గెలిచి చూపిద్దాం!

‘ఆడపిల్లవి.. ఆడపిల్లలా ఉండు’ అనే మాట తరచూ వింటూనే ఉంటాం. ఆ లింగ వివక్ష వల్ల నచ్చిన కెరీర్లను వదిలేసుకున్నవాళ్లూ చాలామందే కనిపిస్తుంటారు. కానీ, వీళ్లు మాత్రం ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రవేశారు. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారో చెప్పుకొచ్చారిలా...

Updated : 03 Mar 2024 14:32 IST

‘ఆడపిల్లవి.. ఆడపిల్లలా ఉండు’ అనే మాట తరచూ వింటూనే ఉంటాం. ఆ లింగ వివక్ష వల్ల నచ్చిన కెరీర్లను వదిలేసుకున్నవాళ్లూ చాలామందే కనిపిస్తుంటారు. కానీ, వీళ్లు మాత్రం ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రవేశారు. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారో చెప్పుకొచ్చారిలా...


అమ్మలా పెంచుతా -ఈశా అంబానీ

మా ఇంట్లో అన్ని విషయాల్లోనూ నన్ను అన్నయ్యా, తమ్ముడితో సమానంగానే పెంచారు. ఆడవాళ్లు ఏ విషయంలోనూ తక్కువ కాదని అమ్మ చెప్పేది. ధీరూభాయ్‌ అంబానీ స్కూల్‌లోనూ సమానత్వం గురించి ప్రత్యేకంగా క్లాస్‌లు చెబుతుంటారు. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మహిళల పట్ల గౌరవాన్ని చూశాను గానీ బయట సమాజం అలా లేకపోవడం బాధించింది. అందుకే మూడేళ్ల క్రితం ‘హర్‌ సర్కిల్‌’ వెబ్‌సైట్‌నూ, ఆప్‌నూ ప్రారంభించాం. వాటి ద్వారా మహిళలకు ఫిట్‌నెస్‌, పౌష్టికాహారం, సంతాన సాఫల్యత, ప్రెగ్నెన్సీ, ఆర్థిక అంశాల గురించి అవగాహన కల్పిస్తున్నా. లక్షల మంది ఆ సేవల్ని వినియోగించుకోవడమే అసలైన విజయంగా భావిస్తున్నా. మా సంస్థల్లోనూ ఆడవాళ్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తున్నా. ఇక, అమ్మ స్ఫూర్తితో నా పిల్లల్నీ అసమానతకు తావులేకుండా పెంచుతున్నా.


ఇంట్లోనే ఎదుర్కొన్నా  - హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

నేను క్రికెట్‌ నేర్చుకోవాలనుకున్నప్పుడు అమ్మానాన్నలు ప్రోత్సహించారు. కానీ మా తమ్ముడూ, అతని స్నేహితులూ వెటకారంగా మాట్లాడేవారు. మగవాళ్లలా ఆడవాళ్లకి శక్తి ఉండదనేవారు. మా బంధువులు కూడా నాన్నని తప్పు పట్టేవారు. ఆ మాటలకు మొదట్లో బాధపడ్డా తరవాత వాళ్ల నోళ్లను మూయించాలని కసితో కష్టపడ్డా. ఎక్కువ గంటలు సాధనమీదే దృష్టి పెట్టేదాన్ని. క్రికెటర్‌గా రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నా ప్రతిభ నిరూపించుకున్నాక కూడా క్రీడల కోటాలో ఉద్యోగమివ్వడానికి చాలామంది అధికారులు ఇష్టపడలేదు. అయినా నేనెప్పుడూ బాధపడలేదు. ఎందులోనూ తక్కువకాదనే భావనతోనే ఉండేదాన్ని. మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌గా తోటి క్రీడాకారిణులకీ అదే చెబుతుంటా.


అందుకే ఆ నిర్ణయం - సాయి పల్లవి

న చుట్టూ ఉన్న ఆడవాళ్లే బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నారు తప్ప మగవారు ఎక్కువగా దాని బారిన పడట్లేదంటే సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. రియాలిటీ షోల్లో పాల్గొన్నప్పుడూ, సినీరంగంలోకి వచ్చిన తొలినాళ్లలో- నా ముఖంపైన మొటిమలు ఎక్కువగా ఉండటం వల్ల నన్ను చాలామంది ఏడిపించారు. ‘నువ్వు నటించడానికి పనికిరావు’ అనేవారు. ‘ప్రేమమ్‌’కు ముందు వరకూ చాలా ఆత్మన్యూనతతో బాధపడేదాన్ని. అయినా సరే మేకప్‌ వేసుకోమని ఎందరు చెప్పినా వినకుండా దాన్ని దూరంపెట్టి పాత్రమీదే ధ్యాస ఉంచి నటించడం అలవాటు చేసుకున్నా. అందం కంటే ప్రతిభే గొప్పదని నమ్మడం వల్లే సౌందర్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నా. మహిళలకు సంబంధించి కృషి చేసే ఎన్జీఓల కోసం డబ్బు తీసుకోకుండా ప్రచారం చేయడం ఎంతో ఆనందాన్నిస్తుంది.


బలాలు తెలుసుకున్నా -ప్రియాంక గాంధీ

మా ఇంట్లో జరిగిన వరుస హత్యల వల్ల నాలుగ్గోడల మధ్య చదువుకోవాల్సి వచ్చింది. నానమ్మ స్ఫూర్తితో బాగా చదువుకున్న నేను సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేశా. కొంత కాలం ఓ స్కూల్లో పని చేసి పిల్లలకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పా. పదేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు చాలామంది నేను జనాల్లో ఇమడలేననీ నానమ్మా, అమ్మలా మాట్లాడలేననీ అన్నారు. అవన్నీ విన్నాకే నా బలాలు నేను తెలుసుకోగలిగా. ప్రజల్ని చైతన్య పరుస్తూ దేశమంతటా తిరుగుతున్నా. ఈ క్రమంలో అత్యాచారాలూ, ఇతర వేధింపులూ ఎదుర్కొన్న బాధితులు నన్ను సంప్రదిస్తే వారిని ఓదార్చడానికి బదులు న్యాయం కోసం పోరాడేలా వెన్నుతడుతున్నా. అలా పోరాటం చేస్తున్న మహిళల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది.


ఇబ్బంది పడ్డా   - ఫల్గుణి నాయర్‌

పెళ్లై పిల్లలున్న మహిళలు ఒంటరిగా వ్యాపారంలో రాణించడం చాలా కష్టం. వ్యక్తిగత బాధ్యతల వల్ల వారు సరిగ్గా పని చేయలేరని చాలామంది అనుకుంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం మానేసి సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘నైకా’ను ప్రారంభించాలనుకున్నప్పుడు అలాంటి సమస్యలనే ఎదుర్కొన్నా. పెట్టుబడి కోసం ఎంతో ఇబ్బంది పడ్డా. ‘బాధ్యతల విషయంలో నువ్వు వెనకడుగు వేయవని నమ్మకం ఏంటీ’ అని అడిగిన బ్యాంకింగ్‌ సంస్థలు ఎన్నో. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించడానికి- దాచుకున్న డబ్బుతో అరకొర వసతులతోనే వ్యాపారం మొదలుపెట్టా. సెల్ఫ్‌మేడ్‌ బిలియనీర్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించాక కష్టాన్నీ, విమర్శల్నీ మర్చిపోయా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..