రామేశ్వర దర్శనం... సర్వపాపహరణం!

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా... అబ్బురపరిచే శిల్పకళావైభవానికి ప్రతీకగా... ఎన్నో వింతలకు నెలవుగా రామేశ్వరాన్ని భావిస్తారు. పరమేశ్వరుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలోని శివలింగాన్ని సీతాదేవి తయారుచేయడం విశేషం.

Updated : 03 Mar 2024 03:27 IST

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా... అబ్బురపరిచే శిల్పకళావైభవానికి ప్రతీకగా... ఎన్నో వింతలకు నెలవుగా రామేశ్వరాన్ని భావిస్తారు. పరమేశ్వరుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలోని శివలింగాన్ని సీతాదేవి తయారుచేయడం విశేషం. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ మహిమాన్వితమైన క్షేత్ర దర్శనం సర్వపాపహరణమని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 

రామేశ్వరం... తమిళనాడులో హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం సంగమస్థానంలో కనిపించే చిన్న ద్వీపం. అలాంటి ద్వీపంలో పరమేశ్వరుడు రామనాథస్వామిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధిపొందిన ఈ రామనాథస్వామి ఆలయ నిర్మాణం భక్తులను ఆశ్చర్యచకితుల్ని చేస్తే... ఇక్కడ కొలువైన స్వామి స్వరూపం వెనుకా ఆసక్తికరమైన కథనం ఉంది. అందుకే రామేశ్వరం ఆధ్యాత్మిక ధామంగానూ, పర్యటక ప్రాంతంగానూ పేరుగాంచి అటు భక్తుల్నీ, ఇటు పర్యటకుల్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలోకి ప్రవేశించి... ఇక్కడి తీర్థాలను చుట్టేస్తూ ఆ తరువాత శిల్పకళా సంపదనీ వీక్షిస్తూ స్వామిని దర్శించుకోవడానికి కనీసం నాలుగు గంటలు పడుతుందంటేనే అర్థంచేసుకోవచ్చు... ఆలయం ఎంత గొప్పగా ఉంటుందో. అవును మరి... పదిహేను ఎకరాల్లో విస్తరించి నాలుగువైపులా నాలుగు గోపురాలతో కనిపించే ఈ ఆలయంలోని మూడో ప్రాకారంలో దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తులో వెయ్యికిపైగా స్తంభాలు ఉంటాయి. అందుకే ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకారం కలిగిన ఆలయంగా ఈ గుడి ప్రసిద్ధిగాంచింది. ప్రారంభంలో కేవలం గడ్డి పాక రూపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం వెనుక ఎందరో రాజుల కృషి ఉంది.  ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలో స్వామి ఎలా కొలువుదీరాడంటే...  

సీతమ్మ చేసిన శివలింగం...

త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు... శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడట. రావణసంహారం అనంతరం రాముడు - సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడితో కలిసి అయోధ్యకు ప్రయాణమవుతూ ఇక్కడ సేదతీరాడట. ఆ సమయంలో మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణబ్రహ్మను సంహరించినందుకు బాధపడుతూ తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపమని మహర్షులను అడిగాడట. అంతా కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సలహా ఇవ్వడంతో కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మంటూ రాముడు హనుమంతుడిని ఆదేశించాడట. అయితే ముహూర్త సమయం దగ్గరపడుతున్నా హనుమంతుడు రాకపోయేసరికి సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారుచేయడంతో రాముడు ఆ శివలింగానికే పూజలు జరిపించాడట. ఆ తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించి... మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలనే నియమాన్ని పెట్టాడట. అందుకే ఇప్పటికీ హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలూ, నైవేద్యాలూ జరిపాకే... రామలింగానికి పూజలు చేస్తారు అర్చకులు. ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగానూ ఈ గుడి గుర్తింపు సాధించింది. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నాడు.

అగ్నితీర్థంలో స్నానమాచరించాకే...

రామేశ్వరంలో మొత్తం అరవైనాలుగు బావులు ఉంటే... వాటిల్లో ఆలయంలో ఉన్న ఇరవైరెండు అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం అనంతరం రాముడి అమ్ములపొదిలో మిగిలిన ఇరవైరెండు బాణాలతోనే ఇక్కడ ఇరవైరెండు బావుల్ని సృష్టించాడనీ అంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డునున్న అగ్నితీర్థంలో స్నానమాచరించాకే ఆలయంలోపలికి వెళ్తారు. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింట్లో కాకపోయినా ఒకటి రెండింట్లోనైనా స్నానమాచరించొచ్చు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉండటమే కాదు... కొన్ని బావుల్లోని నీరు తియ్యగానూ ఉండటం విశేషం. ప్రతి తీర్థానికీ ఆయుర్వేద సుగుణాలు ఉంటాయనీ చెబుతారు. ఈ తీర్థాలకు సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల సూర్య, చంద్ర, గంగ... తదితర పేర్లు ఉంటాయి.  

108 శివలింగాల్నీ చూడొచ్చు...

తీర్థాల్లో స్నానమాచరించిన భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకున్నాకే జ్యోతి ర్లింగాన్ని పూజిస్తారు. శివలింగాల దర్శనమయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి మందిరానికి వెళ్తారు. ఆ తరువాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన - సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లీదేవసేన సమేత కార్తికేయుడు.. తదితర దేవతా మూర్తుల్ని దర్శించుకోవచ్చు. ఆలయం ప్రాకారాల్లో నడిచే భక్తులు - మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలనూ చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్ఠను తెలియజేసే మందిరమూ ఉందిక్కడ. నంది మండపంలోని నంది విగ్రహం దాదాపు పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది. హనుమంతుడి విగ్రహం శ్రీలంకవైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడున్న లక్ష్మణతీర్థంలో పితృతర్పణ కార్యక్రమాలనూ నిర్వహించొచ్చు.

కల్యాణం కమనీయం...

ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒకెత్తయితే  ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే ఉత్సవాలు మరొకెత్తు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా పదిరోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతామూర్తుల్ని పురవీధుల్లో ఊరేగించడం, అభిషేకాలూ, దీపాల అలంకరణలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అలాగే జులై, ఆగస్టు నెలల్లో తిరుకల్యాణం పేరుతో పదిహేడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో జరిగే రామనాథస్వామి-పర్వతవర్ధిని కల్యాణాన్నీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలనూ చూసి తరించాల్సిందే. దేవీశరన్నవరాత్రులు, నటరాజ నిజరూప దర్శనం, రామలింగ ప్రతిష్ఠను పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవం, ఆరుద్ర దర్శనం పేరుతో విశేషమైన కార్యక్రమాలు, శ్రీరామనవమి.. ఇలా ఏడాది మొత్తం ఎన్నో వేడుకలు జరుగుతాయిక్కడ.

సముద్రం శాంతంగా...

రామేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం స్వామి దర్శనంతోనే వెనుతిరిగి వచ్చేయరు. ఇక్కడున్న ధనుష్కోడి, పాంబన్‌ వంతెన, తేలే ఇటుకలు, గంధమాదన పర్వతాన్నీ సందర్శిస్తారు. రాముడి పాదుకలు ఉండే గంధమాదన పర్వతం పైకి ఎక్కితే రామేశ్వరం మొత్తం కనిపిస్తుందట. రామేశ్వరంలోని సముద్రానికి శాంత సముద్రమని పేరు. అలల ఉధృతిలేని సముద్రాన్ని ఇక్కడ మాత్రమే చూడొచ్చు.

సంపూర్ణయాత్ర చేసినట్లే...

రామేశ్వర యాత్రను ఓ పద్ధతి ప్రకారం చేస్తే పుణ్యక్షేత్రాలన్నింటినీ  దర్శించిన ఫలితం దక్కుతుందట. భక్తులు మొదట వారణాసికి వెళ్లి కాశీవిశ్వనాథుడిని పూజించి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని శివుడికి అభిషేకించాలి. మళ్లీ ఇక్కడున్న ఇసుకను తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపాలని అంటారు. పైగా భారతదేశంలో ఉన్న నదులన్నీ ఇక్కడున్న బావుల అంతర్భాగం నుంచే ప్రవహిస్తాయని చెబుతారు. అందుకే రామనాథస్వామిని దర్శించుకుంటే సమస్త యాత్రాఫలితం కలుగుతుందని ప్రతీతి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..