నింగిలోని శాటిలైట్‌లకి... ఇంధనాన్ని ఇస్తారు!

మీరు నేషనల్‌ హైవేలో వెళుతున్నారు. మీ బండిలో పెట్రోలు నిండుకుంది. అప్పుడేం చేస్తారు... ‘ఏముంది? దగ్గర్లోనే ఉన్న పెట్రోల్‌ స్టేషన్‌కి వెళతాం’ అంటారు కదా! ‘మరి అంతరిక్షం లోనూ శాటిలైట్‌ల కోసం అలాంటి స్టేషన్‌ పెడితే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది ఆ యువకులిద్దరికీ.

Published : 26 May 2024 00:04 IST

మీరు నేషనల్‌ హైవేలో వెళుతున్నారు. మీ బండిలో పెట్రోలు నిండుకుంది. అప్పుడేం చేస్తారు... ‘ఏముంది? దగ్గర్లోనే ఉన్న పెట్రోల్‌ స్టేషన్‌కి వెళతాం’ అంటారు కదా! ‘మరి అంతరిక్షం లోనూ శాటిలైట్‌ల కోసం అలాంటి స్టేషన్‌ పెడితే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది ఆ యువకులిద్దరికీ. ‘తమాషాగా ఉందా?! ఊహల్లో విహరించడంమాని పనిచేయండి’ అన్నారట సీనియర్‌ శాస్త్రవేత్తలు. కానీ ‘ఆర్బిట్‌ఎయిడ్‌’ అన్న స్టార్టప్‌తో ఆ ఊహని నిజం చేస్తున్నారు వాళ్ళిప్పుడు. ఆసియాలో ఈ సేవలందించే ఏకైక సంస్థగా గుర్తింపునీ సాధించారు!

గూగుల్‌ మ్యాప్‌లూ, జీపీఎస్‌లూ, వాతావరణ సమాచారాలూ... వీటన్నింటికీ ప్రస్తుతం శాటిలైట్‌లపైనే ఆధారపడి ఉన్నాం మనం. అంతరిక్షంలో మనదేశానికి ఇలాంటి సేవలందించే కృత్రిమ ఉపగ్రహాలు నాలుగువందలదాకా ఉన్నాయట. ప్రతి శాటిలైట్‌నీ తయారుచేయడానికీ, నింగిలోకి పంపడానికీ ఖర్చు కోట్లలో ఉంటుంది. శాటిలైట్‌లోని మిగతా భాగాలన్నీ ఎంత చక్కగా పనిచేస్తున్నా సరే- ఓ దశ తర్వాత ఇంధనం నిండుకుంటే దాన్ని వదులు కోవాల్సిందే. అవి కేవలం అంతరిక్ష వ్యర్థంగా మిగలాల్సిందే. మళ్ళీ కోట్లు ఖర్చుచేసి కొత్త శాటిలైట్‌ని పంపాల్సిందే. దీనికే ఓ పరిష్కారం ఆలోచించారు యువశాస్త్రవేత్తలు శక్తికుమార్‌, నిఖిల్‌లు. మనకిక్కడ పెట్రోల్‌ పంపులు ఉన్నట్టే ఆకాశంలోనూ ఫ్యూయలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. వాళ్ళకీ ఆలోచన తట్టింది పదేళ్ళ కిందట. ఇద్దరూ అప్పట్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సస్‌(ఐఐఎస్‌సీ)లో పరిశోధనలు చేస్తుండేవారు. ఆ ఐడియాను పారిశ్రామికవేత్తగా మారిన ఓ శాస్త్రవేత్తతో పంచుకున్నారట. ఆయన ఇద్దర్నీ తేరిపార చూసి ‘ఐఐఎస్‌సీలో ఇద్దరికీ మంచి భవిష్యత్తుంది. చక్కటి ఉద్యోగాలూ వస్తాయి. ముందు ఆ పనేదో చూడండి... ఇలాంటి ఊహలతో టైం వేస్ట్‌ చేయొద్దు’ అన్నారట. కాలం గిర్రున తిరిగింది. ఆ ఇద్దరూ తమ ఆలోచనతో ‘ఆర్బిట్‌ ఎయిడ్‌’ అనే స్టార్టప్‌ని పెట్టారు. అది నచ్చి జర్మనీ, యూకే, ఐరోపా యూనియన్‌కి చెందిన స్పేస్‌ ఏజెన్సీలూ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దేశ, విదేశాలకి చెందిన ఆరు పెద్ద పరిశ్రమలూ ఇప్పుడు వాళ్ళతో కలిసి నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలతో ఒడంబడిక కుదుర్చుకునే సమయంలోనే ఆ పాత శాస్త్రవేత్తని మళ్ళీ కలవాల్సి వచ్చింది వీళ్ళు. ‘అప్పట్లో మీ ఆలోచన నాకు కేవలం ఓ ఫ్యాంటసీ అనిపించింది. అలాంటి ఊహలు కూడా నిజం కావొచ్చని మీరు నిరూపించారు... శభాష్‌!’ అన్నార్ట ఆయన! ఇంతకీ ఆ ఊహ వీళ్ళకి ఎప్పుడొచ్చిందంటే...

మామూలు జీవితమే...

తమిళనాడులోని బాగా వెనకపడ్డ జిల్లాల్లో ఒకటైన పెరంబలూరులోని ఓ మారుమూల పల్లెటూరు శక్తికుమార్‌ది. అక్కడి ప్రభుత్వ స్కూల్‌లోనే ప్లస్‌ టూ దాకా చదివాడు. చిన్నప్పటి నుంచీ సైన్స్‌పైన- అదీ అంతరిక్షంపైన మక్కువ పెంచుకున్నాడు. స్కూల్‌ లైబ్రరీలోనే తొలిసారి అతనికి ‘సైన్స్‌ ఫిక్షన్‌’ నవలల పిచ్చి పట్టుకుంది. అవి అతని ఊహకి కొత్త రెక్కల్నిస్తూ వచ్చాయి.

ఏరోనాటిక్స్‌లో బీటెక్‌, రాంచీ ‘బిట్స్‌’లో ‘స్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రాకెట్రీ’లో పీజీ చేసిన శక్తికుమార్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సస్‌లో పరిశోధకుడిగా చేరాడు. అక్కడే అతనికి నిఖిల్‌ పరిచయమయ్యాడు. కోయంబత్తూరులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతూ ఇంటర్న్‌షిప్‌ కోసం అప్పట్లో ఐఐఎస్‌సీకి వచ్చాడు నిఖిల్‌. శక్తికుమార్‌ అతనికి మెంటార్‌గా మారాడు. శక్తికుమార్‌ ప్రోత్సాహంతో నిఖిల్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఇజ్రాయెల్‌లోని టెక్నియాన్‌ యూనివర్సిటీలో పీజీ, జర్మనీలోని మ్యూనిక్‌ టెక్నికల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి మళ్ళీ ఐఐఎస్‌సీ పంచన చేరాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇస్రో, డీఆర్‌డీఓ వంటి సంస్థల ప్రాజెక్టుల్లో పనిచేశారు. శాటిలైట్‌ల డిజైనింగ్‌, ఇంధనాల ప్రయోగం (ప్రొపల్షన్‌) పైన పరిశోధనలు చేశారు. ‘చంద్రయాన్‌-2’ ప్రాజెక్టులోనూ పనిచేశారు. అప్పుడే శక్తికుమార్‌కి ‘అంతరిక్షంలో ఇంధన స్టేషన్‌’ అన్న ఆలోచన వచ్చింది. ఇద్దరూ కలిసి దాన్ని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. ఐఐఎస్‌సీలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌లోనే ‘ఆర్బిట్‌ ఎయిడ్‌’ స్టార్టప్‌కి పురుడుపోశారు!

ఇలా పనిచేస్తుంది...

నింగిలో ఇదివరకే ఉన్న ఉపగ్రహాలకి ఇంధనం అందించడానికి శక్తికుమార్‌, నిఖిల్‌లు ప్రత్యేక శాటిలైట్‌లను తయారుచేశారు. నింగిలోకి వెళ్ళాక అవి అక్కడే ఓ ‘స్టేషన్‌లో’ ఉంటూ- అవసరమున్న శాటిలైట్‌లకి సేవలందిస్తాయి. భూమిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్న ఓ శాటిలైట్‌కి- మరో శాటిలైట్‌ ఇంధనం అందివ్వడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దాన్ని ‘డాకింగ్‌’ అంటారు. దానికి సంబంధించి తమదైన సాంకేతికతని ఆవిష్కరించారు ఇద్దరూ! ఒకవేళ- వీళ్ళ ప్రత్యేక ఫ్యూయలింగ్‌ శాటిలైట్‌లో ఇంధనం నిండుకుంటే దాన్ని మళ్ళీ కిందకు తెచ్చి ఇంధనం నింపి పంపించే సాంకేతికతా వీళ్ళ దగ్గర ఉంది. వీటి దన్నుతోనూ, ఇస్రో సహకారంతోనూ త్వరలోనే తమ తొలి ఫ్యూయలింగ్‌ శాటిలైట్‌ని నింగికి పంపించబోతున్నారు!

ఆ కౌంట్‌డౌన్‌ ఇంకా ప్రారంభం కాకపోతేనేం... ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నాలుగుకోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది వీళ్ళ స్టార్టప్‌లో. అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం అంతరిక్ష రంగానికి సంబంధించిన సుమారు 1500 స్టార్టప్‌లని పరిశీలించి ప్రపంచంలోని
‘టాప్‌ 20’ అంకురాల్లో ఒకటిగా నిలబెట్టింది. అంతకన్నా- ఈ తరహా వాటిల్లో ఆసియాలోనే మొదటి స్టార్టప్‌ అన్న గుర్తింపునీ అందించింది. అంతకన్నా ఏం కావాలి?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..