టొమాటో తింటే...

వరసగా రెండు వారాలపాటు టొమాటోల్ని ఆహారంలో భాగంగా అధికంగా తినడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియా మారుతుందని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 20 Nov 2022 03:51 IST

టొమాటో తింటే...

వరసగా రెండు వారాలపాటు టొమాటోల్ని ఆహారంలో భాగంగా అధికంగా తినడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియా మారుతుందని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగా పందుల్లో పరిశీలించగా- పొట్టలోని బ్యాక్టీరియాలో వైవిధ్యం స్పష్టంగా కనిపించిందట. ఇందుకోసం వీళ్లు ఆ జంతువుల్ని రెండు విభాగాలుగా చేశారట. అయితే పీచు, చక్కెర, ప్రొటీన్‌, కొవ్వులు, క్యాలరీలు... అన్నీ ఒకే రకంగా ఉన్న ఆహారాన్ని రెండు విభాగాల్లోని వాటికీ ఇచ్చారట. ఇలా కొన్నాళ్లు చేశాక వాటి మల పరీక్ష ద్వారా రెండింటి పొట్టలోని బ్యాక్టీరియా ఒకేలా ఉందని నిర్ధరించుకున్నారట. ఆ తరవాత ఒక వర్గంలోని వాటికి మాత్రం టొమాటోలు ఎక్కువగా ఉన్న ఆహారాన్నీ మరో వర్గానికి మామూలు ఆహారాన్నే ఇచ్చారట. రెండు వారాల తరవాత మళ్లీ రెండింటి మలాన్ని పరిశీలించినప్పుడు- టొమాటో ఎక్కువగా తీసుకున్న పందుల్లోని మైక్రోబయోమ్‌లో వైవిధ్యం ఎక్కువగా కనిపించిందట. అందులో బ్యాక్టీరియోడొటా అనే బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాటి ఆరోగ్యం మెరుగైనట్లూ గుర్తించారు. అంతేకాదు, ఆహారంలో భాగంగా టొమాటోల్ని ఎక్కువగా తినేవాళ్లలో హృద్రోగాలూ క్యాన్సర్ల శాతం కూడా తగ్గుతున్నట్లు తేలింది. అయితే టొమాటోలకీ పొట్టలోని బ్యాక్టీరియాకీ ఉన్న సంబంధం ఏమిటనేది మాత్రం శాస్త్రవేత్తలకి సైతం ఇంకా అంతుబట్టలేదట.


వెన్నెముకకు గాయమైనా...

పక్షవాతంతో కావచ్చు... ఏదైనా ప్రమాదం వల్ల కావచ్చు... వెన్నెముకకు దెబ్బ తగిలితే  మెదడు నుంచి సంకేతాలు అందకపోవడంతో నరాలు చచ్చుబడిపోతాయి. దాంతో నడవడం చాలా కష్టం. అయితే విద్యుచ్ఛక్తితో నరాలను ప్రేరేపించడం ద్వారా వాళ్లు మళ్లీ నడిచేలా చేయవచ్చు అంటున్నారు లాసానె యూనివర్సిటీ హాస్పిటల్‌ నిపుణులు. అదెలా అంటే- ఎపిడ్యూరల్‌ ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌- అంటే, ఓ చిన్న పరికరాన్ని దెబ్బతిన్న వెన్నెముక భాగంలో అమర్చి, దాన్నుంచి వచ్చే విద్యుచ్ఛక్తితో నరాలను ఉత్తేజితం చేయడం ద్వారా కాళ్లలో కదలికల్ని తీసుకురావచ్చట. దీనివల్ల పూర్తిగా పక్షవాతం బారినపడ్డ తొమ్మిదిమంది లేచి నిల్చుని క్రచెస్‌ సాయంతో నడిచారట. కొన్నాళ్లకు ఆ పరికరాన్ని తీసేసినప్పటికీ వాళ్లు యథాప్రకారం నడవగలగడం ఈ పరిశోధనలో చెప్పుకోదగ్గ విశేషం. దాంతో అసలు నడవడానికి కారణమైన నరాలు ఏవి అన్న విషయాన్ని ఎలుకల్లో పరిశోధన చేయడం ద్వారా తెలుసుకోగలిగారట. మొత్తమ్మీద పక్షవాతం వచ్చినవాళ్లలోనూ కొంతవరకూ కదలికల్ని తీసుకురావచ్చు అని భావిస్తున్నారు.


మానసిక సమస్యలు శ్వాసతో దూరం!

జీవించి ఉండాలంటే శ్వాసించాల్సిందే. అయితే మనం ఎంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాం అనేదాన్నిబట్టి మన భావోద్వేగాలూ, ఏకాగ్రత, దృష్టికోణం... వంటివి ఆధారపడి ఉంటాయని ఆర్హస్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు- ‘గాలి పీల్చండి... వదలండి... గట్టిగా పీల్చండి...’ అని చెబుతుంటారు. దీనివల్ల మానసిక ఆందోళన చాలావరకూ తగ్గుతుంది. అయితే అది అక్కడికే పరిమితం కాలేదనీ, దానివల్ల మెదడు పనితీరు ఆధారపడి ఉంటుందనీ అంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకలు, కోతులు, మనుషుల మెదళ్లను ఎమ్మారై స్కాన్‌లను తీసి మరీ పరిశీలించారట. అందులో ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకుని వదిలినప్పుడు మెదడు నరాలకు సాంత్వన కలిగినట్లు గుర్తించారు. అంటే- మెదడు, ఊపిరితిత్తులు... ఈ రెండూ ఒకదాంతో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయనీ మొత్తంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయనీ తేలింది. అందుకే బాగా ఒత్తిడికి లోనయినప్పుడు డీప్‌ బ్రీత్‌ తీసుకుని ఒక్కసారిగా వదలమని క్రీడాకారులకు చెబుతారు. దానివల్ల ఒత్తిడి, ఆందోళనలన్నీ తొలగిపోతాయి. శ్వాస ఇబ్బందిగా అనిపించినప్పుడు- మన మెదడు సరిగ్గా ఆలోచించదు సరికదా, సైకియాట్రిక్‌ సమస్యలూ ఏర్పడతాయట. అందుకే ఆయా సమస్యలకి యోగా, ధ్యానం చేయమని చెబుతుంటారు. దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడ్డవాళ్లలోనూ ఈ రెండింటికీ సంబంధం ఉండటం స్పష్టంగా కనిపించిందట. కాబట్టి దీని ఆధారంగా- శ్వాసతోనే మానసిక వ్యాధుల్ని ఏ రకంగా తగ్గించగలం అన్నదానిమీద లోతుగా పరిశీలించనున్నారట.


ఈ పింగాణీ లోహంలాంటిది!

సెరామిక్‌ ఎంత దృఢంగా ఉన్నా కింద పడితే పగిలిపోతుంది. అయితే నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ కొత్త రకం పింగాణీ పదార్థాన్ని కనుగొన్నారు. దీన్నే థెర్మోఫార్మబుల్‌ సెరామిక్స్‌ అని పిలుస్తున్నారు. ఇది పగిలిపోదనీ దీన్ని సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్‌లో కూడా ఉపయోగించవచ్చనీ అంటున్నారు. అయితే ఈ సరికొత్త పింగాణీ- ప్రయోగశాలలో అనుకోకుండా రూపొందించబడింది. అదెలా అంటే- పరిశ్రమల్లో వాడేందుకు సెరామిక్‌ ఉత్పత్తుల్ని తయారుచేసే ప్రక్రియలో భాగంగా- బోరాన్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పుడు రూపుదిద్దుకున్న సెరామిక్‌ను యథావిధిగా పగలగొట్టి చూశారట. కానీ పగలలేదట. ఆ తరవాత దాన్ని మరో పాత్రలోకి మార్చుతుంటే చేయి జారి కిందపడిందట. అప్పుడు కూడా అది పగలలేదు కానీ, దాని రూపం మాత్రం కొద్దిగా సాగినట్లుగా అయిందట. దాంతో దాన్ని మళ్లీ పాత రూపంలోకి వచ్చేలా చేయగలిగారట కూడా. అదే సంప్రదాయ పద్ధతిలో తయారయ్యే సెరామిక్‌ అయితే అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర బీటలు వస్తాయి. కానీ ఈ కొత్త థెర్మోఫార్మబుల్‌ సెరామిక్‌ మాత్రం ఎంత వేడినైనా తట్టుకోగలుగుతుంది కాబట్టి లోహం మాదిరిగానే అనేక పరిశ్రమల్లో వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..