అమ్మవారిని మూడు రూపాలలో పూజిస్తారిక్కడ!

విద్య కోసం సరస్వతిని పూజించాలనీ, ఐశ్వర్యానికి లక్ష్మీదేవిని ఆరాధించాలనీ, శారీరక-మానసిక ఆరోగ్యానికి మహాకాళిని దర్శించుకోవాలనీ అంటారు.

Published : 17 Mar 2024 00:03 IST

విద్య కోసం సరస్వతిని పూజించాలనీ, ఐశ్వర్యానికి లక్ష్మీదేవిని ఆరాధించాలనీ, శారీరక-మానసిక ఆరోగ్యానికి మహాకాళిని దర్శించుకోవాలనీ అంటారు. కానీ ఈ ముగ్గురమ్మలూ ఒకే రూపంలో కొలువుదీరిన ఆలయమే చోటానిక్కర భగవతీ దేవాలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు భగవతీ లక్ష్మిగా పూజలు అందుకుంటోంది.

చోటానిక్కర భగవతీ ఆలయం... విశాలమైన ప్రాంగణంలో, ఆకట్టుకునే నిర్మాణశైలితో కనిపిస్తుంది. కేరళలోని కొచ్చిలో ఉండే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి, పూజిస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది.

స్థలపురాణం

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో సరస్వతీదేవికి గుడి లేదని గుర్తించి... ఓ ఆలయాన్ని కట్టించాలనుకుని అమ్మవారి అనుమతి కోసం తపస్సు చేశాడట. అమ్మవారు కరుణించగా- తనతో కలిసి కేరళకు వచ్చి అక్కడ కొలువుదీరమని దేవిని అర్థించాడట. అమ్మ అందుకు అంగీకరించి శంకరాచార్యుల వెనకే వస్తాననీ.. అయితే మార్గమధ్యంలో వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అక్కడే ఆగిపోతాననీ షరతు పెట్టిందట. అలా కర్ణాటకలోని కొడచాద్రి పర్వతాల దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి కాలిగజ్జెల చప్పుడు జగద్గురువుకు వినిపించలేదట. దాంతో అమ్మవారు పెట్టిన షరతును మర్చిపోయి ఆయన వెనక్కి తిరగడంతో దేవి అక్కడే ఆగిపోయి మూకాంబికగా కొలువుదీరిందట. తన తప్పు తెలిసి శంకరాచార్యులు అమ్మవారిని క్షమించమని వేడుకుని.. తనతో కేరళకు రమ్మని అభ్యర్థించడంతో  కనికరించి ఇక్కడకు వచ్చి భగవతీదేవిగా కొలువుదీరిందని ప్రతీతి. అదేవిధంగా మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉన్న
ఈ ప్రాంతంలో కన్నప్పన్‌ అనే గిరిజనుడు ఉండేవాడట. కాళి భక్తుడైన కన్నప్పన్‌ దూడలను దేవికి బలిచ్చేవాడట. ఓసారి అలా దూడను బలిస్తున్నప్పుడే అతడి కూతురు అడ్డుపడటంతో దాన్ని ఆమెకి కానుకగా ఇచ్చేశాడు. కొన్నాళ్లకు బలి ఇచ్చేందుకు ఒక్క దూడ కూడా దొరక్కపోవడంతో తన కూతురు పెంచుకుంటున్న దాన్ని తీసుకెళ్లేందుకు సిద్దమయ్యాడట. అయితే దూడ మాయమై ఆ స్థానంలో రెండు శిలలు కనిపించాయట. అటుగా వచ్చిన ఓ పూజారి  ఆ దూడ మహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపమని
చెప్పడంతో... తన తప్పును తెలుసుకుని బలి ఇవ్వడం మానేశాడని కథనం. అలా అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా స్థిరపడిందని ప్రతీతి.

ఈ ఆలయం తలుపులు తెరిచాకే...

సాధారణంగా ఆలయంలో ఉండే దేవతామూర్తుల్ని బట్టి అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ భగవతీ ఆలయంలో అమ్మవారిని... ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజిస్తారు. అందుకు తగినట్లుగా ఉదయం తెలుపురంగు, మధ్యాహ్నం ముదురు ఎరుపురంగు, సాయంత్రం నీలం రంగు చీరలను అలంకరించి.. మూడు రూపాల్లో పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు... ఈ ఆలయం తలుపులు తెరిచాకే కర్ణాటకలోని మూకాంబిక ఆలయ ద్వారాలు తెరుస్తారు. అంటే... మూకాంబికా దేవి ఉదయం ఇక్కడ భక్తులను అనుగ్రహించి మధ్యాహ్నం కర్ణాటకలో దర్శనమిస్తుందని చెబుతారు. అలాగే...మానసిక సమస్యలున్నవారూ, విపరీతమైన ఒత్తిడితో బాధపడేవారూ సాయంకాలం ఇక్కడ మహాకాళికి నిర్వహించే గురుతి పూజలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.  ఈ అమ్మవారిని దర్శించుకునే వారికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా తొలగుతాయనీ... విద్యాప్రాప్తితోపాటు అష్టైశ్వర్యాలూ కలుగుతాయని అంటారు. అమ్మవారి దర్శనం తరువాత శివుడు, వినాయకుడు, అయ్యప్ప, విష్ణుమూర్తి తదితర దేవతామూర్తుల్ని పూజిస్తారు భక్తులు.  

ప్రత్యేక ఉత్సవాలు...

ఈ ఆలయంలో ఏడాదికోసారి ఏడు రోజులు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఓ రోజు అమ్మవారిని బంగారం, వజ్రవైఢూర్యాలతో అలంకరిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల్లోగా అమ్మవారిని దర్శించుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ.. పెళ్లికానివారికి త్వరగా పెళ్లికుదురుతుందనీ ఓ నమ్మకం. ఇక్కడ నవరాత్రుల సమయంలో ఏనుగుల ఊరేగింపూ, కళాకారులు నిర్వహించే ప్రదర్శనలూ చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని వెలిగించే దీపాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..