమందిలో తిట్టుకున్నా తప్పే. వ్యవస్థ సరిగా నడవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సిందే కదా. అందుకే మరి, ఒకవేళ తప్పు చేసి కమిటీ విధించిన జరిమానాలు సమయానికి కట్టకపోయినా దానికీ జరిమానా ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ- అమ్మానాన్నల్ని సరిగా చూసుకోవాలి, కులాల విషయంలో ఎవరూ గొడవ పడకూడదు, కచ్చితంగా అందరూ చదువుకోవాలి, ఎలాంటి కాలుష్యాన్నీ సృష్టించకూడదు, ఊరి వాళ్ల అనుమతి లేనిది బయటి వ్యాపారులు రాకూడదు, ఏవిధంగానూ పక్కవాళ్లను ఇబ్బంది పెట్టకూడదు... అంటూ పల్లెలో ఒక క్రమశిక్షణ నెలకొనడానికి రకరకాల నియమాల్ని ఏర్పాటు చేసుకుందీ ఊరు. అందరూ అంత బాగుండటం వల్లనేమో ఒకరిమీద ఒకరికి బాగా నమ్మకం ఏర్పడినట్టుంది. ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు కూడా దుకాణాలకూ, ఇళ్లకూ తాళాలు వేయరట. దుకాణాల్లో ఏవైనా వస్తువులు అవసరమైతే వాటిని తీసుకుని డబ్బులు అక్కడ పెట్టి వెళతారట.

కట్టుబాట్లతో ఇలా ఊరంతా మంచి మార్గంలో ఉండటమే కాదు, వాటి వల్ల వచ్చిన డబ్బునూ అందరి ప్రయోజనాలకే వాడటం విశేషం. జరిమానా, ఇంకా పంచాయతీలో జమ అయిన ఇతర డబ్బును ఖర్చుచేస్తూ ఎప్పటికప్పుడు రోడ్లూ, చెత్తకుండీలూ, లైట్లూ, వైఫై, సీసీటీవీ కెమెరాలు, సోలార్‌ సిస్టమ్‌... ఇలా ఊరికి కావాల్సిన సౌకర్యాల్ని సమకూర్చుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తోందీ పల్లె.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..