కార్తికేయుడు... కరుణాకరుడై..!

సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని ఓ నమ్మకం.

Published : 27 Apr 2024 23:53 IST

సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని ఓ నమ్మకం. తిరుత్తణిలో కొలువైన ఈ స్వామి గ్రహదోషాలను తొలగిస్తూనే మానసిక ప్రశాంతతనూ కలిగిస్తున్నాడు. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.

ఆశిఖరం పేరు తణిగై. అక్కడ స్వయంభువుగా కొలువుదీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అయిదు అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో ఉంది. ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో పల్లవరాజులు కట్టిస్తే... చోళులు అభివృద్ధి చేశారు. ఇక్కడ కనిపించే మెట్లూ, జరిపించే ఉత్సవాలూ, స్వామి కొలువుదీరడం వెనుకా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

స్థలపురాణం...

శివ పురాణం ప్రకారం... తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే... శివుడి తనయుడి చేతిలోనే తాను మరణించేలా వరమిమ్మన్నాడట. అప్పటికి పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండటం వల్ల, శివుడికి సంతానం కలగదనే ఆలోచనతోనే ఆ వరాన్ని కోరాడట. దానికి స్వామి సరేననడంతో తారకాసురుడు ముల్లోకాల్లోని దేవతల్ని ఇబ్బందిపెట్టడం ప్రారంభించాడు. చివరకు బ్రహ్మాది దేవతల సూచనతో మన్మథుడు పరమేశ్వరుడు ధ్యానంనుంచి బయటకొచ్చేలా చేశాడట. అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కల్యాణం చేసుకోవడంతో ఆది దంపతుల తనయుడిగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడకు చేరుకుని సాంత్వన పొంది, తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ. అలాగే... సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యల్లో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట. వల్లి చిన్నప్పటినుంచీ సుబ్రహ్మణ్యేశ్వరుడినే వివాహమా డాలనుకునేది. కొన్నాళ్లకు కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగు బారి నుంచి కాపాడి ఆ తరువాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట. తనని కాపాడింది స్వామేనని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు ఇక్కడ వల్లీ సమేతంగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు.  

ఆద్యంతం ఆసక్తికరం...

వల్లీదేవసేనలతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు 365 మెట్లు ఎక్కాలి. ఏడాదిలోని ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు చొప్పున మొత్తం 365 మెట్లను ఏర్పాటు చేశారిక్కడ. ఆలయంలో అక్కడక్కడా కనిపించే ఏనుగు విగ్రహాలన్నీ తూర్పు వైపే తిరిగి ఉంటాయి. ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాక ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడట. అప్పటినుంచి ఇంద్రుడి సంపద తరిగిపోవడం మొదలయ్యిందట. ఐరావతం లేకపోవడమే కారణమని తెలిసినా కానుకను వెనక్కి తీసుకోలేక చివరకు దాన్ని తాను అధిపతిగా ఉన్న తూర్పు దిక్కువైపు తిరిగి ఉండేలా చేయమంటూ కార్తికేయుడిని అభ్యర్థించడంతో మళ్లీ తన సంపదను పొందాడని అంటారు. ఇక, స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు. ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు. ఆ రాయిపైన తీసిన చందనానికి - స్వామిని అలంకరించేసరికి ఔషధగుణాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఆ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు.

శాంతిపురిగా ప్రసిద్ధి...

సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి అనందాన్ని కలిగిస్తాడు కాబట్టే ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు. స్వామిని కరుణాకరుడనీ అంటారు.రావణ సంహారం అనంతరం రాముడు... రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి  ఆ తరువాత ఇక్కడకు వచ్చి.. మానసిక శాంతిని పొందాడట. అలాగే డిసెంబరు 31న ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. న్యూ ఇయర్‌ స్టెప్‌ ఫెస్టివల్‌గా పిలిచే ఈ వేడుకల్లో భజన బృందాలూ పాల్గొనడం, భక్తులు ప్రతి మెట్టుపైనా కర్పూరంతో పాటు కొవ్వొత్తులూ వెలిగించడం కన్నులపండుగ్గా సాగుతుంది. ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వల్లీ కల్యాణం, తెప్పోత్సవం... స్కంద షష్ఠి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేల్‌ కావడి ఉత్సవం పేరుతో భక్తులు కావళ్లు మోసుకుంటూ ఆలయానికి చేరుకుని మొక్కులు
తీర్చుకునే తీరు ఆకట్టుకుంటుంది. వీటన్నింటితోపాటూ ఏడాదికోసారి మార్చిలో మూడురోజులపాటు స్వామిపైన పడే సూర్యకిరణాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..