ఏడుకొండల్లో కొలువైన...శక్తిస్వరూపిణి!

దుష్టశిక్షణ కోసం వివిధ అవతారాలను దాల్చిన జగజ్జనని... నాసిక్‌లోని కల్‌వణ్‌లో ఏడుకొండల మధ్య స్వయంభువుగా స్థిరనివాసం ఏర్పరుచుకుని సప్తశృంగీమాతగా భక్తులను అనుగ్రహిస్తోంది.

Updated : 05 May 2024 15:23 IST

దుష్టశిక్షణ కోసం వివిధ అవతారాలను దాల్చిన జగజ్జనని... నాసిక్‌లోని కల్‌వణ్‌లో ఏడుకొండల మధ్య స్వయంభువుగా స్థిరనివాసం ఏర్పరుచుకుని సప్తశృంగీమాతగా భక్తులను అనుగ్రహిస్తోంది. సిందూర లేపనంతో దర్శనమిస్తూ... కోరిన కోర్కెలను నెరవేర్చే వరప్రదాయినిగా విరాజిల్లుతున్న ఈ శక్తిస్వరూపిణి దర్శనం సర్వపాప హరణమని చెబుతారు.

ప్తశృంగీ... అంటే ఏడు శిఖరాలు అని అర్థం. ఆ ఏడు కొండల మధ్య కొలువుదీరడం వల్లే అమ్మవారు సప్తశృంగీమాతగా, సప్తశృంగీ నివాసినిగా, మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంటోంది. మహారాష్ట్ర, నాసిక్‌లోని కల్‌వణ్‌ తాలూకాలో ఉండే ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం విశేషం. ఎత్తయిన శిఖరంపైన ఉండే ఈ ఆలయాన్ని చేరుకునే భక్తులకు ఆదిపరాశక్తి దాదాపు పది అడుగుల ఎత్తుతో... సిందూర వర్ణంలో పద్దెనిమిది చేతులతో, పద్దెనిమిది రకాల ఆయుధాల్ని దాల్చి తలను కాస్త పక్కకు వంచి భక్తుల కోర్కెలను వింటున్నట్లుగా కనిపిస్తూ దర్శనమిస్తుంది.

స్థలపురాణం

ఓసారి దక్షుడు తన కుమార్తె సతీదేవినీ - అల్లుడైన శివుడినీ ఆహ్వానించకుండానే యజ్ఞాన్ని నిర్వహించాడు. పిలవకపోయినా ఆ యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి చేతిలో అవమానం పొంది చివరకు అక్కడే అగ్నికి ఆహుతి కావడంతో శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని విలయతాండవం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శివుడిని శాంతింపచేసేందుకు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడట. దాంతో అమ్మవారి శరీర భాగాలు పలు ప్రాంతాల్లో పడ్డాయనీ, వాటిల్లో అమ్మవారి కుడిచేయి ఈ పర్వతాలపైన పడిందనీ పురాణగాథ. మరో కథ ప్రకారం... దేవతల్ని ఇబ్బందిపెడుతున్న మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు   శక్తిస్వరూపిణిగా మారిందట. ఆ తరువాత దేవి మహిషాసుర మర్దినిగా ఈ కొండల్లోనే స్థిరనివాసం ఏర్పరుచుకుందట. అలా కొలువుదీరిన అమ్మవారి విగ్రహాన్ని ఓ భక్తుడు చూడటంతో అందరికీ తెలిసిందట. కాలక్రమంలో ఈ ఆలయాన్ని మరాఠా రాజులు అభివృద్ధి చేశారని ప్రతీతి.

అదో రహస్యం

ఓ వైపు లోయ, మరోవైపు ప్రశాంతమైన ప్రకృతి అందాల మధ్య అలరారే సప్తశృంగీ దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు సుమారు 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కలేని భక్తులకు ప్రత్యేకంగా రోప్‌వేని ఏర్పాటూ చేసింది ఆలయ ట్రస్టు.
మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకునే భక్తులకు ఆలయం రెండు అంతస్తుల్లో కనిపిస్తుంది. పై అంతస్తులో జగజ్జనని నిలువెత్తు రూపంతో దర్శనమిస్తుంది. ఆ తరువాత మార్కండేయ శిఖరంగా పిలిచే మరో కొండనూ దర్శించుకుంటారు భక్తులు. మార్కండేయ మహర్షి ఆ శిఖరంపైనే ఉండి దేవీ మహత్మ్యాన్ని రచించాడనీ... అమ్మవారిని అలరించేందుకు పురాణాలను వినిపించేవాడనీ అంటారు. వాటన్నింటినీ వినేందుకే అమ్మవారు తలను కాస్త పక్కకు వంచిందట. ఇక్కడ ఏటా చైత్రమాసంలో రామనవమి నుంచి చైత్రశుద్ధ పౌర్ణమి వరకూ ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. చైత్రోత్సవం పేరుతో పిలిచే ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల్లో సంతానంలేని మహిళలే ఎక్కువగా ఉంటారట. ఈ సమయంలో దేవిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో దాదాపు 150 కిలోమీటర్లు నడిచి మరీ ఆలయానికి చేరుకునేవారూ ఉంటారు. అలా వచ్చే భక్తుల్లో కొందరు గిరి ప్రదక్షిణ చేసేందుకూ ప్రాధాన్యమిస్తారు. ఈ చైత్రోత్సవంలో పౌర్ణమినాడు ఆలయం ఉన్న కొండపైన జెండాను ఎగరేస్తారు.

ఆ క్రతువులో భాగంగా అమ్మవారి చిత్రం ఉన్న ప్రత్యేకమైన జెండాను దారేగావ్‌ గ్రామ పెద్ద సమక్షంలో ఊరేగించి అర్థరాత్రి సమయంలో శిఖరంపైన ఎగరేస్తారు. దీన్ని పదిహేనో శతాబ్దం నుంచి నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే ఇప్పటికీ ఆ మార్గం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటుందని చెబుతారు. అలాగే శ్రావణమాసంలో, నవరాత్రుల్లో అంగరంగవైభవంగా జరిపే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ... తదితర ప్రాంతాలనుంచి ఆలయానికి చేరుకుంటారు.  

ఎలా చేరుకోవచ్చు  

విమానంలో రావాలనుకునే భక్తులు ముంబయి లేదా పుణె విమానాశ్రయాల్లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ ప్రైవేటు వాహనాలూ ఉంటాయి. రైల్లో వెళ్లాలనుకునేవారు నాసిక్‌ రైల్వే స్టేషన్‌లో దిగితే... ఆలయానికి చేరుకునేందుకు ఆటోలు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..