సిసింద్రీ

నేస్తాలూ.. మీకు బొమ్మలంటే ఇష్టమా.. కానీ గీయడం రాదా..! ఏం పర్లేదు. https://kinderart.com/ వెబ్‌సైట్‌లోకి వెళితే చాలు.. ఎంచక్కా బొమ్మలు గీయడం నేర్చుకోవచ్చు.

Published : 09 Oct 2022 00:28 IST

సిసింద్రీ

బొమ్మలు గీద్దాం చలో చలో!

నేస్తాలూ.. మీకు బొమ్మలంటే ఇష్టమా.. కానీ గీయడం రాదా..! ఏం పర్లేదు. https://kinderart.com/ వెబ్‌సైట్‌లోకి వెళితే చాలు.. ఎంచక్కా బొమ్మలు గీయడం నేర్చుకోవచ్చు. వాటర్‌ కలర్స్‌ ఎలా వాడాలి.. ఏ నిష్పత్తిలో కలపాలి.. జంతువుల బొమ్మలు, చెట్ల చిత్రాలు, ఇళ్లు, భవనాలను ఎలా గీయాలి.. ఎలాంటి రంగులు వేయాలి.. తదితర విషయా లన్నీ ఇక్కడ వివరంగా ఉంటాయి. హాయిగా ఆడుతూ పాడుతూ ఇంట్లో కూర్చునే డ్రాయింగ్‌ నేర్చేసుకోవచ్చు. మరి ఇంకెందుకాలస్యం.. ఓసారి సరదాగా ఈ సైట్‌లో అలా అలా విహరించండి.. ఎంచక్కా రంగురంగుల బొమ్మలు గీసేయండి.  


పొట్టి వీరయ్య... పొడుగు మరిడయ్య! 

పొట్టి వీరయ్య, పొడుగు మరిడయ్య స్నేహితులు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఏదైనా స్థిరమైన ఆదాయం చూపమని ఊరి పెద్ద సుబ్బయ్యను అడిగారు ఇద్దరూ. ‘మంచి స్నేహితులు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోండి. కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను’ అన్నాడు సుబ్బయ్య. సరేనంటూ.. సుబ్బయ్య దగ్గర అప్పు చేసి కిరాణా దుకాణం తెరిచారిద్దరూ. గల్లాపెట్టె దగ్గర వీరయ్య కూర్చుంటే.. వచ్చేవారికి సరకులు ఇచ్చే బాధ్యత మరిడయ్యది. కొన్నాళ్లలోనే సుబ్బయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలో వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో.. ఎదురుగా ఉన్న దుకాణదారు జోగయ్యకు అసూయ కలిగింది. ఎలాగైనా స్నేహితుల మధ్య గొడవ పెట్టి, వ్యాపారాన్ని దెబ్బ తీయాలను కున్నాడు. ఒకరోజు వీరయ్య దుకాణంలో లేని సమయం చూసి మరిడయ్యతో.. ‘నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి.

ఆ వీరయ్య మాత్రం చక్కగా కూర్చొని డబ్బులు వసూలు చేస్తాడు’ అంటూ కల్పించి చెప్పాడు. ఆ మర్నాడు మరిడయ్య, వీరయ్యతో దెబ్బలాడి మరీ గల్లాపెట్టె వద్ద కూర్చున్నాడు. పాపం వీరయ్యకు అల్మారాల్లో ఉన్న సరకులు అందక.. కింద పడేయసాగాడు. డబ్బులు తీసుకొని చిల్లర ఇచ్చే క్రమంలో మరిడయ్య గందరగోళపడేవాడు. దీంతో వీళ్ల దుకాణానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. అలా కొన్నాళ్లకు మూతపడే పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఇద్దరినీ పిలిపించాడు. ‘అసూయతో జోగయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారం చెడగొట్టుకున్నారు. వీరయ్య గల్లాపెట్టె ముందు, మరిడయ్య సరకుల పొట్లాలు అందించేవాడు. ఎవరి పని వాళ్లు నిజాయతీగా చేసేటప్పుడు, మూడో మనిషి మాటలు ఎందుకు విన్నారు?’ అంటూ చీవాట్లు పెట్టాడు సుబ్బయ్య. స్నేహితులిద్దరూ తమ తప్పు తెలుసుకున్నారు. మర్నాటి నుంచి గల్లాపెట్టె దగ్గర వీరయ్య, సరకులు అందించే పనిలో మరిడయ్య కుదురుకున్నారు.

- గంటి ఉషాబాలగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..