ఈ పాత్రలు మర్చిపోలేను

రశ్మికా మందన్న... ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ హీరోలతో నటించి నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందింది.

Updated : 19 May 2024 13:31 IST

రశ్మికా మందన్న... ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ హీరోలతో నటించి నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ కన్నడ సొగసరి ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల్లో కొన్ని పాత్రల గురించి చెప్పుకొస్తోందిలా...


‘ఆఫ్రీన్‌’గా న్యాయం చేశాననుకున్నా...

నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రల్లో ఒకటి ‘సీతారామం’లో ఆఫ్రీన్‌. నిజానికి దర్శకుడు హను రాఘవపూడి ఆ పాత్ర గురించి చెప్పినప్పుడు చేయగలనా లేదా అని ఆలోచించా. ఎందుకంటే ‘సీతారామం’ అనేది అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌ లాంటి సినిమా. అలాంటి సినిమాలో ఆఫ్రీన్‌ది రెబల్‌గా కనిపించే పాత్ర. నేనేమో వీలైనంతవరకూ మౌనంగా ఉండేందుకే ఇష్టపడతా. అందుకే ఆ పాత్ర గురించి చెప్పినప్పుడు ఆఫ్రీన్‌లా నటించడాన్ని ఓ సవాలుగా తీసుకున్నా. ఇద్దరు ప్రేమికుల కథను తెలియజేసే బాధ్యతను దర్శకుడు నాపైన పెట్టారు కాబట్టి కథను బాగా అర్థంచేసుకుని నేను చేయాల్సిన సీన్స్‌ను రిహార్సల్‌ చేసుకుని.. సెట్‌కి వెళ్లేదాన్ని. సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకు న్యాయం చేశాననే అనిపించింది.


‘సంస్కృతి’ నవ్విస్తుందని అనుకోలేదు

‘సరిలేరు నీకెవ్వరు’లో అందాల నటుడు మహేశ్‌బాబుతో కలిసి నటించడం ఒక సవాలైతే... అందులో సంస్కృతిగా నవ్వించే పాత్రను చేయడం మరో సవాలు. ఎందుకంటే.. అంతకు ముందువరకూ నేను అలాంటి సరదా పాత్రలు చేయలేదు... చేస్తాననీ ఊహించలేదు మరి. ఇందులో ‘మీకు అర్థమవుతోందా...’ అంటూ సరదాగా నటించడం చూసే వాళ్లకు బాగానే అనిపించింది కానీ మహేశ్‌బాబుతో కలిసి స్క్రీన్‌ను పంచుకోవడానికి నేను ముందు భయపడ్డా. సెట్‌కు వెళ్లి.. తనతో మాట్లాడి రెండుమూడు సీన్లు చేసేవరకూ ఆ కంగారూ భయమూ పోలేదు. సీన్‌ పూర్తయిన ప్రతీసారీ నేను సరిగ్గా చేశానా లేదా అనే సందేహమూ నాలో కలిగేదంటే నమ్మండి.


‘శ్రీవల్లి’ ఓ సాహసమే!

హీరోయిన్‌ అంటేనే అందంగా కనిపించడం. అలాంటిది నేను ‘పుష్ప’లో డీగ్లామర్‌ పాత్రలో నటించా. చెప్పాలంటే శ్రీవల్లి పాత్ర ఓ సాహసమే.  షూటింగ్‌ మొదలుపెట్టిన రోజు నుంచీ పూర్తయ్యేవరకూ ప్రతి సన్నివేశాన్నీ నేను, సుకుమార్‌, అల్లుఅర్జున్‌ ఎప్పటికప్పుడు చర్చించుకుని మార్పులు చేసుకునేవాళ్లం. పైగా ఆ సమయంలో నేను ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్‌కీ వెళ్లేదాన్ని. దాంతో ‘పుష్ప’ సెట్‌లోనేమో చిత్తూరు వాసిలా నా మాటతీరు, ఆహార్యం, హావభావాలను పలికించేందుకు రోజూ నాలుగైదు గంటలు కష్టపడుతూనే రెండో సినిమా షూటింగ్‌కు వెళ్లేదాన్ని. ఒక చోట చిత్తూరు యాసలో, మరోచోట మోడ్రన్‌ అమ్మాయిలా నటించేందుకూ మాట్లాడేందుకూ ఎప్పటికప్పుడు కసరత్తు చేసుకునేదాన్ని. ప్రతి షాట్‌ పూర్తయి డైరెక్టర్‌ ఓకే అని చెప్పాక హమ్మయ్య నా వంతుగా కష్టపడ్డానని సంతృప్తి పడేదాన్ని.  


‘గీతాంజలి’తో గౌరవం పెరిగింది

క స్త్రీ... తన భర్త, పిల్లలు, కుటుంబంకోసం ఎంత కష్టమైనా పడుతుందనీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనీ చెప్పే పాత్రే ‘యానిమల్‌’లోని గీతాంజలి. షూటింగ్‌ మొదలుపెట్టడానికి ముందే గీతాంజలి పాత్ర గురించి దర్శకుడు వివరించినప్పుడు ఇందులో భావోద్వేగాలు ఎక్కువని అర్థమైంది. స్వచ్ఛమైన ప్రేమ, హింస, బాధ, కోపం, కుటుంబంకోసం పడే తపన... ఇలా అన్నిరకాల అంశాలూ కనిపిస్తాయి. ఆ భావోద్వేగాలన్నింటినీ మేనేజ్‌ చేసుకుంటూనే ప్రతి సన్నివేశాన్నీ పూర్తిచేశా. గీతాంజలిలానే చాలామంది మహిళలు పైకి నవ్వుతూ కనిపించినా... తమ కుటుంబం కోసం, పిల్లల కోసం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనీ, ఎంత కష్టమైనా భరిస్తారనీ అప్పుడే అర్థమైంది. అలాంటి మహిళలపైన గౌరవం ఇంకా పెరిగింది.


‘లిల్లీ’ కోసం క్రికెట్‌ నేర్చుకున్నా

‘డియర్‌ కామ్రేడ్‌’లో లిల్లీ/అపర్ణాదేవి పాత్రలో నటించేందుకు ఒకవిధంగా నాతో నేనే పోరాటం చేశా. ఈ సినిమాలో నేను క్రికెటర్‌గా నటించేందుకు దాదాపు నాలుగైదు నెలలు క్రికెట్‌ ప్రాక్టీస్‌కు వెళ్లా. ఆ క్రమంలో నా భుజానికి గాయమైంది. క్రికెట్‌ ఆడుతూ పరుగులు పెడుతున్నప్పుడు పాదం మెలితిరగడంతో నొప్పితో విలవిల్లాడిపోయా. ఇక, ఒళ్లునొప్పులూ, ఎండలో ఆడటం వల్ల చర్మం రంగుమారడం.. వంటి సమస్యలూ ఎదురయ్యాయి. అయినా కూడా ఈ పాత్ర నేనే చేయాలీ.. ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలీ అనుకున్నా. అందుకే ఓ వైపు నా అనారోగ్యాలతో పోరాడుతూనే సినిమా షూటింగ్‌ను పూర్తిచేశా. ఈ పాత్రతో నాలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..