శివాలయంలో... ఉత్తరద్వార దర్శనం!

కాశీ నుంచి తెచ్చిన స్వామి విగ్రహం... వైష్ణవాలయం మాదిరి ఏడాదికోసారి ఉత్తరద్వార దర్శనం... అత్యంత వైభవంగా శివకేశవులకు జరిగే కల్యాణాలు...ఇవన్నీ చూడాలంటే ఆదిలాబాద్‌లోని హరిహర క్షేత్రమైన కాశీవిశ్వనాథ ఆలయానికి వెళ్లాల్సిందే.

Updated : 27 Nov 2022 03:49 IST

శివాలయంలో... ఉత్తరద్వార దర్శనం!

కాశీ నుంచి తెచ్చిన స్వామి విగ్రహం... వైష్ణవాలయం మాదిరి ఏడాదికోసారి ఉత్తరద్వార దర్శనం... అత్యంత వైభవంగా శివకేశవులకు జరిగే కల్యాణాలు...ఇవన్నీ చూడాలంటే ఆదిలాబాద్‌లోని హరిహర క్షేత్రమైన కాశీవిశ్వనాథ ఆలయానికి వెళ్లాల్సిందే. భక్తులు నిర్మించుకున్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.

ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పరిసరాల మధ్య నెలకొన్న క్షేత్రమే కాశీ విశ్వనాథ ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు కాశీవిశ్వనాథుడిగా విశాలాక్షీ సమేతంగా కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. ఈ ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల పట్టణంలో ఉంటుంది. సాక్షాత్తూ పరమశివుడే కోరి మరీ ఈ ప్రాంతంలో తనకోసం గుడి కుట్టించుకున్నాడని అంటారు.  

స్థలపురాణం

కొన్ని సంవత్సరాల క్రితం... మంచిర్యాలలో కొండే వెంకటయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అపర శివభక్తుడైన వెంకటయ్య తన గ్రామంలో శివాలయం లేకపోవడంతో ఇంటి దగ్గరే పరమేశ్వరుడిని పూజించేవాడు. ఏడాదికోసారి తన కుటుంబంతో కలిసి కాశీకి వెళ్లి స్వామిని దర్శించుకుని వచ్చేవాడు. సంవత్సరానికోసారి కాశీకి వెళ్లి వస్తున్నా సొంత ఊళ్లో శివాలయం లేకపోవడంతో అసంతృప్తికి గురైన వెంకటయ్య ఓ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈ ఆలోచనల్లో ఉండగానే ఓ రోజు రాత్రి అతడికి స్వామి కలలో కనిపించి ఆ ఊరికి రావాలనుకుంటున్నట్లుగా చెప్పాడట. ఆ మాటల్ని శివుడి ఆజ్ఞగా పాటించిన అతడు మర్నాడు ఇదే విషయాన్ని ఊరివాళ్లందరికీ చెప్పి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేకొద్దీ ఊరివాళ్లకు శివలింగాన్ని ఎక్కడినుంచి తేవాలనే విషయంలో స్పష్టత రాలేదట. అప్పుడే స్వామి మళ్లీ కలలో కనిపించి కాశీ నుంచి శివలింగం తీసుకురమ్మని ఆదేశించాడట. దాంతో వెంకటయ్య బృందం కాశీకి వెళ్లి అక్కడినుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ గుడికి కాశీ విశ్వనాథ ఆలయమనే పేరు వచ్చిందనీ అప్పటినుంచీ దీన్ని తెలంగాణ కాశీగా పిలుస్తున్నారనీ చెబుతారు ఆలయ నిర్వాహకులు.

ఏడాదికోసారి హరిహరుల కల్యాణం

సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ ఎక్కడా లేనివిధంగా ధనుర్మాసంలో ఏకాదశి తరువాత వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఉత్తర ద్వారం నుంచి శివుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకుంటారు.
ఈ ఆలయాన్ని నిర్మించిన కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడంతో ఇది హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. వేంకటేశ్వరుడికి ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు భోగి రోజున స్వామి కల్యాణాన్నీ... కార్తిక పౌర్ణమినాడు విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి అంగరంగవైభవంగా కల్యాణాన్నీ జరిపిస్తారు. నెలకోసారి అన్నదానం, ఏడాది మొత్తం విశేష పూజలతో కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని చెబుతారు భక్తులు.  

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల పట్టణం నడిబొడ్డున ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్లు, ఆదిలాబాద్‌ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులూ, రైళ్లూ అందుబాటులో ఉన్నాయి.

 సుమంత్‌ సకలాభక్తుల, ఈనాడు పాత్రికేయ పాఠశాల

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..