అయిదిళ్ల భిక్ష.. గణగాపూర్‌ దీక్ష!

ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు భగవంతుడిని దర్శించుకుని ప్రసాదం కొనుక్కుని వచ్చేస్తాం... లేదా అక్కడ పెట్టే అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాం కదూ... కానీ కర్ణాటకలోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయంలో నదీ స్నానం, దేవతామూర్తుల దర్శనం..

Published : 23 Mar 2024 23:31 IST

ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు భగవంతుడిని దర్శించుకుని ప్రసాదం కొనుక్కుని వచ్చేస్తాం... లేదా అక్కడ పెట్టే అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాం కదూ... కానీ కర్ణాటకలోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయంలో నదీ స్నానం, దేవతామూర్తుల దర్శనం.. అన్నీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అంతేనా... భక్తులు ఇక్కడి ఊరివారి నుంచి భిక్ష స్వీకరిస్తారు తామూ భిక్ష వేస్తారు. దత్తాత్రేయుడి అవతారమైన నరసింహ సరస్వతి కొలువుదీరిన ఈ ఆలయ దర్శనం సర్వపాప హరణమని ప్రతీతి.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగానూ... భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు ప్రతిరూపంగానూ దత్తాత్రేయుడిని భావిస్తాం. ఆ దత్తాత్రేయుడు కొలువుదీరిన ఆలయమే గణగాపూర్‌ శ్రీ క్షేత్ర దత్తాత్రేయ సన్నిధానం. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని ఈ గుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని పదమూడో శతాబ్దంలో నిర్మించారు.

స్థలపురాణం

ఓసారి ముగ్గురమ్మవార్ల మధ్య తమలో గొప్ప పతివ్రత ఎవరనే చర్చ జరిగినప్పుడు... అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మహాపతివ్రత అని తేలిందట. అది విన్న లక్ష్మి-పార్వతి-సరస్వతులు అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారట. దాంతో అత్రి ఆశ్రమంలో లేని సమయం చూసి త్రిమూర్తులు అతిథులుగా వచ్చి భోజనం పెట్టమంటూ అనసూయను అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే నగ్నంగా వడ్డిస్తేనే భుజిస్తామని షరతు పెట్టడంతో సందిగ్ధతకు లోనైన అనసూయ అతిథులు సామాన్యులు కారని అర్థంచేసుకుని... ఆ ముగ్గురినీ తన పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైందట. దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోయి ఆతిథ్యం తీసుకున్నారట. కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన అత్రి మహర్షి.. భార్య ద్వారా జరిగింది విని ఆ ముగ్గురినీ పూజించడంతో త్రిమూర్తులు నిజరూపంలోకి మారిపోయి ఆ దంపతులను అనుగ్రహించారట. అలా త్రిమూర్తులే దత్తాత్రేయుడి రూపంలో అత్రి దంపతులకు జన్మించారు. ఆ స్వామే కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించాడనీ కథనం. అలా పుట్టిన నరసింహ సరస్వతి కాశీకి వెళ్లి కృష్ణ సరస్వతి అనే స్వామి దగ్గర సన్యాసదీక్షను చేపట్టి... ఆ తరువాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గణగాపూర్‌లోనూ 23 సంవత్సరాలు ఉన్నాడట. చివరకు తన పాదుకలను ఇక్కడే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదళీవనంలో అవతార సమాప్తి గావించాడని పురాణగాథ. అలా గణగాపూర్‌లో ఆలయం ఏర్పడిందని అంటారు.

దర్శనం ఎలా చేసుకోవాలంటే..

ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నదీస్నానం చేయాలి. ఆ తరువాత నరసింహ సరస్వతి నిర్గుణ పాదాలను దర్శించుకున్నాక కల్లేశ్వరస్వామిగా పిలిచే పరమేశ్వరుడిని పూజించాలనీ అప్పుడే గణగాపూర్‌ సంపూర్ణ యాత్ర చేసిన ఫలితం కలుగుతుందనీ చెబుతారు. ఆ వివరాలను తెలియజేసే బోర్డూ కనిపిస్తుందిక్కడ. ఆ ప్రకారమే.. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట భీమా-అమర్జా నదీ సంగమంలో స్నానమాచరించాక... మందిరంలోకి ప్రవేశిస్తారు. మందిరంలో చిన్న కిటికీద్వారా స్వామి పాదుకలనూ, స్వామినీ దర్శించుకుంటారు. ఆ తరువాతే పరమేశ్వరుడిని పూజిస్తారు. స్వామితోపాటూ పంచముఖ గణపతి, హనుమంతుడు, నవగ్రహాలు... తదితర దేవతామూర్తుల్నీ చూడొచ్చు. నాగ, కుజ, ఇతర గ్రహదోషాలున్నవారూ, మానసిక సమస్యలతో బాధపడేవారూ ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. అలాగే ఈ ప్రాంగణంలో స్వయంభువుగా కొలువుదీరిన శనికి తైలాభిషేకాలను నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఆవరణలో దత్త గురుపారాయణం చేసేందుకు ప్రత్యేక బల్లలూ ఉంటాయి.

భిక్షకు వెళ్తారు...

నరసింహ సరస్వతి మధ్యాహ్నం పూట ఈ ఊళ్లో తిరుగుతూ భిక్షను స్వీకరిస్తాడని స్థానికులూ, భక్తులూ నమ్ముతారు. అందుకే ఊరివాళ్లు తమ శక్తికొద్దీ రొట్టెలు, కిచిడీ, పాయసం వంటివి చేసి సిద్ధంగా ఉంచుతారు. ఆలయానికి వచ్చే భక్తులు ఊళ్లోకి వెళ్లి కనీసం అయిదు ఇళ్లల్లో భిక్ష అడుగుతారు. అలా భిక్షకు వచ్చే భక్తులకు స్థానికులూ ప్రసాదాన్ని పెట్టడమూ కనిపిస్తుందిక్కడ. కొందరు భక్తులు రకరకాల పదార్థాలను చేయించి తోటివారికి భిక్ష రూపంలో పంచిపెట్టడమూ చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..