కార్తికానికి కొత్త కళ!

కార్తిక మాసం వచ్చిందంటే చాలు... చాలామంది గృహిణులు భక్తిశ్రద్ధలతో శివయ్యను కొలుస్తుంటారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.

Published : 26 Nov 2023 00:28 IST

కార్తిక మాసం వచ్చిందంటే చాలు... చాలామంది గృహిణులు భక్తిశ్రద్ధలతో శివయ్యను కొలుస్తుంటారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అందులోనూ కార్తిక పౌర్ణమి రోజున తోచిన విధంగా పత్రమో పుష్పమో సమర్పిస్తూ ఆ దేవదేవుడిని వేడుకుంటారు. ఆ పూజ ఇంకాస్త ప్రత్యేకంగా జరుపుకోవడానికి వీలుగా మార్కెట్లోకి సరికొత్త పూజా సామగ్రి వచ్చేసింది!


నూనెలో తేలే దీపం!

కార్తిక పౌర్ణమి రోజున దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది కాబట్టే ఇంట్లోనే కాకుండా దేవాలయాల్లోనూ వెలిగిస్తారు. వెలిగించిన దీపాలను నదులూ, చెరువుల్లోనూ వదలడం ఆనవాయితీ. అది దృష్టిలో పెట్టుకునే సరికొత్త దీపాలూ మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. అందులో భాగంగా ‘ఆయిల్‌ ఫ్లోటింగ్‌ విక్స్‌’ కూడా వచ్చాయి. పెద్ద గిన్నెలాంటిదాంట్లో నూనెపోసి వీటిని వెలిగించొచ్చు.


ఎన్ని రకాల వత్తులో!

దీపారాధనలో ఉపయోగించే వత్తులకూ ఎంతో విశిష్టత ఉంది. వెలిగించే ఆ దీపాన్ని బట్టి పూజలో వత్తులూ వాడుతుంటారు. వత్తుల సంఖ్యా, ఆకారాలూ కూడా వేరు వేరుగా ఉంటాయి. కొంతమంది గృహిణులు ఇంట్లోనే తమ వీలుని బట్టి వాటిని తయారుచేసుకుంటారు. కానీ ఆ అవకాశం లేనివారి కోసం రకరకాల వత్తులు అందుబాటులో ఉన్నాయి.


ప్రతి దేవుడికీ ఓ వత్తి!

పూజించే దేవుడిని బట్టి పూజలో ప్రతిదీ ఆ దేవుడికి సంబంధించినదే ఉండాలను కునేవారు ఈ వత్తుల్ని ప్రయత్నించొచ్చు. శివుడికైతే మారేడు దళం వత్తులూ, లక్ష్మీదేవికి తామరపువ్వు వత్తులూ... ఇంకా ఇలా చామంతీ, గులాబీ, మందారాల్లాంటి వివిధ ఆకారాల వత్తులు రెడీమేడ్‌గా వస్తున్నాయి. మామూలు దూది వత్తులు సైతం రంగురంగుల్లో దొరుకుతున్నాయి.


బంగారు మారేడు!

త్రినేత్ర ఆకారంలో ఉండే మారేడు దళాన్ని పరమశివుడి పూజలో తప్పక ఉంచుతారు. ‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం’ అంటూ మూడు ఆకులుగా ఉండే ఆ బిల్వ పత్రాల్ని త్రినేత్రుడి ముందు ఉంచి వేడుకుంటారు. శివయ్యకు ప్రీతికరమైన మారేడు దళాలు అందుబాటులో లేనప్పుడు పూజలో ఆ లోటును తీర్చుకోవడానికి బంగారూ, వెండీ మారేడు దళాల ఆకులు దొరుకుతున్నాయి. పూజా మందిరాల్లో పెట్టుకోవడానికివివిధ బంగారూ, వెండీ పూలు ఉన్నట్టే ఇవీ వస్తున్నాయి.


అభిషేకిస్తే వెలిగిపోతాడు!

పూజ గదిలో పెట్టుకోవడానికి వీలుగా రకరకాల శివుడి విగ్రహాలూ, శివలింగాలూ మార్కెట్లో కనిపిస్తుంటాయి. వాటన్నింటికన్నా భిన్నంగా కనిపిస్తుంది ఈ శివలింగం. ‘వాటర్‌ సెన్సర్‌ ఎల్‌ఈడీ… శివలింగం’ పేరుతో వచ్చిన ఈ లింగాన్ని నీటితో అభిషేకించగానే-  ఏదో మాయ చేసినట్టుగా వెలిగిపోతుంది. ఆ కాంతులకు కారణం- అందులో ఉండే వాటర్‌ సెన్సర్‌ ఎల్‌ఈడీ లైటే అయినా భక్తులకు మాత్రం కాస్త ఆనందంగా అనిపిస్తుంది మరి!


ఉసిరి దీపాల్ని ఇలా వెలిగిద్దాం!

క్తులందరూ చాలావరకూ ఈ మాసంలో, ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తుంటారు. లక్ష్మీదేవి స్వరూపమైన ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతుంటారు. ఉసిరి దీపం నేలపైన నిలబడాలంటే దాని అడుగున కాస్త చెక్కడం లాంటివి చేస్తుంటారు. అలాంటివేమీ చేయక్కర్లేకుండా చక్కగా ఉసిరి దీపం పెట్టుకునేలా ‘కార్తిక దీపం స్టాండ్స్‌’ దొరుకుతున్నాయి. వివిధ పరిమాణాల్లో ఉండే వీటిల్లో మనకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు, ఏటా కార్తిక మాసంలో వాడుకోవచ్చు.


గుబాళిస్తాయి!

గరుబత్తులనే కాదు, దీపాన్ని వెలిగించైనా ఇల్లంతా సువాసన వచ్చేలా చేయొచ్చు. ‘ఫ్రాగ్రెన్స్‌ కాటన్‌ పూజా విక్స్‌’ను వెలిగిస్తే గులాబీ, మల్లె, లావెండర్‌ పూల వాసనలతో పాటూ చందనపు సువాసనలతోపరిసరాల్ని నింపేయొచ్చు.


కోటి వత్తుల  గోపురం!

కార్తిక మాసంలో 365 వత్తుల్ని వెలిగిస్తే... ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందనేది నమ్మకం. అందుకే పౌర్ణమి రోజు 365 వత్తులతో పాటూ లక్ష వత్తుల నోముల్లాంటివీ చేస్తుంటారు. అన్ని వత్తులు తయారుచేసుకోవడానికి కుదరని వారిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా వత్తులూ వచ్చాయి. గోపురం, శివలింగం తదితర ఆకారాల్లో లక్షా, కోటి దీపాల వత్తుల కట్టలు దొరుకుతున్నాయి.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..