అభిషేక వేళ... పాలు నీలంగా మారతాయి!

రాహుకాలంలో పూజలు చేయకపోవడం, ఏ శుభకార్యాన్నీ తలపెట్టకపోవడం తెలిసిందే. కానీ తిరునాగేశ్వరం ఆలయంలో మాత్రం కాలసర్పదోషాలూ, రాహు దోషాలూ పోయేందుకు ఆ సమయంలోనే పూజలు చేయించుకుంటారు భక్తులు.

Published : 26 May 2024 00:41 IST

రాహుకాలంలో పూజలు చేయకపోవడం, ఏ శుభకార్యాన్నీ తలపెట్టకపోవడం తెలిసిందే. కానీ తిరునాగేశ్వరం ఆలయంలో మాత్రం కాలసర్పదోషాలూ, రాహు దోషాలూ పోయేందుకు ఆ సమయంలోనే పూజలు చేయించుకుంటారు భక్తులు. ఆ పూజల్లో భాగంగా పరమేశ్వరుడికి నిర్వహించే అభిషేకాన్ని చూసేందుకూ ఎక్కడెక్కడినుంచో వస్తారు. ఎందుకంటే... శివలింగంపైన పాలు పోయగానే అవి నీలంరంగులోకి మారిపోయి నేలకు చేరుకునేసరికి మళ్లీ తెల్లగా కనిపిస్తాయి మరి.

చోళుల కాలం నాటి నిర్మాణశైలితో, ఆకట్టుకునే శిల్పకళా సంపదతో కనిపిస్తుంది తిరునాగేశ్వరం ఆలయం. సాధారణంగా కొన్ని ఆలయాల్లో రాహు-కేతు దోష నివారణ పూజల్ని ప్రత్యేకంగా చేయడం తెలిసిందే. అదేవిధంగా పలు ఆలయాల్లో నవగ్రహాల కోసం విడిగా మందిరాలు ఉండటం చూస్తూనే ఉంటాం. వాటితో పోలిస్తే... నవగ్రహాల్లో ఒకటైన రాహువు ఈ ఆలయంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. నాగనాథర్‌ కోయిల్‌గానూ పిలిచే ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరగా తిరునాగేశ్వరంలో ఉంటుంది. తొమ్మిదో శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని ఒకటో ఆదిత్య చోళుడు కట్టించాడట.

పరమేశ్వరుడు ఇక్కడ నాగనాథర్‌గా/నాగనాథస్వామిగా, పార్వతీదేవి రెండు రూపాల్లో - పిరయైని అమ్మన్‌గా, గిరి కుచాంబికగా లక్ష్మీ సరస్వతులతో కలిసి దర్శనమివ్వడం విశేషం. రాహువు కూడా నాగవల్లి, నాగకన్ని సమేతంగా కనిపిస్తూ రాహుదోష నివారణ పూజల్ని అందుకుంటున్నాడు. నిరంతరం పరమశివుడిని పూజించేందుకే రాహువు ఇక్కడ వెలిశాడనేది ఐతిహ్యం. ఇతర ఆలయాల్లో రాహువు సర్పముఖంతో ఉన్నా... ఇక్కడ మాత్రం మానవముఖంతో కనిపిస్తాడు.
ఈ గుళ్లోనే నంది శివుడిని పూజించి నందీశ్వరుడిగా మారాడట. అదే విధంగా వినాయకుడు గణాలకు అధిపతిగా ఈ ప్రాంతంలోనే గుర్తింపు పొందాడని ప్రతీతి.స్థలపురాణం

ఒకప్పుడు ఈ ప్రాంతంలో సంపెంగ చెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ చెట్టు కిందే పరమశివుడు స్వయంభువుగా వెలిసి పూజలు అందుకోవడం మొదలుపెట్టాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ మహర్షి కుమారుడిని పాము కరిచిందట. దాంతో మహాసాధ్వీ, శివ భక్తురాలూ అయిన ఆ మహర్షి భార్య అందుకు కారణం రాహువని తెలుసుకుని శపించిందట. అలా రాహువు ఈ ప్రాంతానికి వచ్చి పరమశివుడి అనుగ్రహాన్ని పొందేందుకు తపస్సు చేశాడట. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమవడంతో రాహువుకు శాపవిమోచనం కలిగిందని గాథ. అప్పటినుంచీ రాహువు తన భార్యలైన నాగవల్లి, నాగకన్ని సమేతంగా ఇక్కడే ఉండిపోయి నిరంతరం స్వామిని పూజిస్తూ తనని దర్శించుకునే భక్తుల దోషాలనూ తొలగిస్తున్నాడు. రాహువు మాదిరి... ఆదిశేషుడు, దక్షుడు, కర్కోటకుడు కూడా స్వామిని పూజించి శాపవిమోచనాన్ని పొందిన ఆలయం కూడా ఇదే.

అభిషేకాన్ని చూసి తీరాల్సిందే

రాహు ప్రభావం కారణంగా సర్పదోషం, మానసిక సమస్యలు, అనారోగ్యాలు, వివాహాలు ఆలస్యం కావడం, సంతానలేమి, వైవాహిక జీవితంలో సమస్యలు... వంటివెన్నో ఎదురవుతాయి. వాటన్నింటి నివారణకోసమే భక్తులు ఈ ఆలయానికి వచ్చి రాహుదోష నివారణ పూజల్ని రాహుకాలంలో చేయించుకుంటారు. ఆ సమయంలో నిర్వహించే పాలాభిషేకాన్ని చూసి తరించాల్సిందే. రాహుకాలంలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహిస్తారు. అప్పటివరకూ తెల్లగా ఉన్న పాలు కాస్తా శివలింగంపైన పోయగానే నీలంరంగులోకి మారిపోతాయి. మళ్లీ ఆ పాలు నేలను చేరేసరికి తెల్లగా మారిపోవడమూ కనిపిస్తుంది. ఆ అభిషేకాన్ని చూసేందుకే ఎక్కడెక్కడినుంచో ఆలయానికి చేరుకునే భక్తులూ ఉంటారు. ఇక, ఇక్కడ స్వామివారికి నిర్వహించే నిత్య పూజలతోపాటు ప్రతిరోజూ రాహుకాల వేళలకు తగినట్లుగా ఆయా సమయాల్లో అభిషేకాలనూ, ఇతర పూజాదికాలనూ జరిపిస్తారు అర్చకులు. అలాగే... శివరాత్రి, కార్తికంలో విశేషమైన పూజలతోపాటు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

తిరునాగేశ్వరం ఆలయం కుంభకోణం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునే భక్తులు తిరుచ్చి విమానాశ్రయంలో దిగితే... అక్కడి నుంచి ఆలయం దాదాపు వందకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో ఆలయానికి చేరుకోవాలనుకునేవారికి తిరునాగేశ్వరంలోనే ప్రత్యేక రైల్వేస్టేషన్‌ ఉంది. లేదంటే కుంభకోణం రైల్వేస్టేషన్‌లో దిగి... బస్సులూ, ఆటోల్లో ఆలయానికి వెళ్లొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు